అవినీతి భరతం పడతా
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అవినీతి భరతం పడతానని కమిషనర్ జి.వీరపాండ్యన్ స్పష్టంచేశారు. నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఆయన శుక్రవారం ఉదయం 9 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలంటే అవినీతి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. బదిలీ అయిన కమిషనర్ సి.హరికిరణ్ ప్రస్తుత పరిస్థితులపై కొంత సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. పరిస్థితులను అవగాహన చేసుకుని ప్రణాళికాబద్ధంగా పాలన సాగిస్తానని చెప్పారు. రాజధాని నగరంలో పోస్టింగ్ దక్కడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు సంతృప్తికరంగా సేవలు అందించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. సమీక్షల ద్వారా ఎప్పటికప్పుడు అధికారుల పనితీరును బేరీజు వేస్తానని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తానని చెప్పారు. ఆదాయ వనరులను పెంపొందించడంపై దృష్టి సారిస్తానన్నారు. నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల్లో ఆన్‌లైన్ విధానాన్ని మరింత మెరుగుపరుస్తామన్నారు. రాజధానికి కేంద్రంగా ప్రకటించిన నేపథ్యంలో నగరంలో మౌలిక వసతుల కల్పనపై ప్రజల్లో ప్రత్యేక అంచనాలు ఉంటాయన్నారు.
వీటిని సమకూర్చడంలో కార్పొరేషన్ కీలకపాత్ర వహించాలన్నారు. తనదైన శైలిలో పనిచేసి నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషిచేస్తానన్నారు. తాను ఖమ్మంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో ఇసుక క్వారీల నిర్వహణ బాధ్యతను గిరిజన మహిళలకు అప్పగించానని వీరపాండ్యన్ చెప్పారు. దీనివల్ల రూ.18 కోట్ల లాభం వచ్చిందన్నారు. స్పష్టమైన అవగాహన ద్వారా నగరపాలక సంస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించవచ్చన్నారు. అదనపు కమిషనర్ జి.నాగరాజు, ఇన్‌చార్జి చీఫ్ ఇంజినీర్ షుకూర్, సీఎంవోహెచ్ ఎం.గోపీనాయక్, సిటీప్లానర్ ఎస్.చక్రపాణి, అసిస్టెంట్ సిటీప్లానర్ మధుకుమార్, ఎస్‌ఈ ఆదిశేషు, మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు డి.ఈశ్వర్ తదితరులు మర్యాదపూర్వకం గా కమిషనర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.
తొలి రోజు బిజీ...
నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండ్యన్ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు బిజీగా గడిపారు. ఉదయం 9 గంటలకు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉద్యోగులతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేయర్ కోనేరు శ్రీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం భవానీపురం వెళ్లి జీవకారుణ్య సంస్థ కార్యాలయంలో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. కబేళా ఆవరణలో మొక్కలు నాటారు. సాయంత్రం నాలుగు గంటలకు చీఫ్ సెక్రటరీని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం రాత్రి తిరిగి నగరానికి చేరుకుంటారని సమాచారం. సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది.