‘అటానమస్’ సాంకేతికతను వాడుకోవాలంటూ స్టార్టప్
కంపెనీలకు ఆహ్వానం నోటిఫికేషన్ జారీ చేసిన పరిశోధన విభాగం టిహాన్
ఇప్పటికే ఐఐటీ ప్రాంగణంలో డ్రైవర్ లెస్ వాహనాల వినియోగం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డ్రైవర్ అవసరం లేకుండా వాటంతట అవే వాహనాలు నడిచే సాంకేతికతను ఐఐటీ హైదరాబాద్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. ఈ డ్రైవర్ లెస్ (అటానమస్ నావిగేషన్ డేటా అక్విజిషన్ సిస్టం) టెక్నాలజీని వినియోగించుకునేందుకు స్టార్టప్ కంపెనీలు ముందుకు రావాలంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐఐటీ లోని ప్రత్యేక పరిశోధన విభాగం ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్)’ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది.
ఇప్పటికే ఈ సాంకేతికతతో కూడిన డ్రైవర్ లెస్ వాహనాలను ఐఐటీహెచ్‌లో వినియోగిస్తున్నారు. ఈ వాహనాలు ప్రధాన గేటు నుంచి వర్సిటీ లోని అన్నిచోట్లకు విద్యార్థులు, అధ్యాపకులను చేరవేస్తున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో టెస్లా వంటి డ్రైవర్ లెస్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ పౌరులు కూడా వాటిని వినియోగిస్తున్నారు. అయితే అక్కడి రోడ్లు, ప్రత్యేక ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ, ట్రాఫిక్ నిబంధనలు, ఇతర అంశాలకు మన దేశానికి బాగా తేడా ఉంటుంది.
ఈ క్రమంలో మన దేశంలో రోడ్లు, ట్రాఫిక్ వ్యవస్థ, పాదచారులకు అనుగుణంగా ‘అటానమస్’ వాహనాల సాంకేతికతను టిహాన్ అభివృద్ధి చేసింది. ఇందుకోసం ఆధునిక రాడార్లు, త్రీడీ టెక్నాలజీ, అల్గారిథమ్‌లను వినియోగించింది. వర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మెకానికల్, ఏరోస్పేస్, సివిల్, మేథమెటిక్స్, డిజైన్స్ వంటి వివిధ విభాగాల పరిశోధక విద్యార్థులు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment