Farmer Award
-
చల్లటి పంటలు
ఈశాన్య రాష్ట్రాలు అనగానే ముందుగా అక్కడి పచ్చటి తోటలు గుర్తుకు వస్తాయి. వీపున బుట్ట తగిలించుకున్న మహిళలు మనోఫలకం మీద మెదలుతారు. వేళ్లతో అలవోకగా తేయాకు చిగుళ్లను గిల్లుతూ బుట్టలో వేస్తున్న దృశ్యం కూడా. అదే ప్రాంతం నుంచి ఓ మహిళ సేంద్రియ పంటలను బుట్టలో వేయసాగింది. ఇప్పుడు... బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డును కూడా బుట్టలో వేసుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో మనకు ఒక మోస్తరుగా తెలిసిన రాష్ట్రం సిక్కిమ్, ఆ రాష్ట్రానికి రాజధాని గాంగ్టక్, ఆ నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరాన ఉంది రాణిపూల్ అనే చిన్న పట్టణం. అది పట్టణమో, గ్రామమో స్పష్టంగా చెప్పలేం. నివాస ప్రదేశాలకు ఒకవైపు కొండలు, మరోవైపు రాణిఖోలా నది, వాటి మధ్య పచ్చగా విస్తరించిన నేల. ఈ నేలనే తన ప్రయోగశాలగా మార్చుకున్నారు దిల్లీ మాయా భట్టారాయ్. ప్రోగ్రెస్ రిపోర్ట్ టెకీగా సిటీలైఫ్ చట్రంలో జీవితాన్ని కట్టిపడేయడం నచ్చలేదామెకు. ‘మనల్ని మనం పరిరక్షించుకుంటాం, అలాగే భూమాతను కూడా పరిరక్షించాలి’... అంటారు మాయా భట్టారాయ్. అందుకోసం గ్రామంలో సేంద్రియ సేద్యాన్ని, సేంద్రియ ఉత్పత్తుల దుకాణాన్ని కూడా ప్రారంభించారామె. ‘పర్యావరణాన్ని పరిరక్షించడంలో సేంద్రియ వ్యవసాయం ప్రధాన పాత్ర వహిస్తుంది. అందుకే ఈ రంగంలో అడుగుపెట్టాను’ అని చెప్తున్నారామె. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్గానిక్ మిషన్‌లో భాగస్వామి అయిన తర్వాత ఆమెకు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. శాస్త్ర సాంకేతికతను జోడిస్తూ వ్యవసాయం చేయడంలోనూ, ఆర్థిక సంక్షేమాన్ని సాధించడంలో ఆమె కృతకృత్యులయ్యారు. మన నేలకు పరిచయం లేని పాశ్చాత్య దేశాల్లో పండే అనేక పంటలను ఇక్కడ పండించారామె. ఆ పంటలకు తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని, ఎక్కువ ఎండ తగలకుండా తెల్లని పై కప్పుతో సస్యాలను రక్షించారు. మన అల్లం, వంకాయలతోపాటు పశ్చిమాన పండే బ్రోకలి వంటి కొత్త పంటల సాగులోనూ పురోగతి సాధించారు. ఆమె ప్రోగ్రెస్ రిపోర్ట్‌కు మంచి గుర్తింపు వచ్చింది. మాయా భట్టారాయ్ అనుసరించిన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మీద స్థానిక మీడియా చానెళ్లు ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. సోషల్ మీడియా కూడా అందుకుంది. ఆమె ఫార్మింగ్ ఫార్ములా విపరీతంగా ప్రజల్లోకి వెళ్లింది. వాతావరణాన్ని కలుషితం కానివ్వకుండా కాపాడడంలో ఆమె తనవంతుకంటే ఎక్కువ భాగస్వామ్యాన్ని అందించింది. ఆమె స్ఫూర్తితో అనేక మంది మహిళలు పర్యావరణానికి హానికలిగించని విధంగా సాగు చేయడానికి ముందుకు వచ్చారు. ఆమె ప్రయత్నాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆమెను ‘బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డు 2021’తో గౌరవించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌కు చెందిన నార్త్ ఈస్టర్న్ హిల్ రీజియన్ 48వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇటీవల మేఘాలయలోని ఉమియమ్‌లో ఆమె ఈ అవార్డు అందుకున్నారు. పంటకు పురస్కారం రాణిపూల్‌లోని హాత్ బజార్లో మాయా భట్టారాయ్ దుకాణాన్ని, స్థానిక మహిళలు సేంద్రియసాగులో పండిస్తున్న కూరగాయలను చూపిస్తూ ‘ఇదంతా దిల్లీ మాయా భట్టారాయ్ బాటలో మన మహిళలు సాధించిన విజయం. బయటి నుంచి కూరగాయలు మాకక్కరలేదు... అని చెప్పే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం’ అని కథనాలు ప్రసారం చేసింది స్థానిక ‘వాయిస్ ఆఫ్ సిక్కిమ్’ మీడియా. ‘నేలకు గౌరవం అందాలి. పంటకు పురస్కారాలు రావాలి. పంట పండించే రైతు శ్రమను గౌరవించే రోజులు రావాలి’ అంటారామె. -
ఫ్యామిలీ ఫార్మర్!
ఏడేళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ ఇచ్చిన శిక్షణ యువ రైతు జగదీశ్ రెడ్డి జీవితాన్ని మార్చేసింది. అంతకుముందు పదిహేనేళ్లుగా రసాయనిక వ్యవసాయం చేస్తున్న ఆయనకు అప్పటి వరకు తాను చేస్తున్న తప్పులేమిటో అర్థమయ్యాయి. రైతుగా తాను చేయాల్సిందేమిటో బోధపడింది. ఇక వెనక్కి చూడలేదు. 25 ఎకరాల పొలంలో వరి, మామిడి, వేరుశనగ, మినుము, కంది, కొర్రల వంటి పంటలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్నారు. దేశంలోని అనేక నగరాల్లో నివాసం ఉంటున్న కనీసం 50 కుటుంబాలకు ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని నేరుగా అందిస్తున్నారు. ఏటా రూ.7–8 లక్షల నికరాదాయం గడిస్తున్నారు. మరో 50 మంది సేంద్రియ రైతులతో కలిసి పనిచేస్తున్నారు. ప్రతి కుటుంబానికీ విధిగా ఉండాల్సింది వ్యాధులను నయం చేసే ‘ఫ్యామిలీ డాక్టర్’ కాదు.. జబ్బుల పాలు చేయని అమృతాహారాన్నందించే ‘ఫ్యామిలీ ఫార్మర్’ కావాలంటున్న జగదీశ్‌రెడ్డి నిజమైన ఫ్యామిలీ ఫార్మర్. న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.ఎ.ఆర్.ఐ.) ఆయనకు ఇటీవల ‘ఇన్నోవేటివ్ ఫార్మర్’ అవార్డును ప్రదానం చేసిన సందర్భంగా ప్రత్యేక కథనం.. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వై. జగదీశ్ రెడ్డి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేయకుండానే పాతికేళ్ల క్రితం వ్యవసాయం చేపట్టారు. చిత్తూరుజిల్లా బంగారుపాళ్యం మండలం దండువారిపల్లె ఆయన స్వగ్రామం. గ్రామానికి దగ్గరగా కొంత, పది కిలోమీటర్ల దూరంలో కొండ కోనల్లో అడవికి దగ్గరగా మొగిలి గ్రామంలో మరికొంత పొలం ఉంది. మొత్తం పాతిక ఎకరాలు. వ్యవసాయ బావుల ఆధారంగా వ్యవసాయం చేస్తున్నారు. అడవికి దగ్గరగా ఉన్న పొలంలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. పదిహేనేళ్లు రసాయనిక ఎరువులు, పురుగుమందులతో వ్యయప్రయాసలకోర్చి వ్యవసాయం చేసి విసిగిపోయిన దశలో 2011లో పాలేకర్ శిక్షణా శిబిరంలో పాల్గొన్నాడు. ఆ శిక్షణ జగదీశ్ రెడ్డి జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. నేలతల్లితో, మొత్తం ప్రకృతితో తెగిపోయిన సంబంధం తిరిగి అనుసంధానమైన భావన మదిలో నిండింది. సొంత దేశీ ఆవుల పేడ, మూత్రం తదితరాలతో ఘనజీవామృతం, బీజామృతం, జీవామృతం, దశపత్రకషాయం.. వంటి ఉత్పాదకాలనే వాడుతున్నారు. బొత్తిగా రసాయనాలు వాడకుండా 15 ఎకరాల్లో (7.5 ఎకరాల్లో లేత తోట, 7.5 ఎకరాల్లో ముదురు తోట)మామిడి, ఆరెకరాల్లో వేరుశనగ, ఎకరంలో చెరకు, ఎకరంలో కొర్రలు, 3 ఎకరాల్లో వరి ప్రధాన పంటలుగా పండిస్తున్నారు. వీటిలో అనేక అంతరపంటలు వేస్తున్నారు. శ్రమ పెరిగానా ఖర్చు తగ్గిపోయింది. నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. అటవీ జంతువుల దాడులు, కూలీల సమస్య వంటి అనేక సమస్యలతో సతమతమవుతూనే ప్రకృతి వ్యవసాయంలో మాధుర్యాన్ని చవిచూస్తున్నారాయన. తొలుత దిగుబడులు తక్కువగా వచ్చినా క్రమంగా సంతృప్తికరమైన దశకు పెరిగాయి. భూమిలో వానపాములు, సూక్ష్మజీవులకు పెద్ద పీట వేసే వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ ప్రకృతితో మమేకం కావడం.. రసాయనిక అవశేషాల్లేని నాణ్యమైన, పోషకాలతో కూడిన ఆ ఆహారాన్ని తిన్న వారిలో ఆరోగ్యం మెరుగవ్వడంతో జగదీశ్‌రెడ్డికి ప్రకృతి రైతుగా తన బాధ్యత ఎంత సమున్నతమైనదో ఎరుకలోకి వచ్చింది. మారుమూల గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటికీ.. వివిధ రాష్ట్రాల్లో జరిగే సమావేశాలు, సదస్సుల్లో పాల్గొంటూ తరచూ వ్యవసాయదారులను, పౌష్టికాహార నిపుణులను, వైద్యులను కలుసుకుంటూ అనుభవాలను కలబోసుకోవడం జగదీశ్ రెడ్డికి ఇష్టమైన పని. ఆ పరిచయాలతో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లోని కుటుంబాలకు తాను పండించే నాణ్యమైన పోషక విలువలతో కూడిన రసాయన రహిత ఆహారోత్పత్తులను నేరుగా విక్రయించడం ప్రారంభించారు. ఇందుకోసం వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. రైతులకు తన అనుభవాలను పంచడం కూడా ఇందులో ఒక ముఖ్య విషయం. ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి ఆహారోత్పత్తుల ఆవశ్యకత గురించి రైతులకు తెలియజెప్పి.. సలహాలు సంప్రదింపుల ద్వారా ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేయడం ఆయనకు ఇష్టమైన వ్యాపకం. తన పొలంలో పండించిన ప్రకృతి వ్యవసాయోత్పత్తులను నగరవాసులకు విక్రయించడంతోపాటు.. మరో 50 మంది ప్రకృతి వ్యవసాయ దారుల నుంచి సేకరించిన ఉత్పత్తులను సైతం వివిధ నగరాల్లో వినియోగదారులకు నేరుగా విక్రయించేందుకు అనుసంధానకర్తగా జగదీశ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రావాలంటే ధాన్యాలను నేరుగా కాకుండా శుద్ధిచేసి ఆహారోత్పత్తులుగా మార్చి అమ్ముకోవడం రైతులు నేర్చుకోవాలని ఆయన అంటుంటారు. బియ్యం, వేరుశనగలను ఎద్దు కట్టె గానుగ నూనెగా మార్చి అమ్ముకోవడం అవసరం అంటారు జగదీశ్ రెడ్డి. శుద్ధమైన గానుగ నూనె తీసిన తర్వాత వారం రోజులు ఎండలో ఉంచితే మరింత ఆరోగ్యదాయకంగా మారుతుందని, ఈ పద్ధతిలోనే తాను వేరుశనగ సంప్రదాయ గానుగ నూనెను ఉత్పత్తి చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం మామిడి వాతావరణం అనుకూలించిందని, పూత కాలంలో వర్షం పడకపోవడం వల్ల కాపు బాగుందని ఆయన తెలిపారు. ఏనుగుల దాడి వల్ల రబీలో ఈ ఏడాది వరి సాగు చేయడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు దెబ్బతినాల్సి వస్తున్నాదన్నారు. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం తప్ప వేరే దారి కనపడటం లేదన్నారు. ప్రకృతి రైతుగా ఏడాదికి రూ. 7–8 లక్షల నికరాదాయం పొందుతూ, అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆత్మసంతృప్తితో జీవనం గడుపుతున్నానంటారు జగదీశ్‌రెడ్డి. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి విద్యార్థులు, రైతులు, సందర్శకులు తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తుండడం.. తన అనుభవాలను శాస్త్రవేత్తలు సైతం ఆసక్తిగా గమనించడం.. అవార్డులు, పురస్కారాల కన్నా ఎంతో సంతృప్తినిస్తున్నదని ఆయన అంటారు. తరచూ పొలానికి వచ్చే ఏడేళ్ల తన కుమారుడు పార్థురెడ్డిని ప్రకృతి వ్యవసాయదారుడిగా చూడాలన్నదే తన ఆశ అంటారాయన! నేషనల్ న్యూట్రిషన్ అవార్డు (2016–న్యూఢిల్లీ), గ్లోబల్ అవుట్ రీచ్ హెల్త్ కేర్ అవార్డు (2017–జైపూర్), ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు (2019–ఐ.ఎ.ఆర్.ఐ.)లను జగదీశ్వరరెడ్డి అందుకున్నారు. ప్రతి కుటుంబానికీ ఫార్మర్ ఉండాలి! సమాజంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ కన్నా ముఖ్యంగా ఫ్యామిలీ ఫార్మర్ ఉండాలి. ప్రభుత్వం వైద్యం కోసం, ఆసుపత్రుల కోసం ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ప్రజలకు లభించేది ‘మెడికల్ కేర్’ మాత్రమే. అసలైన ‘హెల్త్ కేర్’ అందించగలిగిన వారు ప్రకృతి వ్యవసాయదారులు మాత్రమే. జబ్బు వచ్చాక బాగు చేసుకునే ప్రయత్నం చేయడం కన్నా జబ్బు రాకుండా ఉండే ఆహారాన్ని పండించి అందించడం ముఖ్యం. ప్రకృతి వ్యవసాయంలో నేల లోపలి పొరల నుంచి వానపాములు, సూక్ష్మజీవుల నుంచి సకల పోషకాలను తీసుకొని ప్రకృతి వ్యవసాయంలో పంటలు నిజమైన పోషకాలతో కూడిన గింజలు, కాయలు, పండ్లను మనకు అందిస్తున్నాయి. ఇటువంటి ఆహారాన్నందించే ఫ్యామిలీ ఫార్మరే ప్రతి కుటుంబానికీ కావాలిప్పుడు. – వై. జగదీశ్‌రెడ్డి(94400 44279), ప్రకృతి వ్యవసాయదారుడు, దండువారిపల్లె, బంగారుపాళ్యం మండలం, చిత్తూరు జిల్లా వేరుశనగ పంట చెరకు తోటలో జగదీశ్ రెడ్డి ఇన్పుట్స్: పద్మనాభరెడ్డి, సాక్షి, యాదమరి ఫొటోలు: శివశంకర్, సాక్షి, బంగారుపాళ్యం -
గండభేరుండం
ఒక ఊళ్ళో ఒక పేదరైతుకు ముగ్గురు కొడుకులు ఉండేవాళ్ళు. తల్లి, తండ్రి, ఇద్దరన్నలు రెక్కలు ముక్కలు చేసుకుని పొలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి చేరి ఆరోజు దొరికిన దానితో వండిపెడితే హాయిగా తిని, ఏ చీకూ చింతా లేకుండా ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకుంటూ గడిపేవాడు మూడవవాడు. ఒకరోజు రెండవ వాడికి కోపం వచ్చి ‘‘మనం ముగ్గురం కష్టపడుతుంటే చిన్న సాయం కూడా చేయకుండా తింటున్నాడు. ఇన్నాళ్ళూ చిన్నవాడని వెనకేసుకొచ్చారు. ఇప్పుడు పద్దెనిమిదేళ్ళ పడుచువాడయ్యాడు కదా? వాడ్ని కూడా పనిలో పెట్టండి నాన్నా’’ అని అన్నాడు తండ్రితో. తండ్రి అందుకు సమ్మతించి మూడవ వాడిని ఆ వూరి జమిందారు గారి ఆవులు కాసే పాలేరు దగ్గర పనికి కుదిర్చాడు దినభత్యం కింద. రోజూ పొద్దుటే పెరుగన్నం తిని ఆవుల్ని గుట్టల మీదికి తోలుకెళ్ళేవాడు అతను. ఒకరోజు పేద్ద కొండలాంటి గండభేరుండ పక్షి ఒకటి అతని మందలోని దూడను కాళ్ళతో పట్టుకుని పైకెగిరింది. అది గమనించిన ఆ కుర్రవాడు పాలేరు శిక్షిస్తాడన్న భయంతో దూడను గట్టిగా పట్టుకోవడంతో అతనుకూడా దూడతోసహా గాల్లో వేలాడసాగాడు. గండభేరుండం దూడను అమాంతం నోట్లోకి వేసుకునే సమయానికి అంతవరకూ ఆవుల్ని కాయటానికి తెచ్చుకున్న ముల్లుకర్రను దూడకన్నా ముందుగా చటుక్కున ముక్కుకు అందించేసరికి దానిముక్కు ముళ్ళు గుచ్చుకుని రక్తమోడి భీకరంగా అరిచింది. దూడ ఎత్తయిన గడ్డివాములోకి జారి బ్రతికిపోయింది. పక్షి కొండకొమ్మున ఆగటంతో అతను ఆ కొండమీదే దిగి దానికంటపడకుండా కనిపించిన ఓ గుహలోకెళ్ళి నక్కాడు. ఆ గుహలో ఎవరిదో ఏడుపు వినిపించి చూడగా ఒక యువతి తాళ్ళతో బంధింపబడి కనిపించింది. వెంటనే ఆమెను బంధ విముక్తురాలిని చేసి వెలుపలికి తీసుకొచ్చాడు. వారి కదలికలకు ఆమెను బంధించి తెచ్చిన కొందరు బందిపోట్లు వెంటపడగా ఆ అలికిడికి బెదిరిన గండభేరుండం ఎగరటానికి సిద్ధమైంది. వెంటనే ఆమెను హెచ్చరించి ఇద్దరూ గండభేరుండం కాళ్ళను పట్టుకుని గాల్లోకి ఎగిరారు. కొంతసేపటికి ముక్కుబాధతో పక్షి రెక్కలు విదల్చగా ఇద్దరూ వెళ్ళి అడవిలోని ఓ కొలనులో పడ్డారు. ఎలాగో ఇద్దరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు చెప్పింది ఆమె తాను ఆ నగరంలోని పేద్ద జమిందారుగారి ఏకైక పుత్రికనని. ఆమెను జాగ్రత్తగా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చాడు అతను. గుడికి వెళ్ళిన తమ గారాల పట్టిని బందిపోట్లు ఎత్తుకెళ్ళారని తెలిసి కంటికిమింటికి ఏకధాటిగా దుఃఖిస్తున్న ఆ దంపతులు సంతోషించి తమ కుమార్తె అభీష్టం మేరకు అతనికే ఇచ్చి వివాహం చేశారు. అంతేకాకుండా అతని కోరిక ప్రకారం అతని ఇద్దరన్నలకూ దివాణంలో ఉద్యోగాలిచ్చి, అతని తల్లిదండ్రులను అతని వద్దే వుంచుకోవడానికి ఆనందంగా అంగీకరించారు. పేదరికం వల్ల తమ్ముడిమీద వంతులువేసి పనిచేయించమని చెప్పినా మనసులో పెట్టుకోకుండా ఆదరించినందుకు అన్నలిద్దరూ తమ్ముడి ఔదార్యానికి ఆనందించారు. ఏమైనా కష్టం వచ్చిందని చేతులు ముడుచుకోకుండా సాహసం చేసినందుకు తగిన ఫలితం దక్కిందని నగర ప్రజలు అతన్ని కొనియాడారు. డేగల అనితాసూరి -
ముకుందరెడ్డికి నెక్ పౌల్ట్రీ రైతు అవార్డు
మండపేట: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పౌల్ట్రీలు నెలకొల్పి అత్యధికంగా కోళ్లను పెంచుతున్న శ్రీలక్ష్మి ఎగ్ ఫార్మింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ కర్రి వెంకట ముకుందరెడ్డిని జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ (నెక్) బిగ్గెస్ట్ లేయర్ ఫార్మర్ అవార్డుతో సత్కరించింది. ప్రపంచ ఎగ్ డే సందర్భంగా శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్, సుదర్శన్ భగత్ చేతులమీదుగా ముకుందరెడ్డి ఈ అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ అవార్డుకు ముగ్గురిని ఎంపిక చేయగా అందులో ఆయన ఒకరు. 2 లక్షల నుంచి 28 లక్షలకు..: తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలోని కేపీఆర్ గ్రూప్స్‌లో భాగంగా 1987లో 2 లక్షల కోళ్లతో ముకుందరెడ్డి శ్రీలక్ష్మి పౌల్ట్రీ కాంప్లెక్స్ నెలకొల్పారు. అనతికాలంలోనే దీనిని శ్రీలక్ష్మి ఎగ్ ఫార్మింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌గా అభివృద్ధి చేసి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో పౌల్ట్రీలు నెలకొల్పారు. ప్రస్తుతం ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో చెరో 14 లక్షల లేయర్ కోళ్లను పెంచుతున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కిసాన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల జోక్యం లేకుండా తక్కువ ధరకే తమ ఉత్పత్తులను రైతులకు అందిస్తున్నారు. కేంద్రం సహకారం అందించాలి:పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు ముకుందరెడ్డి తెలిపారు. న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’తో ఆయన ఫోన్లో మాట్లాడారు. కోళ్ల మేతల కృత్రిమ కొరత సమస్యను పరిష్కరించాలని, మొక్కజొన్న, ఇతర ఉత్పత్తులను కోళ్ల రైతులకు రాయితీపై సరఫరా చేయాలని కోరామని తెలిపారు.