Turmeric cultivation
-
పసుపు @ 11 వెరైటీలు
పసుపు అంటే సాధారణంగా సేలం.. దుగ్గిరాల వంటి వంగడాలు గుర్తుకు వస్తుంటాయి. అరుదుగా పండే 11 రకాల దేశీ పసుపు రకాలను పండిస్తున్నారు మహిళా రైతు నడింపల్లి కవిత. కస్తూరి.. లకడాండ్.. నల్ల పసుపు.. రోమ్.. తెల్ల పసుపు.. చింతపల్లి.. సోనియా.. రాజాపూరి.. ప్రతిమ.. వీఐపీ(848), వీఐపీ (849) వంటి ప్రత్యేక పసుపు రకాలను ఆమె పండిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో తనకున్న ఐదెకరాల వ్యవసాయక్షేత్రంలో మామిడిలో అంతర పంటగా ఈ రకాలను ఆమె సాగు చేస్తున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడకుండా కవిత వ్యవసాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భీమవరం సమీపంలోని మొగల్లుకు చెందిన కవిత కుటుంబం హైదరాబాద్ గచ్చిబౌలిలో స్థిరపడ్డారు. వ్యవసాయంపై మక్కువ కలిగిన కవిత సంగారెడ్డి జిల్లాలో ఐదెకరా సొంత భూమిలో ఈ ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. విజయనగరం జిల్లా నుంచి చింతపల్లి రకం, మేఘాలయ, అస్సాం, డెహ్రాడూన్ తదితరప్రాంతాల నుంచి మరికొన్ని పసుపు రకాలను సేకరించిన కవిత గత మూడు సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. పసుపులో రారాజు కస్తూరి.. కస్తూరి రకం పసుపులో రారాజుగా పేరుంది. పసుపు నాణ్యతకుప్రామాణికమైన కర్క్మిన్ ఈ కస్తూరి రకంలో సుమారు 15 శాతం వరకు ఉంటుందన్నారామె. దీన్ని ఔషధాల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. సుమారు 3 సంవత్సరాలు పెరిగిన కస్తూరి రకం పసుపునకు క్యాన్సర్‌ను కూడా నయం చేయగల ఔషధ సామర్థ్యం ఉంటుందని ఆమె చెబుతున్నారు. లకడాంగ్ రకం పసుపు ముఖ సౌందర్యానికి, చర్మ సౌందర్యానికి ఉపయోకరమన్నారు. పండించిన పసుపు కొమ్ములను ఉడికిస్తే ఔషధ గుణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పసుపు కొమ్ములను సోలార్ డ్రయ్యర్లో ఎండబెడుతున్నారు. పసుపును ΄÷డితో పాటు ద్రవ రూపంలోకి, ట్యాబ్లెట్ల రూపంలోకి కూడా మార్చుతున్నారు. పసుపు ఉత్పత్తులను అమెరికా, దుబాయ్ వంటి విదేశాల్లో నివాసం ఉండే పరిచయస్తులకు ఆమె ఇస్తున్నారు. వ్యవసాయం అంటే ఇష్టం.. ప్రకృతి వ్యవసాయం అంటే నాకు ఎంతో ఇష్టం. అరుదైన పసుపు రకాలను సాగు చేయాలని అనుకొని సేకరిస్తున్నాను. ఇప్పటి వరకు 11 వెరైటీల పసుపును పండిస్తున్నాను. అస్సాం రకాన్ని కూడా సాగు చేయాలనుకుంటున్నాను. దేశీ ఆవులను పెంచుతూ పాలేకర్ పద్ధతిలో నేను చేస్తున్న వ్యవసాయానికి మా కుటుంబసభ్యులు ఎంతో సహకరిస్తున్నారు.– నడింపల్లి కవిత (76809 67818), పసుపు రైతు– పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి -
పసుపు సాగు విధానం మరియు లాభాలు
-
పసుపు ఛాయకు.. సిరుల పరిమళం
వందల ఏళ్ల నుంచి ఇక్కడ పసుపు వ్యాపారం సాగుతోంది. పసుపు ప్రాసెసింగ్ కేంద్రాలు ఉన్నాయి. పసుపు వ్యాపారులు కూడా అధికంగా ఉన్నారు. విశాఖ మన్యం 11 మండలాల్లో పండించే పసుపంతా మాడుగుల చేరుతుంది. ప్రాసెసింగ్ జరిగి సిరులు కురిపిస్తుంది. ఔషధ గుణాలున్న ఈ ఆర్గానిక్ పసుపు మంచి గిరాకీ కలిగి ఉండడమే కాదు..పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కరోనాను కూడా దరి చేరనివ్వలేదని దీని గొప్పతనాన్ని చెబుతున్నారు. విశాఖ మన్యంలో సేంద్రియ పద్ధతి పండించే పసుపులో ఔషధ గుణాలున్న కురుక్కుమిన్తో పాటు చర్మ సౌందర్యానికి ఉపయోగపడే ఓలంటయిల్ ఉంది. ఏజెన్సీలో రసాయన ఎరువులు వాడకుండా పూర్తిగా ఆవు పేడ, ఆవు పంచకంతో పండించే ఆర్గానిక్ పంట కావడం కూడా విశేషం. దీంతో ఇక్కడ ప్రాసెస్ అయ్యే పసుపునకు విదేశాల్లో మంచి గిరాకీ ఉందని చెబుతున్నారు. మిగతా ప్రాంతాల్లో పండించే పసుపులో కురుక్కుమిన్ 1.5 నుండి 2 శాతం ఉంటే మాడుగుల పసుపులో 5 శాతం కురుక్కుమిన్ ఉంది. అంతేకాకుండా ఆరెంజ్ ఎల్లో రంగులో ఈ పసుపు ఉంటుంది. ఈ రంగు ఉన్న పసుపును అంతర్జాతీయ మార్కెట్లో నాణ్యమైనదిగా గుర్తిస్తారు. ఇక్కడ పసుపును స్త్రీలు ముఖానికి రాసుకున్నా మంట పుట్టదు..ముఖం మెరుపుఛాయ రావడం, వంటకాలలో ఉపయోగిస్తే రుచితో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. 1500 కుటుంబాలకు జీవనోపాధి విశాఖ మన్యంలో పండించే పసుపు మాడుగులకు తీసుకు వస్తారు అక్కడ ప్రాసెసింగ్ చేసి శుభ్రపరిచిన తరువాత ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. సీజన్లో సుమారు 300 లారీలు పసుపును 200 మంది చిన్నా పెద్ద వ్యాపారులు మాడుగులలో కొనుగోలు చేస్తారు. ఇక్కడ పసుపును ఉడికించి డ్రమ్ముల్లో వేసి మంచి ఛాయ పసుపుగా తయారు చేసి ఆకర్షణీయమైన ప్యాకెట్లలో వేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఈ విధంగా రైతుల దగ్గర నుంచి మార్కెట్‌కు వెళ్లే వరకు సుమారు 1500 కుటుంబాలు దీనిపై ఆధార పడి మనుగడ సాగిస్తున్నారు. ప్రతి ఏటా సుమారు రూ.200 కోట్ల మేరకు వ్యాపారం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. మాడుగులలో ఆరు పసుపు ప్రాసెసింగ్ కేంద్రాలు ఉన్నాయి. పన్ను రాయితీ మేలు రూ.5 లక్షలు వ్యాపారం వరకు జీఎస్టీ రాయితీ ఇవ్వడం వల్ల చిరు పసుపు వ్యాపారులకు మేలు జరగనుంది. ప్రభుత్వ పరంగా పసుపు పరిశ్రమకు చేయూతను అందిస్తుంది. పసుపు రైతులకు ప్రోత్సాహకాలు అందజేయాలి. మాడుగుల పసుపునకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులుండడం వాస్తవమే. –బసవా పరమేష్, పసుపు వ్యాపారి, మాడుగుల కుర్కుమిన్ అధికం కుర్కుమిన్ అధికంగా ఉండే పసుపును తమిళనాడులో ఎక్కువగా ఇష్టపడతారు. కుర్కుమిన్ అధికంగా ఉండే పసుపుతో వంటకాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఔషధాలు ఉండడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ ఉంది. ప్రస్తుతం కిలో రూ.75 నుంచి రూ. 80 వరకు ధరలు పలుకుతున్నాయి. –దేవరాపల్లి శ్రీనివాసరావు, పసుపు వ్యాపారి పసుపు కేంద్రాలే జీవనాధారం మాడుగులలో తరతరాలుగా పలు కుటుంబాలు పసుపు తయారీతో జీవనోపాధి పొందుతున్నాయి. ఏజన్సీలో పండించే పసుపు నుంచి మాడుగులలో ప్రాసెసింగ్ జరిగే వరకు సుమారు 1500 కుటుంబాలకు జీవనాధారంగా మారింది. నిరంతరం పసుపులో పని చేయడం వలన మాకు కరోనా కూడా దరి చేరలేదు. –కోడూరు అప్పారావు, పసుపు కార్మికుడు, మాడుగుల -
పసుపు తవ్వే పరికరం ఇదిగో..!
తయారు చేసుకున్న తొంబరావుపేట రైతు శాస్త్రవేత్తలు..10 రోజులు తవ్వే పసుపును ఈ పరికరంతో ఒక్క రోజులోనే పూర్తి పసుపును సాగు చేసే రైతులు, పసుపు తవ్వకం సమయంలో కూలీలు దొరక్క చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామానికి చెందిన పసుపు రైతులు తమ సమస్యలకు తామే తగిన పరిష్కారాలు వెతుక్కుంటున్నారు. గత జూలైలో పసుపు విత్తే సమయంలో కూడా కూలీల కొరత నేపథ్యంలో తమకు అవసరమైన విధంగా పసుపు వేసే పరికరాన్ని తయారు చేసుకున్నారు (దీనిపై ‘సులువుగా పసుపు విత్తే పరికరం’ కథనాన్ని 2017 జూలై 11న ‘సాగుబడి’లో ప్రచురించాం). అదే వరుసలో.. ట్రాక్టర్‌కు బిగించి పసుపు తవ్వే పరికరాన్ని తాజాగా రూపొందించుకోవడం విశేషం. బెడ్ పద్ధతికి అనువుగా నూతన పరికరం.. ఈ అధునాతన పసుపు తవ్వే పరికరాన్ని మినీ ట్రాక్టర్‌కు వెనుక జోడించి ఉపయోగించవచ్చు. బెడ్ పద్ధతిలో సాగు చేసిన పసుపు పంటకు ఇది మరింతగా ఉపయోగపడుతుంది. బెడ్ల మధ్య 18 అంగుళాలు, సాళ్ల మధ్య 12 అంగుళాల దూరం ఉంటుంది. ఒక బెడ్‌పై రెండు లైన్ల పసుపు మొక్కలు ఉంటాయి. పసుపు పక్వానికి వచ్చి ఆకులు పసుపు వర్ణానికి మారిన తర్వాత, రైతులు పసుపు ఆకును కోస్తారు. ఆ తర్వాత పసుపు తవ్వడానికి మినీ ట్రాక్టరుకు ఈ పరికరాన్ని జోడించి ఉపయోగిస్తున్నారు. పసుపు తవ్వకానికి నాలుగు రోజులు ముందు పొలమంతా సాగు నీటిని పారగట్టడం తప్పని సరి. ఈ పరికరం పసుపు సాళ్లలో వెళ్లినప్పుడు పసుపు పైకిలేచి తిరిగి అందులోనే ఉంటుంది. దీనివల్ల పసుపు ఎండిపోకుండా ఉంటుంది. పరికరం ద్వారా తవ్విన తర్వాత కూలీలు వచ్చినప్పుడు కొమ్ములను విరుచుకోవచ్చు. పసుపు తవ్వినందుకు ట్రాక్టర్ కిరాయిగా ప్రస్తుతం గంటకు రూ. 800 వరకు తీసుకుంటున్నారు. భూమి ఎత్తు పల్లాలు లేకుండా ఉంటే తవ్వకం తొందరగా పూర్తవుతుంది. కొంతమంది రైతులు ఇటీవల పెద్ద ట్రాక్టర్‌కు సైతం ఇలాంటి పరికరాన్ని రూపొందిస్తున్నారు. రైతులందరం కలిసి తయారుచేసుకున్నాం.. పసుపు విత్తడానికి, తవ్వడానికి మా ఊర్లో కూలీలు దొరకడం లేదు. దీంతో, యువ రైతులందరం కలిసి ఆలోచించాం. దాంతో, ఒక్కొక్కరు తమ అనుభవాలను చెప్పడంతో, దాని ప్రకారం ట్రాక్టర్‌కు బిగించి పసుపు విత్తే పరికరాన్ని గతంలో తయారు చేశాం. ఇప్పుడు పసుపు తవ్వే పరికరాన్ని రూపొందించాం. దీంతో, రోజుల తరబడి చేసే పనులను ఒకే రోజులో చేయగలుగుతున్నాం. పెద్ద ట్రాక్టర్‌కు కూడా బిగించే పరికరాన్నీ సిద్ధం చేస్తున్నాం. – ఏలేటి రాజిరెడ్డి(94942 72409), తొంబరావుపేట, జగిత్యాల జిల్లా ఒక కూలీ ఖర్చుతోనే అరెకరం పసుపు తవ్వాను.. ఈ నూతన పరికరం ద్వారానే తన ఎకరం తోటలో వేసిన పసుపును తవ్వాను. అంతకుముందు కూలీలతో తవ్వించినప్పుడు పసుపు కొమ్ములు చెడిపోయేవి. ఎకరం పసుపు తవ్వకానికి కూలీలు దొరక్క దాదాపు 10 రోజులు పట్టేది. ఈ పరికరం రావడంతో ఒక రోజు తవ్వి, మరో రోజు కొమ్ములు విరవడంతో పని తేలికైంది. ఒక కూలీ ఖర్చుతోనే అర ఎకరం పసుపు తవ్వాను. – నల్ల రవి(95535 25623), తొంబరావుపేట, మేడిపల్లి మం., జగిత్యాల జిల్లా – పన్నాల కమలాకర్ రెడ్డి, జగిత్యాల అగ్రికల్చర్, సాక్షి -
పసుపు సాగుతో పసిడి పండించా..
-
సులువుగా పసుపు విత్తే పరికరం!
♦ తొంబరావుపేట రైతుల ఆవిష్కరణ ♦ పరికరాన్ని ట్రాక్టర్ కల్టివేటర్‌కు జత చేసి పసుపు విత్తుకుంటున్నారు ♦ రెండు గంటల్లో ఎకరాలో పసుపు, అంతర పంటగా మొక్కజొన్న విత్తనం వేసుకునే వీలు ♦ కూలీల కొరత సమస్య తీరింది ♦ రూ. 4 వేల నుంచి రూ.2 వేలకు తగ్గిన ఖర్చు అరకలు, కూలీలతో సమస్యను ఎదుర్కొంటున్న పసుపు రైతులు పంటను విత్తుకునేందుకు యంత్రం తయారు చేశారు. జగిత్యాల జిల్లా, మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామ రైతులు ఎక్కువగా పసుపును సాగు చేస్తుంటారు. కూలీలు, అరకలు దొరక్క అదను తప్పేది. దీంతో గ్రామంలోని పసుపు రైతులందరూ సమావేశమై యంత్ర పరికరాన్ని రూపొందించాలని తీర్మానించారు. యువ రైతులు వెల్డింగ్ షాపు యజమానులతో కలిసి యంత్రం తయారు చేశారు. కల్టివేటర్లా ఉండే ఈ పరికరాన్ని ట్రాక్టర్ హైడ్రాలిక్‌కు అనుసంధానిస్తారు. ఈ పరికరంలో మొత్తం మూడు వరుసలు ఉంటాయి. మొదటి వరుసలో నాలుగు నాగళ్లను ఏర్పాటు చేశారు. వీటి మధ్య అడుగున్నర దూరం ఉంటుంది. పై భాగంలో పసుపు విత్తనం పోసుకునేందుకు, ఎరువులు వేసుకునేందుకు ప్లాస్టిక్ గొట్టాలను ఏర్పాటు చేశారు. రెండో వరుసలో మూడు నాగళ్లు ఉంటాయి. వీటిపైన మొక్కజొన్న విత్తనాలు వేసేందుకు బాక్సును ఏర్పాటు చేశారు. మూడోవరుసలో ఐదుగురు కూలీలు కూర్చునేందుకు వీలుగా బల్లను ఏర్పాటు చేశారు. కూలీలు ఎదురుగా ఉన్న బాక్సులో నుంచి విత్తనాలు తీసుకొని పైపుల్లో వేస్తారు. ట్రాక్టరు నెమ్మదిగా ముందుకు వెళుతుంటే తొలుత పసుపు విత్తనం.. తర్వాత ఎరువు, సాళ్ల మధ్యలో మొక్కజొన్న విత్తనాలు పడతాయి. రెండు గంటల్లో ఎకరం విత్తుకోవచ్చు బోదెలు వెడల్పుగా వచ్చేందుకు వీలుగా నాగళ్లకు వెడల్పాటి రేకులను అమర్చారు. దీనివల్ల విత్తుకున్న పసుపుపై బెడ్ వస్తుంది. దానిపైన సులభంగా డ్రిప్పు పైపులు అమర్చుకోవచ్చు. దీనివల్ల పసుపును తవ్వుకోవటం సులభమవుతుంది. ట్రాక్టర్ నాగలి వెనుక కింది భాగంలో కట్టిన బరువైన కట్టె మట్టిపెడ్డలను పగులగొడుతుంది. దీనివల్ల పసుపు రైతుకు శ్రమ, ఖర్చు తగ్గి సమయం కలసి వస్తోంది. రెండు గంటల్లోనే ఎకరంలో పసుపును విత్తుకోవచ్చు. ఎద్దులతో విత్తుకుంటే ఎకరాకు రూ. 4 వేలు ఖర్చవుతుండగా ఈ పరికరంతో మాత్రం రూ. 2 వేలే ఖర్చవుతోంది. దీని తయారీకి రూ. 20 వేలు ఖర్చయిందని రైతులు తెలిపారు. అద్దెకిచ్చి గంటకు రూ. 1,200 కిరాయి వసూలు చేస్తున్నారు. రైతులందరం కలసి తయారు చేశాం..! పసుపు విత్తుకునేందుకు కూలీలు దొరక్కపోవటంతో వెల్డింగ్ షాపు యజమానితో కలిసి పసుపు విత్తే పరికరాన్ని తయారు చేయించాం. రెండేళ్లుగా ఈ దీన్ని వాడుతున్నాం. ఈ ఏడాది గ్రామంలోని రైతులందరూ దీనితోనే పసుపు వేశారు. – ఏలేటి రాజిరెడ్డి (94942 72409), పసుపు రైతు, తొంబరావుపేట, మేడిపల్లి మండలం, జగిత్యాల జిల్లా కొమ్ములు తీయటమూ సులభమే.. ఎద్దుల నాగలికంటే ఈ పరికరంతో పసుపును సులభంగా విత్తుకోవచ్చు. పంట పండిన తర్వాత చిన్న ట్రాక్టరుతో దున్ని, కొమ్ములను సులభంగా వెలికి తీయవచ్చు. దీనికి భవిష్యత్తులో మరిన్ని మార్పులు చేద్దామనుకుంటున్నాం. – యాళ్ల గోపాల్ రెడ్డి (98488 12150), పసుపు రైతు, తొంబరావుపేట, మేడిపల్లి మండలం, జగిత్యాల జిల్లా కూలీల ఇబ్బంది తీరింది.. అరకతో వేసినప్పుడు కూలీలు దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాను. గతంలో రెండెకరాలు వేసేందుకు రెండు రోజులు పట్టేది. కూలీల ఖర్చు ఎక్కువయ్యేది. ఇప్పుడు ముగ్గురు కూలీలతోనే రెండెకరాల్లో పసుపు వేశాను. వేసిన ట్లే అనిపించలేదు. – బద్దం శంకరమ్మ, పసుపు రైతు, సింగరావుపేట, రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి అగ్రికల్చర్, జగిత్యాల -
అంకాపూర్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు
పసుపు సాగుపై అధ్యయనం ఆర్మూర్ టౌన్: వ్యవసాయరంగ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని జపాన్ ప్రభుత్వ రంగ సంస్థ జపనీస్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజన్సీ(జైకా) అధ్యయన ప్రతినిధి బృందం సందర్శించింది. సోమవారం గ్రామంలో పర్యటించి పసుపు పంట సాగు విధానాన్ని అధ్యయనం చేసింది. జైకా డెరైక్టర్ మామియా, కన్సల్టెంట్లు ఇకె గయా, తజీషు, వతానాబే, జైకా భారత ప్రతినిధి ప్రకాష్ పి దేశాయ్, ఆర్ ప్రకాష్ బృందం పసుపు పంట సాగు, శుద్ధి, విక్రయం, తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పండరి నాథ్ నేతృత్వంలో అంకాపూర్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా ప్రతినిధి బృందం గ్రామంలో పసుపు మూ ల విత్తనాల సేకరణ, విత్తే విధానం, సాగు విధా నం, కాల వ్యవ ధి, పండిస్తున్న పసుపు రకాలు, తవ్వి ఉడికించే విధానం, ఉత్పత్తి శుద్ధి చేసే విధానం, మార్కెట్ విక్రయం, ఇందుకు ప్రభుత్వం రైతులకు అం దిస్తున్న సహకారం, తదితర అంశాలపై రైతులతో చర్చించారు. పసుపు సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు గురెడి రెడ్డి రైతు సంఘంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బృందం ప్రతినిధులు మాట్లాడుతూ జపాన్ ప్రభుత్వం అనేక రంగా ల్లో భారత దేశంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. విద్యుత్ ఉత్పాదన, నీటి పారుదల, పారిశ్రామిక విధానం, రవాణా, జాతీ య రహదారుల విస్తరణతో పాటు స్పైసెస్ కూడా ఉం దన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పసుపు, మామిడి పంటలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పా రు. పసుపు పంటను వివిధ ఔషధాల తయారీ, కాస్మోటిక్స్‌లో వాడతారన్నారు. పసుపు కొమ్ములోని లోపని భాగం కురుకుమిన్(గుజ్జు) భాగం ప్రధానమైం దని చెప్పారు. రైతులు పం డించే విధానంపై కురుకుమిన్ నాణ్యత శాతం ఆధారపడి ఉంటుందన్నారు. దీన్ని వాల్యూ చైన్ టర్మరిక్ అని పిలుస్తారని పేర్కొన్నారు. ఆయా అంశాలపై అధ్యయనం చేసి జపాన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు చెప్పా రు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పండరి నాథ్ మాట్లాడుతూ అంకాపూర్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్న దృష్ట్యా ఈ బృందం పర్యటన వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. వీరి వెంట గురెడి రెడ్డి రైతు సంఘం అధ్యక్షుడు ఎంసీ గంగారెడ్డి, కార్యదర్శి అంక్సాపూర్ దేవేందర్ రెడ్డి, ప్రతినిధులు కెకె భాజన్న తదితరులు ఉన్నారు. -
పసుపు సాగు.. కాపాడితే బాగు
అల్లిక రెక్కనల్లి (తెగులు) కారణాలు... ఎక్కువ నీడ, తక్కువ గాలి, వెలుతురు ఉండడం. పైరులో సూక్ష్మ వాతవరణం పొడిగా, చల్లగా ఉండడం. పొలంలో పరిశుభ్రత పాటించకపోవడం. లక్షణాలు ... ఆకుల అడుగు భాగంలో తల్లి, పిల్ల పురుగులు ఉండి రసం పీల్చడం వల్ల ఆకుపై భాగాన తెల్లని వచ్చలు ఏర్పడుతాయి. మొక్క పేలవంగా కనిపిస్తుంది. నల్లి ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులు ఎండిపోతాయి. నివారణ... విత్తనాన్ని సరైన సాంధ్రతతో నాటి మొక్కలకు గాలి, వెలుతురు ప్రసరించేలా చూడాలి. వేప పిండిని పైపాటు ఎరువుగా వేయాలి. పైరుపై పురుగును గమనించగానే లీటరు నీటిని 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా, 2 మిల్లీలీటర్ల డైమిథోఏట్ను కలపి పైరుపై పిచికారి చేయాలి. ఎర్రనల్లి(పొగచూరు తెగులు) : లక్షణాలు... పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగుభాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. నివారణ... లీటరు నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 5 మిల్లీలీటర్ల డైకోఫాల్, 1 మిల్లీలీటరు సబ్బు నీరు కలపి ఆకుల అడుగు భాగాన తడిచేటట్టు పిచికారి చేయాలి. పొలుసు పురుగు(స్కేల్స్) లక్షణాలు.. ఇవి తెల్లని చుక్కల వలే దుంపల మీద కనిపిస్తాయి. విత్తనం నిల్వ చేసినప్పుడు కొమ్ముల నుంచి రసాన్ని పీల్చి వదలి పోయే టట్లు చేస్తాయి. విత్తనం కోసం నిల్వ చేసే పసుపు కొమ్ములను లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల మలాథీయన్ మందు కలిపిన ద్రవంలో 30 నిమిషాలు ఉంచి, ఆరబెట్టి నిల్వ చేసుకుంటే పొలుసు పురుగులు ఆశించవు. దుంప తొలుచు ఈగ : కారణాలు.. చీడపీడలు ఆశించిన తోట నుంచి విత్తనం ఎన్నుకోవటం. విత్తనశుద్ధి చేయక పోవటం. పసుపు తర్వాత పసుపు పంట సాగుచేయడం. తక్కువ ఉష్ణోగ్రత, గాలిలో తేమ ఎక్కువ ఉండటం. తేమ నిల్వ ఉండే పల్లపు భూముల్లో సాగుచేయడం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆకాశం మేఘావృతమై చెదురుముదురుగా వర్షాలు పడడం. నష్టపరిచే విధానం... అక్టోబర్ నె నుంచి పంట చివరి వరకు దుంప తొలుచు ఈగ సమస్య ఉంటుంది. చిన్నవిగా, నల్లగా ఉండే ఈగలు మొక్కల మొదల్లపై నుంచి లోపలికి చేరి గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి బయటకు వచ్చే పిల్ల పురుగులు తెల్లగా బియ్యం గింజల మాదిరిగా ఉంటాయి. ఇది భూమిలోని దుంపల్లోకి చొచ్చుకుపోయి లోపలి కణజాలాన్ని తింటాయి. లక్షణాలు... దుంప తొలుచు ఈగ ఆశించిన మొక్క, సుడిఆకు దాని దగ్గరలో ఉన్న లేద ఆకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. మొవ్వు లాగితే సులభంగా ఊడివస్తుంది. దుంపలో కణజాలం దెబ్బతింటుంది. పుచ్చు ఆశించిన దుంపలను వండితే తొర్రమాదిరి కనిపిస్తుంది. మొక్క ఎదుగుదల నిలిచిపోయి, దిగుబడి 45-50 శాతం తగ్గుతుంది. నివారణ... విత్తనశుద్ధి దుంపలను విత్తే ముందు లీటరు నీటికి 2మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్, లేదా 3మిల్లీలీటర్ల మలథీయాన్,కలిపిన ద్రావణంలో దుంపల్ని నానబెట్టి తర్వాత నాడలో ఆరబెట్టి విత్తుకోవాలి. సమతుల ఎరువులను వాడాలి. మురుగునీరు పోయే సౌకర్యం కల్పించాలి.మొక్కల మధ్య నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పైరుపై దుంప పుచ్చు లక్షణాలు కనిపించిన వెంటనే ఎకరాకు 100 కిలోల వేపపిండిని మొక్కల మధ్య వేయాలి. ఇది దుంపపుచ్చు కలిగించే ఈగను దగ్గిరకు రానీయదు. సత్తువగా కూడా పనిచేస్తుంది. వేపపిండి లేకపోతే ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను అంతే పరిమాణం కలిగిన ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. వేరు నులిపురుగులు : కారణాలు.. పుచ్చు ఉన్న తోట నుంచి విత్తనం ఎన్నుకోవడం. పసుపులో అంతర పంటగా సొలనేసి కుటుంబానికి చెందిన మిరప, టమాట, వంగపైర్లను సాగుచేయడం. మురుగునీరు పోయే అవకాశం లేకపోవడం. పంట మార్పిడి చేయకపోవడం. సేంద్రియ ఎరువులు వేయకపోవడం. నష్టపరిచేతీరు... నులిపురుగులు చేసిన గాయాల ద్వారా నేలలోని వ్యాధి కారణాలు వేళ్లలోకి వ్రవేశిస్తాయి. తద్వారా వేర్లు ఉబ్బిపోయి, కణతులు కలిగి ఉంటాయి. లక్షణాలు.... ఆకులు పాలిపోయి, మొక్కలు బలహీనంగా, పొట్టిగా ఉంటాయి. నులి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. నివారణ... చీడపీడలు, తెగుళ్లు ఆశించని ఆరోగ్యమైన విత్తనాన్ని ఉపయోగించాలి. పసుపులో అంతర పంటగా బంతిని వేసుకోవాలి. పచ్చి ఆకులు లేదా ఎండిన ఆకులతో మల్బింగ్ చేసుకోవాలి. ఎకరాకు 500 కిలోల వేపపిండిని వేసుకోవాలి. ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను వేసుకోవాలి.