female farmer
-
పత్తి దిగుబడి రాలేదని మహిళా రైతు ఆత్మహత్య
కెరమెరి (ఆసిఫాబాద్): ఎదిగిన బిడ్డకు పెళ్లి చేయాలనుకుంది. పది రోజుల క్రితమే పెళ్లి సంబంధం రావడంతో సంబరపడింది. అయితే పెళ్లికి డబ్బు లేక తల్లడిల్లింది. పత్తి పంట చేతికి వస్తుందని అనుకున్న తరుణంలో మాడిపోవడం చూసి కుంగిపోయింది. కూతురు పెళ్లి ఎలా చేయాలో తెలి యక దిగులు చెంది మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. కుమురంభీం జిల్లా కెరమెరి మండలం పెద్ద కరంజివాడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాథోడ్ మీరా బాయి, వసంత్‌రావు దంపతులకు కుమారుడు కిరణ్, కూతురు సుజీ ఉన్నారు. వసంత్‌రావు పదేళ్ల క్రితం చని పోయాడు. అప్పటి నుంచి మీరాబాయి వ్యవసాయం చేస్తూ పిల్లలను కంటికి రెప్పలా చూస్తోంది. ఈ సీజన్లో రూ.80 వేలు అప్పు చేసి తనకున్న ఐదెకరాల్లో పత్తి సాగు చేసింది. అయితే ప్రకృతి కరుణించక పత్తి పంట మాడిపోయింది. కనీసం 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించినా.. ఐదు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదు. పది రో జుల కిందట కూతురికి పెళ్లి సంబంధం వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ లేక పోవ డం, పంట దిగుబడి సరిగా రాక పో వడంతో మీరాబాయి (40) గురు వా రం పత్తి చేనులోనే పురుగు మందు తాగింది. కుటుంబ స భ్యులు ఆమెను కెరమెరి పీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు. మీరాబాయి మృతదేహం -
మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
మనోహరాబాద్(తూప్రాన్): తాతల కాలం నాటి నుంచి సాగు చేసుకుంటూ జీవిస్తున్న భూమిని పరిశ్రమల పేరిట ప్రభుత్వం లాక్కుంటే ఎలా బతికేదని ఓ మహిళా రైతు అధికారుల ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం అధికారులు సర్వే చేస్తుండగా పర్కిబండ గ్రామానికి చెందిన తీగుళ్ళ శ్యామల వారి వద్దకు వచ్చి తమకున్న రెండెకరాల సాగు భూమిని గుంజుకుంటే మాకు జీవనాధారం ఉండదని కాళ్లావేళ్లా పడి వేడుకుంది. మా చేతిలో ఏమీ లేదనీ తమ పైఅధికారుల ఆదేశాల మేరకే 209 సర్వే నంబర్లో 252 ఎకరాల కోసం స్థల సర్వే చేపట్టినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. దీంతో భూమి పోతుందనే దుఃఖంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును అధికారుల ముందే తాగింది. ఇది గమనించిన అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పక్కనే ఉన్న స్థానికులు చికిత్స నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రైతును పరామర్శించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఫోన్లో మాట్లాడి రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
మహిళా రైతు ‘శ్వేతా’నందం!
ప్రొఫెషనల్ డిగ్రీ చేసినా మేకల పెంపకం చేపట్టారు శ్వేత. ఎన్.ఐ.ఎఫ్.టి.లో ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. పెళ్లయ్యాక బెంగళూరులో నివాసం. భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంటి వద్ద ఖాళీగా గడుపుతూ ఉండేది. భర్తతో విహారయాత్రకు వెళ్లినప్పుడు ఒక మేకల పెంపక క్షేత్రాన్ని చూసి ముచ్చటపడింది. అంతే.. చిన్న జీవాలు పెంచే మహిళా రైతుగా మారిపోయింది. విశేషమేమిటంటే.. భర్తకు నచ్చజెప్పి డెహ్రాడూన్ దగ్గర్లోని రాణిపోక్రి గ్రామానికి మకాం మార్చి మరీ.. మేకల పెంపకం చేపట్టింది. ఆన్లైన్ అమ్మకాలతో ఏటా రూ. 25 లక్షల టర్నోవర్ చేస్తోంది! హేట్సాఫ్ శ్వేతా!! -
కోరిక తీరిస్తేనే.. పాస్బుక్కు, చెక్కు
సాక్షి, గద్వాల: ‘నా కోరిక తీర్చు.. అప్పుడే రైతు బంధు చెక్కు, పాస్బుక్కు ఇస్తా’అంటూ తహసీల్దార్ తనను వేధిస్తున్నారని జోగు ళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్‌పై అదే మండలం చిన్నిపాడు గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌కు హెచ్ఆర్సీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. స్థానికంగా ఫిర్యాదు చేస్తే అధికారులు తహసీల్దార్కే వత్తాసు పలుకుతారన్న ఉద్దేశంతో వారం క్రితం తాను హెచ్ఆర్సీని ఆశ్రయించినట్లు బాధితురాలు వెల్లడించింది. పాసుబుక్కు, రైతుబంధు చెక్కు ఇవ్వ కుండా రోజుల తరబడి కార్యాలయానికి తిప్పించుకుంటున్నారని ఆమె వాపోయింది. తనకు అన్యాయం చేయాలని కుట్ర చేశారని.. తన కోరిక తీరిస్తేనే చెక్కు ఇస్తానంటూ వేధిస్తున్నారని తెలిపింది. కాగా, దీనిపై మానవపాడు తహసీల్దార్ మునెప్ప విలేకరులతో మాట్లాడుతూ తాను ఎవరి విషయంలో కూడా అసభ్యంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. చిన్నిపాడులో సర్వే నంబర్ 57/ఏలో 1.06 ఎకరాల భూమి ఉమ్మడి ఆస్తిగా ఉన్నప్పటికీ గతంలో సంబంధిత రెవెన్యూ యంత్రాంగం ఒక్కరిపైనే పట్టా చేసిందన్నారు. చెక్కు పంపిణీ సమయంలో మిగతా వాటాదారుల ఫిర్యాదు మేరకు, వివాదంలో ఉన్నందున చెక్కు ఆపామన్నారు. ఈ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. -
బామ్మ బంగారం
ఆమెతో కొద్దిసేపు మాట్లాడితే స్త్రీ స్వేచ్ఛకు అర్థం తెలుస్తుంది. స్వతంత్ర భావాలతో ఎలా జీవించాలో అర్థమవుతుంది. ఎనిమిది పదుల వయసులోనూ ఆమె చెంగుచెంగున దూకే ‘లేడి’పిల్ల. పురుషాధిక్య సమాజంపై ఏహ్యభావంతో ఆమె పెళ్లికి దూరమైనా.. బంధాలు, అనుబంధాలకు దూరం కాలేదు. వ్యవసాయంపై ఉన్న మమకారాన్ని వదులుకోలేదు. అందుకే బామ్మ బంగారం.. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. – జంగారెడ్డిగూడెం రూరల్ నా పేరు కేసనపల్లి లక్ష్మీకాంతం. మాది జంగారెడ్డిగూడెం. మా తల్లిదండ్రులు పున్నమ్మ, శ్రీరాములు. నాన్న శ్రీరాములు వ్యవసాయం చేసేవారు. అప్పట్లో మాకు సొంతంగా కొంగరగూడెంలో 50 ఎకరాల వ్యవసాయ పొలం ఉండేది. అయితే అప్పట్లో వ్యవసాయం లాభసాటి కాకపోవడంతో మాకు కాస్త ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. మా తల్లిదండ్రులకు మేము ఏడుగురు సంతానం. నాకు ఒక అన్న.. ఒక తమ్ముడు.. నలుగురు చెల్లెళ్లు. అమ్మాయిల్లో నేనే పెద్దదానిని. ఎనిమిదో తరగతి చదివా.. టీచరయ్యా.. నేను 8వ తరగతి వరకు జంగారెడ్డిగూడెంలో చదువుకున్నాను. అప్పట్లో ఐటీడీఏ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో పనిచేసేందుకు ఉపాధ్యాయులు కావాలని ప్రకటన విడుదలైతే దరఖాస్తు చేశాను. ఉద్యోగం రావడంతో 1954లో విధుల్లో చేరాను. వివధ చోట్ల పనిచేసి 1992లో రిటైరయ్యాను. అప్పట్నుంచి వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం అంటే ఇష్టం మాది చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం కావడంతో అనుకోకుండానే నాకు వ్యవసాయంపై ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తితోనే ఉద్యోగ విరమణ అనంతరం నాకు వచ్చిన పెద్ద మొత్తంతో జంగారెడ్డిగూడెం మండలం రామచర్లగూడెం సమీపంలో 5 ఎకరాల భూమి కొనుగోలు చేశాను. నేనే స్వయంగా వ్యవసాయం చేయడం ప్రారంభించాను. ఆయిల్‌పామ్, జామ, కొబ్బరి, కోకో వంటి పంటలు సాగు చేశాను. నాకు నేనుగా అనుభవం ద్వారా వ్యవసాయంలో మెలకువలను నేర్చుకున్నాను. మా తోటలో పండే జామకాయలను ఒరిస్సాలోని కటక్ వరకు ఎగుమతి చేసేవాళ్లం. ప్రస్తుతం ఆయిల్‌పామ్, కోకో సాగు చేస్తున్నాను. ఇంత వయస్సులోనూ పొలానికి వెళ్లి నీళ్లు పెట్టడంతో మొదలు, ఎరువులు వేయడం, తదితర పనులన్నీ నేనే స్వయంగా చేస్తుంటాను. ప్రతి రోజు ఉదయం 5 గంటలకే నిద్ర లేచి పనులు ముగించుకుని స్కూటీపై పొలానికి వస్తుంటాను. గోమూత్రం తదితర వాటితో తయారుచేసిన సేంద్రియ ఎరువులనే వ్యవసాయానికి వినియోగిస్తున్నాను. సేంద్రియ ఎరువు వల్ల మంచి దిగుబడులు సాధించవచ్చు. పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే.. సమాజంలో మహిళలపై పురుష ఆధిక్యత అంటే నాకు నచ్చదు. పైగా నాకు అప్పట్లో కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండేవి. అందువల్లనే నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే రాలేదు. ప్రస్తుతం మా వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకుని ఎక్కడెక్కడికో వెళ్లిపోయారు. మా అన్న అప్పారావు మాత్రం ప్రస్తుతం నాతోనే ఉంటున్నారు. భార్య చనిపోవడంతో ఆయన బాగోగులు నేనే చూసుకుంటున్నాను. జీవిత అవపానదశలో మమ్మల్ని ఎవరైతే కంటికి రెప్పలా చూసుకుంటారో వారికే నా ఆస్తి రాసి ఇవ్వాలనుకుంటున్నాను. లేదంటే ఏ అనాథాశ్రమానికో రాసేస్తాం. -
జీవామృతమే జీవనాధారం!
భర్తను కోల్పోయిన యువతికి బతుకుబాట చూపిన ప్రకృతి వ్యవసాయం. జీవామృతాల ఉత్పత్తులతో దేశవిదేశీ ప్రముఖుల ప్రశంసలందుకుంటున్న యువ మహిళా రైతు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన మహిళా రైతు కొండా ఉషారాణి విజయగాథ ఇది. ‘‘పదోతరగతి పూర్తికాగానే పదిహేడేళ్ల వయసులో పెళ్లి పేరుతో అత్తింట కాలు మోపాను. మూడున్నరేళ్లలో ఇద్దరు బిడ్డలు కలిగారు. సాఫీగా సాగుతున్న నా జీవితంలో భర్త సుధాకర్‌రెడ్డి ఆకస్మిక మరణం నాకో పెద్ద షాక్. ఏం చేయాలో తెలీదు. చంటిపిల్లలు. అర ఎకరం భూమి తప్ప ఆస్తులు లేవు. చదువు పెద్దగా లేదు. బిడ్డల్ని ఎలా సాకాలో దిక్కుతోచేది కాదు. దుఃఖాన్ని దిగమింగుకుంటూనే మా అమ్మ సాయంతో సమీప గ్రామం కాజలో పొగాకు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిలో చేరాను. రోజూ 12 గంటల డ్యూటీ చేసినా నెలాఖరుకు చేతిలో పడేవి రూ.1500. అవి ఏమూలకూ వచ్చేవి కావు. ఇలా కాదని రూ.20 వేలు పెట్టుబడితో చీరలు తెచ్చి, ఇంట్లోనే అమ్మసాగాను. కొన్ని రోజులు ఫర్వాలేదు అనిపించింది. ఓ రోజు ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులతో పాటు చీరలూ ఎత్తుకుపోయారు. దీంతో మళ్లీ నా బతుకు ప్రశ్నార్ధకమైంది. ఉపాధి కోసం వెతుకులాట. బయో ఎరువుల మార్కెటింగ్ నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి వ్యవసాయం పట్ల అవగాహన ఉంది. చుట్టు పక్కల రైతులు కొందరు సొంతంగా జీవామృతాలను తయారుచేసి వాడటం చూసేదాన్ని. బయో ఎరువుల కంపెనీ నుంచి అలాంటి మార్కెటింగ్ చేస్తే బాగుంటుందనిపించింది. ప్రయత్నించి చూద్దామని షాపుల వాళ్లను కలిసి, ఎరువుల శాంపిల్స్ తీసుకున్నాను. సంచిలో ఆ శాంపిల్స్ పెట్టుకొని ఆటోలో మంగళగిరి చుట్టుపక్కల 14 గ్రామాలు తిరుగుతూ మార్కెటింగ్ చేసేదాన్ని. సూర్యోదయంతో పాటే నా ప్రయాణం మొదలయ్యేది. ఉదయం 6.30 గంటలకు బయట కాలుపెడితే తిరిగొచ్చే సరికి చీకటి పడేది. చంటి బిడ్డల ఆలనా పాలనా చూడలేకపోతున్నాను అనే నిస్సహాయత గుండెను పిండేస్తుండేది. కానీ, ఈ పని మానుకొంటే నా పిల్లల నోటికి నాలుగు మెతుకులు అందించేదెలా? అమ్మానాన్నలు ఎన్నాళ్లని సాయం చేస్తారు? అందుకే నా నడక ఆగేది కాదు. ఆశల సాగు ఈ క్రమంలోనే 2007–08లో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. నా జీవితానికో ఆలంబన దొరుకుతుందన్న ఆశ మొలకెత్తింది. కాకినాడ, గుంటూరు, తిరుపతిలో శిక్షణ తరగతులకు హాజర య్యాను. ప్రతి అంశాన్నీ నోట్స్ రాసుకుని సొంతంగా ప్రకృతి సేద్య ప్రయోగాలు ఆరంభించాను. జీవామృత తయారీకి ఆవు కావాలి. కొనాలంటే డబ్బు లేక కొన్ని గోశాలల నుంచి గో మూత్రం, పేడ సేకరించేదాన్ని. ఉమ్మెత్త, వేపాకు, రావి, జిల్లేడు.. వంటి ఆకులను సేకరించి వీటితో జీవామృత కషాయాల తయారీని మొదలుపెట్టాను. వీటిని రైతులకు ఎలా అమ్మాలి.. నేను ఆచరణలో పెడితేనే నలుగురూ నమ్ముతారు. అందుకే మా ఆయన మిగిల్చి వెళ్లిన అర ఎకరం పొలం, పుట్టింటి వాళ్లిచ్చిన 40 సెంట్ల పొలంలో దొండ పందిరి, మినుము వేశాను. తర్వాత మునగ, అంతర పంటగా మిర్చి సాగు చేశాను. నా కష్టాన్ని చూసి ఎగతాళి చేసినవారున్నారు. సాధ్యమయ్యే పనికాదని నిరుత్సాహపరిచిన వారున్నారు. కానీ, మా అమ్మ నాకు అండగా నిలిచింది. పంటలకు నేను తయారు చేసిన జీవామృత కషాయాలను వాడాను. దిగుబడులు బాగానే వచ్చాయి. పంట మార్పిడి కోసం కాలీఫ్లవర్ వేశాను. ధరలు తగ్గిపోవడంతో నష్టం వచ్చింది. నాలుగేళ్లుగా మునగ, పసుపు, వరి పంటలు సాగు చేస్తున్నాను. తర్వాత 80 సెంట్లలో మినుము 4.5 క్వింటాళ్ల దిగుబడి రావడంతో అంతరపంటగా కూరఅరటి, చిక్కుళ్లు సాగు చేశాను. కిందటి సీజనులో 40 సెంట్లలో వేసిన మునగ నెలన్నర ముందుగానే దిగుబడినిచ్చింది. టన్నుకు పైగా మునగ కాయల దిగుబడి వచ్చింది. మళ్లీ ఇప్పుడు మునగ, పసుపు, వరి పైర్లు సాగులో ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర రెండు ఆవులు ఉన్నాయి. వీటి మూత్రం, పేడ, ఆకులతో చేసిన జీవామృతం మా పొలం వరకు సరిపోతాయి. నేను సాగుచేస్తున్న విధానాలు చూసిన రైతులు ఘన, ద్రవ జీవామృతాన్ని తయారుచేసిమ్మన్నారు. రైతుల ఆదరణతో కషాయాల ఉత్పత్తి రెండేళ్ల క్రితం ఊరి బయట మా సొంత స్థలంలోనే శ్రీవాసవీ దుర్గా ప్రకృతి వ్యవసాయ కషాయాల ఉత్పత్తుల యూనిట్‌ను స్థాపించాను. ప్రభుత్వం ఎన్‌పీఎం యూనిట్ కింద రూ.40 వేలు సబ్సిడీ ఇచ్చారు. ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, దశపర్ణిక కషాయం, పంచగవ్య, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం సొంతంగా యూనిట్లో తయారీ చేస్తున్నాను. వీటికి కావల్సిన గోమూత్రం, పేడ గోశాలల నుంచి సేకరిస్తున్నాను. 2 కేజీల నుంచి 50 కేజీల వరకు వీటి ప్యాకింగ్ ఉంటుంది. వీటిని దాదాపు 150 మంది రైతుల వరకు కొనుగోలు చేసి ప్రకృతి సేద్యంలో వినియోగిస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాల్‌కు మంచి ఆదరణ లభించింది. పూల నర్సరీల నిర్వాహకులు, మేడలపై ఇంటిపంటల సాగుదారులు, పల్నాడు రైతులు కూడా ఈ ఉత్పత్తులను కొని తీసుకెళుతున్నారు. ఒక్కోసారి డిమాండుకు సరిపడా సరఫరా చేయలేకపోయానే అనుకునే సందర్భాలూ ఉన్నాయి. ఇద్దరు పనివారిని పెట్టుకుని స్వయంగా ఈ పనులను చేస్తుంటాను. మా అమ్మ, పిల్లలూ ఈ పనిలో సాయం చేస్తుంటారు. ఖర్చునెలకు రూ.65 వేల వరకు వస్తుంది. అన్ని ఖర్చులు పోను నెలకు 15 నుంచి 20 వేల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. నిపుణుల ప్రశంసలు ఈ విజయంతో ప్రకృతి వ్యవసాయ సలహాదారు విజయకుమార్, కెన్యాలోని వరల్డ్ ఆగ్రో ఫారెస్ట్రీకి చెందిన నిపుణులు సహా పలువురు విదేశీ ప్రతినిధులు, ప్రముఖులు మా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల యూనిట్‌ను సందర్శించి, అభినందించారు. ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటునందిస్తే 500 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయించాలని, సమీప ఊళ్లలో ఆదర్శ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పాలనేది నా ఆశయం’’ అంటూ తన విజయగాథను వివరించారు ఉషారాణి. ఆమె (94948 49622) కల నెరవేరాలని ఆశిద్దాం. ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటునందిస్తే 500 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయించాలని, సమీప ఊళ్లలో ఆదర్శ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పాలనేది నా ఆశయం – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా -
తమ భూమి తమకు కాకుండా చేసినందుకే హత్య
-
విషాదం నింపిన భూవివాదం
చిత్తూరు, సాక్షి: మహిళా రైతు విమల(52)ను శుక్రవారం కర్కశంగా చంపిన ఘటనతో చిత్తూరు జిల్లా యాదమర్రి మండలంలోని వరిగపల్లెలో విషాదం అలుముకుంది. భూ తగాదాల నేపథ్యంలో రంజిత్ అనే వ్యక్తి శుక్రవారం అత్యంత కిరాతకంగా ట్రాక్టర్ రొటోవేటర్‌తో విమలను తొక్కించి హత్య చేసిన విషయం తెలిసిందే. అంతేగాక అడ్డువచ్చిన ఆమె భర్తను సైతం ఇనుప రాడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రశాంతంగా ఉండే ఊళ్లో ఇలాంటి దారుణ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామమంతా ఉలిక్కిపడింది. గ్రామంలో అందరికీ తల్లో నాలుకగా వ్యవహరించే మనిషి దూరమవడంతో ఊళ్లోని చిన్నాపెద్దా కన్నీరు పెట్టారు. విమల అంత్యక్రియలు వరిగపల్లెలో శనివారం సాయంత్రం 5 గంటలకు జరిగాయి. మృతదేహాన్ని చూసి కూతురు భవ్యశ్రీ గుండెలవిసేలా ఏడ్వడం అందర్నీ కదిలించింది. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, నిందితులు రంజిత్, గోవిందరాజు, రంజిత్ తండ్రి గోవిందయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగింది? విమల(52), జగన్నాథరెడ్డి(59) భార్యాభర్తలు. జగన్నాథరెడ్డికి శ్రీరాములురెడ్డి అనే తమ్ముడు ఉన్నాడు. శ్రీరాములురెడ్డికి వరిగపల్లె చెరువు సమీపంలో 14 గుంటల వ్యవసాయ పొలం ఉంది. ఈ పొలాన్ని ఐదు సంవత్సరాల క్రితం చిత్తూరుకు చెందిన ఏకాంబరమేస్త్రీ అనే వ్యక్తి వద్ద కుదువ పెట్టి కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు. డబ్బు తీసుకున్న సంవత్సరం తరువాత శ్రీరాములురెడ్డి చనిపోయాడు. దీంతో ఏకాంబరమేస్త్రీ డబ్బు విషయం జగన్నాథరెడ్డి దృష్టికి తీసుకొచ్చాడు. ఆయన నాకు సంబంధం లేదు అని చెప్పడంతో ఏకాంబర మేస్త్రీ వరిగపల్లి గ్రామానికే చెందిన రంజిత్ అనే వ్యక్తికి మూడేళ్ల క్రితం విక్రయించాడు. ఎంత ఒత్తిడి చేసినా ఏకాంబర మేస్త్రీకి రంజిత్ డబ్బు చెల్లించలేదు. దీంతో ఏకాంబర మేస్త్రీ జగన్నాథరెడ్డితో కలిసి చిత్తూరు సివిల్ కోర్టులో కేసు వేశాడు. ఇన్‌జంక్షన్ ఆర్డర్ రావడంతో... శ్రీరాములురెడ్డి, జగన్నాథరెడ్డి అన్నదమ్ములు కాబట్టి భూమి జగన్నాథరెడ్డికి చెందుతుందని ఈ నెల 8న కోర్టు ఇన్‌జంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దీంతో ట్రాక్టర్‌తో పనులు చేసుకునేందుకు పొలానికి వెళ్లారు జగన్నాథరెడ్డి దంపతులు. పొలంలో పనులు చేస్తుండగా రంజిత్ స్నేహితుడు గోవిందరాజులు చూసి పనులు అడ్డుకున్నాడు. రంజిత్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న రంజిత్ పొలం మాది.. పనులు ఎలా చేస్తారని ప్రశ్నించాడు. దీంతో మాటామాటా పెరిగింది. పట్టారాని కోపంతో రంజిత్ వివాదాస్పద పొలం పక్కనే ఉన్న జగన్నాథరెడ్డి జొన్న పంటను ట్రాక్టర్‌తో తొక్కించేశాడు. పంటను నాశనం చేయొద్దని పొలం గట్టుపై నుంచి విమల అరవడం మొదలు పెట్టింది. దీంతో రంజిత్ విచక్షణ మరచి.. ఆమెను ట్రాక్టర్‌తో ఢీకొట్టారు. ఆమె రొటోవేటర్‌లో ఇరుక్కొని దుర్మరణం చెందింది. -
‘కుప్ప’కూలిన మహిళా రైతు
కొనుగోలు కేంద్రంలో ఆగిన గుండె సాక్షి జగిత్యాల/బుగ్గారం: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామనుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లిన ఓ మహిళా రైతు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండలోని సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో ఆదివారం కుప్పకూలింది. వెల్గొండకు చెందిన మహిళా రైతు పల్లపు రాజవ్వ(50), భర్త నర్సయ్యకు ఐదెకరాల సాగు భూమి ఉంది. వారికి 20 క్వింటాళ్ల వరి దిగుబడి వచ్చింది. పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి ఇరవై రోజుల క్రితమే పంటను తీసుకెళ్లింది. కానీ, మొదటి పది రోజులు తేమ శాతం ఉందంటూ నిర్వాహకులు కొనుగోళ్లు నిరా కరించారు. ఆ తర్వాత గన్నీ బ్యాగులు అందుబాటులో లేక తూకానికి జాప్యం జరిగింది. ఇది వరకే.. తన భర్త నర్సయ్య అనారోగ్యం పాలవడంతో రాజవ్వ.. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలోనే వదిలిపెట్టి తరుచూ ఆస్పత్రికి.. ఇంటికెళ్లి వచ్చేది. చివరకు ఈ నెల 27న రాత్రి రాజవ్వకు కొనుగోలు కేంద్రంలో రాజవ్వకు గన్నీ సంచులు దొరికాయి. దీంతో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకే కొనుగోలు కేంద్రానికి వచ్చిన రాజవ్వ.. తన పంట దగ్గర ఎండలోనే నిలబడి గన్నీలో ధాన్యం నింపడం ప్రారంభించింది. ఈ క్రమంలో అస్వస్థతకు గురై.. గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలింది. విషయాన్ని గ్రహించిన స్థానిక రైతులు రాజవ్వను వెంటనే చెట్టు నీడకు తీసుకొచ్చి... పరీక్షించగా అప్పటికే ఆమె చనిపోయింది. -
ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న ప్రయోగాత్మక ‘శిల్ప'o!
► నాలుగేళ్లుగా చెరకుతోపాటు వరి, కూరగాయ పంటల సాగు ►భూసారంతోపాటు ఏటేటా పెరుగుతున్న పంటల దిగుబడి, నికరాదాయం.. ►ఎకరానికి 2 టన్నుల సేంద్రియ బెల్లం, బెల్లం పొడి ఉత్పత్తి.. రూ. లక్ష వరకూ నికరాదాయం ►ప్రయోగాత్మకంగా బోదెలపై ఆరుతడి వరి, అంతర పంటగా మినుము సాగు.. ఆసక్తి, ఓర్పు ఉంటే ప్రకృతి సేద్యం యువ మహిళలకూ సుసాధ్యమేనని నిరూపిస్తున్నారు యువ మహిళా రైతు శిల్ప. పుస్తక పఠనం ద్వారా ప్రకృతి వ్యవసాయంతో కలిగిన పరిచయం.. నాలుగేళ్ల అనుభవంతో పరిపుష్టమైంది. ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం, పంటల తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులు ఆమెను మరింత ఉత్సాహపరుస్తున్నాయి. ప్రయోగాత్మకంగా బోదెలపై ఆరుతడి వరి సాగుకు శ్రీకారం చుట్టారు. సేంద్రియ బెల్లం, బెల్లంపొడి తయారీపై దృష్టి పెట్టారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏటేటా భూసారంతోపాటు దిగుబడి, నికరాదాయంతోపాటు సంతోషమూ ఇనుమడిస్తోందని భరోసాగా చెబుతున్నారు శిల్ప. ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగిన రైతులకు శిక్షణ ఇస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారామె. కరవంటే అనంతపురం, అనంతపురం అంటే కరవు.. రెండూ వేరు వేరు కాదు... గుక్కెడు నీటికి కటకటలాడే చోటది. అలాంటి చోట వ్యవసాయానికి ఉపక్రమించటం ఎండమావిలో నీరు వెతకటమే. దానికి తోడు ఎలాంటి ఫలితాలిస్తాయో తెలియని కొత్త పద్ధతులను న మ్ముకోవటమంటే నేల వదిలి సాము చేయటమే. ఆ రెండు పనులను అత్యంత చాకచక్యంతో నిర్వహించి ఒంటిచేత్తో సాగు చేస్తూ... పచ్చ బంగారాన్ని తన పొత్తిళ్లలో పొదివిపట్టిన భూదేవి అనుపతి శిల్పా కాళేశ్వర్. అనంతపురం జిల్లా పెనుకొండ ఆమె స్వగ్రామం. ఎంబీఏ వరకు చదువుకున్న ఆమెకు వ్యవసాయం బొత్తిగా తెలియదు. సుభాష్ పాలేకర్ పుస్తకాల పఠనంతో ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగింది. మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను స్వయంగా చూసి స్ఫూర్తిని పొందారు. తొలుత పెరటి తోటను సాగు చేసి.. సత్ఫలితాలు రావడంతో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం విశేషం. ప్రకృతి సేద్యంలో విభిన్న పద్ధతులను అనుసరిస్తూ కరువు సీమ రైతు లోకానికి మార్గదర్శిగా నిలుస్తున్నారావిడ. బోదెలపై ఆరుతడి వరి.... గత నాలుగేళ్లుగా శిల్ప ప్రకృతి సేద్యంలో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది బోదెలపైన వరిని సాగు చేసి అందరినీ అబ్బురపరిచారు శిల్ప. సాగు నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఈ ప్రయోగాత్మక పద్ధతికి శ్రీకారం చుట్టారు. పాకిస్థాన్ బాస్మతీ, లోయా, నవారా వరి రకాలను 30 సెంట్ల పొలంలో బోదెలపై సాగు చేశారు. ముందుగా పొలాన్ని దుక్కి దున్ని 50 సెం. మీ. ఎడం ఉండేలా బోదెలు చేసుకున్నారు. 21 రోజుల వయసున్న నారును బోదెలపై నాటించారు. 50 సెం. మీ. దూరంలో పాదుకో మొక్క చొప్పున నాటారు. సాధారణంగా 20 పిలకలు వస్తే ఎక్కువ.. కానీ ఈ మొక్కలకు 40–50 వరకు పిలకలు వచ్చాయి. ప్రతి 15 రోజులకోసారి 500 లీటర్ల జీవామృతాన్ని నీటితో కలిపి పారించేవారు. నాటిన 20 రోజులకు, పొట్ట దశలో నీమాస్త్రాన్ని.. గింజ దశలో పులిసిన మజ్జిగను పిచికారీ చేయటంతో ఎలాంటి చీడపీడలు పంటను ఆశించలేదు. అయితే, గింజ దశలో బోరు చెడిపోవడంతో దిగుబడి దెబ్బతిన్నదని, వచ్చే ఏడాది పూర్తిస్థాయిలో బోదెలపై ఆరుతడి వరిని సాగు చేస్తామని శిల్ప తెలిపారు. రెండు వరి మొక్కల మధ్య అదే బోదెపై మినుము (ఉద్దులు)ను సాగు చేశారు. ఎకరాకు కిలో విత్తనాలు విత్తారు. ఇది 90 రోజుల పంట కావటంతో వరితో పాటే సాగు పూర్తయింది. ఊదల సాగుకు అదనంగా రూపాయి ఖర్చు కాలేదు. చెరకులో అంతరపంటలుగా పసుపు, కూరగాయలు.. నాలుగు ఎకరాల్లో చెరకును నాలుగేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. కార్శి పంటగా చెరకుతో పాటు అంతర పంటలుగా పసుపు, ఉల్లితో పాటు వంగ, మిరప వంటి పంటలను శిల్ప సాగు చేస్తున్నారు. ఈ ఆరెకరాలకు రెయిన్ గన్ల ద్వారా నీటినందిస్తున్నారు. చెరకులో ఏటా ఎకరాకు మూడు ట్రక్కుల పశువుల ఎరువు, 3 క్వింటాళ్ల వేపపిండి దుక్కిలో వేస్తారు. ప్రతి 15 రోజులకోసారి జీవామృతాన్ని నీటి ద్వారా అందిస్తారు. సాధారణంగా కార్శి పంటగా సాగు చేసే చెరకులో మూడేళ్ల తరువాత మళ్లీ కొత్త విత్తనం నాటుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తే 30–40 ఏళ్ల వరకు చెరకును కార్శి పంటగా సాగు చేయవచ్చని చెపుతున్నారు. దీని వల్ల రైతుకు వేల రూపాయల ఖర్చు ఆదా అవుతుంది. ముందుగా నిద్రావస్థను తొలగించేందుకు విత్తన పసుపు కొమ్మును నేలపై కుప్పగా వేస్తారు. విత్తనాన్ని వేపాకు, ఎర్ర మన్నుతో గాలి చొరబడకుండా కప్పి నెల రోజులు ఉంచుతారు. చెరకు కోత కోసిన 2–3 నెలల వ్యవధిలో చెరకు 3 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అప్పుడు చెరకు సాళ్ల మధ్యలో బోదెను ఏర్పాటు చేసి విత్తన పసుపును నాటుకుంటారు. చెరకులో అంతరపంటగా ఉల్లిని సాగు చేస్తున్నారు. బోదె పక్కన ఉలి ్ల నారును నాటుతారు. చెరకు కోతకొచ్చేసరికి అంతర పంటలు కూడా చేతికొస్తాయి. వీటికోసం ప్రత్యేకంగా యాజమాన్య చర్యలు చేపట్టటం, ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రైతుకు అదనపు ఆదాయం లభించింది. కంచె పంటగా సాగు చేసే కందితో ఎకరాకు 2 క్వింటాళ్ల కందుల దిగుబడి వస్తోంది. ఎకరానికి 2 టన్నుల సేంద్రియ బెల్లం, బెల్లం పొడి.. చెరకును సొంతగా గానుగాడించి సేంద్రియ బెల్లాన్ని తయారు చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఎకరాకు చెరకు 2 టన్నుల వరకు బెల్లం లేదా బెల్లం పొడి దిగుబడి వస్తోంది. గానుగ ఆడించేందుకు రూ. 70 వేల వ్యయంతో క్రషింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. చెరకును క్రషర్లో వేస్తే రసం వస్తుంది. దీన్ని బాణలిలో పోసి బాగా మరగబెడతే పాకం తయారవుతుంది. వేడిమీదున్నప్పుడే దీన్ని రకరకాల అచ్చులలో పోసి వివిధ ఆకృతుల్లో బెల్లం దిమ్మలను తయారు చేస్తారు. కిలో రూ. 60 చొప్పున విక్రయిస్తున్నారు. అంతరపంటల ద్వారా ఎకరానికి రూ. 30 నుంచి 40 వేల వరకు ఆదాయం వస్తోంది. ఎకరానికి కనీసం రూ. లక్షకు తగ్గకుండా నికరాదాయం లభిస్తోంది. బెల్లం పొడిని కూడా తయారు చేస్తూ.. కిలో రూ. 150 చొప్పున విక్రయిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సాగు చేయటం, బెల్లం తయారీ ప్రక్రియలో ఎలాంటి రంగులనూ వాడటం లేదు. అందువల్ల ఈ బెల్లం మంచి రుచిగా ఉండటమే కాక ఆరోగ్యకరం కూడా. ఎక్కువ తీపి ఉండడం, ఏడాది కాలానికి Sపైగా నిల్వ ఉండటం సేంద్రియ బెల్లం ప్రత్యేకత. దీంతో ముందుగానే వ్యాపారుల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. వీటిని విజయవాడ, హైదరాబాద్, బొంబాయి వంటి నగరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో చెరకు ఇతర పంటల సాగు.. సేంద్రియ బెల్లం, బెల్లం పొడి తయారీలో ఆసక్తి కలిగిన రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తుండడం విశేషం. మరిన్ని వివరాలకు.. తిప్పన్న 94943 67890, చంద్ర 80192 44100లను సంప్రదించవచ్చు. – తలారి మల్లికార్జున, సాక్షి, పెనుకొండ, అనంతపురం జిల్లా ఇనుమడిస్తున్న సంతోషం! గతంలో వ్యవసాయం గురించి తెలియకపోయినా ప్రకృతి వ్యవసాయం నేర్చుకొని నాలుగేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. మొదటి రెండేళ్లు చీడపీడలు కనిపించాయి. తర్వాత ఆ సమస్య లేదు. భూసారం ఏటేటా పెరుగుతోంది. పంట ఆరోగ్యంగా ఉంటున్నది. ఏటేటా దిగుబడితోపాటు నికరాదాయం పెరుగుతోంది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా వ్యవసాయం చేయడం వల్ల చోటుచేసుకుంటున్న ప్రకృతిపరమైన మార్పు మాకు బాగా తెలుస్తోంది. వానపాములు, పక్షులు, పిచ్చుకలు, కొంగలకు మా తోట ఆలవాలంగా మారింది. బెల్లం, బెల్లంపొడి ఎకరానికి రెండు టన్నుల వరకు వస్తోంది. ఎకరానికి రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు నికరాదాయం వస్తోంది. రాయలసీమలో రైతులు బోదెల పద్ధతిలో ఆరుతడి వరి సాగు చేసుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయాన్ని ధైర్యంగా చేపడితే చక్కని దిగుబడి, ఆదాయం కూడా పొందవచ్చని రైతులు గ్రహించాలి. ఆసక్తి కలిగిన వారికి మా తోటలో శిక్షణ ఇస్తున్నాం.. – శిల్ప, ఆదర్శ యువ రైతు, పెనుకొండ, అనంతపురం జిల్లా -
శభాష్ రాధమ్మ!
ఇటు కుందేళ్ల పెంపకం...అటు వ్యవసాయం చేతినిండా ఆదాయం.. పలువురికి ఉపాధి నల్లమాడ : నల్లమాడ మండలంలోని వంకరకుంట గ్రామానికి చెందిన టీడీ రాధమ్మ... గ్రామ సమీపంలోని తమ పొలంలో ప్రత్యేకంగా ఓ షెడ్డు నిర్మించి రెండేళ్లుగా కుందేళ్ల పెంపకం చేపట్టారు. 200 కుందేళ్లతో ప్రారంభమైన ఈ ప్రకియ ప్రస్తుతం రెండు వేలకు చేరుకుంది. కుందేళ్లకు ఆహారంగా ఎకరా పొలంలో ఎగ్జ్‌లూజర్ రకం గడ్డిని ఆమె సాగు చేస్తున్నారు. దీంతో పాటు దాణాగా దీంతో పాటు సజ్జ, మొక్కజొన్న, వేరుశనగ చెక్కపొడిని అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నలుగురు కూలీలను ఏర్పాటు చేసుకుని వారికి నెలకు రూ. 20 వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. దినసరి కూలీల ఖర్చు ఇందుకు అదనం. మహానగరాలకు ఎగుమతి... మాంసానికి ఉపయోగపడే కుందేళ్ల పెంపకం ఎంతో లాభదాయకంగా ఉంటుందని రాధమ్మ పేర్కొంటున్నారు. ప్రస్తుతం కుందేలు మాంసం కిలో రూ. 580 వరకు అమ్ముడు పోతోందని, డిమాండ్‌ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ, చెన్నై తదితర నగరాల్లోని హోటళ్లు, ఫంక్షన్లకు ఆర్డర్‌పై మాంసం సరఫరా చేస్తుంటామన్నారు. ఆయా నగరాల్లో బహిరంగ మార్కెట్ సౌకర్యం కూడా ఉందన్నారు. కుందేళ్ల మాంసం విక్రయం ద్వారా నెలకు రూ. రెండు లక్షలు రాబడి వస్తోందని, ఇందులో దాణా కొనుగోలు, కూలీల వేతనాలు, ఇతరత్రా ఖర్చులకు రూ.లక్ష ఖర్చు అవుతుందని వివరించారు. షెడ్డు నిర్మాణం, కుందేలు పిల్లల కొనుగోలు, వాటి పోషణకు అవసరమైన జాలరీలు, బోరు ఏర్పాటు కోసం సుమారు రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టామన్నారు. ఆడ కుందేలు నెలకోమారు 5 నుంచి 10 పిల్లలకు జన్మనిస్తుందని, ఈ విధంగా తక్కువ కాలంలోనే కుందేళ్ల సంఖ్య బాగా పెరుగుతుందన్నారు. ఈనిన 12 గంటల తర్వాత మగ కుందేలుతో సంపర్కం చేయిస్తే ఆడ కుందేలు తిరిగి గర్భం దాలుస్తుందన్నారు. కుందేలు పిల్లలను నాలుగు మాసాలు పోషిస్తే రెండు నుంచి రెండున్నర కిలోల బరువు తూగుతాయని, అప్పుడు వాటి మాంసాన్ని విక్రయిస్తామన్నారు. పాడితోనూ లబ్ధి తమకున్న పదెకరాలల్లో మూడు బోర్లు వేయించిన రాధమ్మ... కూలీలతో వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమనూ చేపట్టారు. వేరుశనగ, కంది, మొక్కజొన్న తదితర పంటలు సాగుచేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. కూలీల సాయంతో 10 గేదెలను పోషిస్తూ పాల విక్రయం ద్వారా ఆదాయం గడిస్తున్నారు. భర్త రఘునాథరెడ్డి ఐకేపీ ఉద్యోగి కావడంతో సెలవు రోజుల్లో మాత్రమే ఆయన అందుబాటులో ఉంటారని, తక్కిన సమయంలో తానే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటానని రాధమ్మ తెలిపారు. కుమార్తె చదువు కోసం నల్లమాడలో కాపురముంటున్న రాధమ్మ ప్రతిరోజూ దాదాపు 10 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో రాకపోకలు సాగిస్తుంటారు. -
మహిళా రైతు ఆత్మహత్య
భీమదేవరపల్లి (కరీంనగర్) : అప్పులబాధ తాళలేక మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కట్కూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పంజా లక్ష్మి(45) తనకున్న రెండెకరాలలో పత్తి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు రూ. 4 లక్షలు ఉండటంతో వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. -
మహిళా రైతు బలవన్మరణం
వింజమూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గుండెమడకల గ్రామానికి చెందిన పొగాకు మహిళా రైతు కల్లూరు ఓబుళమ్మ(60) అప్పుల బాధతో శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఓబుళమ్మ తన పొలంలో ఒకటిన్నర బ్యారెక్ పొగాకు పంట వేసింది. అయితే అప్పుల బాధ ఎక్కువ కావడంతో మనస్థాపానికి గురైన ఆమె శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఒక కూమార్తె ఉంది. -
మహిళా రైతు ఆత్మహత్య
డోర్నకల్ (కర్నూలు) : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం తొడేళ్లగూడెం గ్రామానికి చెందిన చెక్కల ఉపేంద్ర(33) తన భర్త శ్రీనుతో కలిసి తమకున్న ఎకరం ఇరవై గుంటల్లో పత్తి సాగు చేస్తోంది. పెట్టుబడి కోసం శ్రీను పలు చోట్ల చేసిన అప్పులు సుమారు రూ.2.30 లక్షల వరకు చేరాయి. ఇంత చేసినా పంటకు సరిగా నీరందలేదు. ఇటీవల రెండుసార్లు వ్యవసాయ బావి కరెంటు మోటారు కాలిపోయింది. మనస్తాపానికి గురైన ఉపేంద్ర సోమవారం తన పత్తి చేను వద్ద పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను భర్తతోపాటు స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ వివరించారు. -
మహిళా రైతు ఆత్మహత్య
మెదక్ (ఆందోల్) : మెదక్ జిల్లా ఆందోల్ మండలం డాకూర్ గ్రామంలో శుక్రవారం కవిత(28) అనే మహిళా రైతు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల వేసిన పత్తి పంట ఎండిపోవటం, అప్పులబాధ తీర్చే మార్గం కనపడకపోవటంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
మహిళా రైతు ఆత్మహత్య
చిగురుమామిడి (కరీంనగర్) : అప్పులబాధ తాళ లేక ఓ మహిళా కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నవాబుపేట గ్రామానికి చెందిన సాగరిక(24) అనే వివాహిత ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పండిస్తోంది. ఈ క్రమంలో గత రెండేళ్లుగా దిగుబడి సరిగ్గా లేక అప్పులే మిగులుతున్నాయి. ఈ ఏడాదైనా పంట చేతికొస్తుందని ఆశలు పెట్టుకున్న సాగరికకు ఎండిపోయిన పత్తి చేను కనిపించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సాగరికకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.