Commissioner of Municipal Corporation
-
అవినీతి భరతం పడతా
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అవినీతి భరతం పడతానని కమిషనర్ జి.వీరపాండ్యన్ స్పష్టంచేశారు. నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఆయన శుక్రవారం ఉదయం 9 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలంటే అవినీతి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. బదిలీ అయిన కమిషనర్ సి.హరికిరణ్ ప్రస్తుత పరిస్థితులపై కొంత సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. పరిస్థితులను అవగాహన చేసుకుని ప్రణాళికాబద్ధంగా పాలన సాగిస్తానని చెప్పారు. రాజధాని నగరంలో పోస్టింగ్ దక్కడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు సంతృప్తికరంగా సేవలు అందించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. సమీక్షల ద్వారా ఎప్పటికప్పుడు అధికారుల పనితీరును బేరీజు వేస్తానని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తానని చెప్పారు. ఆదాయ వనరులను పెంపొందించడంపై దృష్టి సారిస్తానన్నారు. నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల్లో ఆన్లైన్ విధానాన్ని మరింత మెరుగుపరుస్తామన్నారు. రాజధానికి కేంద్రంగా ప్రకటించిన నేపథ్యంలో నగరంలో మౌలిక వసతుల కల్పనపై ప్రజల్లో ప్రత్యేక అంచనాలు ఉంటాయన్నారు. వీటిని సమకూర్చడంలో కార్పొరేషన్ కీలకపాత్ర వహించాలన్నారు. తనదైన శైలిలో పనిచేసి నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషిచేస్తానన్నారు. తాను ఖమ్మంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో ఇసుక క్వారీల నిర్వహణ బాధ్యతను గిరిజన మహిళలకు అప్పగించానని వీరపాండ్యన్ చెప్పారు. దీనివల్ల రూ.18 కోట్ల లాభం వచ్చిందన్నారు. స్పష్టమైన అవగాహన ద్వారా నగరపాలక సంస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించవచ్చన్నారు. అదనపు కమిషనర్ జి.నాగరాజు, ఇన్చార్జి చీఫ్ ఇంజినీర్ షుకూర్, సీఎంవోహెచ్ ఎం.గోపీనాయక్, సిటీప్లానర్ ఎస్.చక్రపాణి, అసిస్టెంట్ సిటీప్లానర్ మధుకుమార్, ఎస్ఈ ఆదిశేషు, మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు డి.ఈశ్వర్ తదితరులు మర్యాదపూర్వకం గా కమిషనర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. తొలి రోజు బిజీ... నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండ్యన్ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు బిజీగా గడిపారు. ఉదయం 9 గంటలకు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉద్యోగులతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేయర్ కోనేరు శ్రీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం భవానీపురం వెళ్లి జీవకారుణ్య సంస్థ కార్యాలయంలో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. కబేళా ఆవరణలో మొక్కలు నాటారు. సాయంత్రం నాలుగు గంటలకు చీఫ్ సెక్రటరీని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం రాత్రి తిరిగి నగరానికి చేరుకుంటారని సమాచారం. సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. -
టార్గెట్ కమిషనర్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ చక్రధర్‌బాబును తెలుగు తమ్ముళ్లు టార్గెట్ చేశారు. కమిషనర్‌ను ఇరుకునపెట్టేందుకు చాపకింద నీరులా పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే టీడీపీ కార్పొరేటర్లు కొందరు పథకం ప్రకారం స్టాండింగ్ కమిటీ ఎన్నికను వాయిదా వేయించారనే ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం హైడ్రామా వెనుక మేయర్ అజీజ్ హస్తం ఉందని బోగట్టా. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా చక్రధర్‌బాబు బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకు అకౌంటెంట్ ప్రవీణ్‌ను తొలగించారు. అయితే అకౌంటెంట్ తొలగింపు మేయర్ అజీజ్‌కు తెలియకుండా చేశారనేది వారి వాదన. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ వెంకటరమణ మేయర్‌కు కార్పొరేషన్ పాలనలో పూర్తి సహకారం అందించేవారుగా పేరుంది. ఆయన ఇటీవల జనన, మరణాల ధ్రువీకరణ పత్రాల జారీలో అవినీతికి పాల్పడిన ఘటనలో ఆయనను సస్పెండ్ చేయటం కూడా మేయర్ అజీజ్‌కు రుచించలేదు. ఈ సంఘటనలు అటుంచితే.. నగరపాలక సంస్థలో ముఖ్యమైన స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కమిషనర్ తనకు ఎటువంటి సమాచారం లేకుండా నోటిఫికేషన్ జారీ చేయటం మేయర్ అజీజ్ అవమానంగా భావించారు. ఈ సంఘటనలతో మేయర్ అజీజ్ కమిషనర్‌ను టార్గెట్ చేశారని ఆయన వర్గీయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నిక వాయిదా వెనుక... కార్పొరేషన్ అభివృద్ధిలో స్టాండింగ్ కమిటీ సభ్యుల ఆమోదం కీలకం. అటువంటి కీలకమైన సభ్యుల ఎన్నిక విషయంలో మేయర్ పట్టుసాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే తన వర్గీయులు నలుగురిని నామినేషన్ వేయించేందుకు నిర్ణయించారు. అయితే మధ్యలో టీడీపీ వర్గీయులు కమిటీలో పైచేయి సాధించేందుకు పావులు కదిపారు. ఈ పరిస్థితుల్లో స్టాండింగ్ కమిటీ చేజారిపోతుందని భావించిన మేయర్ వర్గం ఎన్నికను వాయిదా వేయించేందుకు పథకం రచించినట్లు సమాచారం. కమిషనర్‌పై ఉన్న అసంతృప్తి, ఓటమి భయం రెండింటినీ దృష్టిలో ఉంచుకుని హైడ్రామాకు తెరతీశారు. పథకం ప్రకారమే కొందరు కార్పొరేటర్లు కమిషనర్‌ను కలవటం, అక్కడ గొడవ సృష్టించటం చేశారని ప్రచారం జరుగుతోంది. అక్కడ గొడవ జరుగుతుండగానే వెంటవెంటనే టీడీపీ ముఖ్యనేతలకు సమాచారం ఇవ్వటం, సీఎం పేషీకి తీసుకెళ్లటం జరిగిపోయింది. ఆ తర్వాత కొందరు ముఖ్యనేతల ద్వారా సీఎం పేషీ నుంచి కమిషనర్‌కు ఫోన్ చేయించి స్టాండింగ్ కమిటీ ఎన్నికను వాయిదా వేయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నిక వాయిదాతో కమిషనర్‌ను వదిలేది లేదని టీడీపీకి చెందిన ఓ కార్పొరేటర్ తన అనుచరుల వద్ద మాట్లాడటం కనిపించింది. కొద్దిరోజుల్లో నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలోనూ కమిషనర్‌ను ఇరుకునపెట్టేందుకు ఇప్పటి నుంచి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. -
కమిషనర్ తీరుపై కన్నెర్ర
ఒంగోలు: నగరపాలక సంస్థ కమిషనర్ వ్యవహారం ప్రజాప్రతినిధులకు సైతం అసహనం తెప్పించింది. సోమవారం విద్యుత్ స్తంభంపై నుంచి పడి చనిపోయిన వెంకటేశ్వర్లు బంధువులు, గ్రామస్తులు ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నా ... శాంతింపజేయాల్సింది పోయి కమిషనర్ సెల్‌ఫోన్ స్విచ్ఆఫ్ చేసి ఎక్కడున్నారో తెలియనీయకుండా తప్పించుకోవడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చివరకు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు మొదలు ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ వరకు కమిషనర్‌కు ఫోన్లు చేస్తున్నా నో రెస్పాన్స్. దీంతో కలెక్టర్‌కు ఫోన్‌చేసి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించడంతో కలెక్టర్ జోక్యం చేసుకోవల్సి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి... ముక్తినూతలపాడు పంచాయతీలో కాంట్రాక్టు వర్కర్‌గా అదే గ్రామానికి చెందిన సూదనగుంట వెంకటేశ్వర్లు(32) సోమవారం కరెంట్ పోల్ ఎక్కి విద్యుత్ బల్బులు అమర్చుతూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన విషయం విదితమే. వెంకటేశ్వర్లు కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు, బంధువులు మంగళవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ ఆవరణలోనే మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. ఏఐటీయూసీ నాయకులు కలుగజేసుకొని రూ.15 లక్షల పరిహారం, మృతుని భార్యకు ఉద్యోగం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మంత్రి శిద్దా రాఘవరావుకు, ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌కు ఫోన్‌చేసి కమిషనర్ మొండి వైఖరిని వివరించారు. మరో వైపు వైఎస్సార్‌ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా జోక్యం చేసుకొని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి వివరించారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి నేరుగా కలెక్టర్‌తో మాట్లాడారు. మరో వైపు మంత్రితోపాటు ఎమ్మెల్యే కూడా కమిషనర్‌తో మాట్లాడేందుకు యత్నించగా ఆమె ఎక్కడున్నారో తెలియరాలేదు . కనీసం ఫోన్లు కూడా పని చేయకపోవడంతో కలెక్టర్‌తో మాట్లాడాల్సి వచ్చింది. క్యాంపులో ఉన్న జిల్లా ఉప కార్మికశాఖ అధికారి అఖిల్ విషయం తెలుసుకొని కార్మికశాఖ తరుపున తప్పక న్యాయం జరిగేలా చూస్తానంటూ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రమాదేవి ద్వారా ఆందోళన చేస్తున్నవారికి తెలియజేశారు. ఆ హామీతో సంతృప్తి చెందని ఆందోళనకారులు చర్చిసెంటర్లో రోడ్డుపై బైఠాయించారు. పరారైన కమిషనర్‌ను పిలిపించాలంటూ ఆగ్రహించారు. ఒంగోలు టూటౌన్ సీఐ సూర్యనారాయణ అక్కడకు చేరుకొని కలెక్టర్‌తో చర్చించడానికి రావాలంటూ కొంతమందిని పంపించారు. కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై తప్పకుండా కమిషనర్‌నుంచి వివరణ కోరతానని కలెక్టర్ విజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. మృతుని భార్యకు ప్రభుత్వ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగం ఇస్తానని...పర్మినెంట్ చేసే అవకాశాలు పరిశీలిస్తానన్నారు. వర్క్‌మెన్ కాంపెన్సేషన్ యాక్టు, పీఎఫ్ ఇతరత్రా మొత్తం న్యాయబద్ధంగా ఎంత రావాలో అంత మొత్తాన్ని త్వరితగతిన ఇప్పిస్తామంటూ కలెక్టర్ వివరించడంతో శాంతించి మృతదేహాన్ని చర్చిసెంటర్నుంచి తీసుకొని వెళ్లారు. మున్సిపల్ ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం... వెంకటేశ్వర్లు ఎలక్ట్రీషియన్ కాదని, హెల్పర్‌గా మాత్రమే తీసుకున్నట్లు మున్సిపల్ డీఈ గోపాల్ కలెక్టర్‌కు వివరించారు. దీంతో కలెక్టర్ ఆగ్రహించారు. నాన్ టెక్నికల్ కింద ఉద్యోగం ఇచ్చి టెక్నికల్ పనులు ఎందుకు చేయించుకుంటున్నారు...అతనిని ఏ విభాగం కింద తీసుకున్నారో రిపోర్టు పంపండంటూ మండిపడ్డారు. ఆరుగంటలపాటు అందుబాటులోకి రాని కమిషనర్ చర్చలు ముగిశాయని తెలుసుకొని రాత్రి 8 గంటల తరువాత ప్రత్యక్షమయ్యారు. చీమకుర్తికి వెళ్లడంతో ఫోన్ స్విచాఫ్ అయిందని చెప్పడం గమనార్హం.