బొబ్బిలిలో 23, 24 తేదీల్లో చెరకు ప్రకృతి సేద్యంపై పాలేకర్ శిక్షణ
నూటికి నూరు శాతం సేంద్రియ పంచదార ఉత్పత్తి దిశగా తొలి అడుగు పడుతోంది. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఎన్.సి.ఎస్. సుగర్స్ యాజమాన్యం ఈ దిశగా పూనికతో కదులుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో (రసాయనిక వ్యవసాయంలో) చెరకు దిగుబడి సగటున ఎకరానికి 27 టన్నులు ఉంది. అయితే, మహారాష్ట్రలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు 80 నుంచి 120 టన్నుల దిగుబడి వస్తోంది. ఇక్కడ 2, 3 కార్శి పంటలు వస్తుండగా, అక్కడ 8 పంటలు వస్తున్నాయి.
ఈ అంశంపై స్వయంగా అధ్యయనం చేసిన ఎన్.సి.ఎస్. సుగర్స్ ఎం.డి. ఎన్. నాగేశ్వరరావు పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్ పాలేకర్‌తో ఈ నెల 23, 24 తేదీల్లో చెరకు రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని బొబ్బిలిలోని ఎన్.సి.ఎస్. ఫ్యాక్టరీ ఆవరణలో నిర్వహించనున్నారు.
ఉదయం 9.30 గం. నుంచి సాయంత్రం 6.30 గం. వరకు జరిగే రెండు రోజుల శిక్షణా శిబిరంలో ఫ్యాక్టరీ పరిధిలోని సుమారు 5 వేల మంది చెరకు రైతులు హాజరవుతున్నారు. పాలేకర్ గారి ఆంగ్ల ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించి చెప్పే ఏర్పాటు చేశారు. చెరకులో కూరగాయలు, టమాటా, వేరుశనగ, చిక్కుడు వంటి అంతర పంటలను ఏటా రెండు దఫాలు సాగు చేయడంపై పాలేకర్ రైతులకు శిక్షణ ఇస్తారు. స్థానిక రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలోని చెరకు రైతులు సైతం హాజరుకావచ్చు. ఉచిత భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తున్నారు. పాల్గొనదలచిన రైతులు ఎన్.సి.ఎస్. ఫ్యాక్టరీకి చెందిన పరమేశ్వరరావు (93470 17129)కు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేసుకోవచ్చు.
‘రెండేళ్లలో చెరకు దిగుబడి రెట్టింపే లక్ష్యం’
చెరకు సాగులో, చక్కెర తయారీ ప్రక్రియలో రసాయన రహిత పద్ధతుల్లో సేంద్రియ చక్కెర తయారీపై ప్రపంచవ్యాప్తంగా చైతన్యం వస్తోందని, అమెరికాలో ఇప్పటికే 30% మార్పు వచ్చిందని నాగేశ్వరరావు వివరించారు. తమ ఫ్యాక్టరీ పరిధిలో 22 వేల మంది రైతులు 40 వేల ఎకరాల్లో చెరకు సాగు చేస్తున్నారన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో చెరకు, అంతరపంటల సాగుపై వీరందరికీ దశలవారీగా శిక్షణ ఇప్పిస్తామన్నారు. ప్రతి గ్రామంలో 2 ఎకరాల్లో నమూనా ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తమ జిల్లాలో ఎకరానికి అతి తక్కువగా 20 టన్నుల దిగుబడి వస్తోందని, ప్రకృతి సేద్యం ద్వారా రెండేళ్లలో 40 టన్నులకు పెంచాలన్నదే తన లక్ష్యమన్నారు. 50 వేల టన్నుల చెరకు అందుబాటులోకి వస్తే ప్రత్యేక బ్యాచ్‌గా సేంద్రియ చక్కెర ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. దేశంలోనే తొలి సేంద్రియ చక్కెర ఉత్పత్తి కర్మాగారంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని నాగేశ్వరరావు (nnr@ncsgroup.in) వివరించారు.