మామిడి తోటకు జీవామృతం పిచికారీ చేస్తున్న జగదీశ్ రెడ్డి
ఏడేళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ ఇచ్చిన శిక్షణ యువ రైతు జగదీశ్ రెడ్డి జీవితాన్ని మార్చేసింది. అంతకుముందు పదిహేనేళ్లుగా రసాయనిక వ్యవసాయం చేస్తున్న ఆయనకు అప్పటి వరకు తాను చేస్తున్న తప్పులేమిటో అర్థమయ్యాయి. రైతుగా తాను చేయాల్సిందేమిటో బోధపడింది. ఇక వెనక్కి చూడలేదు. 25 ఎకరాల పొలంలో వరి, మామిడి, వేరుశనగ, మినుము, కంది, కొర్రల వంటి పంటలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్నారు. దేశంలోని అనేక నగరాల్లో నివాసం ఉంటున్న కనీసం 50 కుటుంబాలకు ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని నేరుగా అందిస్తున్నారు. ఏటా రూ.7–8 లక్షల నికరాదాయం గడిస్తున్నారు. మరో 50 మంది సేంద్రియ రైతులతో కలిసి పనిచేస్తున్నారు. ప్రతి కుటుంబానికీ విధిగా ఉండాల్సింది వ్యాధులను నయం చేసే ‘ఫ్యామిలీ డాక్టర్’ కాదు.. జబ్బుల పాలు చేయని అమృతాహారాన్నందించే ‘ఫ్యామిలీ ఫార్మర్’ కావాలంటున్న జగదీశ్‌రెడ్డి నిజమైన ఫ్యామిలీ ఫార్మర్. న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.ఎ.ఆర్.ఐ.) ఆయనకు ఇటీవల ‘ఇన్నోవేటివ్ ఫార్మర్’ అవార్డును ప్రదానం చేసిన సందర్భంగా ప్రత్యేక కథనం..
మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వై. జగదీశ్ రెడ్డి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేయకుండానే పాతికేళ్ల క్రితం వ్యవసాయం చేపట్టారు. చిత్తూరుజిల్లా బంగారుపాళ్యం మండలం దండువారిపల్లె ఆయన స్వగ్రామం. గ్రామానికి దగ్గరగా కొంత, పది కిలోమీటర్ల దూరంలో కొండ కోనల్లో అడవికి దగ్గరగా మొగిలి గ్రామంలో మరికొంత పొలం ఉంది. మొత్తం పాతిక ఎకరాలు. వ్యవసాయ బావుల ఆధారంగా వ్యవసాయం చేస్తున్నారు. అడవికి దగ్గరగా ఉన్న పొలంలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. పదిహేనేళ్లు రసాయనిక ఎరువులు, పురుగుమందులతో వ్యయప్రయాసలకోర్చి వ్యవసాయం చేసి విసిగిపోయిన దశలో 2011లో పాలేకర్ శిక్షణా శిబిరంలో పాల్గొన్నాడు. ఆ శిక్షణ జగదీశ్ రెడ్డి జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. నేలతల్లితో, మొత్తం ప్రకృతితో తెగిపోయిన సంబంధం తిరిగి అనుసంధానమైన భావన మదిలో నిండింది.
సొంత దేశీ ఆవుల పేడ, మూత్రం తదితరాలతో ఘనజీవామృతం, బీజామృతం, జీవామృతం, దశపత్రకషాయం.. వంటి ఉత్పాదకాలనే వాడుతున్నారు. బొత్తిగా రసాయనాలు వాడకుండా 15 ఎకరాల్లో (7.5 ఎకరాల్లో లేత తోట, 7.5 ఎకరాల్లో ముదురు తోట)మామిడి, ఆరెకరాల్లో వేరుశనగ, ఎకరంలో చెరకు, ఎకరంలో కొర్రలు, 3 ఎకరాల్లో వరి ప్రధాన పంటలుగా పండిస్తున్నారు. వీటిలో అనేక అంతరపంటలు వేస్తున్నారు. శ్రమ పెరిగానా ఖర్చు తగ్గిపోయింది. నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. అటవీ జంతువుల దాడులు, కూలీల సమస్య వంటి అనేక సమస్యలతో సతమతమవుతూనే ప్రకృతి వ్యవసాయంలో మాధుర్యాన్ని చవిచూస్తున్నారాయన. తొలుత దిగుబడులు తక్కువగా వచ్చినా క్రమంగా సంతృప్తికరమైన దశకు పెరిగాయి. భూమిలో వానపాములు, సూక్ష్మజీవులకు పెద్ద పీట వేసే వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ ప్రకృతితో మమేకం కావడం.. రసాయనిక అవశేషాల్లేని నాణ్యమైన, పోషకాలతో కూడిన ఆ ఆహారాన్ని తిన్న వారిలో ఆరోగ్యం మెరుగవ్వడంతో జగదీశ్‌రెడ్డికి ప్రకృతి రైతుగా తన బాధ్యత ఎంత సమున్నతమైనదో ఎరుకలోకి వచ్చింది.
మారుమూల గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటికీ.. వివిధ రాష్ట్రాల్లో జరిగే సమావేశాలు, సదస్సుల్లో పాల్గొంటూ తరచూ వ్యవసాయదారులను, పౌష్టికాహార నిపుణులను, వైద్యులను కలుసుకుంటూ అనుభవాలను కలబోసుకోవడం జగదీశ్ రెడ్డికి ఇష్టమైన పని. ఆ పరిచయాలతో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లోని కుటుంబాలకు తాను పండించే నాణ్యమైన పోషక విలువలతో కూడిన రసాయన రహిత ఆహారోత్పత్తులను నేరుగా విక్రయించడం ప్రారంభించారు. ఇందుకోసం వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. రైతులకు తన అనుభవాలను పంచడం కూడా ఇందులో ఒక ముఖ్య విషయం.
ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి ఆహారోత్పత్తుల ఆవశ్యకత గురించి రైతులకు తెలియజెప్పి.. సలహాలు సంప్రదింపుల ద్వారా ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేయడం ఆయనకు ఇష్టమైన వ్యాపకం. తన పొలంలో పండించిన ప్రకృతి వ్యవసాయోత్పత్తులను నగరవాసులకు విక్రయించడంతోపాటు.. మరో 50 మంది ప్రకృతి వ్యవసాయ దారుల నుంచి సేకరించిన ఉత్పత్తులను సైతం వివిధ నగరాల్లో వినియోగదారులకు నేరుగా విక్రయించేందుకు అనుసంధానకర్తగా జగదీశ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రావాలంటే ధాన్యాలను నేరుగా కాకుండా శుద్ధిచేసి ఆహారోత్పత్తులుగా మార్చి అమ్ముకోవడం రైతులు నేర్చుకోవాలని ఆయన అంటుంటారు. బియ్యం, వేరుశనగలను ఎద్దు కట్టె గానుగ నూనెగా మార్చి అమ్ముకోవడం అవసరం అంటారు జగదీశ్ రెడ్డి. శుద్ధమైన గానుగ నూనె తీసిన తర్వాత వారం రోజులు ఎండలో ఉంచితే మరింత ఆరోగ్యదాయకంగా మారుతుందని, ఈ పద్ధతిలోనే తాను వేరుశనగ సంప్రదాయ గానుగ నూనెను ఉత్పత్తి చేస్తున్నానని ఆయన తెలిపారు.
ఈ సంవత్సరం మామిడి వాతావరణం అనుకూలించిందని, పూత కాలంలో వర్షం పడకపోవడం వల్ల కాపు బాగుందని ఆయన తెలిపారు. ఏనుగుల దాడి వల్ల రబీలో ఈ ఏడాది వరి సాగు చేయడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు దెబ్బతినాల్సి వస్తున్నాదన్నారు. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం తప్ప వేరే దారి కనపడటం లేదన్నారు. ప్రకృతి రైతుగా ఏడాదికి రూ. 7–8 లక్షల నికరాదాయం పొందుతూ, అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆత్మసంతృప్తితో జీవనం గడుపుతున్నానంటారు జగదీశ్‌రెడ్డి. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి విద్యార్థులు, రైతులు, సందర్శకులు తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తుండడం.. తన అనుభవాలను శాస్త్రవేత్తలు సైతం ఆసక్తిగా గమనించడం.. అవార్డులు, పురస్కారాల కన్నా ఎంతో సంతృప్తినిస్తున్నదని ఆయన అంటారు. తరచూ పొలానికి వచ్చే ఏడేళ్ల తన కుమారుడు పార్థురెడ్డిని ప్రకృతి వ్యవసాయదారుడిగా చూడాలన్నదే తన ఆశ అంటారాయన! నేషనల్ న్యూట్రిషన్ అవార్డు (2016–న్యూఢిల్లీ), గ్లోబల్ అవుట్ రీచ్ హెల్త్ కేర్ అవార్డు (2017–జైపూర్), ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు (2019–ఐ.ఎ.ఆర్.ఐ.)లను జగదీశ్వరరెడ్డి అందుకున్నారు.
ప్రతి కుటుంబానికీ ఫార్మర్ ఉండాలి!
సమాజంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ కన్నా ముఖ్యంగా ఫ్యామిలీ ఫార్మర్ ఉండాలి. ప్రభుత్వం వైద్యం కోసం, ఆసుపత్రుల కోసం ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ప్రజలకు లభించేది ‘మెడికల్ కేర్’ మాత్రమే. అసలైన ‘హెల్త్ కేర్’ అందించగలిగిన వారు ప్రకృతి వ్యవసాయదారులు మాత్రమే. జబ్బు వచ్చాక బాగు చేసుకునే ప్రయత్నం చేయడం కన్నా జబ్బు రాకుండా ఉండే ఆహారాన్ని పండించి అందించడం ముఖ్యం. ప్రకృతి వ్యవసాయంలో నేల లోపలి పొరల నుంచి వానపాములు, సూక్ష్మజీవుల నుంచి సకల పోషకాలను తీసుకొని ప్రకృతి వ్యవసాయంలో పంటలు నిజమైన పోషకాలతో కూడిన గింజలు, కాయలు, పండ్లను మనకు అందిస్తున్నాయి. ఇటువంటి ఆహారాన్నందించే ఫ్యామిలీ ఫార్మరే ప్రతి కుటుంబానికీ కావాలిప్పుడు.
– వై. జగదీశ్‌రెడ్డి(94400 44279), ప్రకృతి వ్యవసాయదారుడు, దండువారిపల్లె, బంగారుపాళ్యం మండలం, చిత్తూరు జిల్లా
వేరుశనగ పంట
చెరకు తోటలో జగదీశ్ రెడ్డి
ఇన్‌పుట్స్: పద్మనాభరెడ్డి, సాక్షి, యాదమరి
ఫొటోలు: శివశంకర్, సాక్షి, బంగారుపాళ్యం
Comments
Please login to add a commentAdd a comment