కొత్త జేసీ వివేక్ యూదవ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అడిషనల్ సీఈవోగా బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన స్థానంలో గుంటూరు జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్‌ను నియమించింది. 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వీరపాండ్యన్ ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన జిల్లా జేసీగా విధుల్లోకి చేరారు. ఆయన పనిచేసిన ఏడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించారు. కొత్త రాష్ర్టం ఏర్పడిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఆయన శాఖలో ఉన్న కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత కూడా ఎదుర్కొన్నారు. ప్రధానంగా తహశీల్దార్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒకదశలో ఆయన నిర్వహించిన సమావేశాలు కూడా బహిష్కరించారు. అలాగే డీలర్లు, వీఆర్వోలు, రైస్‌మిల్లర్ల నుంచి సైతం విమర్శలు ఎదుర్కొన్నారు. సివిల్ సప్లయ్ సిబ్బంది కూడా విధులను బహిష్కరించి నిరసనలు తెలిపారు. కార్యాయంలో ఫైళ్ల నిర్వహనలో జాప్యం, అనవసర కొర్రిలు వేసి కింది స్థాయి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారనే అపవాదు కూడా ఉంది.
మన్ననలు పొందిన జెసీ..
గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా సుమారు ఏడాది కాలం పని చేసిన వివేక్‌యాదవ్ ఆ జిల్లాలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ అధికారిగా వ్యవహరించి ప్రజల మన్ననలు, అభిమానాన్ని చూరగొన్నారు. పలు కార్యక్రమాలు చేపట్టడం దారా ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుదలకు కృషి చేశారు. ముక్కుసూటిగా వ్యవహరించడమే ఆయనకు కొన్ని సమయాల్లో ఇబ్బందులు తెచ్చిపెట్టిందని పలువురు అధికారులు అంటుంటారు.
పేదల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతో ప్రత్యేకించి ఆ వర్గం ఆయన అంటే ప్రేమ చూపేవారు.
భూ సమస్యల పరిష్కారంలో తనదైన శైలి చూపారు. వెబ్ ల్యాండుకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించారు. పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల సమస్యను పరిష్కరించారు. సివిల్ సప్లయ్స్‌కు సంబంధించి ఆధార్ సీడింగ్‌లో జిల్లాను ఆగ్రభాగంలో నిలిపారు. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకకరణ, పునరావాస కార్యక్రమాల్లో విశేష కృషి చేశారు.