Multi Zonal posts
-
‘మల్టీజోనల్’లోనూ మడత పేచీ
సాక్షి, హైదరాబాద్: జోనల్ విధానంలో భాగంగా ప్రభుత్వం బుధవారం మల్టీ జోనల్ పరిధిలో ఉన్న ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ప్రకటించింది. దీనిప్రకారం మల్టీజోన్–1 నుంచి జోన్– 2కు 40 మందిని, జోన్–2 నుంచి జోన్–1కి 58 మందిని కేటాయించింది. అయితే జిల్లా కేడర్ కేటాయింపు మాదిరిగానే మల్టీ జోనల్ కేటాయింపు ప్రక్రియ కూడా అత్యంత వివాదాస్పదమైంది. హెచ్ఎంలను రాష్ట్ర స్థాయిలో ఏ స్కూలుకు పంపాలనేది విభజన సందర్భంగానే తేల్చాల్సి ఉంటుంది. కానీ హెచ్ఎంలను కేవలం జోన్లకు మాత్రమే కేటాయించారు. కానీ ఏ జిల్లాలో ఏ స్కూలుకు పంపుతారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఏ జిల్లాకు ఎంతమంది హెచ్ఎంలనేది మాత్రం చెప్పా రు. కానీ ఆయా జిల్లాల్లో ఎక్కడ పోస్టులు ఉన్నా యో వెల్లడించలేదు. పైగా జిల్లా అప్షన్లు ఇవ్వమని అడిగారు. దీంతో పోస్టులెక్కడున్నాయో తెలియకుండా ఆప్షన్లు ఎలా పెట్టుకుంటామని హెచ్ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమది మల్టీ జోనల్ కేడర్ పోస్టు అయినప్పుడు జిల్లా అధికారులకు తమ పోస్టింగ్ వ్యవహారం ఇవ్వడమేంటని ఈ విషయమై ఉన్నతాధికారులను సంప్రదించే ప్రయత్నాలు చేశామని, కానీ ఎవరి నుంచీ సరైన సమాధానం రాలేదని టీచర్ల యూనియన్లు చెప్పాయి. ఖాళీలను ప్రకటించాలి: టీఎస్ యూటీఎఫ్ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలకు ఆప్షన్ ఇవ్వమనటాన్ని టీఎస్ యూటీఎఫ్ ఖండించింది. హైస్కూల్ హెచ్ఎం పోస్ట్‌ను మల్టీ జోనల్ పోస్ట్‌గా మార్చిన తర్వాత ఆ మల్టీజోన్‌లోని ఏ పాఠశాలనైనా నేరుగా ఎంచుకునే అవకాశం హెచ్ఎంలకు ఉంటుందని, కానీ జిల్లాను ఎంచుకుంటే ఆ జిల్లాలో పోస్టింగ్ ఇస్తామని అధికారులు చెప్పడం నిబంధనలను ఉల్లంఘించటమేనని సంఘం అధ్యక్షుడు జంగయ్య, కార్యదర్శి చావా రవి చెప్పారు. హెచ్ఎంల సంఖ్యకు సరిపడా ఖాళీలను చూపించిన తర్వాత మాత్రమే ఆప్షన్లు తీసుకోవాలని కోరారు. జిల్లా ఆప్షన్లు ఇవ్వమంటే ఎలా?: పీఆర్బీ ప్రకాశ్ ‘హెచ్ఎంలు మల్టీ జోనల్ కేడర్. అయినాప్రభుత్వం జిల్లా కేడర్‌కు కేటాయించడం దారుణం. పోస్టులు ఎక్కడున్నాయో ప్రకటిస్తే మేం నచ్చిన ఆప్షన్ ఇవ్వొచ్చు. కేవలం జిల్లాల ఆప్షన్లే ఇవ్వమంటే ఎలా?’ అని హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీఆర్బీ ప్రకాశ్ ప్రశ్నించారు. -
ఉద్యోగాలు జో ‘నిల్’
ప్రభుత్వ శాఖల్లో కొత్త నియామకాలు ఇప్పట్లో కష్టమే. గతేడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన జోనల్ విధానంతో ఈ పరిస్థితి తలెత్తింది. అంతకుముందున్న విధానంతో ఉద్యోగాలను భర్తీ చేసిన నియామక సంస్థలు కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఉద్యోగాల ఖాళీల భర్తీ నోటిఫికేషన్ల విడుదలకు బ్రేక్ వేశాయి. ప్రభుత్వం ఆమోదించిన పోస్టులను సైతం భర్తీ చేయకుండా వాయిదా వేశాయి. దాదాపు ఏడాదిన్నర నుంచి వివిధ నియామక సంస్థలు ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. కొత్త విధానం ప్రకారం ఉద్యోగుల విభజన, పోస్టుల సర్దుబాట్లు, ఖాళీలపై స్పష్టత వచ్చే వరకు నూతన నియామకాలు చేపట్టే అవకాశాలు లేవనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సర్కారీ కొలువుపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం మరికొంతకాలం వేచిచూడాల్సిందే. – సాక్షి, హైదరాబాద్ కొత్త విధానమేమిటంటే.. రాష్ట్రంలో నూతన జోనల్ విధానాన్ని ఆమోదిస్తూ గత ఆగస్టులో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానం ప్రకారం రాష్ట్రాన్ని రెండు మల్టీజోన్లు, ఏడు జోన్లు, 31 జిల్లాలుగా విభజించారు. ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్తగా మరో రెండు జిల్లాలు ఏర్పాటు కావడంతో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. దీంతో మల్టీజోన్లు, జోన్ల పరిధిలో ఏయే జిల్లాలు వస్తాయనే అంశంపై స్పష్టత లేదు. రాష్ట్రంలో ఇదివరకు రెండు జోన్లు, 10 జిల్లాల మేరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో స్థానికత, కేడర్ ఆధారంగా మల్టీజోన్లు, జోన్లు, జిల్లా స్థాయిలో ఉద్యోగులను విభజించాలి. దీనికి ప్రతి ఉద్యోగికి ఆప్షన్ ఇవ్వాలి. ఉద్యోగుల సుముఖత, శాఖల సౌలభ్యం ప్రకారం విభజన ప్రక్రియ పూర్తయితేనే కేటగిరీల వారీగా పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీలపై స్పష్టత వస్తుంది. ఈ రెండు ప్రధాన కారణాలతో ఉద్యోగ నియామకాలకు బ్రేక్ పడింది. ఆ నోటిఫికేషన్ల సంగతి.. గతేడాది రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడే నాటికే ప్రభుత్వం కొన్ని రకాల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలు సంబంధిత నియామక సంస్థలకు పంపగా.. నోటిఫికేషన్ల రూపకల్పన దాదాపు పూర్తయింది. చివరి నిమిషంలో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడటం.. కొత్త విధానం తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో ఆ నోటిఫికేషన్లు నిలిచిపోయాయి. టీఎస్పీఎస్సీ, గురుకుల, మెడికల్ బోర్డుల పరిధిలో 8,547 పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పరిధిలో గ్రూప్–1 కేటగిరీలో 138, గ్రూప్–2 కేటగిరీలో 60, గ్రూప్–3 కేటగిరీలో 339, అదేవిధంగా 117 అసిస్టెంట్ ఇంజనీర్, 58 డ్రాఫ్ట్‌మన్, 68 దేవాదాయ, 31 అటవీ అధికారి, 260 రెవెన్యూ అధికారి, 287 కార్మిక ఉపాధి కల్పన, 208 రోడ్డు రవాణా సంస్థ విభాగాలతో పాటు మరిన్ని శాఖల్లో సింగిల్ డిజిట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసే క్రమంలో కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. ►తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు పరిధిలో సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్, లైబ్రేరియన్, క్రాఫ్ట్, ఆర్ట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టాఫ్ నర్సు కేటగిరీల్లో దాదాపు 2,440 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ బోర్డు నుంచి ఏడాదిన్నరగా నోటిఫికేషన్లు విడుదల కాలేదు. ►తెలంగాణ రాష్ట్ర వైద్య నియామకాల బోర్డు పరిధిలో కూడా డాక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్స్, హెల్త్ అసిస్టెంట్ తదితర కేటగిరీల్లో 4,150 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ ఇప్పటివరకు నోటిఫికేషన్లు వెలువడలేదు. -
మళ్లీ బదిలీల సందడి !
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మరోసారి బదిలీల సందడి నెలకొంది. ఈ ఏడాది బదిలీలు పెద్ద ప్రస్థానంగా మారాయి. సర్కార్ తీసుకున్న నిర్ణయాలు, జీవోల్లో లోపాలు, పుష్కరాలు, న్యాయపరమైన అడ్డంకులతో సుమారు నాలుగు నెలలు గడిచిపోయింది. వాస్తవంగా బదిలీల ప్రక్రియ మే నెలలో ప్రారంభంకాగా వీటిపై పలు అడ్డంకులు వచ్చాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో 98ని విడుదల చేయడంతో మరోసారి బదిలీలు తెరపైకి వచ్చాయి. మే నెల నుంచి జూన్ వరకు పలుమార్లు 57, 58, 59, 60 జీవోలు విడుదల చేశారు. అయితే అప్పుడు అరకొరగా పలు శాఖల్లో బదిలీలు జరగ్గా ప్రధాన శాఖలైన రెవెన్యూ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖతోపాటు మరికొన్ని విభాగాల్లో జాబితాలు సిద్ధం చేసేసరికి అడ్డంకులు రావడంతో నిలిచిపోయాయి. విద్యాశాఖలో బదిలీలకు ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ సారి కూడా ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి. తాజాగా వచ్చిన జీవోలో కూడా కమర్షియల్ టాక్సు, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, స్టాంప్, రిజిస్ట్రేషన్, రవాణా శాఖ, ఆడిట్, సర్వే శాఖ, ల్యాండ్ రికార్డులు, గణాంక, వైద్య ఆరోగ్య, పాఠశాల విద్యశాఖ, ఖజానా శాఖల్లో జోనల్ క్యాడర్లు, అకౌంట్ శాఖలో జోనల్, మల్టీ జోనల్ పోస్టులు బదిలీలు వర్తించవు. ఈ శాఖలకు బదిలీల్లో మినహయింపు ఇచ్చారు. ఇటీవల న్యాయ పరమైన అడ్డంకులు, గోదావరి మహా పుష్కరాల కారణంగా ఈ బదిలీల పై ప్రభత్వం బ్యాన్ ఎత్తివేసింది. అయితే జీజీ 98తో మళ్లీ బదిలీలు చేయాలని ఉత్తర్వులు రావడంతో కొన్ని శాఖల్లో అప్పుడే సందడి నెలకొంది. కావాల్సిన చోటుకు బదిలీలు కోరుకుంటున్న ఉద్యోగులు ఇప్పటినుంచి అధికార పార్టీ నేతలను ఆశ్రయిస్తున్నారు.