
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ఏఐ చాట్‌బాట్ గ్రోక్ అభివృద్ధికి, దాని విశ్వసనీయతను పెంచడానికి ప్రతిభావంతులైన బ్యాకెండ్ ఇంజినీర్ల కోసం చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈమేరకు వివిధ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు, ఉద్యోగ పోస్టింగ్ వివరాలు ఓపెన్ఎఐ చాట్‌జీపీటీ, గూగుల్ జెమినితో పోటీపడటానికి మెరుగైన కృత్రిమ మేధను నిర్మించాలని ఎక్స్ చేస్తున్న ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది.
ఎక్స్ఏఐ సహ వ్యవస్థాపకుడు, టెక్ ఇంజినీర్ ఇగోర్ బాబుష్కిన్ ఇటీవల షేర్ చేసిన ఒక పోస్ట్‌లో ‘గ్రోక్ పనితీరును మెరుగ్గా, మరింత విశ్వసించేదిగా మార్చేందుకు సహాయపడటానికి అద్భుతమైన బ్యాకెండ్ ఇంజినీర్లు కావాలి’ అని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ఎక్స్ఏఐ ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తుందని చెప్పిన మస్క్..‘రాజకీయంగా సరైనదైనా.. కాకపోయినా నిజంపైనే దృష్టి సారించిన ఏకైక ప్రధాన ఏఐ కంపెనీ ఎక్స్ఏఐ. సత్యానికి కట్టుబడి ఉండటమే సురక్షితమైన కృత్రిమ మేధను నిర్మించడానికి ఏకైక మార్గం’ అన్నారు.
బ్యాకెండ్ ఇంజినీర్ ఏం చేస్తారు..?
కంపెనీ ఉత్పత్తి సేవల పనితీరును నిర్వహించాలి. ప్రొడక్ట్, రీసెర్చ్ టీమ్‌లు సృజనాత్మక ఏఐ ఉత్పత్తులు, మోడళ్లను తయారు చేసేందుకు సాంకేతికంగా వీలుకల్పించాలి. అధిక పనితీరు కలిగిన మైక్రోసర్వీసెస్ రూపొందించాలి. కోడింగ్, నిర్వహణ, ఉత్పత్తి, పరిశోధన బృందాలతో సహకరించాలి. బ్యాకెండ్ సమస్యలను పరిష్కరించాలి.
ఇదీ చదవండి: మెసేజ్ స్క్రోల్ చేస్తే జాబ్ పోయింది!
వేతనం ఎంతంటే..
ఈ ఇంటర్వ్యూ ప్రక్రియలో రెజ్యూమె సబ్మిట్ చేయడంతోపాటు 15 నిమిషాల ఫోన్ ఇంటర్వ్యూ, కోడింగ్ అసెస్‌మెంట్, సిస్టమ్స్ హ్యాండ్-ఆన్, ప్రాజెక్ట్ డీప్-డైవ్, టీమ్ మీట్ ఉంటుంది. తదుపరి టెక్నికల్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగానికి వార్షిక వేతన శ్రేణి 1,80,000 డాలర్లు (రూ.1.54 కోట్లు) నుంచి 4,40,000 డాలర్లు(రూ.3.77 కోట్లు) ఉంటుందని అంచనా. ఇది ఉద్యోగార్థుల నైపుణ్యాలను అనుసరించి మారే అవకాశం ఉంటుంది.