‘భవిష్యత్ అనేది రకరకాల వస్తువులతో కూడిన బాక్స్‌లాంటిది. మనం తీసినప్పుడు ఏ వస్తువు చేతికందుతుందో తెలియదు. కొన్నిసార్లు నిరాశపరిచే వస్తువు, కొన్నిసార్లు అత్యంత విలువైన వస్తువు చేతికి అందవచ్చు’... ఈ సినిమా డైలాగ్‌ను ప్రమోద్ గాడ్గే, షాహీద్ మెమన్‌లు విన్నారో లేదో తెలియదుగానీ ‘అన్‌బాక్స్’ రూపంలో వారికి బాక్స్ నుంచి విలువైన కానుక లభించింది. తమ భవిష్యత్‌నే మార్చేసిన స్టార్టప్ కానుక అది. లాజిస్టిక్ ఆటోమేషన్ స్టార్టప్ ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రమోద్, షాహీద్‌లు...
‘మన దేశంలో ఇ–కామర్స్ వేగం పెరిగింది’ అనే వార్త చదివి ‘ఓహో అలాగా!’ అనుకోవచ్చు. అద్భుతమైన ‘ఐడియా’ కూడా రావచ్చు. ఆ ఐడియా జీవితాన్నే మార్చేయవచ్చు. ప్రమోద్ గాడ్గే, షాహీద్ మెమన్‌ల విషయంలో జరిగింది ఇదే. మన దేశంలో ఇ–కామర్స్ స్పీడ్‌ను గమనించిన వీరు సప్లై చైన్ రోబోటిక్స్ స్టార్టప్ ‘అన్‌బాక్స్ రొబోటిక్స్’తో విజయపథంలో దూసుకుపోతున్నారు. ఇండియా దాటి యూఎస్, యూరప్ మార్కెట్‌లోకి కూడా అడుగు పెట్టనున్నారు.పుణే కేంద్రంగా మొదలైన ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’ సప్లై చైన్ ఆటోమేషన్ సోల్యూషన్స్‌లో మార్పు తీసుకువచ్చింది. వినూత్న ఏఐ–ఆధారిత కంట్రోల్ సిస్టమ్ ద్వారా రోబోట్‌ల ఉత్పాదకతను పెంచింది. పనితీరును మార్చింది.
‘మావన శక్తి నుంచి రోబోట్స్ వరకు ప్యాకేజీలను క్రమబద్ధీకరించడం, రవాణా చేయడం... మొదలైన విధానాలు మన దేశంలో ఇ–కామర్స్ వేగాన్ని అందుకోలేకపోతున్నాయేమో అనిపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొబైల్ రోబోటిక్స్ సిస్టమ్‌ను నిర్మించాలనుకున్నాం. లాజిస్టిక్స్, రిటైల్ ప్లేయర్‌ల కోసం ప్యాకేజీ సార్టింగ్, ఆర్డర్ కన్సాలిడేషన్ ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి శక్తిమంతమైన రోబోటిక్స్ వ్యవస్థను నిర్మించాలనుకున్నాం’ గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’ సీయివో ప్రమోద్ గాడ్గే.
‘అన్‌బాక్స్ రోబోటిక్స్’కు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో సార్టింగ్‌కు సంబంధించి ఆటోమేషన్ విభాగంలో, మన దేశంలోని తొలి రోబోట్–బేస్డ్ సార్టింగ్ ప్రాజెక్ట్‌లో పనిచేశాడు ప్రమోద్. ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’ కో–ఫౌండర్, సీటీవో షాహీద్ రోబోటిక్స్. ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, స్వోర్మ్ ఇంటెలిజెన్స్‌లో మంచి అనుభవం ఉంది. రోబోటిక్స్, ఆటోమేషన్ ఫీల్డ్స్‌లో సీటీవోగా పనిచేశాడు. ‘అన్‌బాక్స్’కు ముందు ‘వనోర రోబోట్స్’ అనే స్టార్టప్ ప్రారంభించాడు. చిత్తశుద్ధి, కష్టపడే తత్వం, అంకితభావం లేకపోతే పేపర్ మీద రాసుకున్న కాన్సెప్ట్ అక్కడే నిలిచిపోతుంది. అయితే ఈ ఇద్దరు మిత్రులు వారి బృందం బాగా కష్టపడి ‘అన్‌బాక్స్’ను సూపర్ హిట్ చేశారు.
స్టార్టప్ కాన్సెప్ట్‌లో సత్తా ఉంటే ఇన్వెస్టర్‌లు వెనకడుగు వేయరు.
‘అన్‌బాక్స్’ విషయంలోనూ అదే జరిగింది. టీమ్‌ను విస్తరించడానికి, అంతర్జాతీయ స్థాయిలో కస్టమర్‌ల డిమాండ్‌ను నెరవేర్చడానికి, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌పై సమీకరించిన నిధులను వాడారు. 2021లో థర్డ్–పార్టీ లాజిస్టిక్స్, ఇ–కామర్స్ ప్లేయర్స్‌తో కంపెనీ బీటా పైలట్స్ లాంచ్ చేసినప్పుడే లీడింగ్ ఇ- కామర్స్ లాజిస్టిక్స్ కంపెనీల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది. ఇది భవిష్యత్ విజయానికి సూచికలా పనిచేసింది. ఇన్వెస్టర్ట్‌లలో మరింత నమ్మకాన్ని నింపింది.
‘అన్‌బాక్స్’ స్టార్టప్ ఇ–కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్‌లాంటి సెక్టార్‌లలో ఏడు పెద్ద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. క్లయింట్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ ‘రోబోట్ యాజ్ ఏ సర్వీస్’ను కూడా కంపెనీ ప్రారంభించింది. ఇ–కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్ రంగాలకు సంబంధించి రోబోటిక్–బేస్డ్ పుల్‌ఫిల్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీలో ప్రత్యేకత సాధించిన ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’ అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుతుంది. స్టార్టప్ కాన్సెప్ట్‌లో సత్తా ఉంటే ఇన్వెస్టర్‌లు వెనకడుగు వేయరు. ‘అన్‌బాక్స్’ విషయంలోనూ అదే జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment