ఆమెతో కొద్దిసేపు మాట్లాడితే స్త్రీ స్వేచ్ఛకు అర్థం తెలుస్తుంది. స్వతంత్ర భావాలతో ఎలా జీవించాలో అర్థమవుతుంది. ఎనిమిది పదుల వయసులోనూ ఆమె చెంగుచెంగున దూకే ‘లేడి’పిల్ల. పురుషాధిక్య సమాజంపై ఏహ్యభావంతో ఆమె పెళ్లికి దూరమైనా.. బంధాలు, అనుబంధాలకు దూరం కాలేదు. వ్యవసాయంపై ఉన్న మమకారాన్ని వదులుకోలేదు. అందుకే బామ్మ బంగారం.. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
– జంగారెడ్డిగూడెం రూరల్
నా పేరు కేసనపల్లి లక్ష్మీకాంతం. మాది జంగారెడ్డిగూడెం. మా తల్లిదండ్రులు పున్నమ్మ, శ్రీరాములు. నాన్న శ్రీరాములు వ్యవసాయం చేసేవారు. అప్పట్లో మాకు సొంతంగా కొంగరగూడెంలో 50 ఎకరాల వ్యవసాయ పొలం ఉండేది. అయితే అప్పట్లో వ్యవసాయం లాభసాటి కాకపోవడంతో మాకు కాస్త ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. మా తల్లిదండ్రులకు మేము ఏడుగురు సంతానం. నాకు ఒక అన్న.. ఒక తమ్ముడు.. నలుగురు చెల్లెళ్లు. అమ్మాయిల్లో నేనే పెద్దదానిని.
ఎనిమిదో తరగతి చదివా.. టీచరయ్యా..
నేను 8వ తరగతి వరకు జంగారెడ్డిగూడెంలో చదువుకున్నాను. అప్పట్లో ఐటీడీఏ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో పనిచేసేందుకు ఉపాధ్యాయులు కావాలని ప్రకటన విడుదలైతే దరఖాస్తు చేశాను. ఉద్యోగం రావడంతో 1954లో విధుల్లో చేరాను. వివధ చోట్ల పనిచేసి 1992లో రిటైరయ్యాను. అప్పట్నుంచి వ్యవసాయం చేస్తున్నాను.
వ్యవసాయం అంటే ఇష్టం
మాది చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం కావడంతో అనుకోకుండానే నాకు వ్యవసాయంపై ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తితోనే ఉద్యోగ విరమణ అనంతరం నాకు వచ్చిన పెద్ద మొత్తంతో జంగారెడ్డిగూడెం మండలం రామచర్లగూడెం సమీపంలో 5 ఎకరాల భూమి కొనుగోలు చేశాను. నేనే స్వయంగా వ్యవసాయం చేయడం ప్రారంభించాను. ఆయిల్‌పామ్, జామ, కొబ్బరి, కోకో వంటి పంటలు సాగు చేశాను. నాకు నేనుగా అనుభవం ద్వారా వ్యవసాయంలో మెలకువలను నేర్చుకున్నాను. మా తోటలో పండే జామకాయలను ఒరిస్సాలోని కటక్ వరకు ఎగుమతి చేసేవాళ్లం. ప్రస్తుతం ఆయిల్‌పామ్, కోకో సాగు చేస్తున్నాను. ఇంత వయస్సులోనూ పొలానికి వెళ్లి నీళ్లు పెట్టడంతో మొదలు, ఎరువులు వేయడం, తదితర పనులన్నీ నేనే స్వయంగా చేస్తుంటాను. ప్రతి రోజు ఉదయం 5 గంటలకే నిద్ర లేచి పనులు ముగించుకుని స్కూటీపై పొలానికి వస్తుంటాను. గోమూత్రం తదితర వాటితో తయారుచేసిన సేంద్రియ ఎరువులనే వ్యవసాయానికి వినియోగిస్తున్నాను. సేంద్రియ ఎరువు వల్ల మంచి దిగుబడులు సాధించవచ్చు.
పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే..
సమాజంలో మహిళలపై పురుష ఆధిక్యత అంటే నాకు నచ్చదు. పైగా నాకు అప్పట్లో కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండేవి. అందువల్లనే నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే రాలేదు. ప్రస్తుతం మా వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకుని ఎక్కడెక్కడికో వెళ్లిపోయారు. మా అన్న అప్పారావు మాత్రం ప్రస్తుతం నాతోనే ఉంటున్నారు. భార్య చనిపోవడంతో ఆయన బాగోగులు నేనే చూసుకుంటున్నాను. జీవిత అవపానదశలో మమ్మల్ని ఎవరైతే కంటికి రెప్పలా చూసుకుంటారో వారికే నా ఆస్తి రాసి ఇవ్వాలనుకుంటున్నాను. లేదంటే ఏ అనాథాశ్రమానికో రాసేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment