రసాయనిక వ్యవసాయంలో నష్టాలపాలై ఉన్న 20 ఎకరాల్లో 12 ఎకరాలను తెగనమ్ముకున్నారు. అంతటి సంక్షోభ కాలంలో పరిచయమైన ప్రకృతి వ్యవసాయం వారి ఇంట సిరులు కురిపిస్తోంది. అమ్మిన ఆ 12 ఎకరాలను తిరిగి కొనుక్కున్నారు..
అవే పంటలు.. అదే పొలం.. మారినది సాగు పద్ధతి మాత్రమే..
రసాయనిక వ్యవసాయం వారిని అప్పుల్లో ముంచింది. ఆ అప్పులు ఉన్న 20 ఎకరాల పొలంలో 12 ఎకరాలను మింగేశాయి. ఇక వ్యవసాయం వద్దే వద్దు.. అనుకుంటున్న తరుణంలో పరిచయం అయిన ప్రకృతి వ్యవసాయం ఈ లావణ్యా రమణారెడ్డి కుటుంబం తలరాత మారిపోయింది. కల నెరవేరింది..! తెగనమ్ముకున్న అదే 12 ఎకరాల భూమిని మళ్లీ తిరిగి కొనుక్కున్నారు. నమ్ముకున్న రైతు కుటుంబానికి ప్రకృతి వ్యవసాయం దీర్ఘకాలంలో ఎంత మేలు చేస్తుందో లావణ్యా రమణారెడ్డి కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుంది.
నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన లావణ్య భర్త రమణారెడ్డితో కలిసి 16 ఏళ్లుగా ప్రకృతి సేద్యాన్ని లాభదాయకంగా కొనసాగిస్తున్నారు. కళ్లు చెదిరే దిగుబడులు తీస్తున్నారు. కారువంగ గ్రామానికి ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన లావణ్య ప్రజలకు సేవలందిస్తూనే ప్రకృతి వ్యవసాయంపై దృష్టికేంద్రీకరిస్తున్నారు. రైతులకూ శిక్షణ ఇస్తున్నారు.
లావణ్య భర్త రమణారెడ్డితో కలిసి ప్రతి రోజూ తమ పొలంలో పత్తి, మిరప, ఆముదం,మొక్కజొన్న, వరి లాంటి పంటలను గతంలో రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసేవారు. అప్పులపాలై 12 ఎకరాలు అమ్ముకున్న తర్వాత వ్యవసాయం మానేద్దామనుకున్న తరుణంలో.. మహారాష్ట్రకు చెందిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ పుస్తకాల్లో చదివి తెలుసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో మహారాష్ట్ర వెళ్లి పాలేకర్‌ను కలుసుకొని.. కొద్దిరోజులపాటు అక్కడే ఉండి శిక్షణ పొందారు.
మొదట కేవలం ఒక సెంటు భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 2002లో ప్రయోగాత్మకంగా కనకాంబరం తోటను సాగు చేసి అధిక దిగుబడులు సాధించారు. 2003లో అర ఎకర పొలంలో మిర్చి పంట వేసి ఆరు క్వింటాళ్ల దిగుబడి పొందారు. జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలను స్వయంగా తయారు చేసుకొని వాడుతున్నారు.
ఈ ఏడాది ఎకరానికి 10 క్వింటాళ్ల పత్తి దిగుబడిని సాధించారు. ఈ ఏడాది రసాయనిక వ్యవసాయంలో వరిని సుడిదోమ దెబ్బతీసింది. అయితే, లావణ్య పొలంలో ఎకరానికి 78 బస్తాల(బస్తా 60 కిలోలు) ధాన్యం దిగుబడి వచ్చింది.
3 ఎకరాల్లో మిరప తోట సాగు చేయగా.. ఇప్పటికి పండు మిర్చి 3 కోతల్లో 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇంకా ఎకరానికి 6–7 క్వింటాళ్ల కాయ ఉందని ఆమె తెలిపారు. మిరపలో ధనియాలు, ఆవాలు, మెంతులు, గోధుమలు, వేరుశనగ వంటి అంతర పంటలు ఉన్నాయి. అంతరపంటల ద్వారా ఖర్చు తిరిగి వచ్చేస్తే.. ప్రధాన పంట ద్వారా వచ్చే ఆదాయం అంతా నికరాదాయంగా ఉంటుందన్నది పాలేకర్ వ్యవసాయంలో మూల సూత్రం. ఈ సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తూ దినదినాభివృద్ధి సాధిస్తున్నారు లావణ్యా రమణారెడ్డి దంపతులు. ప్రకృతి సాగే తమకు ఎంతగానో నచ్చిందని, ఖర్చు కూడా బాగా తగ్గిందన్నారు. ఇతర గ్రామాల రైతులు సైతం లావణ్య, రమణారెడ్డి చేపట్టిన ప్రకృతి సేద్యంపై ఆసక్తి పెంచుకున్నారు.
– శ్రీధర్, సాక్షి, నాగర్‌కర్నూల్, తెలంగాణ
వ్యవసాయాన్ని ఉద్యోగంలా భావిస్తేనే లాభాలు!
వ్యవసాయాన్ని చాలా మంది రైతులు చాలా తేలికగా తీసుకుంటారు. నిరాసక్తతతో సేద్యం చేస్తారు. ఈ ధోరణే వారిని నష్టాల పాలు చేస్తున్నది. వ్యవసాయ రంగం ఇతర రంగాలకు ఏ మాత్రం తీసిపోదు. దీన్ని ఓ ఉద్యోగంలా భావించి, అనుదినం కనిపెట్టుకొని అన్ని పనులూ స్వయంగా చేసుకోవాలి. మరీ అవసరం ఉన్నప్పుడే కూలీలపై ఆధారపడాలి. ఎంతో శ్రమకోర్చి పండించిన పంటను మార్కెట్ చేసుకునే విషయంలోనూ శ్రద్ధ చూపాలి. మేము పండించే ఎండు మిరప కాయలతో కారం పొడిగా మార్చి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నాం. దీంతో మిర్చి ఆదాయం రెండింతలైంది.
– కసిరెడ్డి లావణ్య రమణారెడ్డి(77300 61819), సీనియర్ ప్రకృతి వ్యవసాయదారు,కారువంక, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
Comments
Please login to add a commentAdd a comment