పచ్చనాకు సాక్షిగా పచ్చటి తోవలో.. 'కృషిమిత్ర' గీత | Development Of Organic Farming With Krushimitra Gita | Sakshi
Sakshi News home page

పచ్చనాకు సాక్షిగా పచ్చటి తోవలో.. 'కృషిమిత్ర' గీత

Published Sat, Jan 6 2024 11:08 AM | Last Updated on Sat, Jan 6 2024 11:08 AM

Development Of Organic Farming With Krushimitra Gita - Sakshi

‘వ్యవసాయం బాగుండాలంటే రసాయన ఎరువులు, పురుగుల మందులు ఎక్కువగా వాడాలి’ అనే నమ్మకం బలంగా పాతుకుపోయిన గ్రామంలో సేంద్రియ వ్యవసాయం గురించి ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది?
పెద్దగా స్పందన కనిపించదు. అంగిసింగి అనే ఊళ్లో కూడా అచ్చం అలాగే జరిగింది. అయితే ‘కృషిమిత్ర’ గీత వల్ల ఆ ఊరు మారింది. పచ్చనాకు సాక్షిగా పచ్చటి తోవలో నడుస్తోంది..'

పచ్చనాకు సాక్షిగా..
పెళ్లయిన తరువాత అంగిసింగి (నయాగఢ్‌ జిల్లా–ఒడిశా) అనే ఊళ్లోని అత్తగారింట్లోకి అడుగు పెట్టింది గీతారాణి సప్తతి. అంగిసింగి అనేది వ్యవసాయ ఆధారిత గ్రామం. అయితే రైతులు మాత్రం ‘ఎన్ని రసాయన ఎరువులు వాడితే వ్యవసాయానికి అంత మంచిది’ అనే ధోరణిలో ఉండేవారు. రైతులు పోటీపడి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడడం వల్ల గ్రామంలో ఆస్తమా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండేది. గీత పిల్లలు కూడా ఆస్తమా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే గీత ‘కృషిమిత్ర’ల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది.

గ్రామాలలో పర్యావరణహిత వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు అవగాహన కలిగించే స్వయం సహాయక బృందం సభ్యులను ‘కృషిమిత్ర’ అంటారు. తన గ్రామంలోని అస్తవ్యస్త వ్యవసాయ పద్ధతులను దృష్టిలో పెట్టుకొని శిక్షణ తరువాత గీత కూడా ‘కృషిమిత్ర’గా మారింది. ‘తక్కువ ఖర్చుతో పర్యావరణ హిత వ్యవసాయం చేయవచ్చు’ అనే నినాదంతో రైతుల దగ్గరకు వెళ్లింది గీత. రసాయన ఎరువులు అధికంగా వాడడం వల్ల కలుగుతున్న నష్టాల గురించి వారికి వివరించింది.

ప్రచారంతోపాటే తాను స్వయంగా సేంద్రియ వ్యవసాయం చేయడం మొదలుపెట్టింది. రైతుల భార్యలను పొలానికి తీసుకువెళ్లి తాను ఆచరిస్తున్న పద్ధతులను పరిచయం చేసేది. సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించేది. ‘తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం’ కాన్సెప్ట్‌తో గీత చేసిన సేంద్రియ వ్యవసాయం విజయవంతం అయింది. ఇక అప్పటినుంచి రైతుల్లో కదలిక మొదలైంది. గీతను వెదుక్కుంటూ వచ్చి, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకునేవారు. ‘ఒకప్పుడు సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసే కృషిమిత్ర నేను ఒక్కరినే. నేను చేస్తున్న వ్యవసాయాన్ని గమనించిన తరువాత ఇప్పుడు చాలామంది మహిళలు కృషిమిత్రగా మారారు’ అంటుంది గీత.

ఒకవైపు ఇంటిపనులు, పొలం పనులు చేసుకుంటూనే మరోవైపు రైతుల పొలాల దగ్గరికి వెళ్లి వారికి అవసరమైన సలహాలు ఇస్తుంటుంది గీత. మొబైల్‌ ఫోన్‌ ద్వారా విజువల్స్, సమాచారాన్ని చేరవేస్తుంటుంది. గీత దినచర్య వేకువ జామునే మొదలవుతుంది. ఆగిపోయిన చదువును దూరవిద్య ద్వారా తిరిగి కొనసాగించాలని నిర్ణయించుకుంది గీత. ఒకప్పుడు ఆమెను నిరుత్సాహపరిచిన భర్త, గీత మాటల వల్ల గ్రామ వ్యవసాయ పద్ధతుల్లో వస్తున్న మార్పులు, రైతులు చూపిస్తున్న గౌరవం చూశాక భార్యకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నాడు.

మా ఊరు..
ఒకప్పుడు ఇంటికి మాత్రమే పరిమితమైన నేను కృషిమిత్ర స్వయం సహాయక బృందంలో చేరడం వల్ల వ్యవసాయం, పర్యావరణానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నాకు తెలిసిన విషయాలను చుట్టుపక్కల వారితో పంచుకుంటున్నాను. ఆశను, ఆశయాలనూ ఎప్పుడూ వదులుకోవద్దు. కాస్త ఆలస్యం అయినా ఫలితం తప్పకుండా వస్తుంది అని చెప్పడానికే మా ఊరే నిదర్శనం. – గీతా రాణి సత్పతి, కృషిమిత్ర

ఇవి చ‌ద‌వండి: స్వావలంబనకు చుక్కాని... రుబీనా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement