తయారు చేసుకున్న తొంబరావుపేట రైతు శాస్త్రవేత్తలు..10 రోజులు తవ్వే పసుపును ఈ పరికరంతో ఒక్క రోజులోనే పూర్తి పసుపును సాగు చేసే రైతులు, పసుపు తవ్వకం సమయంలో కూలీలు దొరక్క చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామానికి చెందిన పసుపు రైతులు తమ సమస్యలకు తామే తగిన పరిష్కారాలు వెతుక్కుంటున్నారు. గత జూలైలో పసుపు విత్తే సమయంలో కూడా కూలీల కొరత నేపథ్యంలో తమకు అవసరమైన విధంగా పసుపు వేసే పరికరాన్ని తయారు చేసుకున్నారు (దీనిపై ‘సులువుగా పసుపు విత్తే పరికరం’ కథనాన్ని 2017 జూలై 11న ‘సాగుబడి’లో ప్రచురించాం). అదే వరుసలో.. ట్రాక్టర్‌కు బిగించి పసుపు తవ్వే పరికరాన్ని తాజాగా రూపొందించుకోవడం విశేషం.
బెడ్ పద్ధతికి అనువుగా నూతన పరికరం..
ఈ అధునాతన పసుపు తవ్వే పరికరాన్ని మినీ ట్రాక్టర్‌కు వెనుక జోడించి ఉపయోగించవచ్చు. బెడ్ పద్ధతిలో సాగు చేసిన పసుపు పంటకు ఇది మరింతగా ఉపయోగపడుతుంది. బెడ్‌ల మధ్య 18 అంగుళాలు, సాళ్ల మధ్య 12 అంగుళాల దూరం ఉంటుంది. ఒక బెడ్‌పై రెండు లైన్ల పసుపు మొక్కలు ఉంటాయి. పసుపు పక్వానికి వచ్చి ఆకులు పసుపు వర్ణానికి మారిన తర్వాత, రైతులు పసుపు ఆకును కోస్తారు. ఆ తర్వాత పసుపు తవ్వడానికి మినీ ట్రాక్టరుకు ఈ పరికరాన్ని జోడించి ఉపయోగిస్తున్నారు.
పసుపు తవ్వకానికి నాలుగు రోజులు ముందు పొలమంతా సాగు నీటిని పారగట్టడం తప్పని సరి. ఈ పరికరం పసుపు సాళ్లలో వెళ్లినప్పుడు పసుపు పైకిలేచి తిరిగి అందులోనే ఉంటుంది. దీనివల్ల పసుపు ఎండిపోకుండా ఉంటుంది. పరికరం ద్వారా తవ్విన తర్వాత కూలీలు వచ్చినప్పుడు కొమ్ములను విరుచుకోవచ్చు. పసుపు తవ్వినందుకు ట్రాక్టర్ కిరాయిగా ప్రస్తుతం గంటకు రూ. 800 వరకు తీసుకుంటున్నారు. భూమి ఎత్తు పల్లాలు లేకుండా ఉంటే తవ్వకం తొందరగా పూర్తవుతుంది. కొంతమంది రైతులు ఇటీవల పెద్ద ట్రాక్టర్‌కు సైతం ఇలాంటి పరికరాన్ని రూపొందిస్తున్నారు.
రైతులందరం కలిసి తయారుచేసుకున్నాం..
పసుపు విత్తడానికి, తవ్వడానికి మా ఊర్లో కూలీలు దొరకడం లేదు. దీంతో, యువ రైతులందరం కలిసి ఆలోచించాం. దాంతో, ఒక్కొక్కరు తమ అనుభవాలను చెప్పడంతో, దాని ప్రకారం ట్రాక్టర్‌కు బిగించి పసుపు విత్తే పరికరాన్ని గతంలో తయారు చేశాం. ఇప్పుడు పసుపు తవ్వే పరికరాన్ని రూపొందించాం. దీంతో, రోజుల తరబడి చేసే పనులను ఒకే రోజులో చేయగలుగుతున్నాం. పెద్ద ట్రాక్టర్‌కు కూడా బిగించే పరికరాన్నీ సిద్ధం చేస్తున్నాం.
– ఏలేటి రాజిరెడ్డి(94942 72409), తొంబరావుపేట, జగిత్యాల జిల్లా
ఒక కూలీ ఖర్చుతోనే అరెకరం పసుపు తవ్వాను..
ఈ నూతన పరికరం ద్వారానే తన ఎకరం తోటలో వేసిన పసుపును తవ్వాను. అంతకుముందు కూలీలతో తవ్వించినప్పుడు పసుపు కొమ్ములు చెడిపోయేవి. ఎకరం పసుపు తవ్వకానికి కూలీలు దొరక్క దాదాపు 10 రోజులు పట్టేది. ఈ పరికరం రావడంతో ఒక రోజు తవ్వి, మరో రోజు కొమ్ములు విరవడంతో పని తేలికైంది. ఒక కూలీ ఖర్చుతోనే అర ఎకరం పసుపు తవ్వాను.
– నల్ల రవి(95535 25623), తొంబరావుపేట, మేడిపల్లి మం., జగిత్యాల జిల్లా
– పన్నాల కమలాకర్ రెడ్డి, జగిత్యాల అగ్రికల్చర్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment