Chemical agriculture
-
నాలుగేళ్లలో రెట్టింపు ఎగుమతులు
న్యూఢిల్లీ: పరిశ్రమకు అనుకూలమైన పరిస్థితులు, అవకాశాలు కల్పిస్తే భారత్ వ్యవసాయ రసాయన ఎగుమతులు రాబోయే నాలుగేళ్లలో రూ.80,000 కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఏఎఫ్‌సీఐ–ఈవై నివేదిక ఒకటి పేర్కొంది. ఇండస్ట్రీ ప్రతినిధ్య సంస్థ అగ్రో కెమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎఫ్ఐ)–ఈవై సంయుక్తంగా ‘భారత వ్యవసాయ రసాయన పరిశ్రమ: ప్రస్తానం, సవాళ్లు, ఆకాంక్షలు’ అన్న శీర్షికన ఈ నివేదిక రూపొందింది. ఏసీఎఫ్ఐ ఏడో సార్వత్రిక సమావేశం నేపథ్యంలో విడుదలైన ఈ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...2022–23 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రసాయనాల ఎగుమతుల విలువ రూ.43,223 కోట్లు.భారత్ వ్యవసాయ రసాయన ఎగుమతులు దేశీయ వినియోగం కంటే ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ రసాయన పరిశ్రమల దన్నుతో భారత్ ఎగుమతులు ఇటీవలి కాలంలో ప్రశంసనీయమైన వృద్ధిని నమోదుచేసుకున్నాయి.లైసెన్సింగ్ నిబంధనలను క్రమబదీ్ధకరించడం, నిల్వ, విక్రయాల కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, బయోపెస్టిసైడ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడం, కొత్త మాలిక్యులస్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం, సడలించిన ఎంఆర్ఎల్ నిబంధనలతో దేశాలతో వాణిజ్య ఒప్పందాలను చేసుకోవడం, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుండి పెట్టుబడులను ఆకర్షించడానికి పీఎల్ఐ తరహాలో ఒక పథకాన్ని ఆవిష్కరించడం వంటి పలు చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. వస్తు సేవల పన్నును (జీఎస్టీ) 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని పరిశ్రమల సంఘం కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించగల దేశంగా భారత్ ప్రపంచ తయారీ కేంద్రంగా రూపొందాలి. ఇందుకు సంబంధించి వృద్ధి అవకాశాల అన్వేషణలో వ్యవసాయ రసాయన పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవసాయ ఉత్పాదకత, ఆహార భద్రత, ఎగుమతి సామర్థ్యాన్ని పెంపొందించడంలో అగ్రోకెమికల్ పరిశ్రమ పాత్ర ఎంతో కీలకం కానుంది.ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద వ్యవసాయ రసాయనాల ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ, భారతదేశం ఒక వైరుధ్య పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశం గణనీయమైన ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఇప్పటికీ గణనీయమైన స్థాయిలో వ్యవసాయ రసాయనాలను దిగుమతి చేసుకుంటుంది. ప్రత్యేకించి చైనా నుంచి ఈ దిగుమతులు జరుగుతున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవతో పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాల్సి ఉంది. అవకాశాలుగా మార్చడానికి సకాలంలో తగిన ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటుకావాలి. ఆయా చర్యలు దేశాన్ని వ్యవసాయ రసాయనాల కోసం ప్రపంచ తయారీ ఎగుమతి కేంద్రంగా మారడానికి వీలు కలి్పస్తుంది. ఇదీ చదవండి: మొబైల్ అలర్ట్‌లతో ప్రాణాలు కాపాడేలా..భారత మార్కెట్లో వ్యవసాయ రసాయన వినియోగం (కేజీ/హెక్టార్‌కు) తక్కువగా ఉంది. నివేదికల ప్రకారం భారతదేశం హెక్టారుకు 400 గ్రాముల వ్యవసాయ రసాయనాలను మాత్రమే వినియోగిస్తోంది. ఇది ప్రపంచ సగటు 2.6 కేజీ/హెక్టార్ కంటే తక్కువగా ఉంది. -
సాగుబడి: సస్యగవ్యతో.. బంజరు భూమి సాగు!
మన దేశంలో 28.7% భూమి (9 కోట్ల 78 లక్షల హెక్టార్ల భూమి బంజరు భూమి ఉంది. విచ్చలవిడిగా రసాయనాల వినియోగం వల్ల పూర్తిగా నిస్సారమై సాగుయోగ్యం కాకుండా పోయిన భూమి కూడా ఇందులో కలసి ఉంది. ఇటువంటి రాళ్లూ రప్పలతో కూడిన బంజరు, నిస్సారమైన భూములను సైతం కేవలం ద్రవరూప ఎరువు ‘సస్యగవ్య’తో పునరుజ్జీవింపచేయ వచ్చని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. వేదకాలం నాటి కృషిపరాశర గ్రంథం నుంచి తీసుకున్న సాగు పద్ధతిలో బంజరు భూములను, నిస్సారమైన భూములను పునరుజ్జీవింపజేస్తూ తిరిగి సాగులోకి తేవడానికి ఉపయోగపడే వినూత్న ప్రకృతి సేద్య పద్ధతిని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ అనుసరిస్తోంది. అనేక రకాల పండ్ల మొక్కలను ఐదేళ్లుగా ఈ పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తోంది. వనపర్తి జిల్లా మదనాపురంలోని ఉద్యాన బోధనా క్షేత్రంలో 11 ఎకరాల రాళ్లతో కూడిన బంజరు భూమిలో అసిస్టెంట్ ్రపొఫెసర్ డా. జడల శంకరస్వామి 2019 నుంచి ఈ ప్రయోగాత్మక సాగు పద్ధతిని అవలంభిస్తూ భూమిని క్రమంగా సారవంతం చేస్తున్నారు. ఎత్తుమడులు.. అధిక సాంద్రత.. 11 ఎకరాలను ఎకరం ప్లాట్లుగా చేసి నేల తీరుకు సరిపోయే పంటలను సాగు చేస్తున్నారు. ఉదాహరణకు రాళ్లు రప్పలతో కూడిన నేలలో దానిమ్మ (భగువ) రకం మొక్కల్ని అధిక సాంద్రతలో ఎకరానికి 300 నాటారు. అదేవిధంగా, 7 రకాల మామిడి, మూడు రకాల అంజూర, జామ, మునగ తదితర తోటలను వేశారు. భూమిని దుక్కి చేసి 2.5 అడుగులు (75 సెం.మీ.) వెడల్పుతో.. సాళ్ల మధ్యలో మీటరు లోతున తవ్విన మట్టిని పోసి 2 మీటర్ల ఎత్తున బెడ్స్ చేశారు. సాళ్ల మధ్య 16 అడుగులు, మొక్కల మధ్య 10 అడుగుల దూరం పాటించారు. ఎత్తుమడులపై మొక్కలు అధిక సాంద్ర పద్ధతిలో నాటి డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారు. గుంతకు 5 కిలోల వర్మీ కంపోస్టు వేసి మొక్కలు నాటారు. ఇక ఆ తర్వాత ఎటువంటి రసాయనిక ఎరువులు గానీ, సేంద్రియ ఎరువులు గానీ, పిచికారీలు గానీ చేయటం లేదు. కలుపు మొక్కలే బలం! ఏ పొలంలో మొలిచే కలుపు మొక్కలను పీకి ఆ పొలంలోనే ఆచ్ఛాదనగా వాడటంతో పాటు.. ఆ మొక్కలను మురగబెట్టి సస్యగవ్య అనే ద్రవ రూప ఎరువును తయారు చేస్తున్నారు. దీన్ని అదే పొలంలో గడ్డీ గాదాన్ని కుళ్లించడానికి వినియోగించటం ద్వారా భూమిని సారవంతం చేసుకోవచ్చు. బంజరు భూముల్ని, సారం కోల్పోయిన భూముల్ని సాగులోకి తేవటానికి బయటి నుంచి ఎటువంటి ఉత్పాదకాలను ఖర్చుపెట్టి కొని తెచ్చి వేయాల్సిన అవసరం లేదని రైతులకు తెలియజెప్పడానికే ఈ ప్రయోగాన్ని చేపట్టామని డా. శంకరస్వామి ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. కలుపు మొక్కలుగా మనం భావించేవాటిలో చాలా మటుకు నిజానికి ఔషధ మొక్కలేనని అంటూ.. వాటిని పీకి పారేయటం కాకుండా అదే నేలలో కలిపేస్తే చాలు. కలుపు ఆచ్ఛాదనపై సస్యగవ్య పిచికారీ ఇక ఏ రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు చల్లకుండా ఉంటే.. ఆ భూమిలోనే ఉండే సూక్ష్మజీవరాశి సంరక్షించబడి భూమిని క్రమంగా సారవంతం చేస్తుందని ఆయన తెలిపారు.గులక రాళ్లు సైతం భూసారాన్ని పెంపొందించడానికి దోహదపడుతాయని తమ అనుభవంలో వెల్లడైందన్నారు. గణనీయంగా పెరిగిన సేంద్రియ కర్బనం.. సస్యగవ్యతో సేద్యం చేయనారంభించిన తొలి దశలో, నాలుగేళ్ల తర్వాత పండ్ల తోటలో భూసార పరీక్షలు చేయించగా భూసారం గణనీయంగా వృద్ధి చెందింది. 11 ఎకరాల్లో సగటున సేంద్రియ కర్బనం 0.24 నుంచి 0.53కి, సేంద్రియ పదార్థం 0.1 నుంచి 1%కి పెరిగింది. వీటితో పాటు మట్టిలో టోటల్ నైట్రోజన్ 0.015 నుంచి 0.045కి పెరిగిందని డా. శంకర స్వామి తెలిపారు. సస్యగవ్యను వరుసగా నాలుగేళ్లు వాటం వల్ల సాగుకు యోగ్యం కాని భూమిని కూడా తిరిగి సారవంతం చేయటం సాద్యమేనన్నారు. ఒక్కో రకం పండ్ల తోట సాగులో ఉన్న తోటలో వేర్వేరు రకాల కలుపు మొక్కలు, ఔషధ మొక్కలు మొలుస్తున్న విషయం గుర్తించామన్నారు. మట్టిలోని గులకరాళ్లు కూడా పరోక్షంగా మట్టిని సారవంతం చేయడానికి పరోక్షంగా దోహదపడుతున్నట్లు కూడా గుర్తించామని అంటూ.. సాగు భూమిలోని గులక రాళ్లు పనికిరానివేమీ కాదన్నారు. బెడ్స్ మధ్యలో రాళ్ల భూమి - బోడ్స్ మధ్య కలుపు ఆచ్ఛాదన ‘సస్యగవ్య’ తయారీ ఇలా.. పొలంలో మొలిచిన కలుపు మొక్కలను ఏడాదికి మూడు దఫాలు పీకి వాటితో సస్యగవ్యను డా. శంకర స్వామి తయారు చేయిస్తున్నారు. ఆ పొలంలోని తాజా కలుపు మొక్కలు కిలో, తాజా ఆవు పేడ కిలో, ఆవు మూత్రం లీటరు, రెండు లీటర్ల నీటి (1:1:1:2)తో కలిపి పొలంలోనే నీడన ఫైబర్ పీపాల్లో మురగబెడుతున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం కలియదిప్పుతుంటే 10–12 రోజుల్లో సస్యగవ్య ద్రవ రూప ఎరువు సిద్ధమవుతుంది. ఆ పొలంలోనే సాళ్ల మధ్యలో ఆచ్ఛాదనగా వేసిన గడ్డీ గాదం, ఆకులు అలములు, కొమ్మలు రెమ్మలపై సస్యగవ్యను 1:1 పాళ్లలో నీరు కలిపి పిచికారీ చేస్తున్నారు. వారం తర్వాత ఆ గడ్డీ గాదాన్ని రొటోవేటర్‌తో మట్టిలో కలియదున్ని, ఆ మట్టిపై మరోసారి సస్యగవ్యను పిచికారీ చేస్తున్నారు. తద్వారా ఈ సేంద్రియ పదార్థం కుళ్లి మట్టిలో కలిసిపోయి భూమి సారవంతం అవుతోంది. ఏడాదిలో మూడు సీజన్లలో కొత్తగా కలుపు మొలిచినప్పుడు ఆ కలుపు మొక్కలతో మాత్రమే దీన్ని తయారు చేసి వాడుతున్నారు. భూమిని సారవంతం చేయటానికి ఈ ఒక్క పని తప్ప మరే ఎరువూ వేయటం లేదు. డ్రిప్ ద్వారా అవసరం మేరకు నీరు మాత్రం క్రమం తప్పకుండా ఇస్తున్నారు. రైతులు అనుసరించడానికి ఇది చాలా అనువైన, ఖర్చులేని పద్ధతని డా. శంకరస్వామి అంటున్నారు. ఇంతకీ దిగుబడి ఎంత? స్వల్ప ఖర్చుతోనే బంజరు భూముల్ని, రసాయనిక వ్యవసాయం వల్ల నిస్సారమైన భూముల్ని తిరిగి సారవంతం చేసుకొని ఫలసాయాన్నిచ్చేలా పునరుజ్జీవింపచేయొచ్చని మా ప్రయోగం రుజువు చేసింది. సస్యగవ్యతో కూడిన ప్రకృతి సేద్యంలో 4 ఏళ్ల తర్వాత ఒక్కో దానిమ్మ (భగువ) చెట్టుకు 3.96 కిలోల పండ్లు, అంజూర (డయాన) చెట్టుకు 13.8 కిలోల పండ్లు, జామ (అలహాబాద్ సఫేది) చెట్టుకు 1.65 కిలోల దిగుబడి వచ్చింది. బయటి నుంచి ఏదీ కొని వేయకుండా సాధించిన ఫలసాయం ఇది. – డా. జడల శంకరస్వామి (97010 64439), ఉద్యాన కళాశాల, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం -
రంగుల్లో వరి వంగడాలు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రసాయన వ్యవసాయంలో హైబ్రిడ్ రకాల ప్రభావం పెరిగిపోతున్న ఈ రోజుల్లో దేశ వాళీ రకాల పరిరక్షణకు ఓ యువకుడు నడుం బిగించాడు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా.. ఆరంభంలో ఐదు రకాల వరి వంగడాలతో సాగు మొదలుపెట్టి, నేడు 300 పైచిలుకు వరి విత్తనాలను సాగుచేస్తున్నాడు. ఎలాంటి లాభాపేక్షకు పోకుండా.. దేశవాళీ రకాలను దేశమంతా విస్తరింపజేయాలన్న సంకల్పంతో పదిమందికి పంచుతూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు.. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం వ్యవసాయ విస్తరణ అధికారి యాదగిరి శ్రీనివాస్. వ్యవసాయంపై ఉన్న మక్కువకు తోడు సేంద్రియసాగులో పాలేకర్ ప్రభావంతో దేశీయవిత్తనాలను కాపాడాలనే లక్ష్యంతో తనకు ఉన్న మూడెకరాల వ్యవసాయభూమిలో సాగుచేస్తున్నాడు. పండించిన వరిధాన్యాన్ని తన అవసరాలకు పోగా, మిగిలిన వాటిని తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు చేసే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా సాగుతున్నాడు. వివిధ రకాల దేశవాళీ వరి వంగడాలను ఇతర ప్రాంతాల నుండి సేకరించి ప్రకృతి వ్యవసాయ(సేంద్రీయవిధానంలో పండిస్తున్నాడు. ఇంద్రధనస్సు రంగులీనే ఈ వంగడాలు బాలింతల్లో పాల వృద్ధికి, పురుషుల్లో వీర్యవృద్ధికి ఉపయోగపడటం విశేషం. రసాయనాలు లేని సేంద్రియ సాగు చేయాలన్న ఆకాంక్షతో 2009లో పాలేకర్ శిక్షణ శిబిరానికి ఏఈవో శ్రీనివాస్ హాజరయ్యారు. దీనిలో భాగంగా మొదట్లో పరిమళ సన్నా(తమిళనాడు), పంచరత్న (ఈశాన్యరాష్ట్రాల) కాలబట్టి(బెంగాల్, దుదేశ్వర్, అంబేమహర్(మహారాష్ట్ర)లకు చెందిన ఐదు రకాల వరి వంగడాలను తీసుకొచ్చి సాగు మొదలు పెట్టాడు. దేశంలో ఒకప్పుడు ఐదువేలకుపైగా రకాలు సాగులో ఉండేవి. ఇవి మనిషి జీవితంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అన్ని దశల్లోనూ కావాల్సిన పోషకాలను అందించగలవు. చిన్నారుల ఉగ్గు నుండి మొదలుకొని దేవుడి నైవేద్యం వరకు ప్రత్యేక రకాల వరి బియ్యం సాగులో ఉండేవి. ఆ రకాలను కాపాడాలన్న సంకల్పంతో ఇలా ఐదు నుంచి మొదలుపెట్టిన వరిరకాలు నేడు 300 వరివంగడాలకు చేరుకున్నాయి. శ్రీనివాస్ సాగు చేసే రకాలు.. 1) నల్లరంగు వడ్లు: పంచరత్న, కాలాబట్ట, బర్మాబ్లాక్, కరిగేజావలి, ఇల్లపు సాంబా, కరిజిద్దా, రమ్యగళి, నవార, కాకిరెక్కలు, కాలాజీరా, ముడిమురంగి, తలంగూర్, తైవాన్బ్లాక్, చిట్టిగ, కాజీసాల. 2) గోధుమ రంగు వడ్లు: మాపిళైసాంబా, కండసాగర్, ఆప్తోకల్, కస్మకుందా, హల్లబట్టా. 3) ఎరుపు రంగు వడ్లు: సేలం సన్న, చిన్న బైసి ల్మోర్, రాంశ్రీ, అరుకులోయ, కుంకుమసాలి. 4) పొట్టిగింజ వడ్లు: తులసీబాసో, డడ్డీగ, అంబేమోహర్, పరిమళ సన్న, నికో, బాలాజీ, రాధజీగేల్, బేళనాళా, జీరగసాంబా, టిక్కిమిస్రీ, సమేలీ బోగ్, బాస్ బోగ్, ఘని. 5) సువాసన వడ్లు: బాసుమతి(ఢిల్లీ, చంద్రగుప్తా, లోకల్), పరిమళ సన్న, సుగంధి, అంబేమొహర్. 6) సన్నవడ్లు: దూదేశ్వర్, చింతలూరి సన్న, ఛత్తీస్‌గఢ్, మచ్చ కాంత, డీఆర్కే2, రాణి కంద, సొనకడిక, నారాయణ కామిని, కమల్ సాంగ్రి, రత్న చోడి. 7) పొడవు వడ్లు: మల్లీపూల్, సన్నజాజులు. 8) దొడ్డు వడ్లు: నికో, బహురూపి, రెడ్ జాస్మిన్. సాగు చేసిన వాటిలో కొన్ని రకాల ప్రత్యేకతలు 1) పుంగార్: బాలింతలకు అధిక పాల వృద్ధికి దోహదపడుతుంది. 2) మపిలైసాంబా: యుక్త వయస్సు వారికి వీర్య వృద్ధికి తోడ్పడుతుంది. 3) కులాకార్: గర్బిణులకు సుఖ ప్రసవానికి ఉపయోగపడుతుంది. 4) నవారా: మధుమేహ వ్యాధి గ్రస్తులకు వ్యాధి నియంత్రణకు, నివారణకు ఉపయుక్తంగా ఉంటుంది. 5) బ్లాక్ రైస్: అన్ని రకాల నల్ల బియ్యం రోగనిరోధక శక్తి పెంపొందిస్తాయి. -
జీవన ఎరువులు - వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత
-
ఫ్యామిలీ ఫార్మర్!
ఏడేళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ ఇచ్చిన శిక్షణ యువ రైతు జగదీశ్ రెడ్డి జీవితాన్ని మార్చేసింది. అంతకుముందు పదిహేనేళ్లుగా రసాయనిక వ్యవసాయం చేస్తున్న ఆయనకు అప్పటి వరకు తాను చేస్తున్న తప్పులేమిటో అర్థమయ్యాయి. రైతుగా తాను చేయాల్సిందేమిటో బోధపడింది. ఇక వెనక్కి చూడలేదు. 25 ఎకరాల పొలంలో వరి, మామిడి, వేరుశనగ, మినుము, కంది, కొర్రల వంటి పంటలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్నారు. దేశంలోని అనేక నగరాల్లో నివాసం ఉంటున్న కనీసం 50 కుటుంబాలకు ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని నేరుగా అందిస్తున్నారు. ఏటా రూ.7–8 లక్షల నికరాదాయం గడిస్తున్నారు. మరో 50 మంది సేంద్రియ రైతులతో కలిసి పనిచేస్తున్నారు. ప్రతి కుటుంబానికీ విధిగా ఉండాల్సింది వ్యాధులను నయం చేసే ‘ఫ్యామిలీ డాక్టర్’ కాదు.. జబ్బుల పాలు చేయని అమృతాహారాన్నందించే ‘ఫ్యామిలీ ఫార్మర్’ కావాలంటున్న జగదీశ్‌రెడ్డి నిజమైన ఫ్యామిలీ ఫార్మర్. న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.ఎ.ఆర్.ఐ.) ఆయనకు ఇటీవల ‘ఇన్నోవేటివ్ ఫార్మర్’ అవార్డును ప్రదానం చేసిన సందర్భంగా ప్రత్యేక కథనం.. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వై. జగదీశ్ రెడ్డి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేయకుండానే పాతికేళ్ల క్రితం వ్యవసాయం చేపట్టారు. చిత్తూరుజిల్లా బంగారుపాళ్యం మండలం దండువారిపల్లె ఆయన స్వగ్రామం. గ్రామానికి దగ్గరగా కొంత, పది కిలోమీటర్ల దూరంలో కొండ కోనల్లో అడవికి దగ్గరగా మొగిలి గ్రామంలో మరికొంత పొలం ఉంది. మొత్తం పాతిక ఎకరాలు. వ్యవసాయ బావుల ఆధారంగా వ్యవసాయం చేస్తున్నారు. అడవికి దగ్గరగా ఉన్న పొలంలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. పదిహేనేళ్లు రసాయనిక ఎరువులు, పురుగుమందులతో వ్యయప్రయాసలకోర్చి వ్యవసాయం చేసి విసిగిపోయిన దశలో 2011లో పాలేకర్ శిక్షణా శిబిరంలో పాల్గొన్నాడు. ఆ శిక్షణ జగదీశ్ రెడ్డి జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. నేలతల్లితో, మొత్తం ప్రకృతితో తెగిపోయిన సంబంధం తిరిగి అనుసంధానమైన భావన మదిలో నిండింది. సొంత దేశీ ఆవుల పేడ, మూత్రం తదితరాలతో ఘనజీవామృతం, బీజామృతం, జీవామృతం, దశపత్రకషాయం.. వంటి ఉత్పాదకాలనే వాడుతున్నారు. బొత్తిగా రసాయనాలు వాడకుండా 15 ఎకరాల్లో (7.5 ఎకరాల్లో లేత తోట, 7.5 ఎకరాల్లో ముదురు తోట)మామిడి, ఆరెకరాల్లో వేరుశనగ, ఎకరంలో చెరకు, ఎకరంలో కొర్రలు, 3 ఎకరాల్లో వరి ప్రధాన పంటలుగా పండిస్తున్నారు. వీటిలో అనేక అంతరపంటలు వేస్తున్నారు. శ్రమ పెరిగానా ఖర్చు తగ్గిపోయింది. నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. అటవీ జంతువుల దాడులు, కూలీల సమస్య వంటి అనేక సమస్యలతో సతమతమవుతూనే ప్రకృతి వ్యవసాయంలో మాధుర్యాన్ని చవిచూస్తున్నారాయన. తొలుత దిగుబడులు తక్కువగా వచ్చినా క్రమంగా సంతృప్తికరమైన దశకు పెరిగాయి. భూమిలో వానపాములు, సూక్ష్మజీవులకు పెద్ద పీట వేసే వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ ప్రకృతితో మమేకం కావడం.. రసాయనిక అవశేషాల్లేని నాణ్యమైన, పోషకాలతో కూడిన ఆ ఆహారాన్ని తిన్న వారిలో ఆరోగ్యం మెరుగవ్వడంతో జగదీశ్‌రెడ్డికి ప్రకృతి రైతుగా తన బాధ్యత ఎంత సమున్నతమైనదో ఎరుకలోకి వచ్చింది. మారుమూల గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటికీ.. వివిధ రాష్ట్రాల్లో జరిగే సమావేశాలు, సదస్సుల్లో పాల్గొంటూ తరచూ వ్యవసాయదారులను, పౌష్టికాహార నిపుణులను, వైద్యులను కలుసుకుంటూ అనుభవాలను కలబోసుకోవడం జగదీశ్ రెడ్డికి ఇష్టమైన పని. ఆ పరిచయాలతో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లోని కుటుంబాలకు తాను పండించే నాణ్యమైన పోషక విలువలతో కూడిన రసాయన రహిత ఆహారోత్పత్తులను నేరుగా విక్రయించడం ప్రారంభించారు. ఇందుకోసం వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. రైతులకు తన అనుభవాలను పంచడం కూడా ఇందులో ఒక ముఖ్య విషయం. ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి ఆహారోత్పత్తుల ఆవశ్యకత గురించి రైతులకు తెలియజెప్పి.. సలహాలు సంప్రదింపుల ద్వారా ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేయడం ఆయనకు ఇష్టమైన వ్యాపకం. తన పొలంలో పండించిన ప్రకృతి వ్యవసాయోత్పత్తులను నగరవాసులకు విక్రయించడంతోపాటు.. మరో 50 మంది ప్రకృతి వ్యవసాయ దారుల నుంచి సేకరించిన ఉత్పత్తులను సైతం వివిధ నగరాల్లో వినియోగదారులకు నేరుగా విక్రయించేందుకు అనుసంధానకర్తగా జగదీశ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రావాలంటే ధాన్యాలను నేరుగా కాకుండా శుద్ధిచేసి ఆహారోత్పత్తులుగా మార్చి అమ్ముకోవడం రైతులు నేర్చుకోవాలని ఆయన అంటుంటారు. బియ్యం, వేరుశనగలను ఎద్దు కట్టె గానుగ నూనెగా మార్చి అమ్ముకోవడం అవసరం అంటారు జగదీశ్ రెడ్డి. శుద్ధమైన గానుగ నూనె తీసిన తర్వాత వారం రోజులు ఎండలో ఉంచితే మరింత ఆరోగ్యదాయకంగా మారుతుందని, ఈ పద్ధతిలోనే తాను వేరుశనగ సంప్రదాయ గానుగ నూనెను ఉత్పత్తి చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం మామిడి వాతావరణం అనుకూలించిందని, పూత కాలంలో వర్షం పడకపోవడం వల్ల కాపు బాగుందని ఆయన తెలిపారు. ఏనుగుల దాడి వల్ల రబీలో ఈ ఏడాది వరి సాగు చేయడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు దెబ్బతినాల్సి వస్తున్నాదన్నారు. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం తప్ప వేరే దారి కనపడటం లేదన్నారు. ప్రకృతి రైతుగా ఏడాదికి రూ. 7–8 లక్షల నికరాదాయం పొందుతూ, అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆత్మసంతృప్తితో జీవనం గడుపుతున్నానంటారు జగదీశ్‌రెడ్డి. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి విద్యార్థులు, రైతులు, సందర్శకులు తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తుండడం.. తన అనుభవాలను శాస్త్రవేత్తలు సైతం ఆసక్తిగా గమనించడం.. అవార్డులు, పురస్కారాల కన్నా ఎంతో సంతృప్తినిస్తున్నదని ఆయన అంటారు. తరచూ పొలానికి వచ్చే ఏడేళ్ల తన కుమారుడు పార్థురెడ్డిని ప్రకృతి వ్యవసాయదారుడిగా చూడాలన్నదే తన ఆశ అంటారాయన! నేషనల్ న్యూట్రిషన్ అవార్డు (2016–న్యూఢిల్లీ), గ్లోబల్ అవుట్ రీచ్ హెల్త్ కేర్ అవార్డు (2017–జైపూర్), ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు (2019–ఐ.ఎ.ఆర్.ఐ.)లను జగదీశ్వరరెడ్డి అందుకున్నారు. ప్రతి కుటుంబానికీ ఫార్మర్ ఉండాలి! సమాజంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ కన్నా ముఖ్యంగా ఫ్యామిలీ ఫార్మర్ ఉండాలి. ప్రభుత్వం వైద్యం కోసం, ఆసుపత్రుల కోసం ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ప్రజలకు లభించేది ‘మెడికల్ కేర్’ మాత్రమే. అసలైన ‘హెల్త్ కేర్’ అందించగలిగిన వారు ప్రకృతి వ్యవసాయదారులు మాత్రమే. జబ్బు వచ్చాక బాగు చేసుకునే ప్రయత్నం చేయడం కన్నా జబ్బు రాకుండా ఉండే ఆహారాన్ని పండించి అందించడం ముఖ్యం. ప్రకృతి వ్యవసాయంలో నేల లోపలి పొరల నుంచి వానపాములు, సూక్ష్మజీవుల నుంచి సకల పోషకాలను తీసుకొని ప్రకృతి వ్యవసాయంలో పంటలు నిజమైన పోషకాలతో కూడిన గింజలు, కాయలు, పండ్లను మనకు అందిస్తున్నాయి. ఇటువంటి ఆహారాన్నందించే ఫ్యామిలీ ఫార్మరే ప్రతి కుటుంబానికీ కావాలిప్పుడు. – వై. జగదీశ్‌రెడ్డి(94400 44279), ప్రకృతి వ్యవసాయదారుడు, దండువారిపల్లె, బంగారుపాళ్యం మండలం, చిత్తూరు జిల్లా వేరుశనగ పంట చెరకు తోటలో జగదీశ్ రెడ్డి ఇన్పుట్స్: పద్మనాభరెడ్డి, సాక్షి, యాదమరి ఫొటోలు: శివశంకర్, సాక్షి, బంగారుపాళ్యం -
సేంద్రియ లాభాల కో(క్కొరో)కో!
‘సాగు గిట్టుబాటు కావడం లేదు. పెట్టిన పెట్టుబడులు రావడం లేదు. దీర్ఘకాలిక పంటే అయినా సాగు చేస్తూ నష్టాలు చవిచూడలేము. దీనికన్నా కోకో తోటలను తొలగించుకోవడమే మేలు’ ఇది కోనసీమలో రసాయనిక వ్యవసాయం చేసే కోకో రైతుల ఆవేదన. అయితే, సేంద్రియ పద్ధతులు పాటించే రైతులు ఖర్చులు భారీగా తగ్గించుకొని లాభాల బాటలో సాగుతున్నారు. కొబ్బరి సాగులో కోకో ప్రధాన అంతర పంట. కొబ్బరితోపాటు ఆయిల్ పామ్ తోటల్లో సైతం దీన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా వేలాది ఎకరాల్లో కోకో సాగు జరుగుతున్నది. ఇటీవల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో దీని విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సైతం కోకో సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉంది. కొబ్బరి సంక్షోభ సమయంలో రైతులను ఆదుకున్నది కోకో పంటే. కోకో ఆదాయంపైనే కొబ్బరి రైతులు ఆధారపడిన సందర్భాలూ లేకపోలేదు. అటువంటిది పెట్టుబడులు పెరగటం, పెట్టుబడులకు తగిన ఆదాయం రాక కోనసీమలో పలువురు రైతులు కోకో తోటలను తొలగిస్తున్నారు. గడిచిన ఒకటి, రెండు నెలల్లో పలువురు రైతులు అరటి తోటల్లో కోకో చెట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారు. ఇందుకు వారు చెప్పే కారణాలివి.. ఇటీవల కాలంలో పెట్టుబడులు పెరగడం, తగిన దిగుబడి రాకపోవడం, కోకో గింజలకు కనీస ధర రాకపోవడం. సేంద్రియ సాగు పద్ధతే శ్రేయోదాయకం ఇటువంటి సమయంలో పెట్టుబడులు తగ్గించుకునేందుకు సేంద్రియ సాగు విధానం మేలు అని ఉద్యానశాఖాధికారులు, శాస్త్రవత్తేలు, ఈ విధానంలో సాగు చేస్తున్న రైతులు చెబుతున్నారు. రసాయనిక ఎరువుల స్థానంలో భూసారం పెంచుకునేందుకు జీవామృతం, వేస్ట్ డీ కంపోజర్, పంచగవ్య వంటి ద్రవరూప ఎరువులను వినియోగించడం, డ్రిప్ వాడకంతో పెట్టుబడులు మూడొంతులు తగ్గుతున్నాయని సేంద్రియ రైతులు చెబుతున్నారు. రూ. 13 వేలకు తగ్గిన పెట్టుబడి రసాయన పద్ధతుల్లో సాగు చేసే రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.70 వేల వరకు ఖర్చవుతుండగా, సేంద్రియ విధానంలో సాగు చేస్తే రూ.13 వేలు ఖర్చవుతుండటం విశేషం. పెట్టుబడులు తగ్గించుకోవడం ద్వారా సేంద్రియ రైతులు ఎకరాకు రూ.43,540 వరకు లాభాలు పొందుతుంటే.. రసాయన, సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేసే రైతులు ఎకరాకు రూ. 6,150 మేరకు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. తక్కువ ఖర్చు, లాభసాటి ధర సేంద్రియ సాగు వల్ల రసాయనిక సేద్యం కన్నా ఏ విధంగా చూసినా మేలే. తొలి రెండేళ్లు సెమీ ఆర్గానిక్ అంటే 60:40, 40:60 పద్ధతుల్లో సాగు చేశాను. గడచిన రెండేళ్ల నుంచి పూర్తిగా సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నాను. దీని వల్ల స్వల్పంగా దిగుబడి తగ్గినా.. పెట్టుబడులు సగానికి పైగా తగ్గాయి. డ్రిప్ వల్ల కూలీల ఖర్చును కూడా బాగా తగ్గించగలిగాను. సేంద్రియ విధానంలో సాగు చేస్తేనే లాభసాటి ధర వస్తోంది. – వంకాయల స్వామిప్రకాష్ (98663 55165), ఆదర్శ రైతు, ఇమ్మిడివరప్పాడు, అమలాపురం, తూ.గో. జిల్లా సేంద్రియ విధానంలో డ్రిప్ పెట్టిన కోకోతోట – ఎన్. సతీష్, సాక్షి, అమలాపురం -
నవార వరి భేష్!
రసాయనిక వ్యవసాయం నష్టదాయకమని తెలుసుకున్న రామాల మాధవరెడ్డి, సుభాషిణి రైతు దంపతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మామిడి, వరి సాగు ప్రారంభించి సంతృప్తికరమైన దిగుబడి పొందుతున్నారు. ఈ సీజన్లో మధుమేహరోగులకు ఉపయోగపడే దేశవాళీ నవార రకం ధాన్యం సాగు చేశారు. కందుకూరు మండలంలోని దొండపాడు గ్రామానికి చెందిన రామాల మాధవరెడ్డి. కౌలుకు ఎకరా పొలం తీసుకొని వరి సాగు చేస్తున్నారు. గత ఏడాది రబీలో శ్రీవరి పద్దతిలో ఎన్‌ఎల్‌ఆర్–33972 రకం వరిని పూర్తి సేంద్రియ ఎరువులను ఉపయోగించి సాగు చేశారు. ఎకరానికి 30 బస్తాలు దిగుబడి సాధించారు. తర్వాత తనకున్న మూడెకరాలలో మామిడి తోటలో సేంద్రియ ఎరువులను వాడటం ప్రారంభించారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులను పూర్తిగా నిలిపివేసి ప్రకృతి వ్యవసాయం వైపే మొగ్గుచూపాడు. మామిడి తోటలో వ్యవసాయం చేస్తున్న సమయంలో మామిడి పిందెలను పరిశీలించేందుకు మామిడి చెట్టు ఎక్కారు. ప్రమాదవశాత్తు మామిడి చెట్టు కొమ్మ విరిగి కింద పడిపోయాడు. దీంతో మాధవరెడ్డికి నడుము, కాలు ప్రమాదానికి గురై పూర్తిగా బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. ఆ దశలో మాధవరెడ్డి భార్య సుభాషిణి, కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి వ్యవసాయంపై దృష్టి సారించటం విశేషం. ఒంగోలులో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటి దగ్గర నుంచే కాలేజ్‌కి వెళ్లి వస్తూ వ్యవసాయ పనుల్లో తల్లికి చేదోడుగా ఉంటున్నారు. ప్రకృతి వ్యవసాయ నిపుణుడు ధనుంజయ త్రిపురాంతకం నుంచి రెండు కిలోల దేశవాళీ నవార రకం వరి విత్తనాలు తెచ్చి ఇచ్చారు. వ్యవసాయాధికారులు, ప్రకృతి వ్యవసాయ నిపుణుల సూచనల ప్రకారం బీజామృతంతో «విత్తన శుద్ధి చేసి, జీవామృతం, ఘన జీవామృతం వాడారు. తెగుళ్ల నివారణకు పుల్లని మజ్జిగ, వావిలాకు కషాయం, ఇంగువ ద్రావణం వాడారు. శ్రీవరి పద్ధతిలో మొక్కకు మొక్కకు 25“25 సెంటీమీటర్ల దూరంలో నాటారు. గింజ గట్టి పడడానికి ఏడు రకాల పప్పు ధాన్యాలతో తయారు చేసుకున్న టానిక్‌ను వాడారు. మూడున్నర నెలల పంటకాలంలో 14 ఆరుతడులు ఇచ్చి, ఇటీవలే నూర్పిడి చేశారు. ఇలా రెండు కిలోల విత్తనాలను ఎకరంలో సాగు చేసి రూ. 12,150 ఖర్చుతో వెయ్యి కేజీల నవార ధాన్యం దిగుబడి సాధించారు. నవారి రకం వరి వడ్లు నలుపు రంగులో బియ్యం బ్రౌన్ రంగులో ఉంటాయి. ఈ బియ్యం డయోబెటిక్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా వాడతారు. మార్కెట్లో ఈ బియ్యానికి గిరాకీ ఉంది. 75 కేజీల బస్తా రూ. 3,500లకు విక్రయిస్తానని రైతు మాధవరెడ్డి చెప్తున్నారు. బియ్యం తిన్నవారు రసాయనిక మందులతో పండించిన బియ్యం తినలేరని ఆయన అంటున్నారు. నవార రకం వరిని సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు విత్తనాలు ఉచితంగా ఇస్తానని మాధవరెడ్డి తెలిపారు. – విజయ్, కందుకూరు రూరల్, ప్రకాశం జిల్లా రైతు మాధవరెడ్డి, నవార రకం బియ్యం -
అమ్మిన 12 ఎకరాలు..మళ్లీ కొన్నది
రసాయనిక వ్యవసాయంలో నష్టాలపాలై ఉన్న 20 ఎకరాల్లో 12 ఎకరాలను తెగనమ్ముకున్నారు. అంతటి సంక్షోభ కాలంలో పరిచయమైన ప్రకృతి వ్యవసాయం వారి ఇంట సిరులు కురిపిస్తోంది. అమ్మిన ఆ 12 ఎకరాలను తిరిగి కొనుక్కున్నారు.. అవే పంటలు.. అదే పొలం.. మారినది సాగు పద్ధతి మాత్రమే.. రసాయనిక వ్యవసాయం వారిని అప్పుల్లో ముంచింది. ఆ అప్పులు ఉన్న 20 ఎకరాల పొలంలో 12 ఎకరాలను మింగేశాయి. ఇక వ్యవసాయం వద్దే వద్దు.. అనుకుంటున్న తరుణంలో పరిచయం అయిన ప్రకృతి వ్యవసాయం ఈ లావణ్యా రమణారెడ్డి కుటుంబం తలరాత మారిపోయింది. కల నెరవేరింది..! తెగనమ్ముకున్న అదే 12 ఎకరాల భూమిని మళ్లీ తిరిగి కొనుక్కున్నారు. నమ్ముకున్న రైతు కుటుంబానికి ప్రకృతి వ్యవసాయం దీర్ఘకాలంలో ఎంత మేలు చేస్తుందో లావణ్యా రమణారెడ్డి కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుంది. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన లావణ్య భర్త రమణారెడ్డితో కలిసి 16 ఏళ్లుగా ప్రకృతి సేద్యాన్ని లాభదాయకంగా కొనసాగిస్తున్నారు. కళ్లు చెదిరే దిగుబడులు తీస్తున్నారు. కారువంగ గ్రామానికి ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన లావణ్య ప్రజలకు సేవలందిస్తూనే ప్రకృతి వ్యవసాయంపై దృష్టికేంద్రీకరిస్తున్నారు. రైతులకూ శిక్షణ ఇస్తున్నారు. లావణ్య భర్త రమణారెడ్డితో కలిసి ప్రతి రోజూ తమ పొలంలో పత్తి, మిరప, ఆముదం,మొక్కజొన్న, వరి లాంటి పంటలను గతంలో రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసేవారు. అప్పులపాలై 12 ఎకరాలు అమ్ముకున్న తర్వాత వ్యవసాయం మానేద్దామనుకున్న తరుణంలో.. మహారాష్ట్రకు చెందిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ పుస్తకాల్లో చదివి తెలుసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో మహారాష్ట్ర వెళ్లి పాలేకర్‌ను కలుసుకొని.. కొద్దిరోజులపాటు అక్కడే ఉండి శిక్షణ పొందారు. మొదట కేవలం ఒక సెంటు భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 2002లో ప్రయోగాత్మకంగా కనకాంబరం తోటను సాగు చేసి అధిక దిగుబడులు సాధించారు. 2003లో అర ఎకర పొలంలో మిర్చి పంట వేసి ఆరు క్వింటాళ్ల దిగుబడి పొందారు. జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలను స్వయంగా తయారు చేసుకొని వాడుతున్నారు. ఈ ఏడాది ఎకరానికి 10 క్వింటాళ్ల పత్తి దిగుబడిని సాధించారు. ఈ ఏడాది రసాయనిక వ్యవసాయంలో వరిని సుడిదోమ దెబ్బతీసింది. అయితే, లావణ్య పొలంలో ఎకరానికి 78 బస్తాల(బస్తా 60 కిలోలు) ధాన్యం దిగుబడి వచ్చింది. 3 ఎకరాల్లో మిరప తోట సాగు చేయగా.. ఇప్పటికి పండు మిర్చి 3 కోతల్లో 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇంకా ఎకరానికి 6–7 క్వింటాళ్ల కాయ ఉందని ఆమె తెలిపారు. మిరపలో ధనియాలు, ఆవాలు, మెంతులు, గోధుమలు, వేరుశనగ వంటి అంతర పంటలు ఉన్నాయి. అంతరపంటల ద్వారా ఖర్చు తిరిగి వచ్చేస్తే.. ప్రధాన పంట ద్వారా వచ్చే ఆదాయం అంతా నికరాదాయంగా ఉంటుందన్నది పాలేకర్ వ్యవసాయంలో మూల సూత్రం. ఈ సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తూ దినదినాభివృద్ధి సాధిస్తున్నారు లావణ్యా రమణారెడ్డి దంపతులు. ప్రకృతి సాగే తమకు ఎంతగానో నచ్చిందని, ఖర్చు కూడా బాగా తగ్గిందన్నారు. ఇతర గ్రామాల రైతులు సైతం లావణ్య, రమణారెడ్డి చేపట్టిన ప్రకృతి సేద్యంపై ఆసక్తి పెంచుకున్నారు. – శ్రీధర్, సాక్షి, నాగర్‌కర్నూల్, తెలంగాణ వ్యవసాయాన్ని ఉద్యోగంలా భావిస్తేనే లాభాలు! వ్యవసాయాన్ని చాలా మంది రైతులు చాలా తేలికగా తీసుకుంటారు. నిరాసక్తతతో సేద్యం చేస్తారు. ఈ ధోరణే వారిని నష్టాల పాలు చేస్తున్నది. వ్యవసాయ రంగం ఇతర రంగాలకు ఏ మాత్రం తీసిపోదు. దీన్ని ఓ ఉద్యోగంలా భావించి, అనుదినం కనిపెట్టుకొని అన్ని పనులూ స్వయంగా చేసుకోవాలి. మరీ అవసరం ఉన్నప్పుడే కూలీలపై ఆధారపడాలి. ఎంతో శ్రమకోర్చి పండించిన పంటను మార్కెట్ చేసుకునే విషయంలోనూ శ్రద్ధ చూపాలి. మేము పండించే ఎండు మిరప కాయలతో కారం పొడిగా మార్చి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నాం. దీంతో మిర్చి ఆదాయం రెండింతలైంది. – కసిరెడ్డి లావణ్య రమణారెడ్డి(77300 61819), సీనియర్ ప్రకృతి వ్యవసాయదారు,కారువంక, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం -
‘ఏపీ సర్కారువి వికృత పోకడలు’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా రసాయనిక వ్యవసాయం వల్ల రసాయనిక అవశేషాలు, పోషకాల లోపంతో కూడిన ఆహారోత్పత్తి జరుగుతోందని ప్రముఖ శాస్త్రవేత్త, దేశీ విత్తన పరిరక్షణ ఉద్యమకారిణి డాక్టర్ వందనాశివ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆహారం తినడం వల్లే జీవనశైలి వ్యాధులు మానవాళికి పెనుముప్పుగా పరిణమించాయని వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ప్రారంభమైన రెండు రోజుల అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ (పర్మాకల్చర్) సదస్సులో వందనాశివ ప్రారంభోపన్యాసం చేశారు. పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల ద్వారా పండిస్తున్న పంటల వల్ల ప్రకృతి వనరులు 70% ఖర్చవుతూ కేవలం 30% ఆహారోత్పత్తి అవుతోందని వందన తెలిపారు. ప్రజలు కేన్సర్, షుగర్, గుండెజబ్బుల వంటి జీవనశైలి వ్యాధుల బారినపడటానికి 75% రసాయనిక అవశేషాలున్న ఆహారమే కారణమన్నారు. మరోవైపు చిన్న, సన్నకారు రైతులు కేవలం 30% వనరులను ఉపయోగిస్తూ 70% ఆహారాన్ని సమాజానికి అందిస్తున్నారన్నారు. రసాయనిక వ్యవసాయం, బీటీ పత్తి వంటి జన్యుమార్పిడి పంటల వల్ల రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారని చెప్పారు. రసాయనిక వ్యవసాయం కొనసాగితే మరో వందేళ్లలో తిండి కూడా దొరకదన్నారు. బహుళజాతి కంపెనీలకు లాభాలు తెచ్చిపెట్టే సాంకేతికతలను అభివృద్ధి పేరుతో రైతులపై రుద్దుతున్న బిల్‌గేట్స్ వంటి వ్యక్తులు పర్యావరణ అజ్ఞానులని ఆమె విమర్శించారు. అటువంటి వారి అడుగులకు మడుగులొత్తే ముఖ్యమంత్రులుండటం దురదృష్టకరమని పరోక్షంగా ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రకృతి/శాశ్వత వ్యవసాయ పద్ధతుల వల్లే సాగు సంక్షోభం శాశ్వతంగా పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఏపీ సర్కారువి వికృత పోకడలు: రాజేంద్రసింగ్ నదుల సహజ ప్రవాహాన్ని అడ్డుకోవడం, సారవంతమైన వ్యవసాయ భూములను రైతుల నుంచి లాక్కోవడం వంటి వికృత పోకడలకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా మారిందని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, జలయోధుడు రాజేంద్రసింగ్ విమర్శించారు. పాలకులు, ప్రజలు జల చైతన్యంతో వ్యవహరించినప్పుడే నీటి వనరుల పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. ఎండిపోయిన నదులను దశాబ్దాల తర్వాత పునరుజ్జీవింపజేయడం సాధ్యమేనని తాము రాజస్తాన్‌లో రుజువు చేశామన్నారు. పర్మాకల్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు విఠల్ రాజన్ ప్రసంగిస్తూ జీవ వైవిధ్యానికి పెద్దపీట వేసే వ్యవసాయ సంస్కృతికి భారత్ పెట్టింది పేరన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన పర్మాకల్చర్ ఉద్యమ నేత రోజ్మేరో, భారతీయ సేంద్రియ వ్యవసాయదారుల సంఘం నేతలు డా. క్లాడ్ అల్వారిస్, డా. సుల్తాన్ ఇస్మాయిల్, అర్ధేందు చటర్జీ, ఏపీ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు టి. విజయకుమార్ తదితరులు ప్రసంగించారు. అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ వ్యవస్థాపకులు కొప్పుల నరసన్న అధ్యక్షత వహించిన ఈ సదస్సుకు 65 దేశాల నుంచి సుమారు 800 మంది ప్రతినిధులు, తెలుగు రాష్ట్రాల నుంచి 200 మంది రైతులు హాజరయ్యారు. సదస్సులో పాల్గొనే తెలుగు రైతుల కోసం ప్రత్యేక అనువాద సదుపాయం కల్పించడం విశేషం. -
దోమ రాలేదు.. దిగుబడి తగ్గలేదు..!
రసాయనిక వ్యవసాయం చేసే వరి రైతుల పొలాల్లో ఈ ఖరీఫ్‌లో దోమ తీవ్రనష్టం కలిగించింది. ఎక్కువ సార్లు పురుగుల మందు పిచికారీ చేసినా పంట దెబ్బతిన్నది. కొన్నిచోట్ల అసలు పంటే చేతికి రాని పరిస్థితి. అయితే.. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తన వరి పంటకు అసలు దోమే రాలేదని నలవాల సుధాకర్ అనే సీనియర్ రైతు సగర్వంగా చెబుతున్నారు. ద్రావణాలు, కషాయాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం తయారు చేసుకొని వాడుకోవటం వంటి పనులను ఓపికగా అలవాటు చేసుకోగలిగిన రైతులకు ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా, ఆరోగ్యదాయకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు.. ‘తొలకరి జల్లుకు తడిసిన నేల... మట్టి పరిమళాలేమైపాయే.. వానపాములు, నత్తగుల్లలు భూమిలో ఎందుకు బతుకుత లేవు.. పత్తి మందుల గత్తర వాసనరా.. ఈ పంట పొలాల్లో..’ అంటూ ఓ కవి రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు పంట పొలాలకు ఎంతటి చేటు చేస్తున్నాయో వివరించారు. ప్రస్తుతం పంట పొలాలు చాలావరకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందుల బారిన పడుతున్నవే. అధికంగా పంట అధిక దిగుబడిని ఆశించి వారానికో మందు కొడుతున్న ఫలితంగా పచ్చని పంట భూములన్నీ విషపూరితమవుతున్నాయి. స్వచ్ఛమైన పంటకు బదులు, రోగాలకు దారితీసే కలుషితమైన ఆహార పదార్థాలను తినాల్సి వస్తోంది. పర్యావరణంలో సమతుల్యత కూడా దెబ్బతింటోంది. ఈ ఫలితంగానే ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి పొలాల్లో దోమ విధ్వంసం సృష్టించింది. వరి దిగుబడులను తీవ్రంగా దెబ్బతీసింది. ఖర్చుకు వెనకాడకుండా వరుస పిచికారీలు చేసినా రైతులకు దుఃఖమే మిగిలింది. దిగుబడి కూడా ఎక్కువే.. అయితే, ఎనిమిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నలువాల సుధాకర్ పొలంలో మాత్రం వరికి దోమ సోకలేదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్‌లోని పెర్కపల్లి వాస్తవ్యుడైన సుధాకర్ ఐదెకరాల్లో గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది 4 ఎకరాల్లో తెలంగాణ సోన, ఎకరంలో జైశ్రీరాం సన్నరకాల వరిని సాగు చేస్తున్నారు. ఎకరానికి 30 బస్తాల (70 కిలోల)కు ధాన్యం దిగుబడి తగ్గదని భరోసాతో ఉన్నారు. ప్రకృతి వ్యవసాయంలో మొదట దిగుబడి తక్కువగా వచ్చినా, కొద్ది ఏళ్లకు వరి దిగుబడి ఎకరానికి 30 బస్తాలకు పెరిగింది. ఈ ఏడాది రసాయనిక వ్యవసాయంలో కన్నా 5 బస్తాలు ఎక్కువగానే దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆయన పొలం చూస్తేనే అర్థమవుతుంది. ఈ పంటకు మార్కెట్లో ధర ఎక్కువగా ఉండడంతో సాగు లాభసాటిగానే ఉంది. ఎలాంటి హానికరమైన రసాయనాలు వాడకుండా, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన, సంతృప్తికరమైన దిగుబడిని సుధాకర్ సాధిస్తున్నారు. మియాపూర్ ప్రాంతంలో సాధారణ రసాయనిక సాగులో ఎకరానికి దాదాపు 40 బస్తాల వరి ధాన్యం పండుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చే స్తే, మొదటి సంవత్సరంలో 20 నుంచి 25 బస్తాల వరకే వస్తాయి. కానీ, మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో ఇవి 40 బస్తాలకు చేరుకొంటాయి. సాధారణ బియ్యానికి కిలో సుమారు రూ.30 ఉంటే, ప్రకృతి వ్యవసాయ బియ్యానికి స్థానికంగా కిలోకు సుమారు రూ.50ల ధర పలుకుతోంది. సాధారణ రసాయనిక పద్ధతిలో కన్నా ప్రకృతి వ్యవసాయంలో ఎకరాకు రూ.8 నుంచి రూ.10 వేల వరకు పెట్టుబడి తగ్గుతుంది. ‘రసాయనిక వ్యవసాయం కొనసాగిస్తున్న వరి రైతు విషం తిని ప్రజలకు విషాహారాన్ని పంచుతున్నాడు.. కేన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోవటం, సుగర్ రావటం, చిన్న వయసులోనే పళ్లు ఊడిపోవటం.. వంటి ఆరోగ్య సమస్యలన్నిటికీ రసాయనిక అవశేషాలున్న ఆహారమే కారణం.. రైతులు ఓపిక పెంచుకుంటే ప్రకృతి వ్యవసాయం కష్టమేమీ కాద’ని సుధాకర్ చెబుతున్నారు. ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పించి ప్రోత్సహిస్తే ఎక్కువ మంది రైతులు ఈ దారిలోకి రావటానికి అవకాశం ఉందని ఆయన అంటున్నారు. మీ పంటే బాగుందంటున్నారు.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడే పద్ధతిలో వరి సాగు చేసిన పొలాల్లో దోమ బాగా నష్టం చేసింది. వారం వారం మందులు వేయటంతో పంట వేగంగా పెరుగుతుంది. చీడపీడలు కూడా తొందరగా ఆశిస్తాయి. ఈ ఏడాది 7–8 సార్లు పురుగుమందులు పిచికారీ చేశారు. మొత్తం ఖర్చు ఎకరానికి రూ. 20 వేల వరకు వచ్చింది. కానీ, దోమ వల్ల దిగుబడి 25 బస్తాలకు పడిపోయింది. అయితే.. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మా పొలంలో వరికి ఈ సంవత్సరం అసలు దోమ రానే లేదు. వేప నూనె ఒకే ఒక్కసారి పిచికారీ చేశా. ఎప్పటిలాగా భూమిలో ఎకరానికి క్వింటా వేప పిండి వేశా. జీవామృతం, ఘనజీవామృతం వేశా.. నాకు మొత్తంగా ఎకరానికి రూ. 10 –11 వేలు ఖర్చయింది. దిగుబడి వారికన్నా ఎక్కువగానే 30 బస్తాలు కచ్చితంగా వస్తుంది. ఆ రైతులు మా పంటను మొదట్లో ఎదుగుదల తక్కువగా ఉందనే వారు. ఇప్పుడు చివరకొచ్చే వరకు మీ పంటే బాగుందంటున్నారు. రైతులందరూ ఈ పద్ధతిలో సాగు చేస్తే, ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తినే అవకాశం లభిస్తుంది. దిగుబడి లాభసాటిగా ఉంటుంది. పర్యావరణ సమస్య తలెత్తదు. భూమి విషపూరితం కాదు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం రైతుకు ఎకరాకు రూ.15 వేలు ప్రోత్సాహకంగా ఇవ్వాలి. దీన్ని ఆచరణలోకి తీసుకురావాలి. మార్కెటింగ్ సౌకర్యం లేక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్లు కూడా మానేస్తున్నారు. ప్రభుత్వం సాయం చేస్తే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తారు. – నలువాల సుధాకర్ (98498 86034), మియాపూర్, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లా – ఆది వెంకట రమణారావు, స్టాఫ్ రిపోర్టర్, పెద్దపల్లి ఫోటోలు : మర్రి సతీష్ కుమార్, ఫోటో జర్నలిస్టు -
బొబ్బిలిలో 23, 24 తేదీల్లో చెరకు ప్రకృతి సేద్యంపై పాలేకర్ శిక్షణ
నూటికి నూరు శాతం సేంద్రియ పంచదార ఉత్పత్తి దిశగా తొలి అడుగు పడుతోంది. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఎన్.సి.ఎస్. సుగర్స్ యాజమాన్యం ఈ దిశగా పూనికతో కదులుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో (రసాయనిక వ్యవసాయంలో) చెరకు దిగుబడి సగటున ఎకరానికి 27 టన్నులు ఉంది. అయితే, మహారాష్ట్రలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు 80 నుంచి 120 టన్నుల దిగుబడి వస్తోంది. ఇక్కడ 2, 3 కార్శి పంటలు వస్తుండగా, అక్కడ 8 పంటలు వస్తున్నాయి. ఈ అంశంపై స్వయంగా అధ్యయనం చేసిన ఎన్.సి.ఎస్. సుగర్స్ ఎం.డి. ఎన్. నాగేశ్వరరావు పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్ పాలేకర్‌తో ఈ నెల 23, 24 తేదీల్లో చెరకు రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని బొబ్బిలిలోని ఎన్.సి.ఎస్. ఫ్యాక్టరీ ఆవరణలో నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గం. నుంచి సాయంత్రం 6.30 గం. వరకు జరిగే రెండు రోజుల శిక్షణా శిబిరంలో ఫ్యాక్టరీ పరిధిలోని సుమారు 5 వేల మంది చెరకు రైతులు హాజరవుతున్నారు. పాలేకర్ గారి ఆంగ్ల ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించి చెప్పే ఏర్పాటు చేశారు. చెరకులో కూరగాయలు, టమాటా, వేరుశనగ, చిక్కుడు వంటి అంతర పంటలను ఏటా రెండు దఫాలు సాగు చేయడంపై పాలేకర్ రైతులకు శిక్షణ ఇస్తారు. స్థానిక రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలోని చెరకు రైతులు సైతం హాజరుకావచ్చు. ఉచిత భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తున్నారు. పాల్గొనదలచిన రైతులు ఎన్.సి.ఎస్. ఫ్యాక్టరీకి చెందిన పరమేశ్వరరావు (93470 17129)కు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేసుకోవచ్చు. ‘రెండేళ్లలో చెరకు దిగుబడి రెట్టింపే లక్ష్యం’ చెరకు సాగులో, చక్కెర తయారీ ప్రక్రియలో రసాయన రహిత పద్ధతుల్లో సేంద్రియ చక్కెర తయారీపై ప్రపంచవ్యాప్తంగా చైతన్యం వస్తోందని, అమెరికాలో ఇప్పటికే 30% మార్పు వచ్చిందని నాగేశ్వరరావు వివరించారు. తమ ఫ్యాక్టరీ పరిధిలో 22 వేల మంది రైతులు 40 వేల ఎకరాల్లో చెరకు సాగు చేస్తున్నారన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో చెరకు, అంతరపంటల సాగుపై వీరందరికీ దశలవారీగా శిక్షణ ఇప్పిస్తామన్నారు. ప్రతి గ్రామంలో 2 ఎకరాల్లో నమూనా ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తమ జిల్లాలో ఎకరానికి అతి తక్కువగా 20 టన్నుల దిగుబడి వస్తోందని, ప్రకృతి సేద్యం ద్వారా రెండేళ్లలో 40 టన్నులకు పెంచాలన్నదే తన లక్ష్యమన్నారు. 50 వేల టన్నుల చెరకు అందుబాటులోకి వస్తే ప్రత్యేక బ్యాచ్‌గా సేంద్రియ చక్కెర ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. దేశంలోనే తొలి సేంద్రియ చక్కెర ఉత్పత్తి కర్మాగారంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని నాగేశ్వరరావు (nnr@ncsgroup.in) వివరించారు. -
మరల సేద్యానికి..!
♦ పాలేకర్ స్ఫూర్తితో 15 ఏళ్ల తర్వాత మళ్లీ వ్యవసాయంలోకి ♦ 60 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ♦ రిస్క్ లేని సేద్యంతో.. తొలి ఏడాదే అనూహ్య దిగుబడులు అన్నదాతను రసాయనిక వ్యవసాయం నష్టాల పాలుజేసి వ్యాపారంలోకి వెళ్లగొడితే.. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం తిరిగి ప్రకృతి ఒడిలోకి ఆప్యాయంగా ఆహ్వానించింది! అనుకోకుండా హాజరైన ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరం పదిహేనేళ్ల తర్వాత అతన్ని మళ్లీ పొలం బాట పట్టించింది. తీవ్రమైన కరువు నిరుత్సాహపరచినా.. ప్రకృతి సాగు నిరాశపరచలేదు. తొలి ఏడాదిలోనే మంచి నికరాదాయాన్నిస్తోంది. ఈ విజయం ఇతర రైతులనూ ప్రకృతి సాగుకు మళ్లిస్తోంది... కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన ఎల్.నరసింహారెడ్డి ప్రకృతి వ్యవసాయం చేపట్టిన మొదటి ఏడాదిలోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఎం.కామ్ చదివిన తర్వాత ఐదేళ్లపాటు వ్యవసాయం చేశారు. అప్పట్లో రసాయనిక వ్యవసాయం వల్ల నష్టాలే మిగిలాయి. దీంతో పొలమంతా కౌలుకు ఇచ్చి.. వ్యాపార రంగంలోకి వెళ్లిపోయారు. ఇది పదిహేనేళ్ల క్రితం మాట. అయితే, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతి ఆయనను తిరిగి నేలతల్లిని ముద్దాడేలా చేసింది. 2014 డిసెంబర్లో సుభాష్ పాలేకర్ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై 5 రోజుల పాటు కర్నూలులో నిర్వహించిన శిక్షణా కార్యక్ర మంలో నరసింహారెడ్డి పాల్గొన్నారు. పాలేకర్ సూచించిన పద్ధతులపై గురి కుదిరింది. పెట్టుబడి లేకపోవటంతో రిస్క్‌గా అనిపించలేదు. పెద్దగా నష్టపోయేదేం లేదనిపించింది. పుస్తకాలు చదివి తన అవగాహనను పరిపుష్టం చేసుకున్నారు. గతేడాది నుంచి ప్రకృతి సేద్యం చేయటం మొదలు పెట్టారు. 60 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం... తొలి ఏడాదే అయినా సోదరుల పొలాన్ని కలిపి మొత్తం 60 ఎకరాల్లోను ప్రకృతి సాగు చేయాలని నిర్ణయించుకున్నారు నరసింహారెడ్డి. వర్షాధారం కింద మొక్కజొన్న, కంది, కొర్రలను మిశ్రమ పంటలుగా 20 ఎకరాల్లోను.. కందిని ఏకపంటగా మరో 10 ఎకరాల్లోను సాగు చేశారు. నీటి వసతి కింద మరో 20 ఎకరాల్లో కందిని సాగు చేశారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం లేదు, విత్తనాలు, కూలీల కోసం ఖర్చులేం చేయలేదు. ఎకరాకు రూ. 4 వేల లోపే ఖర్చయ్యిందని ఆయన తెలిపారు. దీనివల్ల నికరాదాయం ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. వర్షాధారం కింద సాగు చేసిన పంటల్లో ఎకరాకు మొక్కజొన్న 20 క్వింటాళ్లు, కొర్ర 6 క్వింటాళ్లు, కంది 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వర్షాలు అనుకూలంగా ఉంటే దిగుబడులు పెరిగేవని ఆయన చెప్పారు. ప్రకృతి సేద్యం గొప్పతనం తోటి రైతులకు తెలియజేయాలనే సంకల్పంతో ఖాళీగా ఉన్న 40 సెంట్ల కల్లం దొడ్డిలో మిశ్రమ పంటలను సాగు చేశారు. అరటి, బొప్పాయి, వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలను కలిపి సాగు చేసి మంచి దిగుబడులు సాధించారు. చీడపీడల నివారణకు అస్త్రాలే ఆయుధంగా... భూమిలోని తేమ ఆరిపోకుండా గడ్డితో ఆచ్ఛాదన కల్పించారు. జీవామృతం, ఘన జీవామృతం వాడ కం వల్ల చీడపీడల సమస్యలు తగ్గాయి. అగ్ని అస్త్రంతో రసం పీల్చే పురుగులను, బ్రహ్మాస్త్రం తో లావు పురుగులను నివారించారు. తెగుళ్లు నివారణకు జిల్లేడు, ఉమ్మెత్త, సీతాఫలం, వేప, జామ తదితర ఆకులు, ఆవు మూత్రం, పేడ కలిపి తయారుచేసిన దశపర్ణి కషాయంను వినియోగించారు. దశపర్ణిని సర్వరోగ నివారిణిగా నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆయనకు ఆవులు లేకపోవటంతో ఇతర రైతుల ఆవుల నుంచి మూత్రం, పేడ సేకరించారు. పంటకు మార్కెట్లో డిమాండ్... నరసింహారెడ్డి ఇంకా పంటను విక్రయించలేదు. అయితే నూరు శాతం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన పంటలు కావటంతో మార్కెట్ ధర కంటే 30 శాతం ఎక్కువ చెల్లించేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు నందికొట్కూరులో రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. నరసింహారెడ్డి సాధించిన విజయం చూసి నందికొట్కూరులోనే 50 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేందుకు సిద్ధమయ్యారు. - గవిని శ్రీనివాసులు, కర్నూలు (అగ్రికల్చర్) రైతుకు ప్రకృతి వ్యవసాయమే రక్ష మొత్తం 60 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేశాను. నికరాదాయం బాగా పెరిగింది. తోటి రైతులు ఈ పద్ధతుల వైపే మొగ్గు చూపటం సంతోషం కలిగిస్తోంది. ప్రకృతి సాగులో నష్టం రావటానికి అవకాశమే లేదు. ప్రకృతి సేద్యంలో నికరాదాయం ఎక్కువ. ఎటువంటి పరిస్థితుల్లోన యినా రైతుకు ప్రకృతి వ్యవసాయమే రక్ష. - ఎల్.నరసింహారెడ్డి (94402 86399), నందికొట్కూరు మండలం, కర్నూల్ జిల్లా. -
సిరుల పంట.. సుస్థిర సేద్యపు బాట!
స్థానిక సేంద్రియ వనరులతోనే సేద్యానికి పునరుజ్జీవం పంచగవ్య, జీవామృతం, ఆముదం పిండి, వేప పిండితో చక్కని ఫలసాయం 2,700 చీనీ చెట్ల నుంచి 255 టన్నుల దిగుబడి పొందిన రైతు రవీంద్రనాథరెడ్డి రసాయనిక వ్యవసాయంలో అధిక పెట్టుబడులు పెట్టి ఎంత శ్రమపడినా ఫలసాయం నానాటికీ తీసికట్టుగా మారుతున్న అనుభవాలే ఎదురవుతున్నాయి. అయితే, శ్రద్ధ, పట్టుదలకు కాసింత సుస్థిర వ్యవసాయ పరిజ్ఞానాన్ని జోడిస్తే.. వ్యవసాయాన్ని రైతే పండుగగా మార్చుకోవచ్చని చాటుతున్నారు వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామానికి చెందిన రైతు పెద్ద రవీంద్రనాథరెడ్డి. 30 ఎకరాల చీనీ తోటలో గత ఏడాది నుంచి సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయాన్ని చేపట్టారు. వ్యవసాయంపై అమిత మక్కువ కలిగిన రైతు రవీంద్రనాథరెడ్డి. ప్రకృతి ప్రేమికుడు, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు అయిన సుభాష్ పాలేకర్ బోధనలను ఆకళింపు చేసుకున్నారు.శాస్త్రవేత్తల సూచనల మేరకు అందుబాటులో ఉన్న సేంద్రియ వనరులతో సుస్థిర వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు. చీనీ, వేరుశనగ, చిరుధాన్యపు పంట కొర్రను సాగు చేస్తు పరిసర గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయనిక వ్యవసాయంతో విసిగిపోయిన ఆయన దీక్షగా అనుసరిస్తున్న సుస్థిర వ్యవసాయం ఏమిటో, పాటిస్తున్న పద్ధతులేమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. సింహాద్రిపురం మండలం బోడివారిపల్లె-రావులకొలను గ్రామాల పరిసరాల్లో కనుచూపు మేరలో కనిపించేవన్నీ తువ్వ, ఎర్రనేలలే. వర్షాధారం లేదా బోర్ల కిందే పంటల సాగు. పెట్టుబడులు ఎంత పెట్టినా దిగుబడులు అంతంత మాత్రమే. అధిక దిగుబడుల ఆశతో పొలాల్లో బస్తాల కొద్దీ రసాయనిక ఎరువులు, లీటర్ల కొద్దీ పురుగు మందులు పోయడమే ఈ వ్యవసాయంలో ఉన్న అసలు సమస్య అన్న వాస్తవాన్ని గ్రహించాను. సేంద్రియ పద్ధతులను అవలంబించి సుస్థిర వ్యవసాయం చేస్తే భూమిలో గతంలో మాదిరిగా ఎర్రలు (భూమిలో బొరియలు చేస్తూ ఉండే వానపాములు) వృద్ధి చెందుతాయని, భూమి గుల్లబారి మెత్తగా మారుతుందని, కోరిన, ఆరోగ్యకరమైన పంటలు పండించవచ్చనే విషయాన్ని కొందరు శాస్త్రవేత్తల వద్ద నుంచి తెలుసుకొని సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్నాను. సుస్థిర సేద్యంతో భూసారం పెరిగింది వ్యవసాయమంటే ఒడుదుడుకులతో కూడుకున్నది. ఒక ఏడాది పంట బాగా పండితే మరో ఏడాది ప్రకృతి విపత్తులో లేక పురుగులో, తెగుళ్లో ఆశించి పంటలను దెబ్బతీస్తాయి. దీంతో పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు ఉండవు. ఈ దుస్థితి నుంచి బయట పడేందుకు సుస్థిర వ్యవసాయమే మార్గమని భావించాను. రసాయనిక వ్యవసాయం నుంచి ఈ పద్ధతిలోకి మారి భూసారం పెంచుకున్నాను. బండబారిన భూమి బాగా గుల్లబారుతోంది. ఎర్రలు సహజంగానే వృద్ధి చెందుతున్నాయి. పదునుపాటి వర్షం కురిసినప్పుడు భూమిలో జానెడు లోతు మట్టి తవ్వితే ఎర్రలు విరివిగా కనిపిస్తున్నాయి. ఏ పంట సాగు చేసినా నిర్భయంగా దిగుబడి తీయవచ్చని ఏడాది సుస్థిర వ్యవసాయ అనుభవం ద్వారా గ్రహించాను. జీవామృతం, పంచగవ్యతో పురుగులు, తెగుళ్లకు చెక్ జీవామృతం, పంచగవ్య, ఆవు మూత్రంను డ్రిప్ ఇరిగేషన్‌కు ఉపయోగించే డ్రమ్ముల్లో పోసి నేరుగా పంటలకు అందిస్తున్నారు. దీంతో సూక్ష్మపోషకాలను వృద్ధి చేసే సూక్ష్మజీవులు, ఎర్రలు భూమిలో పుష్కలంగా పెరిగిపోయాయి. పంటలను దెబ్బతీసే తెగుళ్లు, పురుగులకు జీవామృతం, పంచగవ్య సింహస్వప్నంగా మారాయి. దీనివల్ల ఎలాంటి తెగుళ్లు, పురుగులు ఆశించకుండా చీనీ చెట్లు ఆరోగ్యంగా పెరుగుతూ కళకళలాడుతున్నాయి. జీవామృతం, పంచగవ్య తయారు చేయాలంటే నాటు ఆవు పేడ, మూత్రం కావాలి. అందుకే పొలంలోనే ఎనిమిది నాటు ఆవులను పెంచుతున్నాను. వాటి మూత్రాన్ని ప్రతి రోజు డ్రమ్ముల్లో నింపి తోటలోని చింతచెట్టు కింద భద్రపరచి జీవామృతం, పంచగవ్య తయారు చేస్తున్నాం. చీనీ చెట్లకు జీవామృతాన్ని ట్రాక్టర్‌కు అమర్చిన స్ప్రేయర్‌తో చెట్టు, మొదళ్ల వద్ద, చెట్టు అడుగున నేలను బాగా తడిచేలా పిచికారీ చేస్తాం. ఒక్కో చెట్టుకు పంచగవ్య కలిపిన నీరు 5 లీటర్ల వరకు పోస్తాం. 80 కిలోల పశువుల ఎరువు వేస్తాం. జీవామృతాన్ని అప్పుడప్పుడూ డ్రిప్ ద్వారా పంపిస్తుంటాము. నూనె తీయని ఆముదం, వేప పిండి మేలు సొంతంగా తయారు చేసుకున్న ఆముదం పిండి, వేప పిండినే చీనీ చెట్లకు వేస్తున్నాం. మార్కెట్లో అమ్మే పిండి నూనె తీసినది. దాన్ని వేసినా ఉపయోగం ఉండదు. అందుకని తోటలోనే పిండి మిల్లును ఏర్పాటు చేసుకున్నాను. ఆముదాలు, వేప కాయలను మిషనులో ఆడించి నూనె తోనే చెట్టుకు 10 కిలోల చొప్పున వేస్తున్నాం. పశువుల పేడను ఆరు నెలల పాటు మాగబెట్టి చీనీ చెట్లకు వేస్తున్నాం. ఇందుకోసం 50 లారీల ఎరువు పట్టే గుంత తవ్వించాను. ఆ గుంతలో పేడతోపాటు జిల్లేడు, కానుగ, మద్ది, నేలతంగేడు చెట్ల ఆకులను వేసి, తగుమాత్రంగా నీళ్లుపెడతాం. 6 నెలలు మాగిన పశువుల ఎరువును చీనీ చెట్లకు వేస్తున్నాం. దోమ, పల్లాకు, ఉడప మటుమాయం! జీవామృతం, పంచగవ్యం, ఆముదం పిండి, వేప పిండి చీనీ చెట్లను దెబ్బతీసే దోమ, పల్లాకు తెగులును సమర్థవంతంగా నియంత్రించాయి. పల్లాకు తెగులు పోయి ఆకులు నల్లగా నిగనిగలాడుతున్నాయి. ఎండుపుల్ల ఏ చెట్టులో వెతికినా కనిపించదు. పక్వానికి రాకముందే కాయ రాలిపోవడం (ఉడప) మటుమాయమైంది. సేంద్రియ ఎరువులు వేయడం వల్లనే ఇది సాధ్యమైందని అర్థమవుతోంది. పక్వానికి వచ్చేంత వరకూ ఒక్క కాయ కూడా నేల రాలడం లేదు. నాణ్యత, నిల్వ సామర్థ్యంతో అధిక ధర సుస్థిర వ్యవ సాయం ద్వారా పండించే పంట ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధర పలుకుతుంది. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నాణ్యత బాగుంటుంది. కాయల సైజు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పద్ధతిలో సాగైన పూలు ఎంత దూరం తీసుకెళ్లినా నాలుగైదు రోజుల వరకు దెబ్బతినవు. అలాగే కూరగాయలు కూడా ఐదు రోజుల వరకు చెడిపోవని వ్యాపారులే స్వయంగా చెబుతున్నారు. ఈ ఉత్పత్తులను వినియోగదారులు కూడా ఇష్టపడుతున్నారు. అందువల్లే సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో ధర ఎక్కువ పలుకుతోంది. - ప్రభాకర్‌రెడ్డి, కడప అగ్రికల్చర్ మా చీనీ తోటకు 30 ఏళ్లు ఢోకా లేదు! పశువుల ఎరువు, వేప పిండితోపాటు రసాయనిక ఎరువులు చాలా తక్కువ వేసిన రోజుల్లో చీనీ తోటలు 25-30 ఏళ్లు చక్కని దిగుబడినిచ్చేవి. ఇప్పుడు రసాయనిక ఎరువులు ఎక్కువ వేస్తున్నందు వల్ల 15-18 ఏళ్లకే చెట్లు పోతున్నాయి. నా చీనీ తోట 30 ఎకరాలు. పన్నెండేళ్ల ఈ తోటలో 2,700 చెట్లున్నాయి. ఐఐఐటికి చెందిన డా. గున్నంరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి (99082 24649) సూచనలతో ఏడాదిగా సుస్థిర సేద్య పద్ధతులను అవలంబిస్తున్నాను. చెట్లు బాగా ఆరోగ్యంగా తయారయ్యాయి. చాలా మార్పు వచ్చింది. తొలి పంటగా ఈ సీజన్లో 255 టన్నుల దిగుబడి వచ్చింది. కిలో రూ.35ల ధర పలకడంతో మంచి ఆదాయమే వచ్చింది. రాబోయే రోజుల్లో మరింత మేలైన దిగుబడులు సాధిస్తానన్న నమ్మకం ఉంది. మా తోటలో ప్రతి చెట్టూ ఆరోగ్యంగా ఉంది. తోట 30 ఏళ్ల వయసు వరకు నిశ్చింతగా ఫలసాయాన్నిస్తుందన్న నమ్మకం కుదిరింది. మిగతా పొలాన్ని కూడా ఇలాగే సాగు చేయబోతున్నా. ఇతర రైతుల్లోనూ చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తా. - పెద్ద రవీంద్రనాథరెడ్డి (98663 14080), కసనూరు, సింహాద్రిపురం మండలం, వైఎస్సార్ జిల్లా -
సేద్య ‘సంజీవని’!
నిస్సారమైన భూముల పునరుద్ధరణకు బాటలు వేస్తున్న ‘సంజీవని’ ఎరువు పండ్ల తోటలు.. కూరగాయల సాగుకు చాలా ఉపయోగకరం విషరహిత ఆహారోత్పత్తికి దోహదపడుతున్న సృజనాత్మక రైతు ఆవిష్కరణ రసాయనిక వ్యవసాయం వల్ల నిస్సారమైన భూముల్లో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం ప్రారంభించి.. మంచి దిగుబడులు సాధించే క్రమంలో రైతులు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఈ బాలారిష్టాలను అధిగమించేందుకు తమ స్థానిక పరిస్థితులు, వనరులకు అనుగుణంగా సృజనాత్మక రైతులు కొత్తదారులు వెదుకుతూనే ఉన్నారు. రైతు స్థాయిలో అటువంటి నిరంతరాన్వేషణలో నుంచి పుట్టినదే ‘సంజీవని’ సేంద్రియ ఎరువు. సృజనాత్మక రైతు విజయకుమార్ ఈ ఎరువు తయారీ పద్ధతిని రూపొందించి, వ్యాప్తిలోకి తెస్తున్నారు. తక్కువ ఖర్చుతో విషరహిత ఆహారోత్పత్తికి కృషి చేస్తున్న రైతులకు ఇది భరోసానిస్తుండడం విశేషం. భూమాతా.... దీవించమ్మా... తెలియక ఇన్నాళ్లూ మేము తప్పు చేశాం. ఇక నుంచి నీకు బాధ కలిగించం. సేంద్రియ పద్ధతుల్లో నిన్ను సారవంతంగా మార్చుకొని.. నీవందించే ఫలాలు పొంది కుటుంబాలను పోషించుకుంటాం. విషపూరితం కాని సేంద్రియ పంట దిగుబడులను పండించి సమాజానికి అందిస్తామని అంటున్నారు వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల ప్రాంత రైతులు. 21 గ్రామాలకు చెందిన 240 మంది రైతులు ‘పున్నమి సేంద్రియ రైతుల సహాయ సహకార సంఘా’న్ని మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకమైన ‘సంజీవని’ సేంద్రియ ఎరువును, ద్రావణాలను సొంతంగా తయారు చేసుకొని పండ్ల తోటలు, కూరగాయల సాగులో వాడుతూ అనేక ఏళ్లుగా చక్కని ఫలితాలు సాధిస్తున్నారు. వేంపల్లె మండలం టి వెలంవారిపల్లె గ్రామానికి చెందిన సేంద్రియ రైతు, వెన్నెల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు కొమ్మూరి విజయకుమార్ వీరికి మార్గదర్శకుడిగా నిలిచారు. 4వ తరగతికి మించి చదువుకోనప్పటికీ వివిధ రాష్ట్రాల్లో ప్రకృతి, సేంద్రియ సేద్య పద్ధతులను ఆయన అధ్యయనం చేశారు. వీటి ఆచరణలో ఎదురైన లోటుపాట్లను అధిగమించేందుకు సృజనాత్మక రైతుగా సొంత ఆలోచనతో ‘సంజీవని’ సేంద్రియ ఎరువు తయారీ పద్ధతిని ఆయన రూపొందించారు. ఆరుతడులకు నీటి వసతి ఉన్న పండ్ల తోటలకు, కూరగాయల సాగుకు ఇది బాగా ఉపకరిస్తున్నదని రైతులు చెబుతున్నారు. కషాయాల కన్నా ద్రావణాలు మిన్న సాధారణంగా ఔషధ మొక్కల ఆకులను నీటిలో మరగబెట్టి తయారు చేసే కషాయాలను చీడపీడల నియంత్రణకు వాడుతుంటారు. అయితే, ఆకులను నీటిలో ఊరబెట్టి తయారుచేసే ద్రావణాలు ఈ కషాయాలకన్నా ప్రభావశీలంగా పనిచేస్తున్నాయని విజయకుమార్ అనుభవపూర్వకంగా గుర్తించారు. ఉడికించడం వల్ల అందులో పోషకాలు నశిస్తాయి. ఆకులను, కాయలను, పండ్లను ఊరబెట్టడం(మురగబెట్టడం) మాత్రమే చేస్తాను. ఈ ద్రావణాలను ఆరు నెలల వరకు నిల్వ ఉంచి వాడుకోవచ్చు. పండ్ల తోటలు, పత్తి వంటి పంటల్లో దోమ, రెక్కల పురుగుల నివారణకు పేడ, బెల్లం ద్రావణం ఉపయోగపడుతుందని అంటున్నారాయన. గత ఏడేళ్లుగా రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ రైతులకు శిక్షణ ఇస్తున్న విజయకుమార్ సేవలను వివిధ జిల్లాల రైతులు వినియోగించుకుంటుండటం విశేషం. పొలంలో మట్టికి భిన్నమైన మట్టితో.. ఎకరం పొలానికి సంజీవని సేంద్రియ ఎరువు తయారీకి కావలసినవి: 2 టన్నుల(ట్రాక్టర్) చివికిన పశువుల ఎరువు. ఆవులు/గేదెలు/ఎద్దుల ఎరువు ఏదైనా పనికొస్తుంది. 4 టన్నుల (2 ట్రాక్టర్ల) మట్టి, 50 కిలోల వేప పిండి, 80 కిలోల వేరుశనగ/ఆముదం/కానుగ చెక్క(కొంచెం నూనె ఉన్నది కావాలి), 50 కిలోల బెల్లం (తక్కువ ధరకు దొరికే బంక/నల్లబెల్లం సరిపోతుంది), అన్నీ కలిపి 18 కిలోల మేరకు 9 రకాల ధాన్యాలు. గింజలో రెండు బద్దలుండే పప్పు జాతి, ఒకటే గింజ ఉండే ధాన్యం రకాలు కలిసి ఉండాలి. కొర్రలు, రాగులు, జొన్నలు, పెసలు, కందులు, బుడ్డ శనగలు, ఉలవలు, మినుములు, సజ్జలు వంటివి వాడొచ్చు. 7-8 టన్నుల ముడిపదార్థాలను వాడితే.. 21 రోజులకు సుమారు 12 టన్నుల సంజీవని ఎరువు తయారవుతుంది. ఏ పంటకైనా ఒకసారి ఈ సంజీవని ఎరువు వేస్తే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు పోషకాలను అందిస్తుంది. ఏ పొలం కోసం ఈ ఎరువు తయారు చేస్తున్నామో.. ఆ పొలంలోని నేల రకానికి భిన్నమైన రకానికి చెందిన మట్టిని ఈ ఎరువు తయారీకి ఉపయోగించడం ముఖ్యం. అంటే.. ఎర్రమట్టి భూములకు నల్లరేగడి మట్టి, నల్లరేగడి భూములకు ఎర్ర మట్టి, ఇసుక నేలలకు బంక మట్టి, బంక నేలలకు ఇసుక(తువ్వ)మట్టి వాడాలి. సంజీవని ఎరువును తయారు చేసే పద్ధతి: తొమ్మిది మీటర్ల పొడవు, మీటరు వెడల్పుతో నీడన బెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. బెడ్లను ఏర్పాటు చేసేటప్పుడు నేలపై మట్టిని కొద్దిగా తొలగించాలి. ముందుగా బెల్లం పానకం తయారు చేసుకోవాలి. సేకరించుకున్న మట్టిని ఒక పొరలాగా వేసుకొని, పానకం చల్లాలి. దానిపై పశువుల ఎరువును 2, 3 అంగుళాల మందాన చల్లాలి. వేరుశనగ/ఆముదం/కానుగ చెక్కను చల్లాలి. దానిపై మళ్లీ బెల్లం పానకం చల్లాలి. ఇలా అనేక దొంతర్లుగా వేస్తూ బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. బెడ్డుపై రోజుకోసారి తగినంత నీరు చల్లుతుండాలి. ఆరో రోజు బెడ్డులో మట్టిని కలియ తిప్పి.. పైన చదునుగా చేయాలి. నవధాన్యాలను నీళ్లలో ఒక గంటపాటు నానబెట్టి ఆ తరువాత బెడ్లపైన చ ల్లాలి. గింజలు కనిపించకుండా మట్టిని ఎగదోయాలి. మట్టికి తడి ఉండేలా చూసుకోవాలి.21 రోజుల వరకు బెడ్లపైన ఉన్న గింజలు/మొలకలను పక్షులు, కోళ్లు తినకుండా దోమ తెరలాంటి గుడ్డనుగాని, వలనుగాని,షేడ్‌నెట్‌ను గాని ఏర్పాటు చేసుకోవాలి.22వ రోజుకు నవధాన్యాలు బెడ్లపైన మొలిచి ఏపుగా పెరుగుతాయి. సంజీవని ఎరువు వాడకానికి సిద్ధమవుతుంది. సంజీవని ఎరువు ఎలా వాడాలంటే.. బెడ్లలో తయారైన ఎరువును ఒక వరుస నుంచి కలియబెడుతూ కుప్పగా చేసుకుంటూ, దాన్ని గంపలతో అప్పకటిప్పుడు పంటలకు వేసుకోవాలి. పండ్ల చెట్లకు ఇరువైపులా కొమ్మల కింద భూమిని నులివేర్లు బయటకు కనపడే వరకు తవ్వి ఈ ఎరువును గాడిలో పోసి పైమట్టిని కప్పాలి. కూరగాయల మొక్కల వద్దనే సంజీవని ఎరువు వేసి మట్టితో కప్పాలి. డ్రిప్ ఉంటే.. డ్రిప్పర్ల దగ్గర వేయాలి. కూరగాయల మొక్కలకు 4 కిలోల చొప్పున వేయాలి. ఏడాది వయసున్న పండ్ల మొక్కలకు 10 కిలోలు వేయాలి. ఆపై ప్రతి ఏడాది వయసుకు 10 కిలోల చొప్పున వేయాలి. ఉదా: రెండేళ్ల మొక్కకు 20 కిలోలు. వేరుశనగ పంటకైతే.. విత్తనం వేశాక 40 రోజుల్లోపు కలుపు తీసి.. పైరుపై సంజీవని ఎరువును చల్లి నీటి తడి అందిస్తే చాలా చక్కగా పంట ఎదుగుతుంది. కూరగాయ పంటను తొలగించి మళ్లీ కూరగాయలను పండించాలనుకుంటే.. గతంలో ఉన్న మొక్కల స్థానంలో కాసింత వేప ద్రావణం చల్లి మొక్కను నాటుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వరి పొలంలో దమ్ము చేయడానికి ముందు నల్ల నేలైతే ఎకరానికి 4-5 టన్నులు, ఇతర భూములైతే 5-6 టన్నుల సంజీవని ఎరువు వాడాలి. పొలానికి వేయగా మిగిలిన సంజీవని ఎరువును బస్తాల్లో నింపి నిల్వ చేసుకోవచ్చు. బెల్లం పానకం చల్లి.. కలియదిప్పి పొలానికి వేసుకోవచ్చు. టన్ను ఎరువులో 5 కేజీల పేడ, 5 కిలోల బెల్లంను 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి. - మాచుపల్లి ప్రభాకర్‌రెడ్డి, కడప అగ్రికల్చర్ ఖర్చు సగం తగ్గింది..! నాకు రెండెకరాల్లో ఏడేళ్ల నిమ్మ తోట ఉంది. మొదట రెండేళ్లు యూరియా, పురుగుమందులు వాడా. ఐదేళ్ల నుంచి సంజీవని ఎరువు, ద్రావణాలు వాడుతున్నా. యూరియా, పురుగుమందులు వాడిన రైతులకు ఎకరానికి రూ. 40 నుంచి 50 వేలు ఖర్చవుతుంటే, నాకు రూ. 20 వేలు అవుతోంది. సంజీవని ఎరువు, దశపత్ర ద్రావణం తయారు చేసి వాడుతున్నాను. బాగా ఉపగయోగపడుతున్నాయి. ఆకుముడత పోయింది. గజ్జి తెగులు బాగా తగ్గింది. పూత, పిందె బాగున్నాయి. నిమ్మకాయలు అమ్మితే మొదటిసారి రూ. లక్షన్నర, రెండోసారి రూ. 3 లక్షల ఆదాయం వచ్చింది. - మోడపోతుల రాందాస్ (89784 58872), సేంద్రియ నిమ్మ రైతు, వేంపల్లె, వైఎస్సార్ జిల్లా దేశంలో ఎన్ని రకాల సేంద్రియ, ప్రకృతి సేద్య పద్ధతులున్నా.. మన స్థానిక పరిస్థితులకు అనువైన పద్ధతులను రూపొందించుకోవాలి. రసాయనిక ఎరువులు, పురుగుమందులు విపరీతంగా వాడి నిస్సారమైన భూములను పునరుజ్జీవింపజేయాలన్నా, సేంద్రియ వ్యవసాయం సత్ఫలితాలనివ్వాలన్నా సంజీవని ఎరువు వాడటం మేలని మా అనుభవంలో తేలింది. సారం ఉన్న భూముల్లో అయితే జీవామృతం సరిపోతుంది. జీవామృతం కన్నా పంచగవ్య మెరుగైన ఫలితాలనిస్తోంది. పంచగవ్యను పంటపై ఏటా 3 దఫాలు పిచికారీ చేస్తే మెరుగైన ఫలితాలొస్తున్నాయి. కషాయాలకు బదులు ద్రావణాలు బాగా పనిచేస్తున్నాయి. విష రసాయనాల వాడకం మానేసే రైతులకు సేవ చేయగలగడం సంతోషాన్నిస్తోంది. - కొమ్మూరి విజయకుమార్ (98496 48498), సంజీవని ఎరువుల రూపశిల్పి, సేంద్రియ రైతు, టి వెలంవారిపల్లె, వేంపల్లె మండలం, వైఎస్సార్ జిల్లా మట్టిని తాకితే మనసు తేలికపడుతుంది! దిగులుగా ఉంటున్నదా? అయితే, మట్టిని తాకండి! ఎందుకంటారా.. మట్టిలో ఉండే సూక్ష్మజీవులు మనోల్లాసాన్ని కలిగిస్తాయని అధ్యయనాల్లో తేలింది! ఒక చెంచా మట్టిలో 5 వేల కోట్లకు పైగా సూక్ష్మజీవులుంటాయట. మైకోబాక్టీరియం వాక్సే అనే సూక్ష్మజీవి వీటిలో ఒకటి. మట్టిలో పనులు చేసే మనుషుల దిగులును తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఎలాగంటారా? సెరొటోనిన్ అనే హార్మోన్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. వ్యాకులతను, మనోవ్యధను తగ్గిస్తుంది. అందుకే దీన్ని ‘హేపీ హార్మోన్’ అని పిలుస్తుంటారు. ఇది జంతువులు, మనుషుల్లో సెరొటోనిన్ అనే రసాయనం విడుదలకు సహజ ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. కుంగుబాటు ఉపశమనానికి వాడే ప్రొజాక్ వంటి ఔషధాల మాదిరిగానే ఈ సూక్ష్మజీవి కూడా.. హేపీ హార్మోన్ విడుదలకు సహజ ఉత్ప్రేరకంగా పనిచేస్తోందని ప్రయోగాల్లో తేలింది. పొలం పనులు, ఇంటిపంటల పనుల్లో చేతులకు మట్టి అయ్యేలా పనిచేయడం వల్ల మనోల్లాసం కలగడం ఇందుకేనన్నమాట. మట్టి మనుషులకు ప్రకృతి చేదోడుగా నిలుస్తుందని చెప్పడానికి ఇంతకుమించిన ఉదాహరణేం కావాలి చెప్పండి..! అంటే.. మట్టిని పలకరిస్తుంటే మనోవ్యాధి దానంతట అదే పరారవుతుందన్న మాట. ప్రకృతి చికిత్స పద్ధతుల్లో రోగి ఒంటిపై మట్టితో పట్టీలు వేయడం, వళ్లంతా మట్టి పూసి స్నానం చేయించడం ఇందుకేనేమో! ఎండు మట్టే ‘బంగారం’! భూమిలో నుంచి తవ్వి ఎండబెట్టిన మట్టి (సబ్ సాయిల్) సకల పోషకాలతో కూడిన ఎరువుతో సమానం అంటారు సికింద్రాబాద్ ఆల్వాల్‌కు చెందిన రైతుశాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి. కొన్ని అడుగుల లోతు నుంచి తీసి ఎండబెట్టిన పొడి మట్టినే ‘మట్టి ఎరువు’గా వాడే పద్ధతిని ఆవిష్కరించిన ఆయన అనేక దేశాల్లో పేటెంట్ పొందారు. వినూత్నమైన ఈ ‘మట్టి ఎరువు’ సాగు పద్ధతిలో అనేక ఏళ్లుగా వరి, ద్రాక్ష, గోధుమ, కూరగాయ పంటలను ఆయన సాగుచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కుందనపల్లిలోని తన సొంత భూమిలో ఈ ఖరీఫ్‌లో బీపీటీ 5204 వంగడం సాగు చేసి ఎకరానికి 36 బస్తాల(75 కిలోలు) ధాన్యం దిగుబడి పొందారు. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుతోపాటు.. నాలుగు దఫాలుగా మట్టి ఎరువును వాడారు. బోరు నుంచి పొలంలోకి పారుతున్న నీటిలో ఈ మట్టిని కలపడం ద్వారా ‘ఒండ్రు నీటి’ని పొలానికి అందిస్తున్నారు. ఇలా సాగైన బియ్యంలో బాలల్లో రేచీకటిని నివారించే ‘విటమిన్ ఎ’ తదితర పోషకాలు నిక్షిప్తమవుతున్నట్లు గతంలో చేయించిన పరీక్షల్లో నిర్ధారణ అయ్యిందని వెంకటరెడ్డి(98668 83336) తెలిపారు(విటమిన్ ఎ కలిగి ఉండే జన్యుమార్పిడి ‘గోల్డెన్ రైస్’పై భారీ ఖర్చుతో అంతర్థాతీయ స్థాయిలో పరిశోధనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే). కొద్ది నెలల క్రితం మట్టి ఎరువుతో సాగవుతున్న వెంకటరెడ్డి ద్రాక్ష తోటను సందర్శించిన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డా. అయ్యప్పన్ ఇలా అభివర్ణించారు: ‘ఇది భూలోకంలో వైకుంఠం’! దశపత్ర ద్రావణంతో చీడపీడలకు చెక్ పంటలను ఆశించే తెగుళ్లు, పురుగులను దశపత్ర ద్రావణం అరికడుతుంది. ప్రధానంగా ఈ ద్రావణం తయారీకి తుంచితే పాలుగారే కొన్ని రకాల ఆకులను వాడాలి. జిల్లేడు, జుట్లపాకు, పలవరేణి, బొప్పాయి, వేప, ముష్టి, తంగేడు, వావిలాకు, కొండ వావిలాకు(నల్లది), వయ్యారిభామ, వెంపలి, వెర్రి మిరప(గబ్బాకు) వాడాలి. చీకాకు, ఉమ్మెత్త ఆకులనూ వాడొచ్చు. ఒక్కో రకం ఆకు ఒక కిలో తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. 5 కిలోల పేడ(బర్రె లేదా ఆవు పేడ), 10 లీటర్ల ఆవు లేదా బర్రె మూత్రం, 200 లీటర్ల నీరు తీసుకొని ఒక డ్రమ్ములో పోసి మురగపెట్టాలి. ఉదయం, సాయంత్రం ఈ ద్రావణాన్ని బాగా కలియబెడుతుండాలి, వారం రోజులపాటు కలియబెట్టి, నిల్వ చేసుకోవాలి. ఈ ద్రావణం తయారైన 6 నెలల వరకు పురుగులు, తెగుళ్ల నివారణకు వాడుకోవచ్చు. పంటకు 25వ రోజు నుంచి, పూతకు ముందు, పిందె ఏర్పడిన తరువాత ఈ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కూరగాయల తోటలకు పిచికారీ చేసే ఒక (12-15 లీటర్ల) డ్రమ్ముకు తొలిసారి పావు లీటరు, తర్వాత రెండుసార్లు అర లీటరు దశపత్ర ద్రావణాన్ని కలిపి పిచికారీ చేసుకోవాలి. పండ్ల తోటలకైతే డ్రమ్మునకు అర లీటరు ద్రావణం కలిపి పిచికారీ చేసుకోవాలి. -
కోకో సాగులో కళ్లు చెదిరే దిగుబడి!
రసాయనిక వ్యవసాయం నష్టదాయకంగా పరిణమించిన విషయాన్ని పూర్తిగా గ్రహించిన రైతులు కూడా సేంద్రియ సాగు పద్ధతిని చేపట్టాలనుకున్నప్పుడు వారి మనస్సులో నూరారు సందేహాలు తలెత్తుతుంటాయి. ఇందులో మొదటిది సేంద్రియ విధానంలో సరైన దిగుబడులు వస్తాయా? అనేది. కానీ, సేంద్రియ సాగు విధానంలోకి అడుగుపెట్టి తొలిపంట నుంచే దిగుబడులు పెంచుకోవచ్చని చాటి చెబుతున్నారు కోకో రైతు కొత్తపల్లి శ్రీమహావిష్ణు(9959363689). తూ. గో. జిల్లా ఆలమూరు మండలం మడికిలోని ఐదెకరాల కొబ్బరి తోటలో 1995 నుంచి కోకో పంటను ఆయన రసాయనిక పద్ధతిలో అంతర పంటగా సాగు చేస్తున్నారు. 2003 వరకు ఎకరాకు సగ టున 400 కేజీల దిగుబడి వచ్చింది. తరువాత క్రమేపీ తగ్గుతూ ఎకరాకు వంద కేజీలకు పడిపోయింది. అటువంటి దశలో సమీప బంధువు నరుకుల శ్రీహర్ష సూచన మేరకు 2012లో రెండెకరాల్లో సేంద్రియ సాగు చేపట్టారు. తొలి ఏడాది ఎకరాకు 200 కిలోలు, 2013లో ఎకరాకు 600 కేజీలకు పైగా దిగుబడి సాధించారు. ఒక చెట్టు ఏకంగా 126 కాయలు కాసి చూపరులను అబ్బుర పరుస్తోంది. ఈ తోట పక్కనే ఇప్పటికీ రసాయనిక పద్ధతిలో సాగు చేస్తున్న 3 ఎకరాల్లో దిగుబడి ఎకరానికి సగటున 120 కేజీల స్థాయిలోనే ఉంది. ‘ఎకరాకు కేవలం రూ.16 వేల పెట్టుబడితో 600 కిలోల దిగుబడి సాధించాను. మిగిలిన మూడు ఎకరాల్లోనూ సేంద్రియ సాగు చేపడతా. డెరైక్టరేట్ ఆఫ్ క్యాజు అండ్ కోకో(కేరళ)కు చెందిన అధికారి వెంకటేశన్ కాంబ్లే మా తోటను చూసెళ్లడం మరచిపోలేని అనుభూతి’ అన్నారు శ్రీమహావిష్ణు. - నిమ్మకాయల సతీష్‌బాబు, న్యూస్‌లైన్, అమలాపురం, తూ. గో. జిల్లా -
40 రోజుల్లో నవజీవం..!
రసాయనిక వ్యవసాయం వల్ల నిస్సారమైన భూమిలో తిరిగి జీవశక్తిని నింపడానికి ఉపయోగపడే ఒక సహజ పద్ధతి ‘రామబాణం’. అందుబాటులో ఉన్న వనరులతోనే రైతులు పొలంలో దీన్ని సులభంగా అమలు చేయవచ్చు. వరుసగా రెండు పంటలకు ముందుగా ఈ పద్ధతిని అమలు చేస్తే.. ఆ భూమి పూర్తిగా సారవంతమవుతుందని ‘రామబాణం’ రూపకర్త డా. పత్తిపాటి రామయ్య చెప్పారు.. 1వ రోజు: ఎకరం భూమిని ఎద్దులతో దున్నించాలి. 2వ రోజు: ఉదయం 6 గం.కు- రెండుంపావు కిలోల అల్లం రుబ్బి 4 లీటర్ల నీటితో కుండలో కలిపి భూమిలో పాతిపెట్టాలి. 9వ రోజు: ఉదయం 6 గంటలకు- 4 కిలోల నాటు ఆవు పేడను 6 లీటర్ల నీటితో కుండలో కలిపి భూమిలో పాతిపెట్టాలి. సాయంత్రం 6 గంటలకు- మురిగిన అల్లం ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి. 14వ రోజు: సాయంత్రం 6 గంటలకు- మురిగిన పేడ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి. 17వ రోజు: ఉదయం 6 గంటలకు- 8 కిలోల బెల్లం 12 లీటర్ల నీటితో కుండలో కలిపి భూమిలో పాతిపెట్టాలి. 19వ రోజు: సాయంత్రం 6 గంటలకు- 3 లీటర్ల నాటు ఆవు మూత్రాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి. 22వ రోజు: ఉదయం 6 గంటలకు- కుండలో 4 లీటర్ల నీటితో రెండుంపావు (2.25) కిలోల ఇంగువ కలిపి పాతిపెట్టాలి. 24వ రోజు: సాయంత్రం 6 గంటలకు- మురిగిన బెల్లం ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి. 27వ రోజు: ఉదయం 6 గంటలకు- 4 కిలోల మంచి శనగపిండిని కుండలో 1 లీటరు నీటితో కలిపి పాతి పెట్టాలి. 29వ రోజు: సాయంత్రం 6 గంటలకు- మురిగిన ఇంగువ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి. 34వ రోజు: సాయంత్రం 6 గంటలకు- మురిగిన మంచి శనగపిండి ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి. 36వ రోజు: ఉదయం 6 గంటలకు- ఒకటిన్నర (1.5) లీటర్ల నాటు ఆవు పెరుగులో ఒకటిన్నర (1.5) లీటర్ల నీటిని కుండలో కలిపి మజ్జిగ చేసి భూమిలో పాతి పెట్టాలి. 40వ రోజు: సాయంత్రం 6 గంటలకు- మురిగిన మజ్జిగను 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి. ప్రకృతి వ్యవసాయం, ‘రామబాణం’పై ఆసక్తి కలిగిన రైతులు సంప్రదించాల్సిన చిరునామా: డా. కె.గంగాధరం (098490 59573), వర్డ్ ప్రకృతి వ్యవసాయ పాఠశాల, చెంచురాజు కండ్రిగ, పిచ్చాటూరు మండలం, చిత్తూరు జిల్లా. -
నేడు జిల్లాకు రానున్న సుభాష్ పాలేకర్
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు మూడురోజుల శిక్షణ వరంగల్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ప్రముఖ శాస్త్రవేత్త, బసవశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ గురువారం జిల్లాకు రానున్నారు. ప్రస్తుత వ్యవసాయ పద్ధతుల్లోని లోపాలను ఎత్తిచూపుతూ ఆచరించాల్సిన మెరుగైన సాగు విధానం గురించి రైతులకు మూడు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. రసాయన వ్యవసాయం నుంచి రైతులు బయటపడడానికి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఆయన అవగాహన కల్పించనున్నారు. కాకతీయ ఫౌండేషన్, మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్ కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ రోడ్డు చింతగట్టు క్యాంపు వద్దనున్న బీజీఆర్ గార్డెన్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు కాకతీయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు నరహరి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. దీనికి ఆత్మ, నాబార్డు శాఖలతోపాటు వ్యవసాయశాఖాధికారులు, శాస్త్రవేత్తలు సహకారం అందిస్తున్నట్టు చెప్పారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి సుమారు వెయ్యిమంది రైతులు శిక్షణకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. మూడు రోజులపాటు వారికి బీజీఆర్ గార్డెన్స్‌లోనే ఉచితంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నామని, ఇందుకోసం వంద రూపాయలు నమోదు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. శిక్షణలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలను అందజేస్తామన్నారు. గురువారం ఉదయం కలెక్టర్ కిషన్ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.