సేద్య ‘సంజీవని’! | Pave the way for the resumption of dry land at the 'elixir' manure | Sakshi
Sakshi News home page

సేద్య ‘సంజీవని’!

Published Wed, Dec 17 2014 10:58 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

సేద్య ‘సంజీవని’! - Sakshi

సేద్య ‘సంజీవని’!

నిస్సారమైన భూముల పునరుద్ధరణకు బాటలు వేస్తున్న ‘సంజీవని’ ఎరువు
పండ్ల తోటలు.. కూరగాయల సాగుకు చాలా ఉపయోగకరం
విషరహిత ఆహారోత్పత్తికి దోహదపడుతున్న సృజనాత్మక రైతు ఆవిష్కరణ

 
రసాయనిక వ్యవసాయం వల్ల నిస్సారమైన భూముల్లో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం ప్రారంభించి.. మంచి దిగుబడులు సాధించే క్రమంలో రైతులు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఈ బాలారిష్టాలను అధిగమించేందుకు తమ స్థానిక పరిస్థితులు, వనరులకు అనుగుణంగా సృజనాత్మక రైతులు కొత్తదారులు వెదుకుతూనే ఉన్నారు. రైతు స్థాయిలో అటువంటి నిరంతరాన్వేషణలో నుంచి పుట్టినదే ‘సంజీవని’ సేంద్రియ ఎరువు. సృజనాత్మక రైతు విజయకుమార్ ఈ ఎరువు తయారీ పద్ధతిని రూపొందించి, వ్యాప్తిలోకి తెస్తున్నారు. తక్కువ ఖర్చుతో విషరహిత ఆహారోత్పత్తికి కృషి చేస్తున్న రైతులకు  ఇది భరోసానిస్తుండడం విశేషం.
 
భూమాతా.... దీవించమ్మా... తెలియక ఇన్నాళ్లూ మేము తప్పు చేశాం. ఇక నుంచి నీకు బాధ కలిగించం. సేంద్రియ పద్ధతుల్లో నిన్ను సారవంతంగా మార్చుకొని.. నీవందించే ఫలాలు పొంది కుటుంబాలను పోషించుకుంటాం. విషపూరితం కాని సేంద్రియ పంట దిగుబడులను పండించి సమాజానికి అందిస్తామని అంటున్నారు వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల ప్రాంత రైతులు. 21 గ్రామాలకు చెందిన 240 మంది రైతులు ‘పున్నమి సేంద్రియ రైతుల సహాయ సహకార సంఘా’న్ని మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకమైన ‘సంజీవని’ సేంద్రియ ఎరువును, ద్రావణాలను సొంతంగా తయారు చేసుకొని పండ్ల తోటలు, కూరగాయల సాగులో వాడుతూ అనేక ఏళ్లుగా చక్కని ఫలితాలు సాధిస్తున్నారు. వేంపల్లె మండలం టి వెలంవారిపల్లె గ్రామానికి చెందిన సేంద్రియ రైతు, వెన్నెల రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు కొమ్మూరి విజయకుమార్ వీరికి మార్గదర్శకుడిగా నిలిచారు. 4వ తరగతికి మించి చదువుకోనప్పటికీ వివిధ రాష్ట్రాల్లో ప్రకృతి, సేంద్రియ సేద్య పద్ధతులను ఆయన అధ్యయనం చేశారు. వీటి ఆచరణలో ఎదురైన లోటుపాట్లను అధిగమించేందుకు సృజనాత్మక రైతుగా సొంత ఆలోచనతో ‘సంజీవని’ సేంద్రియ ఎరువు తయారీ పద్ధతిని ఆయన రూపొందించారు. ఆరుతడులకు నీటి వసతి ఉన్న పండ్ల తోటలకు, కూరగాయల సాగుకు ఇది బాగా ఉపకరిస్తున్నదని రైతులు చెబుతున్నారు.

కషాయాల కన్నా ద్రావణాలు మిన్న

సాధారణంగా ఔషధ మొక్కల ఆకులను నీటిలో మరగబెట్టి తయారు చేసే కషాయాలను చీడపీడల నియంత్రణకు వాడుతుంటారు. అయితే, ఆకులను నీటిలో ఊరబెట్టి తయారుచేసే ద్రావణాలు ఈ కషాయాలకన్నా ప్రభావశీలంగా పనిచేస్తున్నాయని విజయకుమార్ అనుభవపూర్వకంగా గుర్తించారు. ఉడికించడం వల్ల అందులో పోషకాలు నశిస్తాయి. ఆకులను, కాయలను, పండ్లను ఊరబెట్టడం(మురగబెట్టడం) మాత్రమే చేస్తాను. ఈ ద్రావణాలను ఆరు నెలల వరకు నిల్వ ఉంచి వాడుకోవచ్చు. పండ్ల తోటలు, పత్తి వంటి పంటల్లో దోమ, రెక్కల పురుగుల నివారణకు పేడ, బెల్లం ద్రావణం ఉపయోగపడుతుందని అంటున్నారాయన. గత ఏడేళ్లుగా రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ రైతులకు శిక్షణ ఇస్తున్న విజయకుమార్ సేవలను వివిధ జిల్లాల రైతులు వినియోగించుకుంటుండటం విశేషం.  

పొలంలో మట్టికి భిన్నమైన మట్టితో..

ఎకరం పొలానికి సంజీవని సేంద్రియ ఎరువు తయారీకి కావలసినవి: 2 టన్నుల(ట్రాక్టర్) చివికిన పశువుల ఎరువు. ఆవులు/గేదెలు/ఎద్దుల ఎరువు ఏదైనా పనికొస్తుంది. 4 టన్నుల (2 ట్రాక్టర్ల) మట్టి, 50 కిలోల వేప పిండి, 80 కిలోల వేరుశనగ/ఆముదం/కానుగ చెక్క(కొంచెం నూనె ఉన్నది కావాలి), 50 కిలోల బెల్లం (తక్కువ ధరకు దొరికే బంక/నల్లబెల్లం సరిపోతుంది), అన్నీ కలిపి 18 కిలోల మేరకు 9 రకాల ధాన్యాలు. గింజలో రెండు బద్దలుండే పప్పు జాతి, ఒకటే గింజ ఉండే ధాన్యం రకాలు కలిసి ఉండాలి. కొర్రలు, రాగులు, జొన్నలు, పెసలు, కందులు, బుడ్డ శనగలు, ఉలవలు, మినుములు, సజ్జలు వంటివి వాడొచ్చు.

7-8 టన్నుల ముడిపదార్థాలను వాడితే.. 21 రోజులకు సుమారు 12 టన్నుల సంజీవని ఎరువు తయారవుతుంది. ఏ పంటకైనా ఒకసారి ఈ సంజీవని ఎరువు వేస్తే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు పోషకాలను అందిస్తుంది. ఏ పొలం కోసం ఈ ఎరువు తయారు చేస్తున్నామో.. ఆ పొలంలోని నేల రకానికి భిన్నమైన రకానికి చెందిన మట్టిని ఈ ఎరువు తయారీకి ఉపయోగించడం ముఖ్యం. అంటే.. ఎర్రమట్టి భూములకు నల్లరేగడి మట్టి, నల్లరేగడి భూములకు ఎర్ర మట్టి, ఇసుక నేలలకు బంక మట్టి, బంక నేలలకు ఇసుక(తువ్వ)మట్టి వాడాలి.
 
సంజీవని ఎరువును తయారు చేసే పద్ధతి:
   
తొమ్మిది మీటర్ల పొడవు, మీటరు వెడల్పుతో నీడన బెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. బెడ్లను ఏర్పాటు చేసేటప్పుడు నేలపై మట్టిని కొద్దిగా తొలగించాలి. ముందుగా బెల్లం పానకం తయారు చేసుకోవాలి. సేకరించుకున్న మట్టిని ఒక పొరలాగా వేసుకొని, పానకం చల్లాలి. దానిపై పశువుల ఎరువును 2, 3 అంగుళాల మందాన చల్లాలి. వేరుశనగ/ఆముదం/కానుగ చెక్కను చల్లాలి. దానిపై మళ్లీ బెల్లం పానకం చల్లాలి. ఇలా అనేక దొంతర్లుగా వేస్తూ బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి.

