ధనుర్మాసంలో చేసే పూజలకు తగ్గట్టుగానే తులసీతీర్థం, చక్కెర పొంగళి, కట్టె పొంగలి, దద్దోజనం, పులిహోర తదితర పోషక విలువలుండే ప్రసాదాలను ఆరగిస్తారు. అలంకార ప్రియుడైన శ్రీమహావిష్ణువును ఆరాధించడంలో స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలను అర్పించడం ఎంతటి పుణ్యఫలమో, అంతటి ఆరోగ్యబలం కూడా.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్దేశించి ఈ ధనుర్మాసంలో అందిస్తున్న ప్రసాదాలు ఎన్నెన్నో పోషక విలువలతో ముడిపడి ఉండటం విశేషం. తీర్థం.. ప్రసాదంగా మనం స్వామివారికి సమర్పించి స్వీకరించే వీటిలో ప్రతి పదార్థానికి చక్కటి ఔషధగుణాలున్నాయి.
తులసి తీర్థంతో మానసిక బలం
ఆలయాల్లో దేవుడ్ని దర్శించుకున్న తర్వాత అర్చకుడు ఇచ్చే తీర్థమే తులసీతీర్థం. దీనినే భక్తులు తొలి ప్రసాదంగా భావిస్తారు. తులసి పత్రాలు, కర్పూరం.. యాలిక బీజాలను కలిపి తీర్థంగా ఇస్తుంటారు. ఇది మానసిక ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది. దగ్గు, ఆస్థమా, చర్మవ్యాధులు తీర్థ సేవనంతో నయమవుతాయయి. కడుపులో క్రిముల నివారణవుతాయి. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసిక వేదన నుంచి ఉపశమనం లభిస్తుంది.
పరమాన్నం.. పరమ ఔషధం..
పాలు, బియ్యంలో బెల్లం లేదా పంచదార వేసి చేసేదే పరమాన్నం. ఇందులో బాదంపప్పు, యాలకులు, పచ్చికొబ్బరి వేస్తారు. దేహానికి బలం, చక్కని కాంతిని ఇస్తుంది. ఆలోచన శక్తిని పెంచుతుంది. వాత, పైత్యాలను తగ్గిస్తుంది. ప్రతి 100 గ్రాముల బియ్యంలో 78 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8.5 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. 100 గ్రాముల బెల్లంలో 11.4 మిల్లీ గ్రాముల కేలరీలు, ఇనుము ఉన్నాయి దీనికి పుష్టిని ఇచ్చే గుణం ఉంది. వాత రోగాలు నివారణవుతాయి. బాదంలో బలాన్ని చేకూర్చే గుణం ఉంది. ఉత్సాహం పెరగడంతో పాటు నరాల బలహీనత, రక్తపోటును తగ్గుతుంది.
జ్వరాలు రాకుండా దద్దోజనం
తాళింపు పెట్టిన పెరుగన్నమే దద్దోజనం, ఆవు పాలను మరగకాచి చల్లార్చి తోడుపెట్టిన పెరుగులో మిరియాలు, ఇంగువ, శొంఠి మొదలైన వాటిని అన్నంలో కలుపుతారు. దానిని ఆవునెయ్యితో పోపుపెడతారు. ధనుర్మాసంలోని రెండోపక్షంలో దీనిని ప్రసాదంగా నివేదిస్తారు మంచు, చలి ఎక్కువగా ఉండే ఈ సమయంలో దద్దోజనం తీసుకోవటం వల్ల జలుబు, విష జ్వరాలు, శీతల జ్వరం రాకుండా నిరోధిస్తుంది.
అరుగుదలకు పులిహోర..
బియ్యంతో అన్నం వండిన తర్వాత దానికి పసుపు, నూనె, ఆవాలు, ఉప్పు, కరివేపాకు, శెనగపప్పు తదితరాలని కలిపి చేస్తారు. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆకలి పెరుగుతుంది. కాలేయానికి మంచిది. జలుబు, తుమ్ములు, ఉబ్బసం, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
కట్టె పొంగలితో కీళ్లజబ్బులు నయం
ధనుర్మాసంలో చలి, మంచు ఎక్కువగా ఉంటాయి. కట్టె పొంగలిని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. కీళ్ల జబ్బులు తగ్గుతాయి. దగ్గు, జలుబు రాకుండా చేస్తుంది.
చక్కటి ఔషధం చక్కెర పొంగలి
బియ్యం, పెసరపప్పు సమానంగా పోసి ఆవునేతితో ఉడికించి అందులో పంచదార, ద్రాక్ష, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు వేసి చేసే చక్కెర పొంగలిని సేవించడం వల్ల దేహపుష్టి కలుగుతుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శూల (నొప్పి)ని, జ్వరాన్ని హరిస్తుంది. పచ్చకర్పూరం వల్ల ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. కఫాన్ని, శరీరంలోని మంటల్ని నిరోధిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment