‘కొన్నిసార్లు మీరు భయపడకుండా వేసే ఒక్క అడుగు జీవన గమనాన్ని మెరుగ్గా మార్చేస్తుంది’ అంటుంది 24 ఏళ్ల అశ్వతి ప్రహ్లాదన్. బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్న అశ్వతి ఇప్పుడు మిస్ కేరళ ఫిజిక్‌గా టైటిల్ గెలుచుకుంది.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నుంచి ఫిట్‌నెస్ కోచ్‌గా మారింది. సోషల్ మీడియాలో లక్షమంది ఫాలోవర్లతో బిజీగా ఉంది. ఎగతాళి మాటల నుంచి పట్టిన పట్టుదల ఎందరిలోనో స్ఫూర్తిని కలిగిస్తుంది.
‘‘ఒక దశలో నేను బాగా బరువు తగ్గిపోయాను. కారణం కొన్నిరోజులపాటు వేధించిన జ్వరం. ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోయింది. సరైన ఆహారం తీసుకోలేక బాగా సన్నబడిపోయాను. కొన్నాళ్లపాటు ఆ సమస్యను జనాల నుంచి సూటిపోటి మాటల ద్వారా ఎదుర్కొన్నాను. ‘ఎందుకు ఇంత సన్నగా ఉన్నావు? ఇంట్లో వాళ్లు ఫుడ్ పెట్టడం లేదా? గాలికి ఎగిరిపోయేలా ఉన్నావ్?.. లాంటి మాటలను ఎదురుగానే అనేవాళ్లు. చుట్టుపక్కల, బంధువులు రకరకాల సలహాలు ఇచ్చేవారు. దాంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా ఉద్యోగానికి వెళ్లాలంటే భయంగా ఉండేది. అమ్మాయిలు లావుగా ఉన్నా, మరీ సన్నగా ఉన్నా ఈ సమాజంలో జనం ఏదో ఒకటి అంటూ బాధించాలనే చూస్తారు. ఇదో పెద్ద మానసిక ఒత్తిడిగా అనిపించేది. ఈ ట్రామా నుంచి ఎలాగైనా బయట పడాలనుకున్నాను. అప్పుడే ఫిట్‌నెస్‌లోకి రావాలనుకున్నాను.
నన్ను నేను ప్రేమించుకుంటూ..
జనాలు ఎగతాళిగా అనే బాడీ షేమింగ్ వ్యాఖ్యలను అసలు పట్టించుకోవడం మానేశాను. నన్ను నేను ప్రేమించుకోవడం ప్రారంభించాను. నాలా బాధపడేవారికి ఓ రోల్‌మోడల్‌గా ఉండాలని జిమ్‌లో చేరాను. నా జీవనశైలిలో మార్పులు చేసుకున్నాను. సమతుల ఆహారంపై అవగాహన పెంచుకుని, దానిని తీసుకోవడంపై శ్రద్ధ పెట్టాను. ఫలితంగా ఆరోగ్యంలో మార్పు వచ్చింది. మానసిక ఆరోగ్యమూ మెరుగుపడింది. దీంతో ఫిట్‌నెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. ఎంతగా సాధన చేస్తూ వచ్చానంటే బాడీ షేమింగ్ బాధితులకు కేరళ ఫిజిక్ టైటిల్‌ను అంకితం చేసేవరకు నన్ను నేను మలుచుకోవడంలో ఒక తపస్సే చేశాను.
అశ్వతి ప్రహ్లాదన్
విమర్శలను పట్టించుకోను..
‘ఏమీ చేయని వ్యక్తులే జీవితంలో ఏదైనా సాధించాలని ప్రయత్నించేవారిని నిందిస్తుంటారు. మొదట్లో వారి మాటలకు నేను కూడా ఎదురు సమాధానం చెప్పేదాన్ని. ఇప్పటికి కూడా సోషల్‌మీడియాలో ఫేక్ అకౌంట్లతో నన్ను నిందించే ప్రయత్నం చేసేవాళ్లున్నారు. టైటిల్ సాధనతో ఇప్పుడు చెడు వ్యాఖ్యలు చేసేవారి సంఖ్య తగ్గి,పాజిటివ్ కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి.
అపోహలు వద్దు..
మగవారిలాగా తమ శరీరం కూడా కండలు తిరిగిపోతుందేమోనన్న భయంతో వర్కవుట్ చేయని మహిళలు ఉన్నారు. మరోవైపు వర్కవుట్ చేస్తూ బరువు తగ్గుతూ ఉంటే, ఏదైనా కారణాలతో మధ్యలో జిమ్ ఆపేస్తే మళ్లీ బరువు పెరుగుతామేమోనని అంటూ ఆందోళనపడేవారూ ఉన్నారు. ఇలాంటి అపోహలు మన సమాజంలో చాలా ఉన్నాయి. అలాంటి వారికి చెప్పేది ఏమిటంటే ‘జిమ్‌లోనూ, ఇంట్లోనూ మంచి జీవనశైలినిపాటించకుండా ఈ దురభి్రపాయాలకు రావద్దు. ముప్పై ఏళ్లు దాటిన తర్వాత మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గి, కండరాలు ద్రవ్యరాశిని కోల్పోయే అవకాశం ఉంది.
కండర నిర్మాణానికి వ్యాయామం ఆరోగ్యకరం. కండరాలను నిర్మించడం అంటే శరీరం అంతా కండరాలుగా మారడం కాదు. ఫిట్‌నెస్‌నుప్రాక్టీస్ చేస్తే మానసిక, శారీరిక ఆరోగ్యంతో సహా అన్ని విషయాలు మెరుగుపడతాయి. అందుకని, అపోహలతో ఫిట్‌నెస్‌లోకి రావద్దు. మన వెనక జనాలు ఏదో మాట్లాడుతున్నారని వెనకడుగు వేయద్దు. నా విషయంలో అయితే ఈ రంగంలోకి రావడమే మంచి నిర్ణయం అయింది. అందరూ ఈ విషయాన్ని అంగీకరించారు కూడా. మన శరీరానికి సరైన రీతిలో శిక్షణ ఇస్తే మరిన్ని అద్భుతాలను మనమే చేయచ్చు.
నా జీతం మొత్తం..
ఏడాదిన్నర క్రితం ఇన్ఫోపార్క్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఫిట్‌నెస్‌ను కూడా నా జీవితంలో భాగం చేసుకున్నాను. కానీ, పనిలో చాలా ఒత్తిడి ఉండేది. ఒక్కోసారి తొమ్మిది నుంచి పదకొండు గంటలు పనిచేయాల్సి వచ్చేది. ఆ పనుల మధ్య జిమ్‌కి వెళ్లేందుకు సమయం దొరకడం కష్టమైంది. కుటుంబం నుంచి మద్దతు లభించింది. నా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంది మా అమ్మ.
కానీ... వృత్తిని, అభిరుచిని కలపడం చాలా కష్టం అని గ్రహించాను. ఫిట్‌నెస్‌లో పోషకాహారం ఖరీదైనది. నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నా అభిరుచిని కొనసాగించగలిగాను. జీతం నా పోషణకు సరిపోయేది. కొన్ని సంప్లిమెంట్ల కోసం స్పాన్సర్లను వెతికాను. కానీ, లభించలేదు. దీంతో నా జీతం మొత్తం నా పౌష్టికాహారం కోసమే కేటాయించే దాన్ని. మరి ప్రయోజనాలు ఏంటి అని ఎవరైనా అడగచ్చు.
ఈ రంగంలోకి వచ్చినతర్వాత నేనెవరో నాకు అర్ధమైంది.పాటలుపాడతాను, డ్యాన్స్ చేస్తాను. ఫిట్‌నెస్ నన్ను ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుతుంది. ఇది విజయంగా భావిస్తున్నాను. అంతేకాదు, నా ఫిట్‌నెస్ ఇప్పుడు నా ఆదాయ వనరు కూడా. అందుకే, ఉద్యోగాన్ని మానేసి బిజీ ట్రైనర్‌గా మారిపోయాను’ అంటూ తన ఫిట్‌నెస్ రహస్యాలను చెబుతుంది అశ్వతి.
ఇవి చదవండి: Health: కడుపులోని బిడ్డ జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment