ఎస్.పి.కె. వ్యవసాయ పద్ధతి ద్వారానే ఆహార స్వావలంబన సాధ్యం
చర్చాగోష్టిలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాశ్ పాలేకర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: భూతాపాన్ని పెంపొందించటం ద్వారా రైతులను ఆత్మహత్యలకు గురిచేయటంతో పాటు వినియోగదారులను రోగగ్రస్తంగా మార్చుతున్న రసాయనిక వ్యవసాయాన్ని నిషేధించాలని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాశ్ పాలేకర్ పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకుంటూ సంపూర్ణ ఆహార స్వావలంబన ద్వారా అన్ని విధాలా సమృద్ధిని సాధించటం సుభాశ్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిని అనుసరించటం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఫిలింనగర్ క్లబ్‌లో మంగళవారం సాయంత్రం పలువురు సినీ ప్రముఖులు, సామాజిక వేత్తలతో జరిగిన చర్చాగోష్టిలో డా. పాలేకర్ ప్రసంగించారు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు కె.ఎస్. వరప్రసాద్‌రెడ్డి, ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్, టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, నాఫ్‌స్క్వాబ్ మాజీ అధ్యక్షులు కొండ్రు రవీంద్రరావు, ఆధ్యాత్మికవేత్త సత్యవాణి, సినీ రచయిత భారవి, నాబార్్డ పూర్వ సీజీఎం మోహనయ్య, సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ తదితరులతో పాటు వందలాది మంది ప్రకృతి వ్యవసాయ ప్రేమికులు పాల్గొన్నారు.
డా. పాలేకర్ మాట్లాడుతూ, రసాయనిక వ్యవసాయం వల్ల బియ్యం, గోధుమలను మాత్రం ఉత్పత్తి చేసుకుంటున్నామని, వంటనూనెలు, పప్పుధాన్యాలను విదేశాల నుంచి లక్షల టన్నుల దిగుమతి చేసుకుంటున్నామని విమర్శించారు. రసాయనిక వ్యవసాయోత్పత్తులు దేశ ప్రజలను మధుమేహం, కేన్సర్ వంటి భయంకర జబ్బుల పాలు జేస్తున్న విషయాన్ని పాలకులు, సమాజం ఇప్పటికైనా గుర్తించాలన్నారు. సేంద్రియ వ్యవసాయంలోనూ టన్నుల కొద్దీ పశువుల ఎరువులు వేయటం వల్ల రసాయనిక వ్యవసాయంలో మాదిరిగానే కర్బన ఉద్గారాలు పెద్ద ఎత్తున వెలువడి భూతాపాన్ని పెంపొందిస్తున్నాయని ఆయన తెలిపారు.
రసాయనిక వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవటం వల్ల రైతులు అప్పులపాలై ఆత్మహత్యల పాలవుతున్నారని, రైతు కుటుంబాల్లోని యువత వ్యవసాయేతర రంగాల్లోకి వలస వెళ్లటం వల్ల భవిష్యత్తులో వ్యవసాయం చేసే రైతులు కరువయ్యే దుర్గతి నెలకొనబోతోందన్నారు.
సుభాశ్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో నేలలో సూక్ష్మజీవులను పెంపొందించే జీవామృతం, ఘన జీవామృతం వంటి మైక్రోబియల్ కల్చర్‌ను కొద్ది మొత్తంలో వేస్తే సరిపోతుందని, టన్నుల కొద్దీ పశువుల ఎరువులు వేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాలను ఆకళింపు చేసుకొని 5 లేయర్ పద్ధతిలో సాగు చేస్తే ఎకరానికి తొలి ఏడాదిలోనే రూ. 1.5 లక్షల ఆదాయం వస్తుందని, ఆరేళ్ల నుంచి ఏటా ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయం వస్తుందని.. రైతులు సాగు చేస్తున్న నమూనా క్షేత్రాలు సాక్ష్యంగా ఉన్నాయన్నారు. భూములను పునరుజ్జీవింపజేసుకుంటూ భవిష్యత్తులో పెరిగే జనాభాకు ఆహార కొరత లేకుండా చూడాలంటే ప్రకృతి నియమాలను అనుసరిస్తూ ఎస్.పి.కె. వ్యవసాయ పద్ధతిని అనుసరించాలన్నారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇదొక ప్రజా ఉద్యమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని, తెలుగు రాష్టా్రల్లో ప్రతి గ్రామానికీ ఈ వ్యవసాయాన్ని తీసుకెళ్లడానికి అందరూ సహకరించాలని పాలేకర్ కోరారు.
7 వేల మందితో మెగా శిక్షణా శిబిరం..
2015 ఫిబ్రవరి 15 నుంచి 23 వరకు రంగరెడ్డి జిల్లాలోని కన్హ శాంతివనంలో 7 నుంచి 10 వేల మంది రైతు కుటుంబీకులతో మెగా శిక్షణా శిబిరాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు శిబిరం నిర్వాహకులు, సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ ప్రకటించారు. డా. పాలేకర్ ఈ 9 రోజుల శిబిరంలో రోజుకు పది గంటల పాటు శిక్షణ ఇస్తారన్నారు. 7 వేల మంది రైతులు, 3 వేల మంది రైతుల జీవిత భాగస్వాముల్ని సైతం ఈ శిబిరానికి ఆహ్వానిస్తున్నామన్నారు. తెలుగు రాషా్ట్రల్లో ప్రతి గ్రామానికీ సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలన్నదే లక్ష్యమని విజయరామ్ వివరించారు.
శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు కె.ఎస్. వరప్రసాద్‌రెడ్డి ప్రసంగిస్తూ పాలేకర్ వ్యవసాయ పద్ధతిపై రైతు శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పడానికి తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారు. ఆధ్యాత్మికవేత్త సత్యవాణి మాట్లాడుతూ పాలేకర్ కారణజన్ములని, ఈ వ్యవసాయ పద్ధతిని ప్రతి గ్రామానికీ తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇవి చదవండి: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
Comments
Please login to add a commentAdd a comment