కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్
సాక్షి, కర్నూలు : జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన జిల్లా గిరిజన సంక్షేమాధికారి ధనుంజయ, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడును ప్రభుత్వానికి సరెండర్ చేశారు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ అయిన ధనుంజయ.. కోనేరు రంగారావు కమిటీ (కేఆర్‌ఆర్‌సీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. అలాగే ఈయన పూర్తి అదనపు బాధ్యతలతో గిరిజన సంక్షేమ అధికారిగానూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి గైర్హాజరయ్యారు. కలెక్టర్ రెండు రోజుల క్రితం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తనిఖీలు నిర్వహించారు.
ఆళ్లగడ్డలో గురుకుల బాలికల కళాశాల ఉండగా.. బాలుర కళాశాల ఉన్నట్లు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. అక్కడికి తనిఖీకి వెళ్లిన కలెక్టర్.. బాలికలు ఉండటం చూసి కంగుతిన్నారు. ఈ నేపథ్యంలో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ధనుంజయపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జిల్లా అధికారిగా ఉన్న మీకు రాయడం రాదా? అసలు మీరు చదువుకున్నారా? బాలురు ఉంటే బాలికలని, బాలికలు ఉంటే బాలురని ఎలా రాస్తారు?’ అని మండిపడ్డారు. ఇలాంటి వారిని జిల్లాలో ఉంచుకోవడం దారుణమంటూ వెంటనే సరెండర్ చేస్తూ ఆదేశాలిచ్చారు.
సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ తిలక్ విద్యా సాగర్‌కు గిరిజన సంక్షేమ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు గైర్హాజరు కావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఎలా గైర్హాజరవుతారంటూ ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వానికి సరెండర్ చేసేలా ఆదేశాలిచ్చారు. పనిచేసే వాళ్లు మాత్రమే జిల్లాలో ఉంటారని, తన అనుమతి లేకుండా గైర్హాజరైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment