subash palekar
-
20 ఎకరాల్లో ప్రకృతి సేద్యం.. 200కు పైగా కుటుంబాలకు నేరుగా విక్రయిస్తూ..
ఇటు రైతు ఆదాయ భద్రతకు, అటు వినియోగదారుల ఆరోగ్య భద్రతకు దేశీ వంగడాలతో ప్రకృతి సేద్యమే ఆశాదీపమని చాటిచెబుతున్నారు యువ రైతు యనమల జగదీష్‌రెడ్డి. దేశంలో ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి ముఖ్య కారకుడైన సుభాష్ పాలేకర్ బాటలో పయనిస్తున్నారు. రసాయనిక అవశేషాల్లేని అమృతాహార ఉత్పత్తులను హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలోని 200కు పైగా కుటుంబాలకు నేరుగా విక్రయిస్తూ ‘ఫ్యామిలీ ఫార్మర్’గా గుర్తింపు పొందారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం దండువారిపల్లెకు చెందిన జగదీష్‌రెడ్డి వ్యవసాయ కుటుంబంలో పుట్టి పాలిటెక్నిక్ కోర్సును మధ్యలో ఆపేసి వ్యవసాయం బాట పట్టారు. 20 ఎకరాల పొలంలో తొలుత అందరి మాదిరిగానే రసాయనిక వ్యవసాయం చేశారు. ఆశించిన ఫలితం లేక పోగా రసాయనాల వాడకం వల్ల పర్యావరణంతో పాటు ప్రజారోగ్యానికి హాని కలుగుతోందని పాలేకర్ ద్వారా తెలుసుకొని ప్రకృతి సేద్యం చేపట్టారు. వ్యవసాయ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఐసీఏఆర్ అనుబంధ సంస్థ అయిన భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.ఎ.ఆర్.ఐ.) నుంచి మూడేళ్ల వ్యవధిలో రెండు అవార్డులను సొంతం చేసుకున్నారు. 2019లో ఐ.ఎ.ఆర్.ఐ. ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డును అందుకున్నారు. ‘ఐ.ఎ.ఆర్.ఐ. ఫెలో అవార్డు’ను గత నెల 11న పూసాలో జరిగిన కృషి విజ్ఞాన్ మేళాలో అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జగదీష్‌రెడ్డిని అభినందించటం విశేషం. 2012లో తిరుపతి నగరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై పాలేకర్ 5 రోజుల శిక్షణా తరగతుల్లో జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. రసాయనిక వ్యవసాయం రైతులకు ఎన్ని విధాలా నష్టదాయకంగా పరిణమించిందో శాస్త్రీయంగా వివరిస్తూ పాలేకర్ ఇచ్చిన సందేశం ఆయనను ఆకట్టుకుంది. ఆ విధంగా పాలేకర్ స్పూర్తితో జగదీష్‌రెడ్డి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఏడేళ్లుగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రకరకాల పంటలు సాగు చేస్తున్నారు. ఎంత ఆరోగ్యదాయక పోషకాలను పండిస్తున్నాం? జగదీష్‌రెడ్డి 13 ఎకరాల్లో మామిడి, 5 రకాల దేశీ వరి, కొద్ది విస్తీర్ణంలో చెరకు, వేరుశనగ, చిరుధాన్యాలు తదితర పంటలు పండిస్తున్నారు. దేశీ వరి రకాల దిగుబడి తక్కువైనప్పటికీ ఆరోగ్య రక్షక పోషకాల గనులైనందున ప్రజలు ఆదరిస్తున్నారని, దిగుబడి ఎంతని కాకుండా ఎంత ఆరోగ్యదాయక పోషకాలను పండిస్తున్నామన్నది అందరూ గ్రహించాలని ఆయన అంటారు. పంటలకు ముందు జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేసి కలియదున్నుతారు. దేశీయ ఆవు పేడ, మూత్రం తదితరాలతో ఘనజీవామృతం, జీవామృతం, బీజామృతం, ఆచ్ఛాదన వంటి ప్రకృతి వ్యవసాయ మౌలిక సూత్రాలను పాటిస్తున్నారు. మామిడి తోటలో చెట్ల మధ్య దుక్కి చేయకుండా సాగు చేస్తుండటం విశేషం. నవార, ఇంద్రాణి, కుజిపటాలియా తదితర దేశీ రకాల ధాన్యాన్ని మర పట్టించి ముడి బియ్యంతోపాటు.. ఈ బియ్యంతోపాటు ఔషధ, సుగంధ ద్రవ్యాలను జోడించి పోషక పొడుల (బూస్టర్ పౌడర్స్)ను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ పొడులతో హెల్త్ డ్రింక్స్ తయారు చేసుకొని తాగుతున్న వారు జీవనశైలి వ్యాధులను జయించడంతో పాటు మందులు వాడాల్సిన అవసరం తగ్గిపోతున్నదని ఆయన తెలిపారు. చెరకుతో బెల్లం తయారు చేసుకుంటారు. చిరుధాన్యాలతో మురుకులు, వేరుశనగలతో బెల్లం ఉండలు, పల్లికారం పొడులతోపాటు గానుగ నూనెలను సైతం ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తాను పండించిన పంటలతో తయారు చేసిన 20 రకాల ఉత్పత్తులను ప్రజలకు నేరుగా విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ప్రాణహిత పేరుతో కంపెనీని ఏర్పాటు చేశానని, అమెజాన్ ద్వారా కూడా ఉత్పత్తులను విక్రయిస్తానన్నారు. ‘పంటల సాగు కోసం రసాయన ఎరువులు, పురుగుల మందులను విచ్చల విడిగా వినియోగిస్తూ భూమిని కలుషితం చేయడం తగదు. రసాయనాల మూలంగా సాగు భూమి సహజత్వాన్ని, జీవాన్ని కోల్పోతోంది. పంటలు సాగు చేసుకుని జీవిస్తూనే.. భూమి సహజత్వాన్ని, సారవంతమైన భూమిని యథాతథంగా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది..’ అంటున్నారు జగదీష్‌రెడ్డి. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ఆవశ్యకత, సాగు పద్ధతులు, దళారులు లేని డైరెక్ట్ మార్కెటింగ్ మెళకువల గురించి వాట్సప్, ఫేస్బుక్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. పాలేకర్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యంతో ఆరోగ్యకరమైన పంటలను సాగు చేస్తున్నారని జగదీష్‌రెడ్డి అన్నారు. ప్రకృతి సేద్యంపై సలహాల కోసం తనకు ఫోన్ చేయవచ్చన్నారు. – బాబన్నగారి శివశంకర్, సాక్షి, బంగారుపాళెం, చిత్తూరు జిల్లా ‘ఫ్యామిలీ ఫార్మర్’ అవసరాన్ని గుర్తెరగాలి ప్రకృతి ఆహారానికి రోజురోజుకూ విలువ పెరుగుతోంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు నికరాదాయాన్ని పెంచుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాక, రైతు కుటుంబం – సమాజం ఆరోగ్యదాయకంగా మనుగడ సాగించడానికి, భూమి – పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నది. పోషకాల గనులైన దేశీ వంగడాలతో ప్రకృతి వ్యవసాయం చేయటం ముఖ్యం. తదుపరి తరం ఆరోగ్యంగా ఉండే ఆహారం ప్రాధాన్యాన్ని సమాజంలో అందరూ గ్రహించాలి. ఫ్యామిలీ ఫార్మర్ అవసరాన్ని గుర్తెరగాలి. అప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అవసరం రాకుండా ఉంటుంది. ఆరుగాలం కష్టించి పనిచేసి ప్రకృతి వ్యవసాయం చేసే రైతుతో ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఒక్కరూ నెలకు కనీసం 5 నిమిషాలు మాట్లాడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. – యనమల జగదీష్‌రెడ్డి (94400 44279), ఐఎఆర్ఐ ఇన్నోవేటివ్ ఫార్మర్, ఫెలో అవార్డుల గ్రహీత, దండువారిపల్లె, బంగారుపాళెం మండలం, చిత్తూరు జిల్లా -
పాలేకర్ ప్రకృతి సేద్యంపై అధ్యయన కమిటీ
సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ (ఎస్.పి.ఎన్.ఎఫ్.) పద్ధతి(దీన్ని మొదట్లో ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే వారు) ని అనుసరించడం వల్ల ఒనగూడుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సవాళ్లపై సమగ్ర అధ్యయనానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. గత కొన్ని సంవత్సరాల నుంచి పాలేకర్ నేర్పిన పద్ధతిలో అనేక రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సంగతి తెలిసిందే. 12 మంది వ్యవసాయ నిపుణులతో కూడిన జాతీయ స్థాయి కమిటీని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్.) అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డా. ఎస్. భాస్కర్ ఇటీవల నియమించారు. 12 మంది వ్యవసాయ నిపుణులతో కూడిన ఈ కమిటీకి ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. వి. ప్రవీణ్‌రావు సారధ్యంవహిస్తారు. ఈ ఉన్నత స్థాయి జాతీయ కమిటీలో ఐ.సి.ఎ.ఆర్. డీడీజీ డా. ఎస్. భాస్కర్‌తోపాటు మోదీపురంలోని భారతీయ వ్యవసాయ వ్యవస్థల పరిశోధనా సంస్థ సంచాలకులు డా. ఎ. ఎస్. పన్వర్, జాతీయ సేంద్రియ వ్యవసాయ పరిశోధనా స్థానం సిక్కిం సంయుక్త సంచాలకులు డా. ఆర్. కె. అవస్థె, కోయంబత్తూర్‌లోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం సుస్థిర సేంద్రియ వ్యవసాయ విభాగం అధిపతి ప్రొ. ఇ. సోమసుందరం, ఉదయ్‌పూర్‌లోని ఎం.పి.ఎ.ఎ.టి. సేంద్రియ పరిశోధనా కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ డా. ఎస్.కె. శర్మ, పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లుధియానా సేంద్రియ వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ డా. సి.ఎస్. యూలఖ్, అపెడా (ఘజియాబాద్) మాజీ సంచాలకుడు డా. ఎ. కె. యాదవ్, కేంద్ర వ్యవసాయ– సహకార– రైతుల సంక్షేమ శాఖ సంయుక్త కారదర్శి, నీతి ఆయోగ్ వ్యవసాయ సలహాదారు సభ్యులుగా ఉంటారు. భారతీయ సాగు వ్యవస్థల పరిశోధనా సంస్థ (మోదిపురం) ముఖ్య శాస్త్రవేత్త డా. ఎన్. రవిశంకర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఇదీ కమిటీ అధ్యయన పరిధి.. 1 ఎస్.పి.ఎన్.ఎఫ్. (ఇంతకుముందు జడ్.బి.ఎన్.ఎఫ్. అనేవారు)పై వివిధ రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో, భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ అనుబంధ సంస్థల్లో, సేంద్రియ వ్యవసాయంపై అఖిలభారత నెట్వర్క్ ప్రోగ్రాంలో భాగంగా నిర్వహించిన పరిశోధనా ఫలితాలను ఈ కమిటీ సమీక్షిస్తుంది. ఎస్.పి.ఎన్.ఎఫ్.పై భవిష్యత్తులో నిర్వహించే పరిశోధన వ్యూహాలలో చేర్చదగిన అంశాలపై సిఫారసులు చేస్తుంది. 2 సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్ (ఎస్.పి.ఎన్.ఎఫ్.) సాగు పద్ధతి బలాలు, బలహీనతలపై కమిటీ అధ్యయనం చేస్తుంది. వ్యవసాయ పరిశోధనా క్షేత్రాలు, రైతుల వ్యవసాయ క్షేత్రాలలో ఫలితాలను అంచనా వేసేటప్పుడు అనుసరించాల్సిన పద్ధతులను సూచిస్తుంది. 3 ఎస్.పి.ఎన్.ఎఫ్.ను దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తిలోకి తెస్తే భారత దేశంలో భూమి ఆరోగ్యం, ఉత్పాదకత, ఆహార ఉత్పత్తి, జీవనభృతులు, వ్యవసాయ రంగ సుస్థిరత తదితర అంశాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నదీ నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుంది. 4 శాస్త్రీయ సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో ఎస్.పి.ఎన్.ఎఫ్. పద్ధతులను సమ్మిళితం చేయడానికి కమిటీ తగిన సూచనలు చేస్తుంది. ఈ కమిటీకి కాలపరిమితి లేదు. -
31న ప్రకృతి వ్యవసాయంపై వేకనూరులో రైతు సదస్సు
సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అతి తక్కువ విత్తనంతో, అతి తక్కువ నీటితో దేశీ వరి రకాలను కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలోని వేకనూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయదారుడు మాదివాడ సురేంద్ర సాగు చేస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 31(ఆదివారం)న దేశీ వరి ప్రకృతి సాగుపై రైతులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. సేవ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, దేశీ వరి వంగడాల రైతు విజయరామ్ శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు ఉచిత శిక్షణతోపాటు భోజన వసతి కల్పిస్తున్నామని సురేంద్ర (88862 31122) తెలిపారు. విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసి తిరిగి స్వస్థలానికి చేరుకొని ప్రకృతి సేద్యం చేపట్టిన సురేంద్ర.. నారాయణ కామిని, కుళ్లాకర్, పరిమళసన్న, కాలాభట్ దేశీ వరి రకాలను ఈ ఏడాది సాగు చేశారు. -
ఫ్యామిలీ ఫార్మర్!
ఏడేళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ ఇచ్చిన శిక్షణ యువ రైతు జగదీశ్ రెడ్డి జీవితాన్ని మార్చేసింది. అంతకుముందు పదిహేనేళ్లుగా రసాయనిక వ్యవసాయం చేస్తున్న ఆయనకు అప్పటి వరకు తాను చేస్తున్న తప్పులేమిటో అర్థమయ్యాయి. రైతుగా తాను చేయాల్సిందేమిటో బోధపడింది. ఇక వెనక్కి చూడలేదు. 25 ఎకరాల పొలంలో వరి, మామిడి, వేరుశనగ, మినుము, కంది, కొర్రల వంటి పంటలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్నారు. దేశంలోని అనేక నగరాల్లో నివాసం ఉంటున్న కనీసం 50 కుటుంబాలకు ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని నేరుగా అందిస్తున్నారు. ఏటా రూ.7–8 లక్షల నికరాదాయం గడిస్తున్నారు. మరో 50 మంది సేంద్రియ రైతులతో కలిసి పనిచేస్తున్నారు. ప్రతి కుటుంబానికీ విధిగా ఉండాల్సింది వ్యాధులను నయం చేసే ‘ఫ్యామిలీ డాక్టర్’ కాదు.. జబ్బుల పాలు చేయని అమృతాహారాన్నందించే ‘ఫ్యామిలీ ఫార్మర్’ కావాలంటున్న జగదీశ్‌రెడ్డి నిజమైన ఫ్యామిలీ ఫార్మర్. న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.ఎ.ఆర్.ఐ.) ఆయనకు ఇటీవల ‘ఇన్నోవేటివ్ ఫార్మర్’ అవార్డును ప్రదానం చేసిన సందర్భంగా ప్రత్యేక కథనం.. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వై. జగదీశ్ రెడ్డి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేయకుండానే పాతికేళ్ల క్రితం వ్యవసాయం చేపట్టారు. చిత్తూరుజిల్లా బంగారుపాళ్యం మండలం దండువారిపల్లె ఆయన స్వగ్రామం. గ్రామానికి దగ్గరగా కొంత, పది కిలోమీటర్ల దూరంలో కొండ కోనల్లో అడవికి దగ్గరగా మొగిలి గ్రామంలో మరికొంత పొలం ఉంది. మొత్తం పాతిక ఎకరాలు. వ్యవసాయ బావుల ఆధారంగా వ్యవసాయం చేస్తున్నారు. అడవికి దగ్గరగా ఉన్న పొలంలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. పదిహేనేళ్లు రసాయనిక ఎరువులు, పురుగుమందులతో వ్యయప్రయాసలకోర్చి వ్యవసాయం చేసి విసిగిపోయిన దశలో 2011లో పాలేకర్ శిక్షణా శిబిరంలో పాల్గొన్నాడు. ఆ శిక్షణ జగదీశ్ రెడ్డి జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. నేలతల్లితో, మొత్తం ప్రకృతితో తెగిపోయిన సంబంధం తిరిగి అనుసంధానమైన భావన మదిలో నిండింది. సొంత దేశీ ఆవుల పేడ, మూత్రం తదితరాలతో ఘనజీవామృతం, బీజామృతం, జీవామృతం, దశపత్రకషాయం.. వంటి ఉత్పాదకాలనే వాడుతున్నారు. బొత్తిగా రసాయనాలు వాడకుండా 15 ఎకరాల్లో (7.5 ఎకరాల్లో లేత తోట, 7.5 ఎకరాల్లో ముదురు తోట)మామిడి, ఆరెకరాల్లో వేరుశనగ, ఎకరంలో చెరకు, ఎకరంలో కొర్రలు, 3 ఎకరాల్లో వరి ప్రధాన పంటలుగా పండిస్తున్నారు. వీటిలో అనేక అంతరపంటలు వేస్తున్నారు. శ్రమ పెరిగానా ఖర్చు తగ్గిపోయింది. నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. అటవీ జంతువుల దాడులు, కూలీల సమస్య వంటి అనేక సమస్యలతో సతమతమవుతూనే ప్రకృతి వ్యవసాయంలో మాధుర్యాన్ని చవిచూస్తున్నారాయన. తొలుత దిగుబడులు తక్కువగా వచ్చినా క్రమంగా సంతృప్తికరమైన దశకు పెరిగాయి. భూమిలో వానపాములు, సూక్ష్మజీవులకు పెద్ద పీట వేసే వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ ప్రకృతితో మమేకం కావడం.. రసాయనిక అవశేషాల్లేని నాణ్యమైన, పోషకాలతో కూడిన ఆ ఆహారాన్ని తిన్న వారిలో ఆరోగ్యం మెరుగవ్వడంతో జగదీశ్‌రెడ్డికి ప్రకృతి రైతుగా తన బాధ్యత ఎంత సమున్నతమైనదో ఎరుకలోకి వచ్చింది. మారుమూల గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటికీ.. వివిధ రాష్ట్రాల్లో జరిగే సమావేశాలు, సదస్సుల్లో పాల్గొంటూ తరచూ వ్యవసాయదారులను, పౌష్టికాహార నిపుణులను, వైద్యులను కలుసుకుంటూ అనుభవాలను కలబోసుకోవడం జగదీశ్ రెడ్డికి ఇష్టమైన పని. ఆ పరిచయాలతో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లోని కుటుంబాలకు తాను పండించే నాణ్యమైన పోషక విలువలతో కూడిన రసాయన రహిత ఆహారోత్పత్తులను నేరుగా విక్రయించడం ప్రారంభించారు. ఇందుకోసం వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. రైతులకు తన అనుభవాలను పంచడం కూడా ఇందులో ఒక ముఖ్య విషయం. ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి ఆహారోత్పత్తుల ఆవశ్యకత గురించి రైతులకు తెలియజెప్పి.. సలహాలు సంప్రదింపుల ద్వారా ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేయడం ఆయనకు ఇష్టమైన వ్యాపకం. తన పొలంలో పండించిన ప్రకృతి వ్యవసాయోత్పత్తులను నగరవాసులకు విక్రయించడంతోపాటు.. మరో 50 మంది ప్రకృతి వ్యవసాయ దారుల నుంచి సేకరించిన ఉత్పత్తులను సైతం వివిధ నగరాల్లో వినియోగదారులకు నేరుగా విక్రయించేందుకు అనుసంధానకర్తగా జగదీశ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రావాలంటే ధాన్యాలను నేరుగా కాకుండా శుద్ధిచేసి ఆహారోత్పత్తులుగా మార్చి అమ్ముకోవడం రైతులు నేర్చుకోవాలని ఆయన అంటుంటారు. బియ్యం, వేరుశనగలను ఎద్దు కట్టె గానుగ నూనెగా మార్చి అమ్ముకోవడం అవసరం అంటారు జగదీశ్ రెడ్డి. శుద్ధమైన గానుగ నూనె తీసిన తర్వాత వారం రోజులు ఎండలో ఉంచితే మరింత ఆరోగ్యదాయకంగా మారుతుందని, ఈ పద్ధతిలోనే తాను వేరుశనగ సంప్రదాయ గానుగ నూనెను ఉత్పత్తి చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం మామిడి వాతావరణం అనుకూలించిందని, పూత కాలంలో వర్షం పడకపోవడం వల్ల కాపు బాగుందని ఆయన తెలిపారు. ఏనుగుల దాడి వల్ల రబీలో ఈ ఏడాది వరి సాగు చేయడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు దెబ్బతినాల్సి వస్తున్నాదన్నారు. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం తప్ప వేరే దారి కనపడటం లేదన్నారు. ప్రకృతి రైతుగా ఏడాదికి రూ. 7–8 లక్షల నికరాదాయం పొందుతూ, అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆత్మసంతృప్తితో జీవనం గడుపుతున్నానంటారు జగదీశ్‌రెడ్డి. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి విద్యార్థులు, రైతులు, సందర్శకులు తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తుండడం.. తన అనుభవాలను శాస్త్రవేత్తలు సైతం ఆసక్తిగా గమనించడం.. అవార్డులు, పురస్కారాల కన్నా ఎంతో సంతృప్తినిస్తున్నదని ఆయన అంటారు. తరచూ పొలానికి వచ్చే ఏడేళ్ల తన కుమారుడు పార్థురెడ్డిని ప్రకృతి వ్యవసాయదారుడిగా చూడాలన్నదే తన ఆశ అంటారాయన! నేషనల్ న్యూట్రిషన్ అవార్డు (2016–న్యూఢిల్లీ), గ్లోబల్ అవుట్ రీచ్ హెల్త్ కేర్ అవార్డు (2017–జైపూర్), ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు (2019–ఐ.ఎ.ఆర్.ఐ.)లను జగదీశ్వరరెడ్డి అందుకున్నారు. ప్రతి కుటుంబానికీ ఫార్మర్ ఉండాలి! సమాజంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ కన్నా ముఖ్యంగా ఫ్యామిలీ ఫార్మర్ ఉండాలి. ప్రభుత్వం వైద్యం కోసం, ఆసుపత్రుల కోసం ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ప్రజలకు లభించేది ‘మెడికల్ కేర్’ మాత్రమే. అసలైన ‘హెల్త్ కేర్’ అందించగలిగిన వారు ప్రకృతి వ్యవసాయదారులు మాత్రమే. జబ్బు వచ్చాక బాగు చేసుకునే ప్రయత్నం చేయడం కన్నా జబ్బు రాకుండా ఉండే ఆహారాన్ని పండించి అందించడం ముఖ్యం. ప్రకృతి వ్యవసాయంలో నేల లోపలి పొరల నుంచి వానపాములు, సూక్ష్మజీవుల నుంచి సకల పోషకాలను తీసుకొని ప్రకృతి వ్యవసాయంలో పంటలు నిజమైన పోషకాలతో కూడిన గింజలు, కాయలు, పండ్లను మనకు అందిస్తున్నాయి. ఇటువంటి ఆహారాన్నందించే ఫ్యామిలీ ఫార్మరే ప్రతి కుటుంబానికీ కావాలిప్పుడు. – వై. జగదీశ్‌రెడ్డి(94400 44279), ప్రకృతి వ్యవసాయదారుడు, దండువారిపల్లె, బంగారుపాళ్యం మండలం, చిత్తూరు జిల్లా వేరుశనగ పంట చెరకు తోటలో జగదీశ్ రెడ్డి ఇన్పుట్స్: పద్మనాభరెడ్డి, సాక్షి, యాదమరి ఫొటోలు: శివశంకర్, సాక్షి, బంగారుపాళ్యం -
20–22 తేదీల్లో మహారాష్ట్రలో పాలేకర్ క్షేత్ర సందర్శన
మహారాష్ట్రలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగువుతున్న ఉత్తమ పత్తి, పసుపు, మునగ, మిరప, పూలు, బత్తాయి తోటల సందర్శన కార్యక్రమం ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు జరగనుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ స్వయంగా హిందీ/ఇంగ్లిష్‌ల ఈ క్షేత్రాల ఉత్పాదకత గురించి రైతులకు వివరిస్తారు. నాగపూర్ నుంచి 20న ఉ. 8.30 గంటలకు ప్రారంభవమయ్యే యాత్ర వివిధ జిల్లాల్లో 3 రోజులు కొనసాగుతుంది. పాల్గొనదలచిన వారు భోజన, వసతి, రవాణా ఖర్చుల నిమిత్తం రూ. 1,200 చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు.. మనోజ్ జానియల్– 98225 15913, సచిన్ జడె–88050 09737 -
జీవామృతమే జీవనాధారం!
భర్తను కోల్పోయిన యువతికి బతుకుబాట చూపిన ప్రకృతి వ్యవసాయం. జీవామృతాల ఉత్పత్తులతో దేశవిదేశీ ప్రముఖుల ప్రశంసలందుకుంటున్న యువ మహిళా రైతు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన మహిళా రైతు కొండా ఉషారాణి విజయగాథ ఇది. ‘‘పదోతరగతి పూర్తికాగానే పదిహేడేళ్ల వయసులో పెళ్లి పేరుతో అత్తింట కాలు మోపాను. మూడున్నరేళ్లలో ఇద్దరు బిడ్డలు కలిగారు. సాఫీగా సాగుతున్న నా జీవితంలో భర్త సుధాకర్‌రెడ్డి ఆకస్మిక మరణం నాకో పెద్ద షాక్. ఏం చేయాలో తెలీదు. చంటిపిల్లలు. అర ఎకరం భూమి తప్ప ఆస్తులు లేవు. చదువు పెద్దగా లేదు. బిడ్డల్ని ఎలా సాకాలో దిక్కుతోచేది కాదు. దుఃఖాన్ని దిగమింగుకుంటూనే మా అమ్మ సాయంతో సమీప గ్రామం కాజలో పొగాకు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిలో చేరాను. రోజూ 12 గంటల డ్యూటీ చేసినా నెలాఖరుకు చేతిలో పడేవి రూ.1500. అవి ఏమూలకూ వచ్చేవి కావు. ఇలా కాదని రూ.20 వేలు పెట్టుబడితో చీరలు తెచ్చి, ఇంట్లోనే అమ్మసాగాను. కొన్ని రోజులు ఫర్వాలేదు అనిపించింది. ఓ రోజు ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులతో పాటు చీరలూ ఎత్తుకుపోయారు. దీంతో మళ్లీ నా బతుకు ప్రశ్నార్ధకమైంది. ఉపాధి కోసం వెతుకులాట. బయో ఎరువుల మార్కెటింగ్ నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి వ్యవసాయం పట్ల అవగాహన ఉంది. చుట్టు పక్కల రైతులు కొందరు సొంతంగా జీవామృతాలను తయారుచేసి వాడటం చూసేదాన్ని. బయో ఎరువుల కంపెనీ నుంచి అలాంటి మార్కెటింగ్ చేస్తే బాగుంటుందనిపించింది. ప్రయత్నించి చూద్దామని షాపుల వాళ్లను కలిసి, ఎరువుల శాంపిల్స్ తీసుకున్నాను. సంచిలో ఆ శాంపిల్స్ పెట్టుకొని ఆటోలో మంగళగిరి చుట్టుపక్కల 14 గ్రామాలు తిరుగుతూ మార్కెటింగ్ చేసేదాన్ని. సూర్యోదయంతో పాటే నా ప్రయాణం మొదలయ్యేది. ఉదయం 6.30 గంటలకు బయట కాలుపెడితే తిరిగొచ్చే సరికి చీకటి పడేది. చంటి బిడ్డల ఆలనా పాలనా చూడలేకపోతున్నాను అనే నిస్సహాయత గుండెను పిండేస్తుండేది. కానీ, ఈ పని మానుకొంటే నా పిల్లల నోటికి నాలుగు మెతుకులు అందించేదెలా? అమ్మానాన్నలు ఎన్నాళ్లని సాయం చేస్తారు? అందుకే నా నడక ఆగేది కాదు. ఆశల సాగు ఈ క్రమంలోనే 2007–08లో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. నా జీవితానికో ఆలంబన దొరుకుతుందన్న ఆశ మొలకెత్తింది. కాకినాడ, గుంటూరు, తిరుపతిలో శిక్షణ తరగతులకు హాజర య్యాను. ప్రతి అంశాన్నీ నోట్స్ రాసుకుని సొంతంగా ప్రకృతి సేద్య ప్రయోగాలు ఆరంభించాను. జీవామృత తయారీకి ఆవు కావాలి. కొనాలంటే డబ్బు లేక కొన్ని గోశాలల నుంచి గో మూత్రం, పేడ సేకరించేదాన్ని. ఉమ్మెత్త, వేపాకు, రావి, జిల్లేడు.. వంటి ఆకులను సేకరించి వీటితో జీవామృత కషాయాల తయారీని మొదలుపెట్టాను. వీటిని రైతులకు ఎలా అమ్మాలి.. నేను ఆచరణలో పెడితేనే నలుగురూ నమ్ముతారు. అందుకే మా ఆయన మిగిల్చి వెళ్లిన అర ఎకరం పొలం, పుట్టింటి వాళ్లిచ్చిన 40 సెంట్ల పొలంలో దొండ పందిరి, మినుము వేశాను. తర్వాత మునగ, అంతర పంటగా మిర్చి సాగు చేశాను. నా కష్టాన్ని చూసి ఎగతాళి చేసినవారున్నారు. సాధ్యమయ్యే పనికాదని నిరుత్సాహపరిచిన వారున్నారు. కానీ, మా అమ్మ నాకు అండగా నిలిచింది. పంటలకు నేను తయారు చేసిన జీవామృత కషాయాలను వాడాను. దిగుబడులు బాగానే వచ్చాయి. పంట మార్పిడి కోసం కాలీఫ్లవర్ వేశాను. ధరలు తగ్గిపోవడంతో నష్టం వచ్చింది. నాలుగేళ్లుగా మునగ, పసుపు, వరి పంటలు సాగు చేస్తున్నాను. తర్వాత 80 సెంట్లలో మినుము 4.5 క్వింటాళ్ల దిగుబడి రావడంతో అంతరపంటగా కూరఅరటి, చిక్కుళ్లు సాగు చేశాను. కిందటి సీజనులో 40 సెంట్లలో వేసిన మునగ నెలన్నర ముందుగానే దిగుబడినిచ్చింది. టన్నుకు పైగా మునగ కాయల దిగుబడి వచ్చింది. మళ్లీ ఇప్పుడు మునగ, పసుపు, వరి పైర్లు సాగులో ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర రెండు ఆవులు ఉన్నాయి. వీటి మూత్రం, పేడ, ఆకులతో చేసిన జీవామృతం మా పొలం వరకు సరిపోతాయి. నేను సాగుచేస్తున్న విధానాలు చూసిన రైతులు ఘన, ద్రవ జీవామృతాన్ని తయారుచేసిమ్మన్నారు. రైతుల ఆదరణతో కషాయాల ఉత్పత్తి రెండేళ్ల క్రితం ఊరి బయట మా సొంత స్థలంలోనే శ్రీవాసవీ దుర్గా ప్రకృతి వ్యవసాయ కషాయాల ఉత్పత్తుల యూనిట్‌ను స్థాపించాను. ప్రభుత్వం ఎన్‌పీఎం యూనిట్ కింద రూ.40 వేలు సబ్సిడీ ఇచ్చారు. ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, దశపర్ణిక కషాయం, పంచగవ్య, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం సొంతంగా యూనిట్లో తయారీ చేస్తున్నాను. వీటికి కావల్సిన గోమూత్రం, పేడ గోశాలల నుంచి సేకరిస్తున్నాను. 2 కేజీల నుంచి 50 కేజీల వరకు వీటి ప్యాకింగ్ ఉంటుంది. వీటిని దాదాపు 150 మంది రైతుల వరకు కొనుగోలు చేసి ప్రకృతి సేద్యంలో వినియోగిస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాల్‌కు మంచి ఆదరణ లభించింది. పూల నర్సరీల నిర్వాహకులు, మేడలపై ఇంటిపంటల సాగుదారులు, పల్నాడు రైతులు కూడా ఈ ఉత్పత్తులను కొని తీసుకెళుతున్నారు. ఒక్కోసారి డిమాండుకు సరిపడా సరఫరా చేయలేకపోయానే అనుకునే సందర్భాలూ ఉన్నాయి. ఇద్దరు పనివారిని పెట్టుకుని స్వయంగా ఈ పనులను చేస్తుంటాను. మా అమ్మ, పిల్లలూ ఈ పనిలో సాయం చేస్తుంటారు. ఖర్చునెలకు రూ.65 వేల వరకు వస్తుంది. అన్ని ఖర్చులు పోను నెలకు 15 నుంచి 20 వేల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. నిపుణుల ప్రశంసలు ఈ విజయంతో ప్రకృతి వ్యవసాయ సలహాదారు విజయకుమార్, కెన్యాలోని వరల్డ్ ఆగ్రో ఫారెస్ట్రీకి చెందిన నిపుణులు సహా పలువురు విదేశీ ప్రతినిధులు, ప్రముఖులు మా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల యూనిట్‌ను సందర్శించి, అభినందించారు. ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటునందిస్తే 500 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయించాలని, సమీప ఊళ్లలో ఆదర్శ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పాలనేది నా ఆశయం’’ అంటూ తన విజయగాథను వివరించారు ఉషారాణి. ఆమె (94948 49622) కల నెరవేరాలని ఆశిద్దాం. ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటునందిస్తే 500 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయించాలని, సమీప ఊళ్లలో ఆదర్శ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పాలనేది నా ఆశయం – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా -
సైన్సు, టెక్నాలజీ రెండూ వేర్వేరు
– నేను సాంకేతిక పరిజ్ఞానానికి వ్యతిరేకం కాదు – శాస్త్రవేత్తలు నా మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేదు – రసాయన వ్యవసాయం భూసారాన్ని దెబ్బతీస్తోంది – జెడ్బీఎన్ఎఫ్తోనే ఆహార సమస్యకు శాశ్వత పరిష్కారం – తిరుపతి మీడియా సమావేశంలో పద్మశ్రీ సుభాష్ పాలేకర్ సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘‘విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలు రెండూ వేర్వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రకృతిలో ఉన్న విషయాన్నే శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. పైన ఎగిరే పక్షి శాస్త్ర పరిజ్ఞానమైతే, ఆకాశంలో ఎగిరే విమానం సాంకేతిక పరిజ్ఞానం. నేను టెక్నాలజీకి వ్యతిరేకం కాదు. అయితే అది సుస్థిరమైనదై ఉండాలి. హరిత విప్లవం గురించి మాట్లాడినపుడు శాస్త్రవేత్తలు బాధపడి ఉంటారు. నేను చెప్పింది వేరు.. వారు అర్థం చేసుకుంది వేరు’’ అని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన మాటలకు మనస్థాపానికి గురైన శాస్త్రవేత్తలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని పోత్సహించాలని సూచన చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని ఆహార కొరత, పెరుగుతున్న భూ తాపం, రైతుల ఆత్మహత్యలు, భూసారం తరుగుదల, రైతుల వలసలు వంటి ఐదు రకాల సమస్యలు వెంటాడుతున్నాయని పాలేకర్ పేర్కొన్నారు. వాటిని పరిష్కరించే పరిజ్ఞానం జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయంలోనే ఉందన్నారు. నీటిని వాతావరణం నుంచి తీసుకునే పరిజ్ఞానం ప్రకృతి వ్యవసాయంలో ఉందనీ, తేమను వినియోగించుకునే సామర్థ్యం ఈ విధానంలో ఎక్కువని వివరించారు. తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ కూడా పుష్కలంగా పండ్లను అందించగలిగిన సర్వ స్వతంత్ర అటవీ పర్యావరణ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ నేపథ్యంలో రసాయనిక ఎరువులు వాడుతూ చేసే వ్యవసాయం దేవుడు సృష్టించిన ప్రకృతికి హానికరంగా చేస్తున్నదే అవుతుందన్నారు. రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో ఉండే అనంత సూక్ష్మజీవులను నిర్మూలించడమే కాకుండా నేలను నిర్జీవంగా మారుస్తున్నారని పాలేకర్ ఆవేదన వెలిబుచ్చారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో విషతుల్యం కాని ఆహారం, కలుషితం కాని గాలి, నీరు సమతుల ఉష్ణోగ్రత కలిగిన పర్యావరణాన్ని కల్పించడమే ప్రకృతి వ్యవసాయ ఉద్యమ లక్ష్యమని వివరించారు. వాయుగుండాలు, కరువుల వంటి విపత్తులను తట్టుకునే సామర్థ్యం ప్రకృతి వ్యవసాయంలోనే లభిస్తుందన్నారు. ఈ ఉద్యమాన్ని ప్రసార మాధ్యమాలు విస్త్రృత ప్రచారం చేయాలని పాలేకర్ మీడియా ప్రతినిధులను కోరారు. త్వరలో ప్రత్యేక వ్యవసాయ మిషన్ : విజయకుమార్ శాస్త్ర సాంకేతిక వ్యవసాయ విధానానికి పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసంధానం చేస్తూ త్వరలో సరికొత్త వ్యవసాయ మిషన్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్ వివరించారు. ప్రస్తుతం 131 క్లస్టర్ల నుంచి హాజరైన రైతులను ప్రకృతి వ్యవసాయంలో మాస్టర్ ఫార్మర్స్‌గా తయారుచేసి వారి ద్వారా మిగతా రైతులకు శిక్షణ అందించే ప్రక్రియ మొదలు పెడతామన్నారు. ప్రతి 30 మంది రైతులకూ ఒక కమ్యూనిటీ రీసోర్సు పర్సన్‌ను ఏర్పాటుచేసి సీడీ, పెన్‌డ్రైవ్ వెర్షన్లలో శిక్షణ అందించే ందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని కెమికల్ ఫ్రీ ఫుడ్ అందించే రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సుభాష్ పాలేకర్ తెలియజేసిన ప్రకృతి వ్యవసాయంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని విజయ్‌కుమార్ వివరించారు. -
11 నుంచి తిరుపతిలో ప్రకృతి వ్యవసాయ సదస్సు
– సుభాష్‌పాలేకర్, రాష్ట్రమంత్రులు హాజరు – 14 వరకూ రైతులకు శిక్షణ తరగతులు – అన్ని జిల్లాల నుంచీ 6 వేల మంది రైతులు – చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రంలోని రైతులకు ప్రకృతి వ్యవసాయంపై పూర్తిస్థాయి అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. ఈ నెల 11 నుంచి 14 వరకూ తిరుపతిలో రాష్ట్రస్థాయి ప్రకృతి వ్యవసాయ సదస్సులను నిర్వహించనుంది. జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయంపై అనుభవం గడించిన సుభాష్ పాలేకర్ స్వయంగా హాజరై నాలుగు రోజుల పాటు రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. 11న ఉదయం 10 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు సదస్సులను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం పెరుగుతోంది. రసాయనిక ఎరువులతో పంటలను పండించే విధానానికి స్వస్తి పలుకుతున్న రైతులు సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ విధానాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆహార ధాన్యాలు, అపరాలు, కూరగాయలు, పండ్లను విరివిగా పండిస్తున్నారు. రాష్ట్రంలోని విజయవాడ, కాకినాడల్లో రెండు దఫాలుగా శిక్షణా తరగతులు నిర్వహించిన సుభాష్‌పాలేకర్ మూడో విడత తిరుపతిలో వీటి నిర్వహణకు సిద్ధమయ్యారు. ప్రకృతి వ్యవసాయాన్ని రైతుల్లో విస్తత పరచాలన్న ఆలోచనతో ప్రభుత్వం తరగతుల నిర్వహణ కోసం రూ.3 కోట్లను విడుదల చేసింది. జిల్లాకు 400 మంది రైతులు, శాస్త్రవేత్తలను ఎంపిక చేసింది. వీరందరూ తిరుపతి సదస్సుకు çహాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాట్లు... తిరుపతిలోని తనుపల్లె రోడ్డులో ఉన్న రామానాయుడు కల్యాణ మండపంలో వ్యవసాయ సదస్సును నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇక్కడ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. శుక్రవారం జిల్లా కలెక్టర్, జెడ్పీ సీఈవో, వ్యవసాయశాఖ జేడీఏలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సదస్సుల నిర్వహణ కోసం ప్రభుత్వం వ్యవసాయ కమిషనరేట్‌లో డీడీగా పనిచేస్తోన్న భగవత్స్వరూప్ను ఇన్చార్జిగా నియమించింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్‌కుమార్, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు తిరుపతి శిక్షణ తరగతులకు సీఎం చంద్రబాబునాయుడు హాజరు కానున్నారని నిర్వాహకులు తెలిపారు.