విలేకరులతో మాట్లాడుతున్న సుభాష్ పాలేకర్, పక్కన విజయ్‌కుమార్
– నేను సాంకేతిక పరిజ్ఞానానికి వ్యతిరేకం కాదు
– శాస్త్రవేత్తలు నా మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేదు
– రసాయన వ్యవసాయం భూసారాన్ని దెబ్బతీస్తోంది
– జెడ్‌బీఎన్‌ఎఫ్‌తోనే ఆహార సమస్యకు శాశ్వత పరిష్కారం
– తిరుపతి మీడియా సమావేశంలో పద్మశ్రీ సుభాష్ పాలేకర్
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
‘‘విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలు రెండూ వేర్వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రకృతిలో ఉన్న విషయాన్నే శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. పైన ఎగిరే పక్షి శాస్త్ర పరిజ్ఞానమైతే, ఆకాశంలో ఎగిరే విమానం సాంకేతిక పరిజ్ఞానం. నేను టెక్నాలజీకి వ్యతిరేకం కాదు. అయితే అది సుస్థిరమైనదై ఉండాలి. హరిత విప్లవం గురించి మాట్లాడినపుడు శాస్త్రవేత్తలు బాధపడి ఉంటారు. నేను చెప్పింది వేరు.. వారు అర్థం చేసుకుంది వేరు’’ అని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన మాటలకు మనస్థాపానికి గురైన శాస్త్రవేత్తలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని పోత్సహించాలని సూచన చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని ఆహార కొరత, పెరుగుతున్న భూ తాపం, రైతుల ఆత్మహత్యలు, భూసారం తరుగుదల, రైతుల వలసలు వంటి ఐదు రకాల సమస్యలు వెంటాడుతున్నాయని పాలేకర్ పేర్కొన్నారు. వాటిని పరిష్కరించే పరిజ్ఞానం జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయంలోనే ఉందన్నారు. నీటిని వాతావరణం నుంచి తీసుకునే పరిజ్ఞానం ప్రకృతి వ్యవసాయంలో ఉందనీ, తేమను వినియోగించుకునే సామర్థ్యం ఈ విధానంలో ఎక్కువని వివరించారు. తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ కూడా పుష్కలంగా పండ్లను అందించగలిగిన సర్వ స్వతంత్ర అటవీ పర్యావరణ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ నేపథ్యంలో రసాయనిక ఎరువులు వాడుతూ చేసే వ్యవసాయం దేవుడు సృష్టించిన ప్రకృతికి హానికరంగా చేస్తున్నదే అవుతుందన్నారు. రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో ఉండే అనంత సూక్ష్మజీవులను నిర్మూలించడమే కాకుండా నేలను నిర్జీవంగా మారుస్తున్నారని పాలేకర్ ఆవేదన వెలిబుచ్చారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో విషతుల్యం కాని ఆహారం, కలుషితం కాని గాలి, నీరు సమతుల ఉష్ణోగ్రత కలిగిన పర్యావరణాన్ని కల్పించడమే ప్రకృతి వ్యవసాయ ఉద్యమ లక్ష్యమని వివరించారు. వాయుగుండాలు, కరువుల వంటి విపత్తులను తట్టుకునే సామర్థ్యం ప్రకృతి వ్యవసాయంలోనే లభిస్తుందన్నారు. ఈ ఉద్యమాన్ని ప్రసార మాధ్యమాలు విస్త్రృత ప్రచారం చేయాలని పాలేకర్ మీడియా ప్రతినిధులను కోరారు.
త్వరలో ప్రత్యేక వ్యవసాయ మిషన్ : విజయకుమార్
శాస్త్ర సాంకేతిక వ్యవసాయ విధానానికి పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసంధానం చేస్తూ త్వరలో సరికొత్త వ్యవసాయ మిషన్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్ వివరించారు. ప్రస్తుతం 131 క్లస్టర్ల నుంచి హాజరైన రైతులను ప్రకృతి వ్యవసాయంలో మాస్టర్ ఫార్మర్స్‌గా తయారుచేసి వారి ద్వారా మిగతా రైతులకు శిక్షణ అందించే ప్రక్రియ మొదలు పెడతామన్నారు. ప్రతి 30 మంది రైతులకూ ఒక కమ్యూనిటీ రీసోర్సు పర్సన్‌ను ఏర్పాటుచేసి సీడీ, పెన్‌డ్రైవ్ వెర్షన్లలో శిక్షణ అందించే ందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని కెమికల్ ఫ్రీ ఫుడ్ అందించే రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సుభాష్ పాలేకర్ తెలియజేసిన ప్రకృతి వ్యవసాయంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని విజయ్‌కుమార్ వివరించారు.