సంకల్పబలం ముందు ఎన్ని అవరోధాలైనా తలవంచక తప్పదు. ఇందుకు లక్ష్మీకాంతం జీవితం ఒక ప్రత్యక్ష నిదర్శనం. బాల్యం నుంచీ ఆమె తన జీవితంలోని ప్రతికూలతలతో సేద్యం చేస్తూనే ఉన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన కేశనపల్లి శ్రీరాములు, పున్నమ్మ దంపతుల కుమార్తె కేశనపల్లి లక్ష్మీకాంతం. శ్రీరాములుకు ఇద్దరు మగపిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు. వ్యవసాయ కుటుంబం. ఆ కుటుంబంలోని రెండవ సంతానం లక్ష్మీకాంతం. శ్రీరాములు వ్యవసాయమే ఆధారంగా కుటుంబాన్ని పోషించేవారు. ఆయనకు కొంగరగూడెంలో కొంత పొలం ఉండేది. వ్యవసాయంలో ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో లక్ష్మీకాంతం తన సోదరులతో కలిసి తండ్రికి చేయూతగా మెలిగారు. అప్పుడే తనకు వ్యవసాయం మీద మక్కువ పెరిగిందని ఆమె చెబుతారు.
బదలీల బాటలో విధులకు..!
తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూనే లక్ష్మీకాంతం చదువును కొనసాగించారు. స్థానిక పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం 1952 నుంచి 1954 వరకు హయ్యర్‌గ్రేడ్ టీచింగ్‌లో శిక్షణ పొందారు. ఇప్పుడు దానిని బీఈడీ అని పిలుస్తున్నారు). అప్పట్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో పాఠశాలల్లో పనిచేసేందుకు ప్రకటన విడుదల అవగా లక్ష్మీకాంతం టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. 1954లో పోలవరం మండలంలోని పాఠశాలలో విధులకు చేరారు. అప్పటినుంచి ఏజెన్సీలోని వివిధ ప్రాంతాల్లో ఆమె విధులు నిర్వహించారు. ఏజెన్సీలో విధులు నిర్వహించడమంటే కత్తిమీద సామే అంటారు లక్ష్మీకాంతం.
ఆ రోజుల్లో రోడ్లు, రవాణా సౌకర్యాలు ఉండేవి కావు. కాలినడకన లేదా సైకిల్‌పై వెళ్లాల్సి వచ్చేది. దూరప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వహించాల్సి ఉండడంతో ఏజెన్సీ ప్రాంతంలో పనిచేయాలంటేనే ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. అధికారులు ఎక్కడ విధులు కేటాయిస్తే అక్కడికి లక్ష్మీకాంతం చొరవగా వెళ్లేవారు. అలా ఏజెన్సీ ప్రాంతంలోని పోలవరం, రామయ్యపేట, కొత్తూరు, పైడిపాక, చేగొండిపల్లి, సింగన్నపల్లి, లక్షీ్మపురం, కోండ్రుకోట.. ఇలా అధికారులు నిర్దేశించిన ప్రతీ ప్రాంతానికి వెళ్లి విధులు నిర్వహించారు. రామయ్యపేటలో పనిచేస్తున్న సమయంలో (1963–64) లక్ష్మీకాంతం సైకిల్ నేర్చుకున్నారు. సైకిల్‌పై పాఠశాలకు వెళ్లి వచ్చేవారు.
అనంతరం మారుతున్న కాలానికి అనుగుణంగా ఆమె 1981 సంవత్సరంలో స్కూటర్‌ను నేర్చుకున్నారు. లక్ష్మీకాంతం ఉద్యోగం చేస్తున్న సమయంలోనే 1966లో తండ్రి శ్రీరాములు మృతి చెందారు. అన్న అప్పారావు ఒక్కరే కుటుంబభారం మోయలేకపోవడంతో, కుటుంబ బాధ్యత కూడా లక్ష్మీకాంతంపై పడింది. అయితే ఆమె ఎక్కడా బెదరలేదు. తాను చేసే ఉద్యోగం నుంచి వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో ఒకపక్క ఉద్యోగం చేస్తూనే వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. అన్న అప్పారావుకు సహకారం అందిస్తూ కుటుంబ పోషణకు తానూ తోడుగా నిలిచారు. రామయ్యపేట గ్రామంలో కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయాన్ని ప్రారంభించారు.
విరమణ డబ్బుతో పొలం
1992లో తన ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన సొమ్ముతో జంగారెడ్డిగూడెం మండలం రామచర్లగూడెంలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అందులో ఆయిల్‌పామ్, కోకో సాగు చేస్తున్నారు. ఇదిగాక మిర్చి, కంది, వేరుశెనగ, మొక్కజొన్న, అరటి, వరి, జామ వంటి పంటలను కూడా ఆమె పండిస్తున్నారు. గోమూత్రంతో తయారు చేసిన సేంద్రియ ఎరువులనే వ్యవసాయంలో వినియోగిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉదయాన్నే తన స్కూటర్‌పై పొలానికి వెళ్లడం, అక్కడ పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చి తన పనులు చేసుకోవడం.. ఇదీ ఆమె దినచర్య. లక్ష్మీకాంతం పెళ్లి వద్దనుకున్నారు.
అందుకు కారణం చెబుతూ.. ‘‘అప్పటి సమాజంలో మహిళలపై పురుషాధిక్యత ఎక్కువగా ఉండేది. ప్రతీ విషయంలో మహిళ పురుషునిపై ఆధారపడి జీవించాల్సి వచ్చేది. శక్తి ఉన్నా మగవాడు ఏం చెబితే అదే చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో నాకు వివాహం అన్న ఆలోచనే రాలేదు’’ అన్నారు. ‘‘అన్న అప్పారావు సహకారంతో తమ్ముడు, చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేశాను. వారి పిల్లలను కూడా పెంచాను. ప్రస్తుతం నా తోడబుట్టిన వారు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలు, మనుమలతో వేర్వేరు ప్రాంతాల్లో స్ధిరపడ్డారు. కొంతకాలం క్రితం వరకు అన్నయ్య నాతోనే ఉండే వారు. అయన ఈ ఏడాదిలోనే కాలం చేశారు. దీంతో నేను ఒంటరిగా ఉంటున్నాను’’ అని తెలిపారు.. ఈ వయసులోనూ ఒకరిపై ఆధారపడకుండా స్కూటర్ నడుపుతూ, వ్యవసాయం చేస్తున్న లక్ష్మీకాంతం.
– డి.వి.భాస్కరరావు, సాక్షి
జంగారెడ్డిగూడెం, ప.గో.జిల్లా
Comments
Please login to add a commentAdd a comment