‘ఇదేమీ జీవితం’ అనే మాట సంప్రీత్ కౌర్ నోటి నుంచి ఎన్నోసార్లు వచ్చేది. నరకాన్ని తలపించే ప్రదేశంలో ఆమె బందీగా లేదు. ఎప్పటిలాగే, అదే ఇంట్లో అదే కుటుంబ సభ్యుల మధ్య ఉంది. ‘ఇదేమీ జీవితం నుంచి ఎందుకీ జీవితం’ వరకు కౌర్ ఆలోచనలు వెళుతున్న చీకటి కాలంలో ఆమె ముందు ఒక వెలుగు కిరణం పడింది. దాని పేరు... మక్రామీ!
స్కూల్ నుంచి కాలేజీ వరకు స్టార్ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకుంది హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన సంప్రీత్‌కౌర్. ప్రెగ్నెన్సీ సమయంలో తొమ్మిదేళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. ఎన్నో ప్రసిద్ధ సంస్థల్లో క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన కౌర్‌కు ఖాళీగా కూర్చోవడం అంటే ఇష్టం ఉండదు. కాని అనివార్య పరిస్థితులలో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. డెలివరీ తర్వాత కౌర్ ప్రసూతి వైరాగ్యానికి అంటే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కు గురైంది. తాను తనలాగా ఉండలేకపోయేది.ఏవేవో ప్రతికూల ఆలోచనలు. ఎప్పుడూ సందడిగా ఉండే కౌర్‌కు ఎవరితో మాట్లాడాలనిపించే కాదు. ‘మనసుంటే మార్గం ఉంటుంది’ అంటారు. అయితే ఆమె మనసు చీకట్లో కొట్టుమిట్టాడుతోంది. అయినప్పటికీ ఆ మనసు ఒక మార్గాన్ని వెలుతురుగా ఇచ్చింది... అదే మక్రామీ ఆర్ట్.
ఆ ఆర్ట్‌కు దగ్గరవుతున్నకొద్దీ తనలోని డిప్రెషన్ మూడ్స్ దూరంగా వెళ్లిపోయేవి. చివరికి అవి కనిపించకుండా పోయాయి. కౌర్ గతంలోలాగే చురుగ్గా ఉండడం మొదలుపెట్టింది.‘మక్రామీ’లో నేర్పు సాధించిన కౌర్ ఆ కళను గాలికి వదిలేయలేదు. తాను ఎంటర్‌ప్రెన్యూర్ కావడానికి దాన్ని ఒక దారిగా చేసుకుంది. ‘అబ్బాయి పుట్టిన తరువాత, తరచుగా డిప్రెసివ్ మూడ్స్ వచ్చేవి. నా కాలేజి చదువు కోసం తల్లిదండ్రులు ఎంతో ఖర్చు చేశారు. ఉద్యోగ జీవితాన్ని మిస్ అవుతున్నాననే బాధ ఉండేది. ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాను. ఇప్పుడు ఇలా ఖాళీగా ఉండడం ఏమిటీ అని ఆలోచించేదాన్ని. గుంపులో ఉన్నా ఒంటరిగానే ఫీలయ్యేదాన్ని. పిల్లాడితో ఆడుకుంటూ ఆనందించడం కంటే, పిల్లాడు ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూసేదాన్ని.
పిల్లాడు నిద్రపోగానే ఒంటరిగా కూర్చొని ఏవేవో ఆలోచించేదాన్ని. ‘పిల్లాడి మీద శ్రద్ధ పెట్టు. వృథాగా ఆలోచించకు’ అని అమ్మ మందలించేది. ఎప్పుడూ సరదాగా ఉండే నేను సీరియస్‌గా మారిపోవడం చూసి మా ఆయన అయోమయానికి గురయ్యేవారు. ఆయనకు ఏం అర్థమయ్యేది కాదు. ఒకరోజు యూట్యూబ్‌లో పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కు సంబంధించిన వీడియో చూశాను. తల్లి మూడ్‌స్వింగ్స్ పిల్లాడిపై ప్రభావం చూపుతాయనే విషయం విన్న తరువాత భయమేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నా సమస్యకు నేనే పరిష్కారాన్ని వెదుక్కున్నాను’ గతాన్ని గుర్తు చేసుకుంటుంది కౌర్.‘జస్ట్ ఏ హాబీ’గా పరిచయం అయిన మక్రామీ ఆర్ట్ కౌర్‌ను పూర్తిగా మార్చివేసింది. మునపటి చురుకుదనాన్ని, హాస్యచతురతను తెచ్చి ఇచ్చింది.
‘మక్రామీ ఆర్ట్ ద్వారా అర్థం లేని ఆలోచనకు అడ్డుకట్ట పడింది. మనసు చాలా తేలిక అయింది. కొన్ని ఫ్లవర్ పాట్ హోల్డర్స్‌ను తయారుచేసి వాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. ఒక ఫ్రెండ్ ఇది చూసి తనకు ఆరు పీస్‌లు కావాలని అడిగింది. ఆమె నా ఫస్ట్ కస్టమర్. నా హాబీ అనేది విజయవంతమైన వ్యాపారంగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడడం ఇష్టంలేని నాకు ఇది చాలా గర్వంగా అనిపించింది’ అంటుంది కౌర్. కౌర్ ఆర్ట్‌వర్క్‌కు ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. వారిలో ఒకరు... రెగ్యులర్ కస్టమర్ అయిన అర్చన.
‘కౌర్ ఆర్ట్‌వర్క్ అంటే నాకు ఎంతో ఇష్టం. అత్యంత కఠిన సమయంలో ఆర్ట్ ద్వారా ఎలా బయటపడిందో తెలుసుకున్నాక ఆమె మీద అభిమానం రెట్టింపు అయింది. గోరంత సమస్యనే కొండంత చేసుకొని బాధపడే వారికి కౌర్ గురించి చెబుతుంటాను. ఆమె ఆర్ట్ వర్క్‌లో క్వాలిటీ, చూడగానే ఆకట్టుకునే సృజన నాకు ఇష్టం’ అంటుంది అర్చన.బాలీవుడ్ నటి తాప్సీ పన్ను నుంచి కౌర్‌కు పెద్ద ఆర్డర్ వచ్చింది. విదేశాల నుంచి కూడా ఆర్డర్లు రావడం మొదలైంది.
దేశ, విదేశాల నుంచి ప్రతి నెల పదిహేను వందలకు పైగా ఆర్డర్లు వస్తున్నాయి. ‘నాలాగే సమస్యలు ఎదుర్కొంటున్న తల్లుల దగ్గరకు వెళ్లి నేను పడిన ఆందోళన, దానినుంచి బయటపడడానికి చేసిన కృషి గురించి చెప్పి మామూలు స్థితికి తీసుకువచ్చేదాన్ని. ఎంటర్‌ప్రెన్యూర్‌గా సాధించిన విజయం కంటే వారిలో మార్పు తీసుకువచ్చాననే సంతృప్తి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది’ అంటుంది సంప్రీత్ కౌర్.
Comments
Please login to add a commentAdd a comment