పసుపు అంటే సాధారణంగా సేలం.. దుగ్గిరాల వంటి వంగడాలు గుర్తుకు వస్తుంటాయి. అరుదుగా పండే 11 రకాల దేశీ పసుపు రకాలను పండిస్తున్నారు మహిళా రైతు నడింపల్లి కవిత. కస్తూరి.. లకడాండ్.. నల్ల పసుపు.. రోమ్.. తెల్ల పసుపు.. చింతపల్లి.. సోనియా.. రాజాపూరి.. ప్రతిమ.. వీఐపీ(848), వీఐపీ (849) వంటి ప్రత్యేక పసుపు రకాలను ఆమె పండిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో తనకున్న ఐదెకరాల వ్యవసాయక్షేత్రంలో మామిడిలో అంతర పంటగా ఈ రకాలను ఆమె సాగు చేస్తున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడకుండా కవిత వ్యవసాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భీమవరం సమీపంలోని మొగల్లుకు చెందిన కవిత కుటుంబం హైదరాబాద్ గచ్చిబౌలిలో స్థిరపడ్డారు. వ్యవసాయంపై మక్కువ కలిగిన కవిత సంగారెడ్డి జిల్లాలో ఐదెకరా సొంత భూమిలో ఈ ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు.
విజయనగరం జిల్లా నుంచి చింతపల్లి రకం, మేఘాలయ, అస్సాం, డెహ్రాడూన్ తదితరప్రాంతాల నుంచి మరికొన్ని పసుపు రకాలను సేకరించిన కవిత గత మూడు సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు.
పసుపులో రారాజు కస్తూరి..
కస్తూరి రకం పసుపులో రారాజుగా పేరుంది. పసుపు నాణ్యతకుప్రామాణికమైన కర్క్‌మిన్ ఈ కస్తూరి రకంలో సుమారు 15 శాతం వరకు ఉంటుందన్నారామె. దీన్ని ఔషధాల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. సుమారు 3 సంవత్సరాలు పెరిగిన కస్తూరి రకం పసుపునకు క్యాన్సర్‌ను కూడా నయం చేయగల ఔషధ సామర్థ్యం ఉంటుందని ఆమె చెబుతున్నారు.
లకడాంగ్ రకం పసుపు ముఖ సౌందర్యానికి, చర్మ సౌందర్యానికి ఉపయోకరమన్నారు. పండించిన పసుపు కొమ్ములను ఉడికిస్తే ఔషధ గుణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పసుపు కొమ్ములను సోలార్ డ్రయ్యర్‌లో ఎండబెడుతున్నారు. పసుపును ΄÷డితో పాటు ద్రవ రూపంలోకి, ట్యాబ్‌లెట్ల రూపంలోకి కూడా మార్చుతున్నారు. పసుపు ఉత్పత్తులను అమెరికా, దుబాయ్ వంటి విదేశాల్లో నివాసం ఉండే పరిచయస్తులకు ఆమె ఇస్తున్నారు.
వ్యవసాయం అంటే ఇష్టం..
ప్రకృతి వ్యవసాయం అంటే నాకు ఎంతో ఇష్టం. అరుదైన పసుపు రకాలను సాగు చేయాలని అనుకొని సేకరిస్తున్నాను. ఇప్పటి వరకు 11 వెరైటీల పసుపును పండిస్తున్నాను. అస్సాం రకాన్ని కూడా సాగు చేయాలనుకుంటున్నాను. దేశీ ఆవులను పెంచుతూ పాలేకర్ పద్ధతిలో నేను చేస్తున్న వ్యవసాయానికి మా కుటుంబసభ్యులు ఎంతో సహకరిస్తున్నారు.
– నడింపల్లి కవిత (76809 67818), పసుపు రైతు
– పాత బాలప్రసాద్,
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment