కలెక్టర్‌గా వీరపాండ్యన్‌ | Veerapandiyan collector | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌గా వీరపాండ్యన్‌

Published Tue, Apr 18 2017 12:47 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

కలెక్టర్‌గా వీరపాండ్యన్‌ - Sakshi

కలెక్టర్‌గా వీరపాండ్యన్‌

(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
జిల్లా కలెక్టర్‌గా వీరపాండ్యన్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్‌ కోన శశిధర్‌ను గుంటూరు కలెక్టర్‌గా బదిలీ చేసింది. అలాగే జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతానికి కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు   సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వీరపాండ్యన్‌ ప్రస్తుతం విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఈయన 2008 ఐఏఎస్‌ బ్యాచ్‌లో ఆలిండియా  53వ ర్యాంకు సాధించారు. 2009 ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 3 వరకూ ముస్సోరిలో ఐఏఎస్‌ శిక్షణ పొందారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని  నల్గొండ ట్రైనీ కలెక్టర్‌గా 2010 జూన్‌ 25 నుంచి 2011 జూన్‌ 11 వరకూ పనిచేశారు. అనంతరం
 
ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా 2012 ఆగస్టు 8 నుంచి 2014 ఫిబ్రవరి 14 వరకూ విధులు నిర్వర్తించారు. తర్వాత శ్రీకాకుళం జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేశారు. 2015 జనవరి 9 నుంచి ఇప్పటి వరకూ విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌గా ఉన్నారు. వీరపాండ్యన్‌కు సమర్థవంతమైన అధికారిగా పేరుంది. 
 
గుంటూరు కలెక్టర్‌గా శశిధర్‌
కోన శశిధర్‌ అనంతపురం కలెక్టర్‌గా 2015 జనవరి 22న బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 27 నెలలపాటు సమర్థవంతంగా పనిచేశారు. ముఖ్యంగా జిల్లా అధికారులలో బాధ్యతను పెంచారు.  పాఠశాల విద్యలో నాణ్యత పెంచేలా, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రత్యేక దృ ష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించేలా చొరవ తీసుకున్నారు. ఇందుకుగాను ప్రధానమంత్రి చేతుల మీదుగా స్వచ్ఛఅనంత అవార్డును స్వీకరించారు. ప్రస్తుతం ఈయన గుంటూరు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. 
 
కృష్ణా కలెక్టర్‌గా లక్ష్మీకాంతం
లక్ష్మీకాంతం అనంతపురం జాయింట్‌ కలెక్టర్‌గా  2015 జనవరి 9న బాధ్యతలు స్వీకరించారు. ఈయన కూడా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. హాస్టల్‌ విద్యార్థులకు వసతులు కల్పించేందుకు దాతల సహకారం తీసుకున్నారు. వాటికి మరమ్మతులు చేయించి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచారు. నేషనల్‌ ఈ –గవర్నెన్స్‌పై మన రాష్ట్రం తరఫున ఢిల్లీలో ప్రజెంటేషన్‌ ఇచ్చి ఏపీకి మొదటి బహుమతి తీసుకొచ్చారు. ఇటీవల ఢిల్లీలో ఇంటర్నేషనల్‌ ల్యాండ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌పై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్‌ జార్జియా దేశంలో జరిగే కాన్ఫరెన్స్‌కు ఎంపికైంది. ఈ నేపథ్యంలో లక్ష్మీకాంతానికి కృష్ణా కలెక్టర్‌గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
 
‘అనంత’ను జీవితంలో మరవలేను: కోన శశిధర్, కలెక్టర్‌
అనంతపురం జిల్లా ప్రజలు నన్ను బాగా ఆదరించారు. ఇక్కడి ప్రజలు చాలా మంచివాళ్లు.  ఈ జిల్లా ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. నేను ఎక్కడున్నా ఈ జిల్లా నా మనసుకు చాలా దగ్గరగా ఉంటుంది. నాకు ప్రధానమంత్రి అవార్డును  తెచ్చిపెట్టింది. గొల్లపల్లికి రిజర్వాయర్‌కు నీళ్లు ఇచ్చేందుకు నా వంతు కృషి చేశా. ఫారంపాండ్లు తవ్వించాం. జీవితంలో ఎప్పుడైనా ఏ అవకాశం వచ్చినా జిల్లా రుణం తీర్చుకుంటా.
అమితానందాన్నిచ్చింది: లక్ష్మీకాంతం, జేసీ
అనంతపురం జిల్లా నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఈ జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఇవి మరింత కష్టపడేందుకు అవకాశం కల్పించాయి. ఈ జిల్లా నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement