శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మరోసారి బదిలీల సందడి నెలకొంది. ఈ ఏడాది బదిలీలు పెద్ద ప్రస్థానంగా మారాయి. సర్కార్ తీసుకున్న నిర్ణయాలు, జీవోల్లో లోపాలు, పుష్కరాలు, న్యాయపరమైన అడ్డంకులతో సుమారు నాలుగు నెలలు గడిచిపోయింది. వాస్తవంగా బదిలీల ప్రక్రియ మే నెలలో ప్రారంభంకాగా వీటిపై పలు అడ్డంకులు వచ్చాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో 98ని విడుదల చేయడంతో మరోసారి బదిలీలు తెరపైకి వచ్చాయి.
మే నెల నుంచి జూన్ వరకు పలుమార్లు 57, 58, 59, 60 జీవోలు విడుదల చేశారు. అయితే అప్పుడు అరకొరగా పలు శాఖల్లో బదిలీలు జరగ్గా ప్రధాన శాఖలైన రెవెన్యూ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖతోపాటు మరికొన్ని విభాగాల్లో జాబితాలు సిద్ధం చేసేసరికి అడ్డంకులు రావడంతో నిలిచిపోయాయి. విద్యాశాఖలో బదిలీలకు ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ సారి కూడా ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి.
తాజాగా వచ్చిన జీవోలో కూడా కమర్షియల్ టాక్సు, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, స్టాంప్, రిజిస్ట్రేషన్, రవాణా శాఖ, ఆడిట్, సర్వే శాఖ, ల్యాండ్ రికార్డులు, గణాంక, వైద్య ఆరోగ్య, పాఠశాల విద్యశాఖ, ఖజానా శాఖల్లో జోనల్ క్యాడర్లు, అకౌంట్ శాఖలో జోనల్, మల్టీ జోనల్ పోస్టులు బదిలీలు వర్తించవు. ఈ శాఖలకు బదిలీల్లో మినహయింపు ఇచ్చారు.
ఇటీవల న్యాయ పరమైన అడ్డంకులు, గోదావరి మహా పుష్కరాల కారణంగా ఈ బదిలీల పై ప్రభత్వం బ్యాన్ ఎత్తివేసింది. అయితే జీజీ 98తో మళ్లీ బదిలీలు చేయాలని ఉత్తర్వులు రావడంతో కొన్ని శాఖల్లో అప్పుడే సందడి నెలకొంది. కావాల్సిన చోటుకు బదిలీలు కోరుకుంటున్న ఉద్యోగులు ఇప్పటినుంచి అధికార పార్టీ నేతలను ఆశ్రయిస్తున్నారు.
మళ్లీ బదిలీల సందడి !
Published Wed, Aug 5 2015 1:21 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement