krushi
-
పచ్చనాకు సాక్షిగా పచ్చటి తోవలో.. 'కృషిమిత్ర' గీత
‘వ్యవసాయం బాగుండాలంటే రసాయన ఎరువులు, పురుగుల మందులు ఎక్కువగా వాడాలి’ అనే నమ్మకం బలంగా పాతుకుపోయిన గ్రామంలో సేంద్రియ వ్యవసాయం గురించి ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? పెద్దగా స్పందన కనిపించదు. అంగిసింగి అనే ఊళ్లో కూడా అచ్చం అలాగే జరిగింది. అయితే ‘కృషిమిత్ర’ గీత వల్ల ఆ ఊరు మారింది. పచ్చనాకు సాక్షిగా పచ్చటి తోవలో నడుస్తోంది..' పచ్చనాకు సాక్షిగా.. పెళ్లయిన తరువాత అంగిసింగి (నయాగఢ్ జిల్లా–ఒడిశా) అనే ఊళ్లోని అత్తగారింట్లోకి అడుగు పెట్టింది గీతారాణి సప్తతి. అంగిసింగి అనేది వ్యవసాయ ఆధారిత గ్రామం. అయితే రైతులు మాత్రం ‘ఎన్ని రసాయన ఎరువులు వాడితే వ్యవసాయానికి అంత మంచిది’ అనే ధోరణిలో ఉండేవారు. రైతులు పోటీపడి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడడం వల్ల గ్రామంలో ఆస్తమా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండేది. గీత పిల్లలు కూడా ఆస్తమా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే గీత ‘కృషిమిత్ర’ల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. గ్రామాలలో పర్యావరణహిత వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు అవగాహన కలిగించే స్వయం సహాయక బృందం సభ్యులను ‘కృషిమిత్ర’ అంటారు. తన గ్రామంలోని అస్తవ్యస్త వ్యవసాయ పద్ధతులను దృష్టిలో పెట్టుకొని శిక్షణ తరువాత గీత కూడా ‘కృషిమిత్ర’గా మారింది. ‘తక్కువ ఖర్చుతో పర్యావరణ హిత వ్యవసాయం చేయవచ్చు’ అనే నినాదంతో రైతుల దగ్గరకు వెళ్లింది గీత. రసాయన ఎరువులు అధికంగా వాడడం వల్ల కలుగుతున్న నష్టాల గురించి వారికి వివరించింది. ప్రచారంతోపాటే తాను స్వయంగా సేంద్రియ వ్యవసాయం చేయడం మొదలుపెట్టింది. రైతుల భార్యలను పొలానికి తీసుకువెళ్లి తాను ఆచరిస్తున్న పద్ధతులను పరిచయం చేసేది. సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించేది. ‘తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం’ కాన్సెప్ట్‌తో గీత చేసిన సేంద్రియ వ్యవసాయం విజయవంతం అయింది. ఇక అప్పటినుంచి రైతుల్లో కదలిక మొదలైంది. గీతను వెదుక్కుంటూ వచ్చి, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకునేవారు. ‘ఒకప్పుడు సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసే కృషిమిత్ర నేను ఒక్కరినే. నేను చేస్తున్న వ్యవసాయాన్ని గమనించిన తరువాత ఇప్పుడు చాలామంది మహిళలు కృషిమిత్రగా మారారు’ అంటుంది గీత. ఒకవైపు ఇంటిపనులు, పొలం పనులు చేసుకుంటూనే మరోవైపు రైతుల పొలాల దగ్గరికి వెళ్లి వారికి అవసరమైన సలహాలు ఇస్తుంటుంది గీత. మొబైల్ ఫోన్ ద్వారా విజువల్స్, సమాచారాన్ని చేరవేస్తుంటుంది. గీత దినచర్య వేకువ జామునే మొదలవుతుంది. ఆగిపోయిన చదువును దూరవిద్య ద్వారా తిరిగి కొనసాగించాలని నిర్ణయించుకుంది గీత. ఒకప్పుడు ఆమెను నిరుత్సాహపరిచిన భర్త, గీత మాటల వల్ల గ్రామ వ్యవసాయ పద్ధతుల్లో వస్తున్న మార్పులు, రైతులు చూపిస్తున్న గౌరవం చూశాక భార్యకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నాడు. మా ఊరు.. ఒకప్పుడు ఇంటికి మాత్రమే పరిమితమైన నేను కృషిమిత్ర స్వయం సహాయక బృందంలో చేరడం వల్ల వ్యవసాయం, పర్యావరణానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నాకు తెలిసిన విషయాలను చుట్టుపక్కల వారితో పంచుకుంటున్నాను. ఆశను, ఆశయాలనూ ఎప్పుడూ వదులుకోవద్దు. కాస్త ఆలస్యం అయినా ఫలితం తప్పకుండా వస్తుంది అని చెప్పడానికే మా ఊరే నిదర్శనం. – గీతా రాణి సత్పతి, కృషిమిత్ర ఇవి చదవండి: స్వావలంబనకు చుక్కాని... రుబీనా! -
తల్లిదండ్రులపై ‘కృషి’ వెంకటేశ్వరరావు దాడి
సాక్షి, విజయవాడ : కృషి బ్యాంకు కుంభకోణం సూత్రధారి కోసరాజు వెంకటేశ్వరరావుపై ఆయన తల్లిదండ్రులే కేసు పెట్టారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడకు చెందిన కోసరాజు జయసింహ-బేబి సరోజినీలపై వారి కొడుకులైన వెంకటేశ్వరరావు, వేణుగోపాల్‌లు దాడికి పాల్పడ్డారు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు ఇద్దరు కొడుకులపై పెదపారుపూడి పోలీసులు కేసు నమోదుచేశారు. ఆస్తి విషయంలో తలెత్తిన విబేధాలే దాడికి కారణమని తెలిసింది. కృషి బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు వెంకటేశ్వరరావు. బ్యాంకు డిపాజిటర్లకు ఎక్కువ మొత్తంలో వడ్డీ(16.5 శాతం) ఇస్తానని ఆశలు చూపి భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. కుంభకోణం వెలుగులోకి రావడంతో చాకచక్యంగా 2001 జూలైలో భార్యతో కలిసి యూకే పారిపోయాడు. అక్కడ పౌరసత్వం రాకపోవడంతో మళ్లీ థాయిలాండ్‌కు పారిపోయాడు. ఈ విషయం హైదరాబాద్ పోలీసులకు తెలియడంతో బ్యాంకాక్ పోలీసులు, ఇంటర్ పోల్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో 2005లో బ్యాంకాక్‌లో వెంకటేశ్వర రావును అరెస్ట్ చేశారు. 2006, జూన్‌లో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. తల్లిదండ్రులపై దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
‘అన్నపూర్ణ కృషి ప్రసార సేవ’పై అవగాహన
కొత్తపల్లి : రైతులకు సాంకేతిక సమాచారాన్ని అందజేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అన్నపూర్ణ కృషి ప్రసార సేవ పేరిట టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్టు వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె.కృష్ణప్రసాద్ అన్నారు. జిల్లాలో తొలిసారి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అన్నపూర్ణ కృషి ప్రసార సేవ టోల్ ఫ్రీ నంబర్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నేరుగా శాస్త్రవేత్తలను సంప్రదించవచ్చన్నారు. వ్యవసాయం, పాడిపరిశ్రమ, ఉద్యాన వన పంటలు, చేపల పెంపకం తదితర అంశాలపై సూచనలు, సలహాలు పొందవచ్చునన్నారు. 24 గంటలూ ఈ టోల్ ఫ్రీ నంబర్ 18004253141 రైతులకు అందుబాటులో ఉంటుందన్నారు. రైతులు సెల్‌ఫోన్ నంబర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాతే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందుతుందన్నారు. ఇప్పటివరకూ సుమారుగా 22 వేల నంబర్లు రిజిస్ట్రేషన్ అయినట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాకినాడ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ పీఎల్ఆర్జే ప్రవీణ, శాస్త్రవేత్త ఎం.నందకిషోర్, గుంటూరు జిల్లా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వీడియో ల్యాబ్ రీసెర్చి పర్సన్స్ డాక్టర్ ఎం.సహదేవయ్య, డాక్టర్ పి.సాయి, కాకినాడ ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ పి.పద్మజ, పిఠాపురం ఏడీఏ పద్మశ్రీ, ఏఓ జోగిరాజు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు అనిశెట్టి సత్యానందరెడ్డి, ఎంపీడీఓ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.