శభాష్ రాధమ్మ!
- ఇటు కుందేళ్ల పెంపకం...అటు వ్యవసాయం
- చేతినిండా ఆదాయం.. పలువురికి ఉపాధి
నల్లమాడ : నల్లమాడ మండలంలోని వంకరకుంట గ్రామానికి చెందిన టీడీ రాధమ్మ... గ్రామ సమీపంలోని తమ పొలంలో ప్రత్యేకంగా ఓ షెడ్డు నిర్మించి రెండేళ్లుగా కుందేళ్ల పెంపకం చేపట్టారు. 200 కుందేళ్లతో ప్రారంభమైన ఈ ప్రకియ ప్రస్తుతం రెండు వేలకు చేరుకుంది. కుందేళ్లకు ఆహారంగా ఎకరా పొలంలో ఎగ్జ్‌లూజర్ రకం గడ్డిని ఆమె సాగు చేస్తున్నారు. దీంతో పాటు దాణాగా దీంతో పాటు సజ్జ, మొక్కజొన్న, వేరుశనగ చెక్కపొడిని అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నలుగురు కూలీలను ఏర్పాటు చేసుకుని వారికి నెలకు రూ. 20 వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. దినసరి కూలీల ఖర్చు ఇందుకు అదనం.
మహానగరాలకు ఎగుమతి...
మాంసానికి ఉపయోగపడే కుందేళ్ల పెంపకం ఎంతో లాభదాయకంగా ఉంటుందని రాధమ్మ పేర్కొంటున్నారు. ప్రస్తుతం కుందేలు మాంసం కిలో రూ. 580 వరకు అమ్ముడు పోతోందని, డిమాండ్‌ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ, చెన్నై తదితర నగరాల్లోని హోటళ్లు, ఫంక‌్షన్లకు ఆర్డర్‌పై మాంసం సరఫరా చేస్తుంటామన్నారు. ఆయా నగరాల్లో బహిరంగ మార్కెట్ సౌకర్యం కూడా ఉందన్నారు. కుందేళ్ల మాంసం విక్రయం ద్వారా నెలకు రూ. రెండు లక్షలు రాబడి వస్తోందని, ఇందులో దాణా కొనుగోలు, కూలీల వేతనాలు, ఇతరత్రా ఖర్చులకు రూ.లక్ష ఖర్చు అవుతుందని వివరించారు. షెడ్డు నిర్మాణం, కుందేలు పిల్లల కొనుగోలు, వాటి పోషణకు అవసరమైన జాలరీలు, బోరు ఏర్పాటు కోసం సుమారు రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టామన్నారు. ఆడ కుందేలు నెలకోమారు 5 నుంచి 10 పిల్లలకు జన్మనిస్తుందని, ఈ విధంగా తక్కువ కాలంలోనే కుందేళ్ల సంఖ్య బాగా పెరుగుతుందన్నారు. ఈనిన 12 గంటల తర్వాత మగ కుందేలుతో సంపర్కం చేయిస్తే ఆడ కుందేలు తిరిగి గర్భం దాలుస్తుందన్నారు. కుందేలు పిల్లలను నాలుగు మాసాలు పోషిస్తే రెండు నుంచి రెండున్నర కిలోల బరువు తూగుతాయని, అప్పుడు వాటి మాంసాన్ని విక్రయిస్తామన్నారు.
పాడితోనూ లబ్ధి
తమకున్న పదెకరాలల్లో మూడు బోర్లు వేయించిన రాధమ్మ... కూలీలతో వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమనూ చేపట్టారు. వేరుశనగ, కంది, మొక్కజొన్న తదితర పంటలు సాగుచేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. కూలీల సాయంతో 10 గేదెలను పోషిస్తూ పాల విక్రయం ద్వారా ఆదాయం గడిస్తున్నారు. భర్త రఘునాథరెడ్డి ఐకేపీ ఉద్యోగి కావడంతో సెలవు రోజుల్లో మాత్రమే ఆయన అందుబాటులో ఉంటారని, తక్కిన సమయంలో తానే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటానని రాధమ్మ తెలిపారు. కుమార్తె చదువు కోసం నల్లమాడలో కాపురముంటున్న రాధమ్మ ప్రతిరోజూ దాదాపు 10 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో రాకపోకలు సాగిస్తుంటారు.