బెడ్డుపై రోజుకోసారి తగినంత నీరు చల్లుతుండాలి. ఆరో రోజు బెడ్డులో మట్టిని కలియ తిప్పి.. పైన చదునుగా చేయాలి. నవధాన్యాలను నీళ్లలో ఒక గంటపాటు నానబెట్టి ఆ తరువాత బెడ్లపైన చ ల్లాలి. గింజలు కనిపించకుండా మట్టిని ఎగదోయాలి. మట్టికి తడి ఉండేలా చూసుకోవాలి.21 రోజుల వరకు బెడ్లపైన ఉన్న గింజలు/మొలకలను పక్షులు, కోళ్లు తినకుండా దోమ తెరలాంటి గుడ్డనుగాని, వలనుగాని,షేడ్‌నెట్‌ను గాని ఏర్పాటు చేసుకోవాలి.22వ రోజుకు నవధాన్యాలు బెడ్లపైన మొలిచి ఏపుగా పెరుగుతాయి. సంజీవని ఎరువు వాడకానికి సిద్ధమవుతుంది.
 
సంజీవని ఎరువు ఎలా వాడాలంటే..

 
బెడ్లలో తయారైన ఎరువును ఒక వరుస నుంచి కలియబెడుతూ కుప్పగా చేసుకుంటూ, దాన్ని గంపలతో అప్పకటిప్పుడు పంటలకు వేసుకోవాలి. పండ్ల చెట్లకు ఇరువైపులా కొమ్మల కింద భూమిని నులివేర్లు బయటకు కనపడే వరకు తవ్వి ఈ ఎరువును గాడిలో పోసి పైమట్టిని కప్పాలి. కూరగాయల మొక్కల వద్దనే సంజీవని ఎరువు వేసి మట్టితో కప్పాలి. డ్రిప్ ఉంటే.. డ్రిప్పర్ల దగ్గర వేయాలి. కూరగాయల మొక్కలకు 4 కిలోల చొప్పున వేయాలి. ఏడాది వయసున్న పండ్ల మొక్కలకు 10 కిలోలు వేయాలి. ఆపై ప్రతి ఏడాది వయసుకు 10 కిలోల చొప్పున వేయాలి. ఉదా: రెండేళ్ల మొక్కకు 20 కిలోలు.   వేరుశనగ పంటకైతే.. విత్తనం వేశాక 40 రోజుల్లోపు కలుపు తీసి.. పైరుపై సంజీవని ఎరువును చల్లి నీటి తడి అందిస్తే  చాలా చక్కగా పంట ఎదుగుతుంది.

కూరగాయ పంటను తొలగించి మళ్లీ కూరగాయలను పండించాలనుకుంటే.. గతంలో ఉన్న మొక్కల స్థానంలో కాసింత వేప ద్రావణం చల్లి మొక్కను నాటుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వరి పొలంలో దమ్ము చేయడానికి ముందు నల్ల నేలైతే ఎకరానికి 4-5 టన్నులు, ఇతర భూములైతే 5-6 టన్నుల సంజీవని ఎరువు వాడాలి. పొలానికి వేయగా మిగిలిన సంజీవని ఎరువును బస్తాల్లో నింపి నిల్వ చేసుకోవచ్చు. బెల్లం పానకం చల్లి.. కలియదిప్పి పొలానికి వేసుకోవచ్చు. టన్ను ఎరువులో 5 కేజీల పేడ, 5 కిలోల బెల్లంను 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి.  
 - మాచుపల్లి ప్రభాకర్‌రెడ్డి, కడప అగ్రికల్చర్
 
 
ఖర్చు సగం తగ్గింది..!

నాకు రెండెకరాల్లో ఏడేళ్ల నిమ్మ తోట ఉంది. మొదట రెండేళ్లు యూరియా, పురుగుమందులు వాడా. ఐదేళ్ల నుంచి సంజీవని ఎరువు, ద్రావణాలు వాడుతున్నా. యూరియా, పురుగుమందులు వాడిన రైతులకు ఎకరానికి రూ. 40 నుంచి 50 వేలు ఖర్చవుతుంటే, నాకు రూ. 20 వేలు అవుతోంది. సంజీవని ఎరువు, దశపత్ర ద్రావణం తయారు చేసి వాడుతున్నాను. బాగా ఉపగయోగపడుతున్నాయి. ఆకుముడత పోయింది. గజ్జి తెగులు బాగా తగ్గింది. పూత, పిందె బాగున్నాయి. నిమ్మకాయలు అమ్మితే మొదటిసారి రూ. లక్షన్నర, రెండోసారి రూ. 3 లక్షల ఆదాయం వచ్చింది.
 - మోడపోతుల రాందాస్
 (89784 58872),
  సేంద్రియ నిమ్మ రైతు,
 వేంపల్లె, వైఎస్సార్ జిల్లా
 
 
 
దేశంలో ఎన్ని రకాల సేంద్రియ, ప్రకృతి సేద్య పద్ధతులున్నా.. మన స్థానిక పరిస్థితులకు అనువైన పద్ధతులను రూపొందించుకోవాలి. రసాయనిక ఎరువులు, పురుగుమందులు విపరీతంగా వాడి నిస్సారమైన భూములను పునరుజ్జీవింపజేయాలన్నా, సేంద్రియ వ్యవసాయం సత్ఫలితాలనివ్వాలన్నా సంజీవని ఎరువు వాడటం మేలని మా అనుభవంలో తేలింది. సారం ఉన్న భూముల్లో అయితే జీవామృతం సరిపోతుంది. జీవామృతం కన్నా పంచగవ్య మెరుగైన ఫలితాలనిస్తోంది. పంచగవ్యను పంటపై ఏటా 3 దఫాలు పిచికారీ చేస్తే మెరుగైన ఫలితాలొస్తున్నాయి. కషాయాలకు బదులు ద్రావణాలు బాగా పనిచేస్తున్నాయి. విష రసాయనాల వాడకం మానేసే రైతులకు సేవ చేయగలగడం సంతోషాన్నిస్తోంది.
 - కొమ్మూరి విజయకుమార్   (98496 48498),
 సంజీవని ఎరువుల రూపశిల్పి, సేంద్రియ రైతు, టి వెలంవారిపల్లె, వేంపల్లె మండలం, వైఎస్సార్ జిల్లా
 
మట్టిని తాకితే మనసు తేలికపడుతుంది!
 
దిగులుగా ఉంటున్నదా? అయితే, మట్టిని తాకండి! ఎందుకంటారా.. మట్టిలో ఉండే సూక్ష్మజీవులు మనోల్లాసాన్ని కలిగిస్తాయని అధ్యయనాల్లో తేలింది! ఒక చెంచా మట్టిలో 5 వేల కోట్లకు పైగా సూక్ష్మజీవులుంటాయట. మైకోబాక్టీరియం వాక్సే అనే సూక్ష్మజీవి వీటిలో ఒకటి. మట్టిలో పనులు చేసే మనుషుల దిగులును తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఎలాగంటారా? సెరొటోనిన్ అనే హార్మోన్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. వ్యాకులతను, మనోవ్యధను తగ్గిస్తుంది. అందుకే దీన్ని ‘హేపీ హార్మోన్’ అని పిలుస్తుంటారు. ఇది జంతువులు, మనుషుల్లో సెరొటోనిన్ అనే రసాయనం విడుదలకు సహజ ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. కుంగుబాటు ఉపశమనానికి వాడే ప్రొజాక్ వంటి ఔషధాల మాదిరిగానే ఈ సూక్ష్మజీవి కూడా.. హేపీ హార్మోన్ విడుదలకు సహజ ఉత్ప్రేరకంగా పనిచేస్తోందని ప్రయోగాల్లో తేలింది. పొలం పనులు, ఇంటిపంటల పనుల్లో చేతులకు మట్టి అయ్యేలా పనిచేయడం వల్ల మనోల్లాసం కలగడం ఇందుకేనన్నమాట. మట్టి మనుషులకు ప్రకృతి చేదోడుగా నిలుస్తుందని చెప్పడానికి ఇంతకుమించిన ఉదాహరణేం కావాలి చెప్పండి..! అంటే.. మట్టిని పలకరిస్తుంటే మనోవ్యాధి దానంతట అదే పరారవుతుందన్న మాట. ప్రకృతి చికిత్స పద్ధతుల్లో రోగి ఒంటిపై మట్టితో పట్టీలు వేయడం, వళ్లంతా మట్టి పూసి స్నానం చేయించడం ఇందుకేనేమో!
 
ఎండు మట్టే ‘బంగారం’!
 
భూమిలో నుంచి తవ్వి ఎండబెట్టిన మట్టి (సబ్ సాయిల్) సకల పోషకాలతో కూడిన ఎరువుతో సమానం అంటారు సికింద్రాబాద్ ఆల్వాల్‌కు చెందిన రైతుశాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి. కొన్ని అడుగుల లోతు నుంచి తీసి ఎండబెట్టిన పొడి మట్టినే ‘మట్టి ఎరువు’గా వాడే పద్ధతిని ఆవిష్కరించిన ఆయన అనేక దేశాల్లో పేటెంట్ పొందారు. వినూత్నమైన ఈ ‘మట్టి ఎరువు’ సాగు పద్ధతిలో అనేక ఏళ్లుగా వరి, ద్రాక్ష, గోధుమ, కూరగాయ పంటలను ఆయన సాగుచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కుందనపల్లిలోని తన సొంత భూమిలో ఈ ఖరీఫ్‌లో బీపీటీ 5204 వంగడం సాగు చేసి ఎకరానికి 36 బస్తాల(75 కిలోలు) ధాన్యం దిగుబడి పొందారు. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుతోపాటు.. నాలుగు దఫాలుగా మట్టి ఎరువును వాడారు. బోరు నుంచి పొలంలోకి పారుతున్న నీటిలో ఈ మట్టిని కలపడం ద్వారా ‘ఒండ్రు నీటి’ని పొలానికి అందిస్తున్నారు. ఇలా సాగైన బియ్యంలో బాలల్లో రేచీకటిని నివారించే ‘విటమిన్ ఎ’ తదితర పోషకాలు నిక్షిప్తమవుతున్నట్లు గతంలో చేయించిన పరీక్షల్లో నిర్ధారణ అయ్యిందని వెంకటరెడ్డి(98668 83336) తెలిపారు(విటమిన్ ఎ కలిగి ఉండే జన్యుమార్పిడి ‘గోల్డెన్ రైస్’పై భారీ ఖర్చుతో అంతర్థాతీయ స్థాయిలో పరిశోధనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే). కొద్ది నెలల క్రితం మట్టి ఎరువుతో సాగవుతున్న వెంకటరెడ్డి ద్రాక్ష తోటను సందర్శించిన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డా. అయ్యప్పన్ ఇలా అభివర్ణించారు: ‘ఇది భూలోకంలో వైకుంఠం’!
 
దశపత్ర ద్రావణంతో చీడపీడలకు చెక్
 
పంటలను ఆశించే తెగుళ్లు, పురుగులను దశపత్ర ద్రావణం అరికడుతుంది. ప్రధానంగా ఈ ద్రావణం తయారీకి తుంచితే పాలుగారే కొన్ని రకాల ఆకులను వాడాలి. జిల్లేడు, జుట్లపాకు, పలవరేణి, బొప్పాయి, వేప, ముష్టి, తంగేడు, వావిలాకు, కొండ వావిలాకు(నల్లది), వయ్యారిభామ, వెంపలి, వెర్రి మిరప(గబ్బాకు) వాడాలి. చీకాకు, ఉమ్మెత్త ఆకులనూ వాడొచ్చు. ఒక్కో రకం ఆకు ఒక కిలో తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. 5 కిలోల పేడ(బర్రె లేదా ఆవు పేడ), 10 లీటర్ల ఆవు లేదా బర్రె మూత్రం, 200 లీటర్ల నీరు తీసుకొని ఒక డ్రమ్ములో పోసి మురగపెట్టాలి.

ఉదయం, సాయంత్రం ఈ ద్రావణాన్ని బాగా కలియబెడుతుండాలి, వారం రోజులపాటు కలియబెట్టి, నిల్వ చేసుకోవాలి. ఈ ద్రావణం తయారైన 6 నెలల వరకు పురుగులు, తెగుళ్ల నివారణకు వాడుకోవచ్చు. పంటకు 25వ రోజు నుంచి, పూతకు ముందు, పిందె ఏర్పడిన తరువాత ఈ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కూరగాయల తోటలకు పిచికారీ చేసే ఒక (12-15 లీటర్ల) డ్రమ్ముకు తొలిసారి పావు లీటరు, తర్వాత రెండుసార్లు అర లీటరు దశపత్ర ద్రావణాన్ని కలిపి పిచికారీ చేసుకోవాలి. పండ్ల తోటలకైతే డ్రమ్మునకు అర లీటరు ద్రావణం కలిపి పిచికారీ చేసుకోవాలి.
 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement