సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ చక్రధర్‌బాబును తెలుగు తమ్ముళ్లు టార్గెట్ చేశారు. కమిషనర్‌ను ఇరుకునపెట్టేందుకు చాపకింద నీరులా పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే టీడీపీ కార్పొరేటర్లు కొందరు పథకం ప్రకారం స్టాండింగ్ కమిటీ ఎన్నికను వాయిదా వేయించారనే ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం హైడ్రామా వెనుక మేయర్ అజీజ్ హస్తం ఉందని బోగట్టా. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా చక్రధర్‌బాబు బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకు అకౌంటెంట్ ప్రవీణ్‌ను తొలగించారు.
అయితే అకౌంటెంట్ తొలగింపు మేయర్ అజీజ్‌కు తెలియకుండా చేశారనేది వారి వాదన. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ వెంకటరమణ మేయర్‌కు కార్పొరేషన్ పాలనలో పూర్తి సహకారం అందించేవారుగా పేరుంది. ఆయన ఇటీవల జనన, మరణాల ధ్రువీకరణ పత్రాల జారీలో అవినీతికి పాల్పడిన ఘటనలో ఆయనను సస్పెండ్ చేయటం కూడా మేయర్ అజీజ్‌కు రుచించలేదు.
ఈ సంఘటనలు అటుంచితే.. నగరపాలక సంస్థలో ముఖ్యమైన స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కమిషనర్ తనకు ఎటువంటి సమాచారం లేకుండా నోటిఫికేషన్ జారీ చేయటం మేయర్ అజీజ్ అవమానంగా భావించారు. ఈ సంఘటనలతో మేయర్ అజీజ్ కమిషనర్‌ను టార్గెట్ చేశారని ఆయన వర్గీయులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎన్నిక వాయిదా వెనుక...
కార్పొరేషన్ అభివృద్ధిలో స్టాండింగ్ కమిటీ సభ్యుల ఆమోదం కీలకం. అటువంటి కీలకమైన సభ్యుల ఎన్నిక విషయంలో మేయర్ పట్టుసాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే తన వర్గీయులు నలుగురిని నామినేషన్ వేయించేందుకు నిర్ణయించారు.
అయితే మధ్యలో టీడీపీ వర్గీయులు కమిటీలో పైచేయి సాధించేందుకు పావులు కదిపారు. ఈ పరిస్థితుల్లో స్టాండింగ్ కమిటీ చేజారిపోతుందని భావించిన మేయర్ వర్గం ఎన్నికను వాయిదా వేయించేందుకు పథకం రచించినట్లు సమాచారం. కమిషనర్‌పై ఉన్న అసంతృప్తి, ఓటమి భయం రెండింటినీ దృష్టిలో ఉంచుకుని హైడ్రామాకు తెరతీశారు.
పథకం ప్రకారమే కొందరు కార్పొరేటర్లు కమిషనర్‌ను కలవటం, అక్కడ గొడవ సృష్టించటం చేశారని ప్రచారం జరుగుతోంది. అక్కడ గొడవ జరుగుతుండగానే వెంటవెంటనే టీడీపీ ముఖ్యనేతలకు సమాచారం ఇవ్వటం, సీఎం పేషీకి తీసుకెళ్లటం జరిగిపోయింది.
ఆ తర్వాత కొందరు ముఖ్యనేతల ద్వారా సీఎం పేషీ నుంచి కమిషనర్‌కు ఫోన్ చేయించి స్టాండింగ్ కమిటీ ఎన్నికను వాయిదా వేయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నిక వాయిదాతో కమిషనర్‌ను వదిలేది లేదని టీడీపీకి చెందిన ఓ కార్పొరేటర్ తన అనుచరుల వద్ద మాట్లాడటం కనిపించింది. కొద్దిరోజుల్లో నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలోనూ కమిషనర్‌ను ఇరుకునపెట్టేందుకు ఇప్పటి నుంచి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
టార్గెట్ కమిషనర్
Published Thu, Nov 13 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement