laksmikantam
-
ఒడిదుడుకుల జీవితం దిగులే పడని గమనం
సంకల్పబలం ముందు ఎన్ని అవరోధాలైనా తలవంచక తప్పదు. ఇందుకు లక్ష్మీకాంతం జీవితం ఒక ప్రత్యక్ష నిదర్శనం. బాల్యం నుంచీ ఆమె తన జీవితంలోని ప్రతికూలతలతో సేద్యం చేస్తూనే ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన కేశనపల్లి శ్రీరాములు, పున్నమ్మ దంపతుల కుమార్తె కేశనపల్లి లక్ష్మీకాంతం. శ్రీరాములుకు ఇద్దరు మగపిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు. వ్యవసాయ కుటుంబం. ఆ కుటుంబంలోని రెండవ సంతానం లక్ష్మీకాంతం. శ్రీరాములు వ్యవసాయమే ఆధారంగా కుటుంబాన్ని పోషించేవారు. ఆయనకు కొంగరగూడెంలో కొంత పొలం ఉండేది. వ్యవసాయంలో ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో లక్ష్మీకాంతం తన సోదరులతో కలిసి తండ్రికి చేయూతగా మెలిగారు. అప్పుడే తనకు వ్యవసాయం మీద మక్కువ పెరిగిందని ఆమె చెబుతారు. బదలీల బాటలో విధులకు..! తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూనే లక్ష్మీకాంతం చదువును కొనసాగించారు. స్థానిక పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం 1952 నుంచి 1954 వరకు హయ్యర్‌గ్రేడ్ టీచింగ్‌లో శిక్షణ పొందారు. ఇప్పుడు దానిని బీఈడీ అని పిలుస్తున్నారు). అప్పట్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో పాఠశాలల్లో పనిచేసేందుకు ప్రకటన విడుదల అవగా లక్ష్మీకాంతం టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. 1954లో పోలవరం మండలంలోని పాఠశాలలో విధులకు చేరారు. అప్పటినుంచి ఏజెన్సీలోని వివిధ ప్రాంతాల్లో ఆమె విధులు నిర్వహించారు. ఏజెన్సీలో విధులు నిర్వహించడమంటే కత్తిమీద సామే అంటారు లక్ష్మీకాంతం. ఆ రోజుల్లో రోడ్లు, రవాణా సౌకర్యాలు ఉండేవి కావు. కాలినడకన లేదా సైకిల్‌పై వెళ్లాల్సి వచ్చేది. దూరప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వహించాల్సి ఉండడంతో ఏజెన్సీ ప్రాంతంలో పనిచేయాలంటేనే ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. అధికారులు ఎక్కడ విధులు కేటాయిస్తే అక్కడికి లక్ష్మీకాంతం చొరవగా వెళ్లేవారు. అలా ఏజెన్సీ ప్రాంతంలోని పోలవరం, రామయ్యపేట, కొత్తూరు, పైడిపాక, చేగొండిపల్లి, సింగన్నపల్లి, లక్షీ్మపురం, కోండ్రుకోట.. ఇలా అధికారులు నిర్దేశించిన ప్రతీ ప్రాంతానికి వెళ్లి విధులు నిర్వహించారు. రామయ్యపేటలో పనిచేస్తున్న సమయంలో (1963–64) లక్ష్మీకాంతం సైకిల్ నేర్చుకున్నారు. సైకిల్‌పై పాఠశాలకు వెళ్లి వచ్చేవారు. అనంతరం మారుతున్న కాలానికి అనుగుణంగా ఆమె 1981 సంవత్సరంలో స్కూటర్‌ను నేర్చుకున్నారు. లక్ష్మీకాంతం ఉద్యోగం చేస్తున్న సమయంలోనే 1966లో తండ్రి శ్రీరాములు మృతి చెందారు. అన్న అప్పారావు ఒక్కరే కుటుంబభారం మోయలేకపోవడంతో, కుటుంబ బాధ్యత కూడా లక్ష్మీకాంతంపై పడింది. అయితే ఆమె ఎక్కడా బెదరలేదు. తాను చేసే ఉద్యోగం నుంచి వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో ఒకపక్క ఉద్యోగం చేస్తూనే వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. అన్న అప్పారావుకు సహకారం అందిస్తూ కుటుంబ పోషణకు తానూ తోడుగా నిలిచారు. రామయ్యపేట గ్రామంలో కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయాన్ని ప్రారంభించారు. విరమణ డబ్బుతో పొలం 1992లో తన ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన సొమ్ముతో జంగారెడ్డిగూడెం మండలం రామచర్లగూడెంలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అందులో ఆయిల్‌పామ్, కోకో సాగు చేస్తున్నారు. ఇదిగాక మిర్చి, కంది, వేరుశెనగ, మొక్కజొన్న, అరటి, వరి, జామ వంటి పంటలను కూడా ఆమె పండిస్తున్నారు. గోమూత్రంతో తయారు చేసిన సేంద్రియ ఎరువులనే వ్యవసాయంలో వినియోగిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉదయాన్నే తన స్కూటర్‌పై పొలానికి వెళ్లడం, అక్కడ పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చి తన పనులు చేసుకోవడం.. ఇదీ ఆమె దినచర్య. లక్ష్మీకాంతం పెళ్లి వద్దనుకున్నారు. అందుకు కారణం చెబుతూ.. ‘‘అప్పటి సమాజంలో మహిళలపై పురుషాధిక్యత ఎక్కువగా ఉండేది. ప్రతీ విషయంలో మహిళ పురుషునిపై ఆధారపడి జీవించాల్సి వచ్చేది. శక్తి ఉన్నా మగవాడు ఏం చెబితే అదే చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో నాకు వివాహం అన్న ఆలోచనే రాలేదు’’ అన్నారు. ‘‘అన్న అప్పారావు సహకారంతో తమ్ముడు, చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేశాను. వారి పిల్లలను కూడా పెంచాను. ప్రస్తుతం నా తోడబుట్టిన వారు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలు, మనుమలతో వేర్వేరు ప్రాంతాల్లో స్ధిరపడ్డారు. కొంతకాలం క్రితం వరకు అన్నయ్య నాతోనే ఉండే వారు. అయన ఈ ఏడాదిలోనే కాలం చేశారు. దీంతో నేను ఒంటరిగా ఉంటున్నాను’’ అని తెలిపారు.. ఈ వయసులోనూ ఒకరిపై ఆధారపడకుండా స్కూటర్ నడుపుతూ, వ్యవసాయం చేస్తున్న లక్ష్మీకాంతం. – డి.వి.భాస్కరరావు, సాక్షి జంగారెడ్డిగూడెం, ప.గో.జిల్లా -
బామ్మ బంగారం
ఆమెతో కొద్దిసేపు మాట్లాడితే స్త్రీ స్వేచ్ఛకు అర్థం తెలుస్తుంది. స్వతంత్ర భావాలతో ఎలా జీవించాలో అర్థమవుతుంది. ఎనిమిది పదుల వయసులోనూ ఆమె చెంగుచెంగున దూకే ‘లేడి’పిల్ల. పురుషాధిక్య సమాజంపై ఏహ్యభావంతో ఆమె పెళ్లికి దూరమైనా.. బంధాలు, అనుబంధాలకు దూరం కాలేదు. వ్యవసాయంపై ఉన్న మమకారాన్ని వదులుకోలేదు. అందుకే బామ్మ బంగారం.. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. – జంగారెడ్డిగూడెం రూరల్ నా పేరు కేసనపల్లి లక్ష్మీకాంతం. మాది జంగారెడ్డిగూడెం. మా తల్లిదండ్రులు పున్నమ్మ, శ్రీరాములు. నాన్న శ్రీరాములు వ్యవసాయం చేసేవారు. అప్పట్లో మాకు సొంతంగా కొంగరగూడెంలో 50 ఎకరాల వ్యవసాయ పొలం ఉండేది. అయితే అప్పట్లో వ్యవసాయం లాభసాటి కాకపోవడంతో మాకు కాస్త ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. మా తల్లిదండ్రులకు మేము ఏడుగురు సంతానం. నాకు ఒక అన్న.. ఒక తమ్ముడు.. నలుగురు చెల్లెళ్లు. అమ్మాయిల్లో నేనే పెద్దదానిని. ఎనిమిదో తరగతి చదివా.. టీచరయ్యా.. నేను 8వ తరగతి వరకు జంగారెడ్డిగూడెంలో చదువుకున్నాను. అప్పట్లో ఐటీడీఏ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో పనిచేసేందుకు ఉపాధ్యాయులు కావాలని ప్రకటన విడుదలైతే దరఖాస్తు చేశాను. ఉద్యోగం రావడంతో 1954లో విధుల్లో చేరాను. వివధ చోట్ల పనిచేసి 1992లో రిటైరయ్యాను. అప్పట్నుంచి వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం అంటే ఇష్టం మాది చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం కావడంతో అనుకోకుండానే నాకు వ్యవసాయంపై ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తితోనే ఉద్యోగ విరమణ అనంతరం నాకు వచ్చిన పెద్ద మొత్తంతో జంగారెడ్డిగూడెం మండలం రామచర్లగూడెం సమీపంలో 5 ఎకరాల భూమి కొనుగోలు చేశాను. నేనే స్వయంగా వ్యవసాయం చేయడం ప్రారంభించాను. ఆయిల్‌పామ్, జామ, కొబ్బరి, కోకో వంటి పంటలు సాగు చేశాను. నాకు నేనుగా అనుభవం ద్వారా వ్యవసాయంలో మెలకువలను నేర్చుకున్నాను. మా తోటలో పండే జామకాయలను ఒరిస్సాలోని కటక్ వరకు ఎగుమతి చేసేవాళ్లం. ప్రస్తుతం ఆయిల్‌పామ్, కోకో సాగు చేస్తున్నాను. ఇంత వయస్సులోనూ పొలానికి వెళ్లి నీళ్లు పెట్టడంతో మొదలు, ఎరువులు వేయడం, తదితర పనులన్నీ నేనే స్వయంగా చేస్తుంటాను. ప్రతి రోజు ఉదయం 5 గంటలకే నిద్ర లేచి పనులు ముగించుకుని స్కూటీపై పొలానికి వస్తుంటాను. గోమూత్రం తదితర వాటితో తయారుచేసిన సేంద్రియ ఎరువులనే వ్యవసాయానికి వినియోగిస్తున్నాను. సేంద్రియ ఎరువు వల్ల మంచి దిగుబడులు సాధించవచ్చు. పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే.. సమాజంలో మహిళలపై పురుష ఆధిక్యత అంటే నాకు నచ్చదు. పైగా నాకు అప్పట్లో కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండేవి. అందువల్లనే నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే రాలేదు. ప్రస్తుతం మా వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకుని ఎక్కడెక్కడికో వెళ్లిపోయారు. మా అన్న అప్పారావు మాత్రం ప్రస్తుతం నాతోనే ఉంటున్నారు. భార్య చనిపోవడంతో ఆయన బాగోగులు నేనే చూసుకుంటున్నాను. జీవిత అవపానదశలో మమ్మల్ని ఎవరైతే కంటికి రెప్పలా చూసుకుంటారో వారికే నా ఆస్తి రాసి ఇవ్వాలనుకుంటున్నాను. లేదంటే ఏ అనాథాశ్రమానికో రాసేస్తాం. -
కలెక్టర్‌గా వీరపాండ్యన్
(సాక్షి ప్రతినిధి, అనంతపురం) జిల్లా కలెక్టర్‌గా వీరపాండ్యన్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్ కోన శశిధర్‌ను గుంటూరు కలెక్టర్‌గా బదిలీ చేసింది. అలాగే జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతానికి కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వీరపాండ్యన్ ప్రస్తుతం విజయవాడ మునిసిపల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఈయన 2008 ఐఏఎస్ బ్యాచ్‌లో ఆలిండియా 53వ ర్యాంకు సాధించారు. 2009 ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 3 వరకూ ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పొందారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ ట్రైనీ కలెక్టర్‌గా 2010 జూన్ 25 నుంచి 2011 జూన్ 11 వరకూ పనిచేశారు. అనంతరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా 2012 ఆగస్టు 8 నుంచి 2014 ఫిబ్రవరి 14 వరకూ విధులు నిర్వర్తించారు. తర్వాత శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. 2015 జనవరి 9 నుంచి ఇప్పటి వరకూ విజయవాడ మునిసిపల్ కమిషనర్‌గా ఉన్నారు. వీరపాండ్యన్‌కు సమర్థవంతమైన అధికారిగా పేరుంది. గుంటూరు కలెక్టర్‌గా శశిధర్ కోన శశిధర్ అనంతపురం కలెక్టర్‌గా 2015 జనవరి 22న బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 27 నెలలపాటు సమర్థవంతంగా పనిచేశారు. ముఖ్యంగా జిల్లా అధికారులలో బాధ్యతను పెంచారు. పాఠశాల విద్యలో నాణ్యత పెంచేలా, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రత్యేక దృ ష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించేలా చొరవ తీసుకున్నారు. ఇందుకుగాను ప్రధానమంత్రి చేతుల మీదుగా స్వచ్ఛఅనంత అవార్డును స్వీకరించారు. ప్రస్తుతం ఈయన గుంటూరు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. కృష్ణా కలెక్టర్‌గా లక్ష్మీకాంతం లక్ష్మీకాంతం అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా 2015 జనవరి 9న బాధ్యతలు స్వీకరించారు. ఈయన కూడా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. హాస్టల్ విద్యార్థులకు వసతులు కల్పించేందుకు దాతల సహకారం తీసుకున్నారు. వాటికి మరమ్మతులు చేయించి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచారు. నేషనల్ ఈ –గవర్నెన్స్‌పై మన రాష్ట్రం తరఫున ఢిల్లీలో ప్రజెంటేషన్ ఇచ్చి ఏపీకి మొదటి బహుమతి తీసుకొచ్చారు. ఇటీవల ఢిల్లీలో ఇంటర్నేషనల్ ల్యాండ్ అండ్ డెవలప్మెంట్పై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ జార్జియా దేశంలో జరిగే కాన్ఫరెన్స్‌కు ఎంపికైంది. ఈ నేపథ్యంలో లక్ష్మీకాంతానికి కృష్ణా కలెక్టర్‌గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ‘అనంత’ను జీవితంలో మరవలేను: కోన శశిధర్, కలెక్టర్ అనంతపురం జిల్లా ప్రజలు నన్ను బాగా ఆదరించారు. ఇక్కడి ప్రజలు చాలా మంచివాళ్లు. ఈ జిల్లా ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. నేను ఎక్కడున్నా ఈ జిల్లా నా మనసుకు చాలా దగ్గరగా ఉంటుంది. నాకు ప్రధానమంత్రి అవార్డును తెచ్చిపెట్టింది. గొల్లపల్లికి రిజర్వాయర్‌కు నీళ్లు ఇచ్చేందుకు నా వంతు కృషి చేశా. ఫారంపాండ్లు తవ్వించాం. జీవితంలో ఎప్పుడైనా ఏ అవకాశం వచ్చినా జిల్లా రుణం తీర్చుకుంటా. అమితానందాన్నిచ్చింది: లక్ష్మీకాంతం, జేసీ అనంతపురం జిల్లా నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఈ జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఇవి మరింత కష్టపడేందుకు అవకాశం కల్పించాయి. ఈ జిల్లా నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనది.