
మనోహరాబాద్(తూప్రాన్): తాతల కాలం నాటి నుంచి సాగు చేసుకుంటూ జీవిస్తున్న భూమిని పరిశ్రమల పేరిట ప్రభుత్వం లాక్కుంటే ఎలా బతికేదని ఓ మహిళా రైతు అధికారుల ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం అధికారులు సర్వే చేస్తుండగా పర్కిబండ గ్రామానికి చెందిన తీగుళ్ళ శ్యామల వారి వద్దకు వచ్చి తమకున్న రెండెకరాల సాగు భూమిని గుంజుకుంటే మాకు జీవనాధారం ఉండదని కాళ్లావేళ్లా పడి వేడుకుంది.
మా చేతిలో ఏమీ లేదనీ తమ పైఅధికారుల ఆదేశాల మేరకే 209 సర్వే నంబర్‌లో 252 ఎకరాల కోసం స్థల సర్వే చేపట్టినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. దీంతో భూమి పోతుందనే దుఃఖంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును అధికారుల ముందే తాగింది. ఇది గమనించిన అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పక్కనే ఉన్న స్థానికులు చికిత్స నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్‌పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రైతును పరామర్శించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడి రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment