radhamma
-
కొడుకు కొట్టాడని.. ఇంటి నుంచి వెళ్లిన తల్లి.. చివరికి శవమై ఇలా..!
మహబూబ్‌నగర్: మద్యం మత్తులో ఉన్న కుమారుడు తల్లిని కొట్టడంతో మనస్తాపానికి గురై మూడు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిన ఆమె ఆదివారం కోయిల్‌సాగర్ కుడి కాల్వలో శవమై కనిపించిన ఘటన పూసల్‌పహాడ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూసల్‌పహాడ్‌కు చెందిన రాధమ్మ(45) కుమారుడు శివకుమార్‌రెడ్డి ఈ నెల 14న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇలా రోజూ మద్యం తాగి ఇంటికి వస్తే కుటుంబం ఎలా గడుస్తుందని తల్లి కుమారుడిని నిలదీసింది. ఆగ్రహానికి గురైన కుమారుడు తల్లిని కొట్టాడు. ఆమె మనస్తాపానికి గురై అదే రోజు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. మరుసటి రోజు కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకి లభించలేదు. బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీసినా లాభం లేకపోయింది. భర్త రాజారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. చివరకు అనుమానం వచ్చిన గ్రామస్తులు కోయిల్‌సాగర్ కుడి కాల్వకు వస్తున్న నీటిని నిలిపివేయించారు. మూడు రోజుల తర్వాత వెంకటాపూర్ గ్రామ శివారులో కుడి కాల్వ ముళ్లపొదలో చిక్కుకున్న రాధమ్మ మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. నారాయణపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమర్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాపు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలియజేశారు. -
అత్తారింటి ఎదుట కోడలి దీక్ష
హిందూపురం అర్బన్ : నాలుగేళ్లు కాపురం చేసిన కోడలును ఇంట్లోకి రానివ్వకుండా అత్తమామలు అడ్డుకోవడంతో బాధితురాలు పోరాటానికి దిగింది. ఈ సంఘటన హిందూపురం హస్నాబాద్‌లో శుక్రవారం జరిగింది. ఇదే మండలం కొటిపి గ్రామానికి చెందిన రాధమ్మను హిందూపురంలో టీవీ మెకానిక్‌గా పని చేస్తున్న ప్రభాకర్‌తో వివాహమైంది. నాలుగేళ్లు వారి సంసారం సాఫీగా సాగింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. నెల రోజుల కిందట పుట్టింటికి వెళ్లి రమ్మంటూ మామ ఆంజనేయులు చెప్పడంతో ఆమె సరేనని వెళ్లింది. నాలుగు రోజుల కిందట తిరిగి అత్తారింటికి వచ్చిన రాధమ్మను భర్త ప్రభాకర్ గొడవకు దిగాడు. ఇంట్లోకి రావద్దనడంతో ఆమె నేరుగా రూరల్ æపోలీసుస్టేషన్‌కు వెళ్లి అత్తమామ సహా భర్తపై ఫిర్యాదు చేశారు. తిరిగి ఇంటికి రాగా వారు ఆమెను ఇంట్లోకి రానివ్వకపోవడంతో గేటు వద్ద బైఠాయించింది. తనకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పింది. రాధమ్మను భర్త తరచూ వేధింపులకు గురి చేసేవాడని ఇరుగుపొరుగు వారు కూడా ఆరోపించారు. పిల్లలు పుట్టలేదన్న సాకుతో తనను వదలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు వాపోతోంది. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు ఆమెను పోలీసుస్టేషన్‌కు పిల్చుకెళ్లారు. వివరాలు తెలుసుకున్నారు. ఆమె నిరసంగా ఉండటంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అత్తమామలు, భర్తను స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. -
శభాష్ రాధమ్మ!
ఇటు కుందేళ్ల పెంపకం...అటు వ్యవసాయం చేతినిండా ఆదాయం.. పలువురికి ఉపాధి నల్లమాడ : నల్లమాడ మండలంలోని వంకరకుంట గ్రామానికి చెందిన టీడీ రాధమ్మ... గ్రామ సమీపంలోని తమ పొలంలో ప్రత్యేకంగా ఓ షెడ్డు నిర్మించి రెండేళ్లుగా కుందేళ్ల పెంపకం చేపట్టారు. 200 కుందేళ్లతో ప్రారంభమైన ఈ ప్రకియ ప్రస్తుతం రెండు వేలకు చేరుకుంది. కుందేళ్లకు ఆహారంగా ఎకరా పొలంలో ఎగ్జ్‌లూజర్ రకం గడ్డిని ఆమె సాగు చేస్తున్నారు. దీంతో పాటు దాణాగా దీంతో పాటు సజ్జ, మొక్కజొన్న, వేరుశనగ చెక్కపొడిని అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నలుగురు కూలీలను ఏర్పాటు చేసుకుని వారికి నెలకు రూ. 20 వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. దినసరి కూలీల ఖర్చు ఇందుకు అదనం. మహానగరాలకు ఎగుమతి... మాంసానికి ఉపయోగపడే కుందేళ్ల పెంపకం ఎంతో లాభదాయకంగా ఉంటుందని రాధమ్మ పేర్కొంటున్నారు. ప్రస్తుతం కుందేలు మాంసం కిలో రూ. 580 వరకు అమ్ముడు పోతోందని, డిమాండ్‌ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ, చెన్నై తదితర నగరాల్లోని హోటళ్లు, ఫంక్షన్లకు ఆర్డర్‌పై మాంసం సరఫరా చేస్తుంటామన్నారు. ఆయా నగరాల్లో బహిరంగ మార్కెట్ సౌకర్యం కూడా ఉందన్నారు. కుందేళ్ల మాంసం విక్రయం ద్వారా నెలకు రూ. రెండు లక్షలు రాబడి వస్తోందని, ఇందులో దాణా కొనుగోలు, కూలీల వేతనాలు, ఇతరత్రా ఖర్చులకు రూ.లక్ష ఖర్చు అవుతుందని వివరించారు. షెడ్డు నిర్మాణం, కుందేలు పిల్లల కొనుగోలు, వాటి పోషణకు అవసరమైన జాలరీలు, బోరు ఏర్పాటు కోసం సుమారు రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టామన్నారు. ఆడ కుందేలు నెలకోమారు 5 నుంచి 10 పిల్లలకు జన్మనిస్తుందని, ఈ విధంగా తక్కువ కాలంలోనే కుందేళ్ల సంఖ్య బాగా పెరుగుతుందన్నారు. ఈనిన 12 గంటల తర్వాత మగ కుందేలుతో సంపర్కం చేయిస్తే ఆడ కుందేలు తిరిగి గర్భం దాలుస్తుందన్నారు. కుందేలు పిల్లలను నాలుగు మాసాలు పోషిస్తే రెండు నుంచి రెండున్నర కిలోల బరువు తూగుతాయని, అప్పుడు వాటి మాంసాన్ని విక్రయిస్తామన్నారు. పాడితోనూ లబ్ధి తమకున్న పదెకరాలల్లో మూడు బోర్లు వేయించిన రాధమ్మ... కూలీలతో వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమనూ చేపట్టారు. వేరుశనగ, కంది, మొక్కజొన్న తదితర పంటలు సాగుచేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. కూలీల సాయంతో 10 గేదెలను పోషిస్తూ పాల విక్రయం ద్వారా ఆదాయం గడిస్తున్నారు. భర్త రఘునాథరెడ్డి ఐకేపీ ఉద్యోగి కావడంతో సెలవు రోజుల్లో మాత్రమే ఆయన అందుబాటులో ఉంటారని, తక్కిన సమయంలో తానే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటానని రాధమ్మ తెలిపారు. కుమార్తె చదువు కోసం నల్లమాడలో కాపురముంటున్న రాధమ్మ ప్రతిరోజూ దాదాపు 10 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో రాకపోకలు సాగిస్తుంటారు. -
భర్త రెండో పెళ్లికి సిద్ధ పడ్డాడని..
పురుగుల మందు తాగిన వివాహిత మదనపల్లె క్రైం: పెళ్లి అయి మూడు నెలలు కాకుండానే భర్త రెండో పెళ్లికి సిద్ధ పడడంతో మనస్తాపం చెందిన నవ వధువు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గురువారం ములకలచెరువు మండలంలో జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీకి చెందిన సిద్దగాళ్ల వెంకటేష్‌కు మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన రాధమ్మ(19)తో పెళ్లి జరిగింది. వీరి కాపురం మూడు నెలలు సజావుగా సాగింది. తర్వాత ఏమి జరిగిందో ఏమో కాని వెంకటేష్ రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో రాధమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు 108 ద్వారా మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా మదనపల్లె మండలం కోటవారిపల్లె పంచాయతీ బండకిందపల్లెలో చంద్రకళ(20) అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది విషపు గులికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాధమ్మ వండిన వంట తినరంట!
బెంగళూరు: ఇప్పటికే వందమంది విద్యార్థులు ఆ ప్రభుత్వ బడి నుంచి వేరే పాఠశాలకు మారారు. కేవలం 18 మంది విద్యార్థులు ఇప్పుడు ఆ బడిలో చదువుతున్నా.. అందులో ఐదుగురే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. అందుకు కారణం రాధమ్మ మధ్యాహ్న భోజనాన్ని వండటమే. రాధమ్మ దళిత మహిళ కావడంతో ఆమె వండిన వంటను తినడానికి విద్యార్థులు నిరాకరిస్తున్నారు. ఆమె వండిన మధ్యాహ్న భోజనాన్ని తినలేమంటూ మరో పాఠశాలలో వెళ్లి చేరుతున్నారు. ఇది కర్ణాటక కొలార్ జిల్లాలోని కగ్గనహళ్లి గ్రామంలో మాధ్యమిక ప్రభుత్వ పాఠశాలలోని పరిస్థితి. ఈ అనాగరిక పరిస్థితిపై పాఠశాల కూక్ రాధమ్మ విలేకరులతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. '2014 ఫిబ్రవరిలో నేను పాఠశాలలో చేరిననాటినుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉంది. నేను ఇచ్చిన పాలు కూడా విద్యార్థులు తాగరు. నేను వండిన వంటను తినరు. వాళ్ల తల్లిదండ్రులే నా వంట తినొద్దని విద్యార్థులకు నూరిపోస్తున్నారు. ఇంకా నేను వాళ్లకు ఏం చెప్పేది' అంటూ ఆమె బాధపడ్డారు. నిజానికి ఈ పరిస్థితి మార్చడానికి గతంలో జిల్లా అధికారులు ప్రయత్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామవాసులతో సమావేశం నిర్వహించి.. ఇలా చేయకూడదని చెప్పిచూశారు. దీంతోపాటు గత నెలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి అధికారులు పాఠశాలలో సామూహిక భోజనాలు చేశారు. అయినా పరిస్థితి మారలేదు. అయితే రాధమ్మ వండిన వంట తినకపోవడానికి కారణం కులవివక్ష కాదని, ఈ పాఠశాలలో చదివే చాలామంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీలే అయినప్పటికీ.. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకున్న రాజకీయ కక్షలతోనే వాళ్లు పాఠశాల మారుతున్నారని స్కూల్ ఇన్చార్జి వైఎం వెంకటచలపతి చెప్తున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో వసతులు మెరుగుపరిచాలని, తగినంత మంది ఉపాధ్యాయులను నియమించాలని, దాంతోపాటు దళిత మహిళా కూక్‌ను మార్చితేనే.. తమ పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్చుతామని స్పష్టం చేస్తున్నారు. -
కలత చెందా !
కోలారు: అంటరానితనం అంటే తెలియని పసి మొగ్గలు వారు... ప్రొద్భలమో, లేక చెప్పుడు మాటలో కాని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు దళిత మహిళ వంట చేస్తోందని చెప్పి వారు మధ్యాహ్న భోజనం తినకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన వంట మనిషి రాధమ్మ ఏకంగా రాష్ట్ర గవర్నర్‌కు ‘దయా మరణం’ (మెర్సి కిల్లింగ్) కోరుతూ లేఖ రాయడం సంచలనం సృష్టించింది. దీంతో ఆగమేఘాలపై అధికార యంత్రాంగం అక్కడికి చేరుకుని పరిస్థితి సరిదిద్దారు. వివరాలు... జిల్లాలోని ముళబాగిలు తాలూకా నంగలి ఫిర్కా కగ్గనహళ్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దళిత మహిళ రాధమ్మ కొంతకాలంగా వంట మనిషిగా పనిచేస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా దళిత మహిళ అనే నెపంతో పాఠశాలలో చదువుతున్న 18 మంది విద్యార్థులు ఆమె వండిన భోజనం చేయడానికి నిరాకరించారు. దాంతో మనస్థాపానికి గురైన దళిత మహిళ రాధమ్మ తనకు దయా మరణం కోరుతూ గవర్నర్‌కు లేఖ రాసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం సోమవారం హుటాహుటిన కగ్గనహళ్లి గ్రామానికి చేరుకుంది. బెంగుళూరు సీఆర్ఓ సెల్ అదనపు పోలీస్ ఏడీజీపీ భాస్కర్‌రావ్ గ్రామానికి వెళ్లి స్వయంగా పరిశీలన జరిపారు. మధ్యాహ్నం వేళకు గ్రామానికి చేరుకున్న ఏడీజీపీ భాస్కర్ రావ్ తొలుత పాఠశాల సిబ్బంది. గ్రామస్తుల కలిసి సమావేశమై చర్చలు జరిపారు. గ్రామంలో ఇలాంటి అంటరానితనం పద్దతి పోవాలని గ్రామస్తులు, విద్యార్థులకు నచ్చచెప్పారు. అంతే కాకుండా మధ్యాహ్న భోజనాన్ని అధికారులు, విద్యార్థులతో కలిసి వంటమనిషి రాధమ్మ వండిన వంటకాలతో భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ... చట్టం ముందు ఎవరూ పెద్దవారు కాదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. పిల్లల లేత హృదయాలలో ఇలాంటి భావాలు రాకుండా ఉపాధ్యాయులు జాగ్రత్త పడాలని సూచించా రు. పాఠశాల అధ్యక్షుడు సురేష్, ప్రధానోపాధ్యాయుడు వెంకటా చలపతితో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి మరోమారు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరస్పర వైషమ్యాల వల్ల దేనిని సాధించడానికి సాధ్యం కాదన్నారు గతంలోనే వివాదం : గ్రామంలోని పాఠశాలలో గతంలో దళిత మహిళ వంట చేయడానికి నియమించడంపై వివాదం చెలరేగింది. అపట్లో దళితులను బహిష్కరించారనే ఆరోపణలపై గ్రామానికి చెంది కొంతమంది అరెస్టయ్యారు. దళిత మహిళ రాధమ్మ పాఠశాలలో వంట చేయడానికి అర్జీ వేయడానికి కూడా నిరాకరించారనే ఆరోపణలు వినిపించాయి. అప్పటి కలెక్టర్ డీకే రవి స్వయం గా గ్రామానికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్ది వచ్చారు. దళిత మహిళ రాధమ్మను వంట మనిషిగా నియమించడానికి అనుమతించారు. పాత కక్షల నేపథ్యంలో మళ్లీ ఇలా జరుగుతోందని గ్రామంలోని పలువరు దళితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 126 మంది పిల్లలకు 108 మంది పిల్లలు టీసీలు తీసుకుని వేరే పాఠశాలల్లో చేరారు. ప్రస్తుతం 18 మంది పిల్లలు మాత్రమే ఉండి వీరు కూడా రాధమ్మ చేస్తున్న వంటలు తినడం లేదని ఆరోపణ. 18 మంది పిల్లలలో ఓబీసీ వారు 3, ఎస్టీ 1 మిగిలిన వారందరూ ఎస్సీ సముదాయానికి చెందిన వారే కావడం విశేషం. గ్రామాన్ని సందర్శించిన వారిలో కోలారు ఎస్పీ అజయ్హిలోరి, బీఈఓ దేవరాజ్, అధికారులు కణ్ణయ్య, వి లక్ష్మయ్య, ఆర్డీవో మంజునాథ్, డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తదితరులు ఉన్నారు. -
తల్లి శవం పక్కనే.. కుమార్తె సజీవ సమాధి
కాల్వశ్రీరాంపూర్, న్యూస్‌లైన్: తల్లి మృతి చెందడంతో కడసారి చూపు కోసం పరుగున వచ్చిన కుమార్తె అక్కడ రోదిస్తుండగానే... గోడకూలి తల్లి శవం పక్కనే సజీవ సమాధి అయింది. వివరాలు.. కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఆరెపల్లెకి చెందిన పొవారి రాయమల్లమ్మ(85)అనారోగ్యంతో గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. వరంగల్ జిల్లా మొగుల్లపల్లి మండలం చింతలపల్లె గ్రామంలో ఉంటున్న కుమార్తె రాధమ్మ తల్లిని కడసారి చూసుకునేందుకు రాత్రికి ఆరెపల్లెకు చేరుకుంది. శుక్రవారం ఉదయం రాయమల్లమ్మ మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు సిద్ధమయ్యారు. అప్పటివరకు మృతదేహం పక్కనే కూర్చున్న వారందరూ లేచి ముందుకు వచ్చారు. రాధమ్మ తల్లి మృతదే హం పక్కనే రోదించసాగింది. పక్కనే ఉన్న సిమెంట్ గోడ అకస్మాత్తుగా కూలిపోవడంతో రాధమ్మ ఆ గోడ శిథిలాల కింద ఇరుక్కుపోయింది. తీవ్రగాయాలై ఊపిరాడకపోవడంతో శిథిలాలను తొలగించేలోపే ఆమె చనిపోయింది. సిమెంట్ గోడ అవతలివైపు ఇసుక పోశారు. ఇటీవల వర్షాలకు ఇసుక తడిసి బరువెక్కింది. దీంతో గోడ ఒక్కసారిగా కూలిపోయిందని గ్రామస్తులు తెలిపారు. 24 గంటల వ్యవధిలోనే తల్లీబిడ్డలు మృతి చెందడంతో విషాదం అలుముకుంది. -
జనం నీళ్లల్లో.. మంత్రులు ఇళ్లల్లో..
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షంతో జనజీవనం అతలాకుతలమవుతున్నా మన జిల్లా ప్రజాప్రతినిధులు పత్తాకు లేరు. కష్టాల కండగండ్లలో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు నేతలకు తీరికలేకుండా పోయింది. చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిని విలపిస్తున్న అన్నదాతను ఓదార్చే దిక్కు కరువైంది. పూర్తిగా అధికారులు, ఇతర సిబ్బందిపైనే భారం మోపి ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 1,3,423 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, మిరప, వరి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 300 ఇళ్లు కూలిపోయాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. సారయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పునియోజకవర్గ పరిధిలో రాధమ్మ అనే మహిళ గోడకూలి మృతిచెందింది. పలు కాలనీలు, ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుని జనం బిక్కుబిక్కుమంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రైతులను, ప్రజలను ఓదారుస్తూ అధికారుల్లో చలనం తీసుకొచ్చి అవసరమైన చర్యలు చేపట్టడంలో భాగస్వామ్యం కావాల్సిన నాయకులంతా జాడలేకుండా పోయారు. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్, రాష్ర్ట మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, వర్ధన్నపేట, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, మాలోతు కవిత ఇప్పటి వరకు బాధితులను పలకరించిన పాపాన పోలేదు. టీడీపీ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కొడకండ్ల, రాయపర్తి మండలాల్లో పర్యటించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కొత్తగూడ మండలంలో, నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి ఖానాపురం మండలంలో పర్యటించారు. డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ మాత్రం జాడలేకుండా పోయారు. టీఆర్ఎస్కు చెందిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ నియోజకవర్గంలోని జలదిగ్బంధ కాలనీల్లో పర్యటించారు. బాధితులకు మంచినీరు, భోజనవసతి ఏర్పాటు చేశారు. పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి గీసుకొండ మండలంలోని మచ్చాపూర్‌లో పర్యటించి రైతులను ఓదార్చారు. ఇక స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య పార్టీ ఎమ్మెల్యేల బృందం పర్యటనలో వరంగల్ మార్కెట్, నర్సంపే ట, గీసుగొండ ప్రాంతాల్లో పాల్గొన్నారు. తన నియోజకవర్గంలో ఇంకా అడుగిడలేదు. కొందరు ప్రజాప్రతినిధులు ఢిల్లీలో ఉంటే మరికొందరు హైదరాబాద్, జిల్లా కేంద్రానికే పరిమితమయ్యారు. నియోజకవర్గాల పర్యటనకు దూరం గా ఉన్నారు. జిల్లాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు మినహా ఇతరత్రా ప్రజాప్రతినిధులెవరూ లేరు. పరిస్థితి సర్పంచ్ల స్థాయిలో లేదు. స్పందించాల్సిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనీసం స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు రైతు సంఘాలు, ప్రజాసంఘాలు, అక్కడక్కడ టీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన స్థానిక నాయకులు మాత్రం పర్యటించి రైతులకు కొంతైనా భరోసా కల్పిస్తున్నారు. ఇకనైనా మన ప్రజాప్రతినిధులు స్పందించి, బాధితులకు అండగా నిలిచేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.