వ్యవసాయ రసాయనాలు రూ. 80,000 కోట్లకు అప్!
న్యూఢిల్లీ: పరిశ్రమకు అనుకూలమైన పరిస్థితులు, అవకాశాలు కల్పిస్తే భారత్ వ్యవసాయ రసాయన ఎగుమతులు రాబోయే నాలుగేళ్లలో రూ.80,000 కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఏఎఫ్‌సీఐ–ఈవై నివేదిక ఒకటి పేర్కొంది. ఇండస్ట్రీ ప్రతినిధ్య సంస్థ అగ్రో కెమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎఫ్‌ఐ)–ఈవై సంయుక్తంగా ‘భారత వ్యవసాయ రసాయన పరిశ్రమ: ప్రస్తానం, సవాళ్లు, ఆకాంక్షలు’ అన్న శీర్షికన ఈ నివేదిక రూపొందింది. ఏసీఎఫ్‌ఐ ఏడో సార్వత్రిక సమావేశం నేపథ్యంలో విడుదలైన ఈ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
2022–23 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రసాయనాల ఎగుమతుల విలువ రూ.43,223 కోట్లు.
భారత్ వ్యవసాయ రసాయన ఎగుమతులు దేశీయ వినియోగం కంటే ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ రసాయన పరిశ్రమల దన్నుతో భారత్ ఎగుమతులు ఇటీవలి కాలంలో ప్రశంసనీయమైన వృద్ధిని నమోదుచేసుకున్నాయి.
లైసెన్సింగ్ నిబంధనలను క్రమబదీ్ధకరించడం, నిల్వ, విక్రయాల కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, బయోపెస్టిసైడ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహించడం, కొత్త మాలిక్యులస్‌లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం, సడలించిన ఎంఆర్‌ఎల్ నిబంధనలతో దేశాలతో వాణిజ్య ఒప్పందాలను చేసుకోవడం, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుండి పెట్టుబడులను ఆకర్షించడానికి పీఎల్‌ఐ తరహాలో ఒక పథకాన్ని ఆవిష్కరించడం వంటి పలు చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
వస్తు సేవల పన్నును (జీఎస్‌టీ) 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని పరిశ్రమల సంఘం కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం.
2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించగల దేశంగా భారత్ ప్రపంచ తయారీ కేంద్రంగా రూపొందాలి. ఇందుకు సంబంధించి వృద్ధి అవకాశాల అన్వేషణలో వ్యవసాయ రసాయన పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవసాయ ఉత్పాదకత, ఆహార భద్రత, ఎగుమతి సామర్థ్యాన్ని పెంపొందించడంలో అగ్రోకెమికల్ పరిశ్రమ పాత్ర ఎంతో కీలకం కానుంది.
ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద వ్యవసాయ రసాయనాల ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ, భారతదేశం ఒక వైరుధ్య పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశం గణనీయమైన ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఇప్పటికీ గణనీయమైన స్థాయిలో వ్యవసాయ రసాయనాలను దిగుమతి చేసుకుంటుంది. ప్రత్యేకించి చైనా నుంచి ఈ దిగుమతులు జరుగుతున్నాయి.
‘మేక్ ఇన్ ఇండియా’ చొరవతో పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాల్సి ఉంది. అవకాశాలుగా మార్చడానికి సకాలంలో తగిన ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటుకావాలి. ఆయా చర్యలు దేశాన్ని వ్యవసాయ రసాయనాల కోసం ప్రపంచ తయారీ ఎగుమతి కేంద్రంగా మారడానికి వీలు కలి్పస్తుంది.
ఇదీ చదవండి: మొబైల్ అలర్ట్‌లతో ప్రాణాలు కాపాడేలా..
భారత మార్కెట్‌లో వ్యవసాయ రసాయన వినియోగం (కేజీ/హెక్టార్‌కు) తక్కువగా ఉంది. నివేదికల ప్రకారం భారతదేశం హెక్టారుకు 400 గ్రాముల వ్యవసాయ రసాయనాలను మాత్రమే వినియోగిస్తోంది. ఇది ప్రపంచ సగటు 2.6 కేజీ/హెక్టార్ కంటే తక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment