కార్యదర్శుల బదిలీల జాతర | Upcoming transformations Secretaries | Sakshi
Sakshi News home page

కార్యదర్శుల బదిలీల జాతర

Published Wed, Aug 19 2015 1:17 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Upcoming transformations Secretaries

శ్రీకాకుళం పాతబస్టాండ్ : పంచాయతీరాజ్ విభాగంలోని కార్యదర్శుల బదిలీలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మంగళవారం ఈ మేరకు జాబితాలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి బదిలీలు ఈ నెల 15వ తేదీలోగానే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ జోక్యంతో అధికారులు బదిలీలు చేపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి, విప్‌లు సిఫార్సు చేసిన జాబితాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేస్తున్నట్లు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఐదేళ్లు ఒకేచోట పనిచేసినవారినే బదిలీచేయాల్సి ఉంది. వారికి కౌన్సెలింగ్‌విధానంలో సెంటర్లను ఎంపిక చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. అంతేగాకుండా గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలి. ఇవేవీ పట్టించుకోకుండా నిబంధనలు పాటించడంలేదని, ఇంతవరకు ఎవ్వరినుంచీ ఆప్షన్ల దరఖాస్తులు కోరలేదనీ ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే 20 శాతం కంటే ఎక్కువ మందిని బదిలీ చేయొద్దన్న నిబంధన ఉన్నప్పటికీ భారీ సంఖ్యలో బదిలీల జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
 
 150మందికి పైగా స్థానచలనం
 జిల్లాలో 570 మంది వరకు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. వీరిలో 20 శాతం ప్రకారం 115 మందికి మాత్రమే బదిలీ చేయాలి. కానీ బదిలీల జాబితాలో 150 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల జిల్లా పరిషత్ విభాగంలో బదిలీలు జరిగినప్పుడు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు కోరారు. అలాగే నిబంధనల మేరకు ఐదేళ్లు ఒకేచోట పనిచేసినవారినే బదిలీ చేశారు అయితే జిల్లా పంచాయతీ కార్యాలయంలో అటువంటి నిబంధనలు పాటించలేదని కొంతమంది కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ విభాగంలో ఈ బదిలీల జాబితాపై డీపీఓ డి. కోటేశ్వరరావు వద్ద ప్రస్తావించగా ఆయన సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. తనకు సమయం లేదంటూ, తరువాత మాట్లాడతానంటూ దాటవేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement