లంకణం పరమౌషధం అని పెద్దొళ్లు ఊరకే చెప్పలేదు. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా ప్రయోగకరంగా నిరూపిస్తున్నారు. అమెరికాలోని శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యయనం ప్రకారం..ఉపవాసం ఉంటే శరీరంలో మంట/వాపు తగ్గిస్తుందట. రోగ నిరోధక వ్యవస్థపై ఏమాత్రం ప్రభావం చూపకుండానే మంట/వాపులను నయం చేయగలదట. ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ చేసే మొట్టమొదటి పని మంట/వాపును సృష్టించడం. ఇది ఎక్కువ కాలం ఉంటే గుండెజబ్బులు, కేన్సర్, వంటి అనేక జబ్బులు చుట్టుముడతాయి.
ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల బృందం మానవ, ఎలుకల నిరోధక వ్యవస్థ కణాలపై అధ్యయనం నిర్వహించింది. ఉపవాసం ఉన్నప్పుడు మంట/వాపులకు కారణమయ్యే మోనోసైట్స్ ఉపవాసంలో నిద్రాణ స్థితికి చేరుకుంటాయని చెబుతున్నారు. మరిన్ని పరిశోధనలతో మంట/వాపులకు మెరుగైన చికిత్స సాధ్యమవుతుందని, ప్రాణాంతక వ్యాధులను నివారించడం సాధ్యమవుతుందని వివరించారు.
లంకనం(ఉపవాసం) అంటే తేలిగ్గా ఉండటం, భగవంతునికి సమీపంగా ఉండటం అని అర్థం. మనుసు, దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించినప్పుడు ఆ తాదాత్మ్యతలో ఆకలిదప్పులు తెలియవు. ఏకాగ్రతతో కూడిన ధ్యానం వలన మానసిక దృఢత్వం అధికం అవుతుంది. తాత్కాలిక నిరాహారం వల్ల శరీర కణాలలోని జీవక్రియలు ఉత్తేజితమై,సర్వాంగాలలోనూ చైతన్య ప్రేరణ కలుగుతుంది. ఇదే దీర్ఘాయువునకు పెద్ద పీట. కొందరు గంటలు మొదలుకొని రోజుల వరకు ఉపవాసం చేస్తారు.
మరికొందరు మంచినీళ్లు కూడా తాగకుండా కఠోర ఉపవాసం చేస్తారు.వారానికి ఒకసారి లేదా నెలకు రెండు సార్లు ఉపవాసం చేయడం ఉత్తమం. నిజానికి ఫాస్టింగ్‌లో ఏమీ తినకూడదు అన్న నిబంధన ఏమీ లేదు. కాకపోతే కడుపునిండా తింటే నిద్ర రావడం, ప్రకృతి అవసరాల కోసం సమయం కేటాయించడం వంటివి చేస్తుంటాం. వీటన్నింటి కారణంగా దైవచింతనలో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉండదు కాబట్టే ఉపవాసం రోజున భోజనం మానేసే సాంప్రదాయం వచ్చింది.
అయితే ఉపవాసం వల్ల ఎన్నోప్రయోజనాలు ఉన్నాయి. కనీసం పగలంతా ఘన పదార్థాలు (వండినవి) తినకుండా కేవలం ద్రవాహారంతో చేసినా జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. రాత్రి స్వల్పంగా తినవచ్చు. ఆయుర్వేదంలో కొన్ని జావలు (సూప్స్) చెప్పారు. (బియ్యప్పిండి, పేలాలు, అటుకులు, కూరగాయలు). వీటిలో పాచక పదార్థాలు (మిరియాల పొడి; వాము జీలకర్ర పొడులు, శొంఠి, పిప్పళ్ల పొడులు) వంటివి తీసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment