రాత్రిని పగలుగా మార్చేయండిలా.. | Satellites to Beam Sunlight Down to Earth at Night | Sakshi
Sakshi News home page

రాత్రిపూట వెలుగు ఆర్డర్‌ చేసుకోవచ్చు.. మీరు ఎక్కడంటే అక్కడ!

Published Sun, Sep 15 2024 7:22 PM | Last Updated on Sun, Sep 15 2024 7:58 PM

Satellites to Beam Sunlight Down to Earth at Night

అసాధ్యాలను సుసాధ్యం చేయడమే మనిషి పని. ఇప్పటికే అనేక అద్భుతాలను సృష్టించిన మానవుడు.. రాత్రి పూట కూడా వెలుతురును అందించడానికి కొత్త ప్రయోగాలను చేస్తున్నాడు. ఇదే జరిగితే.. రాత్రి పూట ఎక్కడ వెలుతురు కావాలన్నా ఇట్టే ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకోవానికి అదేమైనా ఫుడ్ అనుకున్నావా? అనే అనుమానం మీకు రావొచ్చు.. వినడానికి కొంత వింతగా కూడా అనిపించవచ్చు. కానీ వివరాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యాపోవడం తప్పకుండా మీ వంతు అవుతుంది. ఇక ఆలస్యమెందుకు ఈ కథనంలో చదివేయండి..

కాలిఫోర్నియాకు చెందిన 'రిఫ్లెక్ట్ ఆర్బిటాల్' (Reflect Orbital) అనే కంపెనీ సూర్యుడు అస్తమించిన తరువాత సూర్యరశ్మిని (కాంతిని) అందించడానికి ఓ కొత్త ప్రయోగం చేస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కంపెనీ సీఈఓ 'బెన్ నోవాక్' కొన్ని వివరాలను కూడా షేర్ చేసుకున్నారు.

బెన్ నోవాక్ ప్రకారం.. భూమి ఉపరితలం మీద భారీ సౌరఫలకాలను ఏర్పాటు చేసి కాంతి ఎక్కడ కావాలనుకుంటారో అక్కడకు మళ్లించడానికి కొత్త టెక్నాలజీలను తీసుకువస్తున్నారు. సమయంలో సంబంధం లేకుండా.. సూర్యరశ్మిని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన ప్లాన్‌ను కూడా బెన్ నోవాక్.. లండన్‌లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఫ్రమ్'లో వివరించారు.

ప్రస్తుతం ఎక్కువమంది సోలార్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. ఇది ఆనందించాల్సిన విషయమే. అయితే ఇక్కడ వచ్చిన ఓ సమస్య ఏమిటంటే కోరుకున్నప్పుడు సౌరశక్తి అందుబాటులో ఉండదు. సోలార్‌ ఫామ్‌లు రాత్రిపూట శక్తిని ఉత్పత్తి చేయలేక పోతున్నాయని వెల్లడించారు. కాబట్టి తమ ప్రాజెక్ట్ ద్వారా రాత్రి సమయంలో కూడా వెలుగును అందిస్తామని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం నోవాక్ బృందం 57 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులోని ప్రతి ఒక్కటీ 33 చదరపు అడుగుల అల్ట్రా రిఫ్లెక్టివ్‌తో అమర్చబడి ఉన్నాయి. ఇవన్నీ భూమి ఉపరితం నుంచి 370 మైళ్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతాయి. అత్యవసర సమయంలో.. భూమి ఉపరితలం మీద నిర్మించిన పవర్ ప్లాంట్‌లకు అదనంగా 30 నిమిషాల కాంతిని అందించగలవని పేర్కొన్నారు.

మొత్తం మీద ఒక్కమాటలో చెప్పాలంటే.. కక్ష్యలోని ఉపగ్రహాలు సూర్యుని నుంచి కాంతిని గ్రహించి,  భూమిపై అమర్చిన సోలార్ ఫలకాల మీద పడేలా చేస్తాయి. ఆ తరువాత కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే డైరెక్షన్ ఆధారంగా ఆపరేటర్లు ఎక్కడ లైటింగ్ కావాలో అక్కడ ప్రసరించేలా చేస్తారన్నమాట.

ఏడుగురు సభ్యులతో కూడిన నోవాన్ బృందం దీనిని అర్థం అయ్యేలా చెప్పడానికి ఒక ప్రయోగం చేశారు. హాట్ ఎయిర్ బెలూన్‌కు సుమారు ఎనిమిది అడుగుల మైలార్ మిర్రర్‌ జోడించారు. సౌర ఫలకాలపై సూర్యరశ్మిని పరావర్తనం చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో ఉపయోగించిన మైలార్ మిర్రర్స్ గాజుతో కాకుండా.. అల్యూమినియం ఫ్రేమ్‌పై విస్తరించిన పాలిస్టర్ ఫిల్మ్‌ను కలిగి ఉండటం చూడవచ్చు.

ఇదీ చదవండి: జాబిల్లిపై రోబో గోడలు!

ఈ వీడియోలో ఒక కంట్రోలర్ సాయంతో అక్కడే ఉన్న ట్రక్కు మీదికి కాంతిని ప్రసరింపజేయడం చూడవచ్చు. ప్రయోగంలో 800 అడుగులు దూరంలో హాట్ ఎయిర్ బెలూన్‌పై ఉన్న మైలార్ మిర్రర్.. కింద ఉన్న సోలార్ ప్యానెల్స్‌పై కాంతిని ప్రసరించేలా చేసింది. అన్నీ అనుకున్న విధంగా పూర్తయితే.. ఇది 2025 నాటికి అమలులోకి వస్తుంది. ఇప్పటికే దీనికోసం 30000 మంది అప్లై చేసుకున్నట్లు సమాచారం.

ఇదెలా పనిచేస్తుందంటే..
ఇప్పటికే అప్లై చేసుకున్నవారు.. రాత్రి పూట కాంతి అవసరమైన ప్రదేశంలో లైటింగ్ కావాలనుకున్నప్పుడు కంపెనీ లోకేషన్ ఆధారంగా కాంతిని ప్రసరింపజేస్తారు. అయితే ఈ కాంతి కొన్ని నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement