
పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాకున్నా సొంతపార్టీ పెట్టకున్నా సంచలన వ్యాఖ్యల ద్వారా నటుడు రజనీకాంత్ తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. 1971లో పెరియార్ నిర్వహించిన మహానాడులో శ్రీరామచంద్రమూర్తి చిత్రపటానికి అవమానం జరిగిందని, ఈ ఘటన వల్ల పెరియర్ సిద్ధాంతాలను అనుసరించే డీఎంకే రాజకీయంగా వెనుకబడి పోయిందంటూ ఇటీవల రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీన్ని డీఎంకే తీవ్రంగా ఖండించింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘తుగ్లక్’ పత్రిక తరఫున ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో నటుడు రజనీకాంత్ తన ప్రసంగంలో ‘మురసొలి పత్రిక చేతిలో ఉంటే అతడు డీఎంకే పార్టీకి చెందిన వాడిగా పరిగణిస్తాం, అదే తుగ్లక్ పత్రిక చేతిలో ఉంటే మేధావి అని చెప్పవచ్చు’ అని అన్నారు. అదేవిధంగా ‘ఊరేగింపు సాగుతుండగా సీతారాముల చిత్రపటాలపై డీఎంకే కార్యకర్తలు చెప్పులు విసిరారు. దీనివల్లనే ఆ పార్టీ బాగా దెబ్బతింది. అప్పుడు అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి ఎంతో చెడ్డపేరు వచ్చింది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు డీఎంకే పార్టీ నేతల ఆగ్రహానికి గురిచేశాయి.
డీఎంకే కార్యకర్తలు, అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా రజనీ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తన ట్విట్టర్‌లో రజనీ పేరును ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. మురసొలి పత్రిక, డీఎంకే ఎంతగొప్పదో వివరిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ద్రవిడ కళగం ప్రధాన కార్యదర్శి కలిపూంగున్రన్, ద్రవిడర్ విడుదలై కళగ అధ్యక్షుడు ఎస్ వీరపాండియన్ సైతం స్పందించారు. 1971లో సేలంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహానికి పెరియార్ చెప్పుల దండ వేసి ఊరేగింపుగా వెళ్లిన సంఘటనను తుగ్లక్ సభలో రజనీకాంత్ ప్రస్తావించడంపై ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆనాటి సంఘటనను వ్యతిరేకిస్తూ మరే వార్తాపత్రిక ప్రచురించని సమయంలో తుగ్లప్ పత్రిక అధినేత చో రామస్వామి మాత్రమే ధైర్యంగా కవర్‌పేజీ కథనంగా రాసి ప్రజల్లోకి తీసుకెళ్లారని అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించేందుకు అందరికీ హక్కుంది, అయితే వార్తలను మార్చి చెప్పడం, మరో విధంగా చెప్పడానికి ఎవ్వరికీ హక్కులేదన్నారు. దురదృష్టవశాత్తు రజనీకాంత్ అదే చేస్తున్నారని విమర్శించారు.
1971 నాటి మహానాడుపై నిషేధం విధించాలని నల్ల జెండాలు ప్రదర్శిస్తూ జనసంఘం (నేటి బీజేపీ) పార్టీ నేతలు ఆందోళనలు సాగించినపుడు మహానాడుకు అనుమతి ఇచ్చింది కరుణానిదేనని గుర్తుచేశారు. నల్లజెండాలు ప్రదర్శించిన జన సంఘం నేతలు చెప్పు విసరగా ఆ చెప్పు సీతారాముల చిత్రపటాలపై పడిందని ఆయన అన్నారు. చెప్పులు విసిరిన వారి గురించి రజనీకాంత్ ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. చరిత్రపై అవగాహన లేకుండా ప్రసంగాలు చేస్తున్నారని వీరపాండియన్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment