సులువుగా పసుపు విత్తే పరికరం!
♦ తొంబరావుపేట రైతుల ఆవిష్కరణ
♦ పరికరాన్ని ట్రాక్టర్ కల్టివేటర్‌కు జత చేసి పసుపు విత్తుకుంటున్నారు
♦ రెండు గంటల్లో ఎకరాలో పసుపు, అంతర పంటగా మొక్కజొన్న విత్తనం వేసుకునే వీలు
♦ కూలీల కొరత సమస్య తీరింది
♦ రూ. 4 వేల నుంచి రూ.2 వేలకు తగ్గిన ఖర్చు
అరకలు, కూలీలతో సమస్యను ఎదుర్కొంటున్న పసుపు రైతులు పంటను విత్తుకునేందుకు యంత్రం తయారు చేశారు. జగిత్యాల జిల్లా, మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామ రైతులు ఎక్కువగా పసుపును సాగు చేస్తుంటారు. కూలీలు, అరకలు దొరక్క అదను తప్పేది. దీంతో గ్రామంలోని పసుపు రైతులందరూ సమావేశమై యంత్ర పరికరాన్ని రూపొందించాలని తీర్మానించారు. యువ రైతులు వెల్డింగ్ షాపు యజమానులతో కలిసి యంత్రం తయారు చేశారు.
కల్టివేటర్‌లా ఉండే ఈ పరికరాన్ని ట్రాక్టర్ హైడ్రాలిక్‌కు అనుసంధానిస్తారు. ఈ పరికరంలో మొత్తం మూడు వరుసలు ఉంటాయి. మొదటి వరుసలో నాలుగు నాగళ్లను ఏర్పాటు చేశారు. వీటి మధ్య అడుగున్నర దూరం ఉంటుంది. పై భాగంలో పసుపు విత్తనం పోసుకునేందుకు, ఎరువులు వేసుకునేందుకు ప్లాస్టిక్ గొట్టాలను ఏర్పాటు చేశారు. రెండో వరుసలో మూడు నాగళ్లు ఉంటాయి. వీటిపైన మొక్కజొన్న విత్తనాలు వేసేందుకు బాక్సును ఏర్పాటు చేశారు. మూడోవరుసలో ఐదుగురు కూలీలు కూర్చునేందుకు వీలుగా బల్లను ఏర్పాటు చేశారు. కూలీలు ఎదురుగా ఉన్న బాక్సులో నుంచి విత్తనాలు తీసుకొని పైపుల్లో వేస్తారు. ట్రాక్టరు నెమ్మదిగా ముందుకు వెళుతుంటే తొలుత పసుపు విత్తనం.. తర్వాత ఎరువు, సాళ్ల మధ్యలో మొక్కజొన్న విత్తనాలు పడతాయి.
రెండు గంటల్లో ఎకరం విత్తుకోవచ్చు
బోదెలు వెడల్పుగా వచ్చేందుకు వీలుగా నాగళ్లకు వెడల్పాటి రేకులను అమర్చారు. దీనివల్ల విత్తుకున్న పసుపుపై బెడ్ వస్తుంది. దానిపైన సులభంగా డ్రిప్పు పైపులు అమర్చుకోవచ్చు. దీనివల్ల పసుపును తవ్వుకోవటం సులభమవుతుంది. ట్రాక్టర్ నాగలి వెనుక కింది భాగంలో కట్టిన బరువైన కట్టె మట్టిపెడ్డలను పగులగొడుతుంది. దీనివల్ల పసుపు రైతుకు శ్రమ, ఖర్చు తగ్గి సమయం కలసి వస్తోంది. రెండు గంటల్లోనే ఎకరంలో పసుపును విత్తుకోవచ్చు. ఎద్దులతో విత్తుకుంటే ఎకరాకు రూ. 4 వేలు ఖర్చవుతుండగా ఈ పరికరంతో మాత్రం రూ. 2 వేలే ఖర్చవుతోంది. దీని తయారీకి రూ. 20 వేలు ఖర్చయిందని రైతులు తెలిపారు. అద్దెకిచ్చి గంటకు రూ. 1,200 కిరాయి వసూలు చేస్తున్నారు.
రైతులందరం కలసి తయారు చేశాం..!
పసుపు విత్తుకునేందుకు కూలీలు దొరక్కపోవటంతో వెల్డింగ్ షాపు యజమానితో కలిసి పసుపు విత్తే పరికరాన్ని తయారు చేయించాం. రెండేళ్లుగా ఈ దీన్ని వాడుతున్నాం. ఈ ఏడాది గ్రామంలోని రైతులందరూ దీనితోనే పసుపు వేశారు.
– ఏలేటి రాజిరెడ్డి (94942 72409), పసుపు రైతు, తొంబరావుపేట, మేడిపల్లి మండలం, జగిత్యాల జిల్లా
కొమ్ములు తీయటమూ సులభమే..
ఎద్దుల నాగలికంటే ఈ పరికరంతో పసుపును సులభంగా విత్తుకోవచ్చు. పంట పండిన తర్వాత చిన్న ట్రాక్టరుతో దున్ని, కొమ్ములను సులభంగా వెలికి తీయవచ్చు. దీనికి భవిష్యత్తులో మరిన్ని మార్పులు చేద్దామనుకుంటున్నాం.
– యాళ్ల గోపాల్ రెడ్డి (98488 12150), పసుపు రైతు, తొంబరావుపేట, మేడిపల్లి మండలం, జగిత్యాల జిల్లా
కూలీల ఇబ్బంది తీరింది..
అరకతో వేసినప్పుడు కూలీలు దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాను. గతంలో రెండెకరాలు వేసేందుకు రెండు రోజులు పట్టేది. కూలీల ఖర్చు ఎక్కువయ్యేది. ఇప్పుడు ముగ్గురు కూలీలతోనే రెండెకరాల్లో పసుపు వేశాను. వేసిన ట్లే అనిపించలేదు.
– బద్దం శంకరమ్మ, పసుపు రైతు, సింగరావుపేట, రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా
– పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి అగ్రికల్చర్, జగిత్యాల