రూబీ సిన్హా ప్రారంభించిన ‘షీ ఎట్ వర్క్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎంతోమంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు జ్ఞానకేంద్రంగా మారింది.‘అదిగో దారి’ అని దారి చూపే దిక్సూచి అయింది. ‘ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలు పెట్టారా? అయితే మీ దగ్గర ఉన్న శక్తిని బయటికి తీసుకురావల్సిన సమయం వచ్చింది. ఒక్కరిగా ప్రయాణం మొదలు పెట్టి వందలాదిమందికి స్ఫూర్తి ఇస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో మీరు ఒకరు ఎందుకు కాకూడదు!’ అంటూ ఔత్సాహిక వ్యాపారవేత్తలను ఉత్సాహపరిచే రూబీ సిన్హా తాజాగా బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఉమెన్ వర్టికల్ అధ్యక్షురాలిగా నియామకం అయింది...
దిల్లీకి చెందిన రూబీ సిన్హా జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ చేసిన తరువాత జర్నలిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టింది. మరోవైపు వారాంతాలలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసేది. ఏమాత్రం తీరిక దొరికినా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేది. షార్ట్ ఫిల్మ్స్ తీసేది.అడ్వర్‌టైజింగ్ దిగ్గజాలతో కలిసి పనిచేయడం ఆమెకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది.ఒక బిడ్డకు తల్లి అయిన రూబీ ఇంటికే పరిమితం కావల్సి వచ్చింది. కొంత కాలం తరువాత స్నేహితులలో ఒకరు ఇండిపెండెంట్ పీఆర్ కన్సల్టెంట్‌గా ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఈ సలహా రూబీకి బాగా నచ్చింది. అలా మొదలైన ప్రయాణమే తనను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది.
‘అనుభవమైతేగానీ తత్వం బోధపడదు’ అన్నట్లు రూబీ సిన్హా ఎంటర్‌ప్రెన్యూర్ అయిన తరువాతగానీ మహిళ వ్యాపారవేత్తలు ఎదుర్కొనే సమస్యలు అర్థం కాలేదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ‘కమ్యూన్ బ్రాండ్ సొల్యూషన్స్’ ద్వారా కమ్యూనికేషన్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గెలుపు జెండా ఎగరేసింది. అయితే తన విజయానికే పరిమితమై సంతృప్తి పడకుండా ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘షీ ఎట్ వర్క్’ ద్వారా ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించింది. ‘ప్రతి స్టార్టప్ ఐడియా సక్సెస్ కావాలని ఏమీ లేదు. కానీ ఎందుకు సక్సెస్ కాలేము అనే పట్టుదల ఉండే మాత్రం కచ్చితంగా సక్సెస్ అవుతాం. మన దేశంలో ఎంతో ప్రతిభ, సృజనాత్మకత ఉంది.
వోలా క్యాబ్స్ నుంచి ఫ్లిప్‌కార్ట్ వరకు ఎన్నెన్నో విజయాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి చాలు’... ఇలాంటి మాటలు ఎన్నో ‘షీ ఎట్ వర్క్’లో కనిపిస్తాయి. ‘ఒంటరి ప్రయాణం కష్టాలతో కూడుకున్నది. అయితే ఆ ప్రయాణం నీకు కొత్త శక్తి ఇస్తుంది’ అనే మాట రూబీకి చాలా ఇష్టం.తాను ఒంటరిగానే ప్రయాణం పెట్టింది.‘బడ్జెట్, క్యాష్ ఫ్లో మేనేజ్‌మెంట్ నుంచి ప్రతిభావంతులైన ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం వరకు ఎంటర్‌ప్రెన్యూర్ ముందు ఎన్నో సవాళ్లు ఉంటాయి. అయితే అవేమీ జటిలమైన సవాళ్లు కాదు. ప్రతి సవాలు ఒక పాఠం నేర్పుతుంది. అలా నేను ఎన్నో నేర్చుకున్నాను. ఎంటర్‌ప్రెన్యూర్ టీమ్ కెప్టెన్‌గానే కాదు టీమ్ మెంబర్‌గా కూడా వ్యవహరించాలి. టీమ్‌తో కలిసిపోయి వారికి ఉత్సాహాన్ని ఇవ్వాలి’ అంటుంది రూబీ.
నేర్చుకోవడానికి చిన్నా,పెద్దా తేడా అనేది ఉండదు.‘నేను ఒకరి దగ్గర నేర్చుకోవడం ఏమిటి’ అనే అహం అడ్డొస్తే అదే అడ్డుగోడగా మారుతుంది. అయితే రూబీకి అలాంటి అహాలు లేవు.‘ఈ తరానికి అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం, తెలివితేటలు, చురుకుదనం ఉన్నాయి. వారి నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటాను’ అంటుంది రూబీ.‘భవిషత్ దార్శనికత, వ్యూహ చతురత, అంకితభావం రూబీ సిన్హా బలాలు’ అంటున్నారు బ్రిక్స్ సీసీఐ డైరెక్టర్ జనరల్ మధుకర్.భౌగోళిక సరిహద్దులకు అతీతంగా స్త్రీ సాధికారతకు సంబంధించిన లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడానికి బ్రిక్స్ సీసీఐ, ఉమెన్ వర్టికల్ ఏర్పాటయింది. ఇప్పుడు ఈ విభాగానికి రూబీ సిన్హా రూపంలో అంతులేని బలం చేకూరింది.
Comments
Please login to add a commentAdd a comment