జీవామృతమే జీవనాధారం! | Life is the livelihood! agricultr female former konda usharani | Sakshi
Sakshi News home page

జీవామృతమే జీవనాధారం!

Published Tue, Feb 13 2018 12:09 AM | Last Updated on Tue, Feb 13 2018 11:32 AM

Life is the livelihood! agricultr female former konda usharani - Sakshi

భర్తను కోల్పోయిన యువతికి బతుకుబాట చూపిన ప్రకృతి వ్యవసాయం. జీవామృతాల ఉత్పత్తులతో దేశవిదేశీ ప్రముఖుల ప్రశంసలందుకుంటున్న యువ మహిళా రైతు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన మహిళా రైతు కొండా ఉషారాణి విజయగాథ ఇది.

‘‘పదోతరగతి పూర్తికాగానే పదిహేడేళ్ల వయసులో పెళ్లి పేరుతో అత్తింట కాలు మోపాను. మూడున్నరేళ్లలో ఇద్దరు బిడ్డలు కలిగారు. సాఫీగా సాగుతున్న నా జీవితంలో భర్త సుధాకర్‌రెడ్డి ఆకస్మిక మరణం నాకో పెద్ద షాక్‌. ఏం చేయాలో తెలీదు. చంటిపిల్లలు. అర ఎకరం భూమి తప్ప ఆస్తులు లేవు. చదువు పెద్దగా లేదు. బిడ్డల్ని ఎలా సాకాలో దిక్కుతోచేది కాదు. దుఃఖాన్ని దిగమింగుకుంటూనే మా అమ్మ సాయంతో సమీప గ్రామం కాజలో పొగాకు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిలో చేరాను. రోజూ 12 గంటల డ్యూటీ చేసినా నెలాఖరుకు చేతిలో పడేవి రూ.1500. అవి ఏమూలకూ వచ్చేవి కావు. ఇలా కాదని రూ.20 వేలు పెట్టుబడితో చీరలు తెచ్చి, ఇంట్లోనే అమ్మసాగాను. కొన్ని రోజులు ఫర్వాలేదు అనిపించింది. ఓ రోజు ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులతో పాటు చీరలూ ఎత్తుకుపోయారు. దీంతో మళ్లీ నా బతుకు ప్రశ్నార్ధకమైంది. ఉపాధి కోసం వెతుకులాట.

బయో ఎరువుల మార్కెటింగ్‌
నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి వ్యవసాయం పట్ల అవగాహన ఉంది. చుట్టు పక్కల రైతులు కొందరు సొంతంగా జీవామృతాలను తయారుచేసి వాడటం చూసేదాన్ని. బయో ఎరువుల కంపెనీ నుంచి అలాంటి మార్కెటింగ్‌ చేస్తే బాగుంటుందనిపించింది. ప్రయత్నించి చూద్దామని షాపుల వాళ్లను కలిసి, ఎరువుల శాంపిల్స్‌ తీసుకున్నాను. సంచిలో ఆ శాంపిల్స్‌ పెట్టుకొని ఆటోలో మంగళగిరి చుట్టుపక్కల 14 గ్రామాలు తిరుగుతూ మార్కెటింగ్‌ చేసేదాన్ని. సూర్యోదయంతో పాటే నా ప్రయాణం మొదలయ్యేది. ఉదయం 6.30 గంటలకు బయట కాలుపెడితే తిరిగొచ్చే సరికి చీకటి పడేది. చంటి బిడ్డల ఆలనా పాలనా చూడలేకపోతున్నాను అనే నిస్సహాయత గుండెను పిండేస్తుండేది. కానీ, ఈ పని మానుకొంటే నా పిల్లల నోటికి నాలుగు మెతుకులు అందించేదెలా? అమ్మానాన్నలు ఎన్నాళ్లని సాయం చేస్తారు? అందుకే నా నడక ఆగేది కాదు.

ఆశల సాగు
ఈ క్రమంలోనే 2007–08లో సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. నా జీవితానికో ఆలంబన దొరుకుతుందన్న ఆశ మొలకెత్తింది. కాకినాడ, గుంటూరు, తిరుపతిలో శిక్షణ తరగతులకు హాజర య్యాను. ప్రతి అంశాన్నీ నోట్స్‌ రాసుకుని సొంతంగా ప్రకృతి సేద్య ప్రయోగాలు ఆరంభించాను. జీవామృత తయారీకి ఆవు కావాలి. కొనాలంటే డబ్బు లేక కొన్ని గోశాలల నుంచి గో మూత్రం, పేడ సేకరించేదాన్ని. ఉమ్మెత్త, వేపాకు, రావి, జిల్లేడు.. వంటి ఆకులను సేకరించి వీటితో జీవామృత కషాయాల తయారీని మొదలుపెట్టాను.

వీటిని రైతులకు ఎలా అమ్మాలి.. నేను ఆచరణలో పెడితేనే నలుగురూ నమ్ముతారు.  అందుకే మా ఆయన మిగిల్చి వెళ్లిన అర ఎకరం పొలం, పుట్టింటి వాళ్లిచ్చిన 40 సెంట్ల పొలంలో దొండ పందిరి, మినుము వేశాను. తర్వాత మునగ, అంతర పంటగా మిర్చి సాగు చేశాను. నా కష్టాన్ని చూసి ఎగతాళి చేసినవారున్నారు. సాధ్యమయ్యే పనికాదని నిరుత్సాహపరిచిన వారున్నారు. కానీ, మా అమ్మ నాకు అండగా నిలిచింది. పంటలకు నేను తయారు చేసిన జీవామృత కషాయాలను వాడాను. దిగుబడులు బాగానే వచ్చాయి. పంట మార్పిడి కోసం కాలీఫ్లవర్‌ వేశాను.

ధరలు తగ్గిపోవడంతో నష్టం వచ్చింది. నాలుగేళ్లుగా మునగ, పసుపు, వరి పంటలు సాగు చేస్తున్నాను. తర్వాత 80 సెంట్లలో మినుము 4.5 క్వింటాళ్ల దిగుబడి రావడంతో అంతరపంటగా కూరఅరటి, చిక్కుళ్లు సాగు చేశాను. కిందటి సీజనులో 40 సెంట్లలో వేసిన మునగ నెలన్నర ముందుగానే దిగుబడినిచ్చింది. టన్నుకు పైగా మునగ కాయల దిగుబడి వచ్చింది.  మళ్లీ ఇప్పుడు మునగ, పసుపు, వరి పైర్లు సాగులో ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర రెండు ఆవులు ఉన్నాయి. వీటి మూత్రం, పేడ, ఆకులతో చేసిన జీవామృతం మా పొలం వరకు సరిపోతాయి. నేను సాగుచేస్తున్న విధానాలు చూసిన రైతులు ఘన, ద్రవ జీవామృతాన్ని తయారుచేసిమ్మన్నారు.

రైతుల ఆదరణతో కషాయాల ఉత్పత్తి
రెండేళ్ల క్రితం ఊరి బయట మా సొంత స్థలంలోనే శ్రీవాసవీ దుర్గా ప్రకృతి వ్యవసాయ కషాయాల ఉత్పత్తుల యూనిట్‌ను స్థాపించాను. ప్రభుత్వం ఎన్‌పీఎం యూనిట్‌ కింద రూ.40 వేలు సబ్సిడీ ఇచ్చారు. ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, దశపర్ణిక కషాయం, పంచగవ్య, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం సొంతంగా యూనిట్‌లో తయారీ చేస్తున్నాను. వీటికి కావల్సిన గోమూత్రం, పేడ గోశాలల నుంచి సేకరిస్తున్నాను. 2 కేజీల నుంచి 50 కేజీల వరకు వీటి ప్యాకింగ్‌ ఉంటుంది. వీటిని దాదాపు 150 మంది రైతుల వరకు కొనుగోలు చేసి ప్రకృతి సేద్యంలో వినియోగిస్తున్నారు.

ఇటీవల విజయవాడలో జరిగిన ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన స్టాల్‌కు మంచి ఆదరణ లభించింది. పూల నర్సరీల నిర్వాహకులు, మేడలపై ఇంటిపంటల సాగుదారులు, పల్నాడు రైతులు కూడా ఈ ఉత్పత్తులను కొని తీసుకెళుతున్నారు. ఒక్కోసారి డిమాండుకు సరిపడా సరఫరా చేయలేకపోయానే అనుకునే సందర్భాలూ ఉన్నాయి. ఇద్దరు పనివారిని పెట్టుకుని స్వయంగా ఈ పనులను చేస్తుంటాను. మా అమ్మ, పిల్లలూ ఈ పనిలో సాయం చేస్తుంటారు. ఖర్చునెలకు రూ.65 వేల వరకు వస్తుంది. అన్ని ఖర్చులు పోను నెలకు 15 నుంచి 20 వేల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది.

నిపుణుల ప్రశంసలు
ఈ విజయంతో ప్రకృతి వ్యవసాయ సలహాదారు విజయకుమార్, కెన్యాలోని వరల్డ్‌ ఆగ్రో ఫారెస్ట్రీకి చెందిన నిపుణులు సహా పలువురు విదేశీ ప్రతినిధులు, ప్రముఖులు మా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల యూనిట్‌ను సందర్శించి, అభినందించారు. ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటునందిస్తే 500 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయించాలని, సమీప ఊళ్లలో ఆదర్శ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పాలనేది నా ఆశయం’’ అంటూ తన విజయగాథను వివరించారు ఉషారాణి. ఆమె (94948 49622) కల నెరవేరాలని ఆశిద్దాం.

 ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటునందిస్తే 500 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయించాలని, సమీప ఊళ్లలో ఆదర్శ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పాలనేది నా ఆశయం

– బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement