veerapandiyan
-
గేలి చేయడం హింసే: దర్శకుడు
గేలి చేయడం కూడా హింసే అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని రూపొందిస్తున్న చిత్రం ‘కాంప్లక్స్’ అని ఆ చిత్ర దర్శకుడు మంత్ర వీరపాండియన్ తెలిపారు. దీని గురించి ఆయన తెలుపుతూ ఇంజినీరింగ్ చదివిన తాను విదేశాలలో మంచి ఉద్యోగం చేసుకుంటూ సినిమాపై ఇష్టంతో ఈ రంగంలోకి వచ్చానన్నారు. పలు షార్ట్ ఫిల్మ్ చేసిన తాను, దర్శకుడు బాలా వద్ద నాచియార్, వర్మ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశానన్నారు. ఆ తరువాత ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో ప్రముఖ నటీనటులతో చిత్రం చేసే అవకాశం వచ్చిందన్నారు. అయితే అంతకు ముందు కాంప్లక్స్ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించానన్నారు. మనిషి రూపాన్ని చూసి అతని ప్రతిభను అంచనా వేయరాదని చెప్పే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. అలాగే ఇతరుల రూపాన్ని పరిహాసం చేయడం కూడా హింసే అవుతుందని ఈ చిత్రం ద్వారా చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో పాత్రలకు తగిన ఆర్టిస్టులను ఎంపిక చేసి నటింప చేసినట్లు చెప్పారు. ఆ విధంగా నటుడు వెంకట్ సెంగుట్టవన్, నటి ఇవన ఇందులో హీరో హీరోయిన్లుగా నటించినట్లు చెప్పారు. దీనికి కార్తీక్ రాజా సంగీతాన్ని అందించారని, షూటింగ్‌లు పూర్తి చేసి ఆయనకు చూపించగా చాలా బాగుందని అభినందించడంతో పాటు నాలుగు చక్కని పాటలను ఇచ్చారని తెలిపారు. చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లు చెప్పారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే చిత్ర ఆడియో ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
‘కోవిడ్ నియమాలతో పరీక్షలు నిర్వహిస్తున్నాం’
సాక్షి, కర్నూలు : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో 1276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలోని 1276 పోస్టులకు గాను, 85,910 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, జిల్లాలో 127 పరీక్ష కేంద్రాల ఏర్పాటు, ఆరు క్లస్టర్స్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పరీక్ష కోసం వచ్చే అభ్యర్థులకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చని, 320 మంది పోలీస్ భద్రతతో పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. (సీఎం జగన్ ఆ మాటే నా 'ఇకిగయ్'.) దీనిపై జిల్లా అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ‘తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి. ఖచ్చితంగా మాస్కు ధరించాలి. కోవిడ్ నియమాలతో పరీక్ష నిర్వహిస్తున్నాం. ఇందుకు హల్ టికెట్లోనే కరోనా వైరస్‌తో వ్యక్తి గత భద్రత గురించి పోందుపరిచాం. కరోనా లక్షణాలు కనిపించిన వారికి పరీక్ష కేంద్రంలో ప్రత్యేక ఐసోలేషన్ హల్‌ను ఏర్పాటు చేశాం. పరీక్ష రాయనిస్తాం’ అని తెలిపారు. కాగా మూడు అంచల భద్రతతో గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు నిర్వహిస్తున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కిరప్ప పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టు 144 సెక్షన్ విధించినట్లు, పరీక్ష కేంద్రంలో విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (అక్టోబర్ 5 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు) -
సడలింపులు ఉన్నా: కర్నూల్లో వీటికి నో!
సాక్షి, కర్నూలు : జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందని, కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాని ప్రాంతంలో లాకడౌన్‌కు సంబంధించి సడలింపులు ఉన్నాయని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కిరప్ప తెలిపారు. సడలింపులు ఉన్నప్పటికి ఎలాంటి వేడుకలు, పండుగలను జరుపుకోకూడదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి సీజ్ అయిన వాహనాలను ఆదివారంనుంచి విడుదల చేస్తామని చెప్పారు. కరోనా డిశ్చార్జ్‌లు: కర్నూలు మొదటిస్థానం కరోనా వైరస్ బారినుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య పరంగా కర్నూలు జిల్లా మొదటి స్థానంలో.. పరీక్షలు చేయడంలో నాల్గవ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 608 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఇందులో 397 మంది డిశ్చార్జ్ అయ్యారని, 19 మంది చనిపోగా 199 పాజిటివ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్ ద్వారా లాక్డౌన్ కొనసాగుతుందని చెప్పారు. ( ఆదోనిలో ‘కోయంబేడు’ కలకలం ) జిల్లాలో 50 కంటైన్మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేశామని, ఇందులో 9 క్లస్టర్ కంటైన్మెంట్ జోన్లలో 45 రోజుల నుండి యాక్టివ్ కేసులు లేక పోవడంతో 9 జోన్లలో లాక్డౌన్ ఎత్తి వేస్తున్నామని తెలిపారు. ఇతర క్లస్టర్లలో 20 రోజుల పాటు పాజిటివ్ కేసు నమోదు కాకపోతే అక్కడ కూడా లాక్డౌన్ సడలింపులు కొనసాగుతాయన్నారు. పాజిటివ్ కేసులు నమోదు అయిన ప్రదేశాలలో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. కాగా, జిల్లాలోని నందికొట్కూరు రెడ్‌జోన్ ప్రాంతంలో శనివారం కేంద్ర కమిటీ బృందం పర్యటించింది. డా" మధు మిత దుబే ఆధ్వర్యంలోని ఈ బృందం హౌసింగ్ బోర్డ్ కాలనీలో కోవిడ్ -19 పై తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించింది. కరోనాపై ప్రజలకు అవగహన కల్పించాలని అధికారులకు సూచనలు చేసింది. రెడ్ జోన్ ప్రాంతంలో రాపిడ్ కిట్లతో టెస్టులు చేయడంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం కితాబునిచ్చింది. -
రజనీ చరిత్ర తెలుసుకో.. ద్రవిడ పార్టీల ఆగ్రహం
పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాకున్నా సొంతపార్టీ పెట్టకున్నా సంచలన వ్యాఖ్యల ద్వారా నటుడు రజనీకాంత్ తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. 1971లో పెరియార్ నిర్వహించిన మహానాడులో శ్రీరామచంద్రమూర్తి చిత్రపటానికి అవమానం జరిగిందని, ఈ ఘటన వల్ల పెరియర్ సిద్ధాంతాలను అనుసరించే డీఎంకే రాజకీయంగా వెనుకబడి పోయిందంటూ ఇటీవల రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీన్ని డీఎంకే తీవ్రంగా ఖండించింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘తుగ్లక్’ పత్రిక తరఫున ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో నటుడు రజనీకాంత్ తన ప్రసంగంలో ‘మురసొలి పత్రిక చేతిలో ఉంటే అతడు డీఎంకే పార్టీకి చెందిన వాడిగా పరిగణిస్తాం, అదే తుగ్లక్ పత్రిక చేతిలో ఉంటే మేధావి అని చెప్పవచ్చు’ అని అన్నారు. అదేవిధంగా ‘ఊరేగింపు సాగుతుండగా సీతారాముల చిత్రపటాలపై డీఎంకే కార్యకర్తలు చెప్పులు విసిరారు. దీనివల్లనే ఆ పార్టీ బాగా దెబ్బతింది. అప్పుడు అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి ఎంతో చెడ్డపేరు వచ్చింది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు డీఎంకే పార్టీ నేతల ఆగ్రహానికి గురిచేశాయి. డీఎంకే కార్యకర్తలు, అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా రజనీ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తన ట్విట్టర్లో రజనీ పేరును ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. మురసొలి పత్రిక, డీఎంకే ఎంతగొప్పదో వివరిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ద్రవిడ కళగం ప్రధాన కార్యదర్శి కలిపూంగున్రన్, ద్రవిడర్ విడుదలై కళగ అధ్యక్షుడు ఎస్ వీరపాండియన్ సైతం స్పందించారు. 1971లో సేలంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహానికి పెరియార్ చెప్పుల దండ వేసి ఊరేగింపుగా వెళ్లిన సంఘటనను తుగ్లక్ సభలో రజనీకాంత్ ప్రస్తావించడంపై ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆనాటి సంఘటనను వ్యతిరేకిస్తూ మరే వార్తాపత్రిక ప్రచురించని సమయంలో తుగ్లప్ పత్రిక అధినేత చో రామస్వామి మాత్రమే ధైర్యంగా కవర్‌పేజీ కథనంగా రాసి ప్రజల్లోకి తీసుకెళ్లారని అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించేందుకు అందరికీ హక్కుంది, అయితే వార్తలను మార్చి చెప్పడం, మరో విధంగా చెప్పడానికి ఎవ్వరికీ హక్కులేదన్నారు. దురదృష్టవశాత్తు రజనీకాంత్ అదే చేస్తున్నారని విమర్శించారు. 1971 నాటి మహానాడుపై నిషేధం విధించాలని నల్ల జెండాలు ప్రదర్శిస్తూ జనసంఘం (నేటి బీజేపీ) పార్టీ నేతలు ఆందోళనలు సాగించినపుడు మహానాడుకు అనుమతి ఇచ్చింది కరుణానిదేనని గుర్తుచేశారు. నల్లజెండాలు ప్రదర్శించిన జన సంఘం నేతలు చెప్పు విసరగా ఆ చెప్పు సీతారాముల చిత్రపటాలపై పడిందని ఆయన అన్నారు. చెప్పులు విసిరిన వారి గురించి రజనీకాంత్ ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. చరిత్రపై అవగాహన లేకుండా ప్రసంగాలు చేస్తున్నారని వీరపాండియన్ మండిపడ్డారు. -
నా భర్తను అతను దారుణంగా మోసం చేశారు
సాక్షి, కర్నూలు : నగరంలోని ప్రతిభ ఎడ్యుకేషనల్ సొసైటీలో భాగస్వామ్యం మీద 18 సంవత్సరాలుగా పని చేస్తున్న తన భర్త సీవీఆర్ మోహన్‌రెడ్డిని అరుణాచలంరెడ్డి అక్రమంగా తొలగించారని ఆయన భార్య జయమ్మ జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె కలెక్టర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..ప్రతిభ ఎడ్యుకేషనల్ సొసైటీని 2000 సంవత్సరంలో అరుణాచలంరెడ్డి, సీవీఆర్‌మోహన్‌రెడ్డి, షేక్ షంషుద్దీన్, ప్రసాదు, చంద్రశేఖర్ కలిసి ప్రారంభించారన్నారు. తన భర్తను సొసైటీకి డైరక్టర్‌గా నియమించారన్నారు. ఆయన నేతృత్వంలో అనతికాలంలోనే ప్రతిభ కోచింగ్ సెంటర్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంస్థగా పేరుగాంచిందన్నారు. దీంతో ఇదే పేరు మీద కర్నూలు, పత్తికొండలలో పాఠశాలల, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, డీఈడీ, బీఈడీ కళాశాలలను స్థాపించి విజయవంతంగా నడిపారని, ప్రస్తుతం వాటికి సంబంధించిన ఆస్తులు కోట్లకు చేరాయన్నారు. ఆ ఆస్తులన్నింటినీ అరుణాచలంరెడ్డి గతేడాది కుటుంబ సభ్యుల పేరిట రాయించుకున్నారని ఆరోపించారు. సొసైటీలో భాగస్వామి అయిన తన భర్తను పట్టించుకోకపోగా రూ.80 లక్షలు అప్పులు మోపారన్నారు. దీనిపై ప్రశి్నస్తే కొట్టేందుకు వస్తున్నారని, మీరు స్పందించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. లేకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమవుతుందన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. కర్నూలు ఆర్డీఓ వెంకటేశ్‌ను విచారణకు ఆదేశించారు. -
రాయడం రాదు..నువ్వు జిల్లా అధికారివా?
సాక్షి, కర్నూలు : జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన జిల్లా గిరిజన సంక్షేమాధికారి ధనుంజయ, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడును ప్రభుత్వానికి సరెండర్ చేశారు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ అయిన ధనుంజయ.. కోనేరు రంగారావు కమిటీ (కేఆర్ఆర్సీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. అలాగే ఈయన పూర్తి అదనపు బాధ్యతలతో గిరిజన సంక్షేమ అధికారిగానూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి గైర్హాజరయ్యారు. కలెక్టర్ రెండు రోజుల క్రితం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తనిఖీలు నిర్వహించారు. ఆళ్లగడ్డలో గురుకుల బాలికల కళాశాల ఉండగా.. బాలుర కళాశాల ఉన్నట్లు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. అక్కడికి తనిఖీకి వెళ్లిన కలెక్టర్.. బాలికలు ఉండటం చూసి కంగుతిన్నారు. ఈ నేపథ్యంలో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ధనుంజయపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జిల్లా అధికారిగా ఉన్న మీకు రాయడం రాదా? అసలు మీరు చదువుకున్నారా? బాలురు ఉంటే బాలికలని, బాలికలు ఉంటే బాలురని ఎలా రాస్తారు?’ అని మండిపడ్డారు. ఇలాంటి వారిని జిల్లాలో ఉంచుకోవడం దారుణమంటూ వెంటనే సరెండర్ చేస్తూ ఆదేశాలిచ్చారు. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ తిలక్ విద్యా సాగర్‌కు గిరిజన సంక్షేమ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు గైర్హాజరు కావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఎలా గైర్హాజరవుతారంటూ ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వానికి సరెండర్ చేసేలా ఆదేశాలిచ్చారు. పనిచేసే వాళ్లు మాత్రమే జిల్లాలో ఉంటారని, తన అనుమతి లేకుండా గైర్హాజరైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. -
పకడ్బందీగా లెక్కింపు
ఓట్లలెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలని, ఏ చిన్న తప్పు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి వీరపాండియన్ సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం ఆయన ఆర్ఓలు, ఏఆర్ఓలకు డెమో కౌంటింగ్ వివరించారు. అనంతరం ఎస్పీతో కలిసి కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను చిత్రీకరించడంతో పాటు కౌంటింగ్ కేంద్రంలో హాట్‌లైన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి రవాణా సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. సాక్షి, అనంతపురం అర్బన్: ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఆర్ఓలు, ఏఆర్ఓలది కీలకపాత్ర అని, కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.వీరపాండియన్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ఎలా చేయాలనే అంశంపై మంగళవారం జేఎన్టీయూలోని కౌంటింగ్ కేంద్రంలో ఆర్ఓలు, ఏఆర్‌ఓల ద్వారా డెమో కౌంటింగ్ చేయించారు. ఈసందర్భంగా కలెక్టర్ కౌంటింగ్ విధానం గురించి వివరించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ టేబుల్‌కు ఈవీఎం పెట్టెలను సహాయకులు తీసుకొచ్చి ఉంచుతారన్నారు. కంట్రోల్ యూనిట్‌ను బ్యాలెట్ యూనిట్‌కు కనెక్ట్ చేసి అందులో అభ్యర్థుల వారీగా పోలైన ఓట్ల వివరాలను 17సి పార్ట్–2లో రౌండ్ల వారీగా నమోదు చేయాలని సూచించారు. పోలైన ఓట్లను హాల్లోని ఏజెంట్లు, సూక్ష్మ పరిశీలకులు, కౌంటింగ్ అసిస్టెంట్లకు చూపించాల్సిన బాధ్యత కౌంటింగ్ సూపర్వైజర్లదేనన్నారు. రౌండ్లు మేరకు సిద్ధం చేసుకుని ఉంచిన ఫోల్డర్లో రౌండ్ కౌంటింగ్ షీట్‌ను ఉంచి కంపానియన్ టేబుల్‌కు పంపించి, సిస్టంలో నమోదు చేయించాలన్నారు. తరువాత సువిధ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. నేడు రెండో రాండమైజేషన్ ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో ఆర్ఓల సమక్షంలో బుధవారం రెండో విడత రాండమైజేషన్ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. 23వ తేదీ ఉదయం 5 గంటల్లోగా మూడో రాండమైజేషన్ జరుగుతుందన్నారు. అప్పుడు కౌంటింగ్ కేంద్రాలు, టేబుళ్లను కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో జేసీ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, ట్రైనీ కలెక్టర్ ఎం.జాహ్నవి, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, నోడల్ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు భద్రత కట్టుదిట్టం సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ఆఖరు ఘట్టమైన కౌంటింగ్ రోజున కట్టుదిట్టమైన భద్రత చేపట్టామని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ మంగళశారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్యాక్షన్, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా వేశామని, జిల్లా బలగాలే కాకుండా ఎపీఎస్పీ, సీఆర్పీఫ్ బలగాలను సైతం భారీగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ రోజున రిటర్నింగ్ అధికారుల అనుమతి లేనిదే ఎవరినీ కౌంటింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లోకి అనుమతించమని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నాయకులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
నిర్ణీత గడువులోపు కియా పూర్తికావాలి
అనంతపురం అర్బన్:నిర్దేశించిన గడువులోపు కియా కార్ల పరిశ్రమ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తరఫు నుంచి అందించాల్సిన సహకారాన్ని ఇవ్వాలని ఆదేశించారు. గురువారం కియా పరిశ్రమ పురోగతిపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కియా ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎంఓయూ ప్రకారం ప్రాజెక్టు సైట్‌కు వారంలోపు సేల్ అగ్రిమెంట్ పూర్తి చేయాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌ను ఆదేశించారు. కియా సైట్లో హెలి పాడ్, టౌన్షిప్, శిక్షణ కేంద్రం, తదితర ప్రదేశాలన్నీ జోనింగ్ చేయాలని నగర పాలక కమిషనర్ మూర్తిని ఆదేశించారు. కియా కార్ల పరిశ్రమకు సంబంధించిన వ్యర్థాల నిర్వహణకు మడకశిరలో గుర్తించిన భూమిని కియా ప్రతినిధులకు చూపించి ఆమోదయోగ్యమా, కాదా అనేది తెలపాలన్నారు. కొరియన్ ప్రతినిధులు పిల్లల చదువుకు ఇంటర్నేషనల్ స్కూల్, ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థినులకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేయాలని డీఆర్డీఏ పీడీ కేఎస్ రామారావును ఆదేశిం చారు. స్థానికులకే ఉద్యోగాల్లో ప్రాధాన్యత కియాలో ఉద్యోగాలకు స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని పాలిటెక్నిక్, ఐటీఐ, యూనివర్సిటీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. సమావేశంలో కియా ప్రతనిధి జూడ్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగేశ్వరరావు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనాథ్, జిల్లా పరిశ్రమల శాఖ ఇన్చార్జీ జీఎం జేమ్స్ సుందర్రాజు, డీడీ శ్రీనివాస్ తదితరులు, పాల్గొన్నారు. -
సెలవులో కలెక్టర్
అనంతపురం అర్బన్ : జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఈ నెల 12 వరకు సెలవులో వెళ్లారు. వ్యక్తిగత పనులపైన సెలవు పెట్టినట్లు సమాచారం. 13వ తేదీన తిరిగి విధులకు హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. -
కలెక్టర్‌గా వీరపాండ్యన్
(సాక్షి ప్రతినిధి, అనంతపురం) జిల్లా కలెక్టర్‌గా వీరపాండ్యన్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్ కోన శశిధర్‌ను గుంటూరు కలెక్టర్‌గా బదిలీ చేసింది. అలాగే జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతానికి కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వీరపాండ్యన్ ప్రస్తుతం విజయవాడ మునిసిపల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఈయన 2008 ఐఏఎస్ బ్యాచ్‌లో ఆలిండియా 53వ ర్యాంకు సాధించారు. 2009 ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 3 వరకూ ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పొందారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ ట్రైనీ కలెక్టర్‌గా 2010 జూన్ 25 నుంచి 2011 జూన్ 11 వరకూ పనిచేశారు. అనంతరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా 2012 ఆగస్టు 8 నుంచి 2014 ఫిబ్రవరి 14 వరకూ విధులు నిర్వర్తించారు. తర్వాత శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. 2015 జనవరి 9 నుంచి ఇప్పటి వరకూ విజయవాడ మునిసిపల్ కమిషనర్‌గా ఉన్నారు. వీరపాండ్యన్‌కు సమర్థవంతమైన అధికారిగా పేరుంది. గుంటూరు కలెక్టర్‌గా శశిధర్ కోన శశిధర్ అనంతపురం కలెక్టర్‌గా 2015 జనవరి 22న బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 27 నెలలపాటు సమర్థవంతంగా పనిచేశారు. ముఖ్యంగా జిల్లా అధికారులలో బాధ్యతను పెంచారు. పాఠశాల విద్యలో నాణ్యత పెంచేలా, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రత్యేక దృ ష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించేలా చొరవ తీసుకున్నారు. ఇందుకుగాను ప్రధానమంత్రి చేతుల మీదుగా స్వచ్ఛఅనంత అవార్డును స్వీకరించారు. ప్రస్తుతం ఈయన గుంటూరు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. కృష్ణా కలెక్టర్‌గా లక్ష్మీకాంతం లక్ష్మీకాంతం అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా 2015 జనవరి 9న బాధ్యతలు స్వీకరించారు. ఈయన కూడా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. హాస్టల్ విద్యార్థులకు వసతులు కల్పించేందుకు దాతల సహకారం తీసుకున్నారు. వాటికి మరమ్మతులు చేయించి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచారు. నేషనల్ ఈ –గవర్నెన్స్‌పై మన రాష్ట్రం తరఫున ఢిల్లీలో ప్రజెంటేషన్ ఇచ్చి ఏపీకి మొదటి బహుమతి తీసుకొచ్చారు. ఇటీవల ఢిల్లీలో ఇంటర్నేషనల్ ల్యాండ్ అండ్ డెవలప్మెంట్పై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ జార్జియా దేశంలో జరిగే కాన్ఫరెన్స్‌కు ఎంపికైంది. ఈ నేపథ్యంలో లక్ష్మీకాంతానికి కృష్ణా కలెక్టర్‌గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ‘అనంత’ను జీవితంలో మరవలేను: కోన శశిధర్, కలెక్టర్ అనంతపురం జిల్లా ప్రజలు నన్ను బాగా ఆదరించారు. ఇక్కడి ప్రజలు చాలా మంచివాళ్లు. ఈ జిల్లా ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. నేను ఎక్కడున్నా ఈ జిల్లా నా మనసుకు చాలా దగ్గరగా ఉంటుంది. నాకు ప్రధానమంత్రి అవార్డును తెచ్చిపెట్టింది. గొల్లపల్లికి రిజర్వాయర్‌కు నీళ్లు ఇచ్చేందుకు నా వంతు కృషి చేశా. ఫారంపాండ్లు తవ్వించాం. జీవితంలో ఎప్పుడైనా ఏ అవకాశం వచ్చినా జిల్లా రుణం తీర్చుకుంటా. అమితానందాన్నిచ్చింది: లక్ష్మీకాంతం, జేసీ అనంతపురం జిల్లా నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఈ జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఇవి మరింత కష్టపడేందుకు అవకాశం కల్పించాయి. ఈ జిల్లా నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనది. -
అవినీతి భరతం పడతా
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అవినీతి భరతం పడతానని కమిషనర్ జి.వీరపాండ్యన్ స్పష్టంచేశారు. నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఆయన శుక్రవారం ఉదయం 9 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలంటే అవినీతి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. బదిలీ అయిన కమిషనర్ సి.హరికిరణ్ ప్రస్తుత పరిస్థితులపై కొంత సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. పరిస్థితులను అవగాహన చేసుకుని ప్రణాళికాబద్ధంగా పాలన సాగిస్తానని చెప్పారు. రాజధాని నగరంలో పోస్టింగ్ దక్కడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు సంతృప్తికరంగా సేవలు అందించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. సమీక్షల ద్వారా ఎప్పటికప్పుడు అధికారుల పనితీరును బేరీజు వేస్తానని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తానని చెప్పారు. ఆదాయ వనరులను పెంపొందించడంపై దృష్టి సారిస్తానన్నారు. నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల్లో ఆన్లైన్ విధానాన్ని మరింత మెరుగుపరుస్తామన్నారు. రాజధానికి కేంద్రంగా ప్రకటించిన నేపథ్యంలో నగరంలో మౌలిక వసతుల కల్పనపై ప్రజల్లో ప్రత్యేక అంచనాలు ఉంటాయన్నారు. వీటిని సమకూర్చడంలో కార్పొరేషన్ కీలకపాత్ర వహించాలన్నారు. తనదైన శైలిలో పనిచేసి నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషిచేస్తానన్నారు. తాను ఖమ్మంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో ఇసుక క్వారీల నిర్వహణ బాధ్యతను గిరిజన మహిళలకు అప్పగించానని వీరపాండ్యన్ చెప్పారు. దీనివల్ల రూ.18 కోట్ల లాభం వచ్చిందన్నారు. స్పష్టమైన అవగాహన ద్వారా నగరపాలక సంస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించవచ్చన్నారు. అదనపు కమిషనర్ జి.నాగరాజు, ఇన్చార్జి చీఫ్ ఇంజినీర్ షుకూర్, సీఎంవోహెచ్ ఎం.గోపీనాయక్, సిటీప్లానర్ ఎస్.చక్రపాణి, అసిస్టెంట్ సిటీప్లానర్ మధుకుమార్, ఎస్ఈ ఆదిశేషు, మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు డి.ఈశ్వర్ తదితరులు మర్యాదపూర్వకం గా కమిషనర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. తొలి రోజు బిజీ... నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండ్యన్ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు బిజీగా గడిపారు. ఉదయం 9 గంటలకు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉద్యోగులతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేయర్ కోనేరు శ్రీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం భవానీపురం వెళ్లి జీవకారుణ్య సంస్థ కార్యాలయంలో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. కబేళా ఆవరణలో మొక్కలు నాటారు. సాయంత్రం నాలుగు గంటలకు చీఫ్ సెక్రటరీని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం రాత్రి తిరిగి నగరానికి చేరుకుంటారని సమాచారం. సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. -
కొత్త జేసీ వివేక్ యూదవ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అడిషనల్ సీఈవోగా బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన స్థానంలో గుంటూరు జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్‌ను నియమించింది. 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వీరపాండ్యన్ ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన జిల్లా జేసీగా విధుల్లోకి చేరారు. ఆయన పనిచేసిన ఏడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించారు. కొత్త రాష్ర్టం ఏర్పడిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఆయన శాఖలో ఉన్న కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత కూడా ఎదుర్కొన్నారు. ప్రధానంగా తహశీల్దార్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒకదశలో ఆయన నిర్వహించిన సమావేశాలు కూడా బహిష్కరించారు. అలాగే డీలర్లు, వీఆర్వోలు, రైస్‌మిల్లర్ల నుంచి సైతం విమర్శలు ఎదుర్కొన్నారు. సివిల్ సప్లయ్ సిబ్బంది కూడా విధులను బహిష్కరించి నిరసనలు తెలిపారు. కార్యాయంలో ఫైళ్ల నిర్వహనలో జాప్యం, అనవసర కొర్రిలు వేసి కింది స్థాయి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారనే అపవాదు కూడా ఉంది. మన్ననలు పొందిన జెసీ.. గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా సుమారు ఏడాది కాలం పని చేసిన వివేక్‌యాదవ్ ఆ జిల్లాలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ అధికారిగా వ్యవహరించి ప్రజల మన్ననలు, అభిమానాన్ని చూరగొన్నారు. పలు కార్యక్రమాలు చేపట్టడం దారా ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుదలకు కృషి చేశారు. ముక్కుసూటిగా వ్యవహరించడమే ఆయనకు కొన్ని సమయాల్లో ఇబ్బందులు తెచ్చిపెట్టిందని పలువురు అధికారులు అంటుంటారు. పేదల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతో ప్రత్యేకించి ఆ వర్గం ఆయన అంటే ప్రేమ చూపేవారు. భూ సమస్యల పరిష్కారంలో తనదైన శైలి చూపారు. వెబ్ ల్యాండుకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించారు. పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల సమస్యను పరిష్కరించారు. సివిల్ సప్లయ్స్‌కు సంబంధించి ఆధార్ సీడింగ్‌లో జిల్లాను ఆగ్రభాగంలో నిలిపారు. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకకరణ, పునరావాస కార్యక్రమాల్లో విశేష కృషి చేశారు. -
రేషన్ డిపోల్లో జేసీ ఆకస్మిక తనిఖీలు
శ్రీకాకుళం రూరల్/సరుబుజ్జిలి, న్యూస్‌లైన్: రేషన్ డిపోల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలోని డీసీఎంఎస్ పాయింట్(డిపో నంబరు-52), ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల్లోని పలు డిపోలను తనిఖీ చేశారు. డీసీఎంఎస్ పాయింట్ డిపోలో సుమారు 20 నిమిషాలు పాటు రికార్డులు, స్టాక్‌ను సరిచూశారు. గ్రాండ్ స్టాక్ బ్యాలెన్సును పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతీ రేషన్ డిపోలో కచ్చితంగా ఎలక్ట్రానిక్ తూనికల యంత్రాలను వినియోగించాలని డీలర్లను ఆదేశించారు. మరోసారి తనిఖీకి వచ్చే సమయానికి ఎలక్ట్రానిక్ తూనికల యంత్రాలు లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ ప్రాం తాల్లోని డిపోల్లో ప్రభుత్వం నియమించిన డీలర్లు కాకుండా అనాధికార వ్యక్తులు డీలర్‌గా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, అలా ఎక్కడైనా ఉంటే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రేషన్ డిపోల డీలర్లు స్టాక్, సేల్స్ రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పై నిబంధనలు తక్షణమే అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని డీఎస్వో ఆనందకుమార్‌ను ఆదేశించారు. తరుగు వస్తే సహించేదిలేదు చౌకధరల డీలర్లకు సరఫరా చేసే సరకుల్లో తరుగు వస్తే సహించేదిలేదని జేసీ హెచ్చరించారు. పౌరసరఫరాల గొడౌన్‌తోపాటు, పలు రేషన్ డిపోలపై ఫిర్యాదులు రావడంతో సరుబుజ్జిలి మండలంలోని గొడౌన్‌తోపాటు మర్రిపాడు రేషన్ డిపోలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మర్రిపాడు డిపోలో సరకుల వివరాలు, ధరలు, స్టాకుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అలాగే మండల పౌరసరఫరాల గొడౌన్లో సరకులు నిల్వచేసే పద్ధతులను, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. డిపోలకు సరఫరా చేసే సరకుల్లో తరుగులు వస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, సరిదిద్దుకోకపోతే చర్యలు తప్పవని గొడౌన్ ఇన్చార్జిపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో పౌరసరఫరాల జిల్లా మేనే జర్ లోక్‌మోహన్, తహశీల్డార్లు పాల్గొన్నారు.