Physical Fitness
-
Kumanan Sethuraman: తన ఏడుపదుల వయసులోనూ.. ఫిజిక్ ఫిట్!!
సాక్షి, సిటీబ్యూరో: రమణా లోడ్ ఎత్తాలిరా అనే డైలాగ్ వింటే ప్రేక్షకులకు ఆయన గుర్తొస్తాడు కానీ సిటీలోని ఫిట్నెస్ స్టూడియోల్లో మాత్రం సీనియర్ సిటిజన్స్ ఫిజిక్ గురించి మాట్లాడాలంటే ఆయన తప్ప మరెవరూ గుర్తురారు. జన్మతః తమిళనాడుకు చెందిన కుమనన్.. ప్రస్తుతం టాలీవుడ్ నటుడిగా రాణిస్తున్నారు. అంతేకాదు అద్భుతమైన శరీరాకృతితో ఆకట్టుకుంటూ ఏడు పదుల వయసులో ఏకైక మేల్ మోడల్‌గానూ ర్యాంప్‌పై మెరుస్తున్నారు. ఇటీవలే అంతర్జాతీయంగా పనిచేసే బియర్డ్స్ క్లబ్ నుంచి వాషింగ్టన్లో నిర్వహించే ఈవెంట్లో ర్యాంప్ వాక్కు ఆహ్వానం సైతం అందుకున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో ఆయన పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..ఓ టీవీలు తయారు చేసే కంపెనీలో ఉద్యోగం చేసే సమయంలో చాలా లావుగా ఉండేవాడ్ని. డీలర్ల మీట్స్ కాక్టెయిల్ పార్టీస్‌తో వెయిట్ పెరిగాను. అదే సమయంలో నాకు వ్యక్తిగతంగా ఉన్న ఇష్టంతో ఫ్యాషన్ ఫొటోగ్రఫీ కూడా పార్ట్‌టైమ్‌గా చేసేవాడ్ని. అలా వైజాగ్‌తో పాటు పలు నగరాల్లో ఫ్యాషన్ ఈవెంట్స్‌కు హాజరయ్యేవాడిని. అలాంటి సమయంలో వారిని చూసినప్పుడు మోడల్స్‌లా మనమెందుకు లేం? ఈ పొట్ట, ఫ్యాట్ మనల్ని వదిలిపోవా? అని ఆలోచించేవాడ్ని.మార్చిన మోడల్స్.. ఇలాంటి ఆలోచనలతో కొందరు మోడల్స్‌తో మాట్లాడుతూ అనేక విషయాలపైన అవగాహన పెంచుకున్నాను. ముందు వెయిట్‌లాస్ అవ్వాలి. రోజూ వాకింగ్ చేసి వెయిట్ లాస్ అయ్యాక వర్కవుట్ చేయాలనేది తెలుసుకున్నా. ఒక శుభముహూర్తాన కాక్టెయిల్ పార్టీలు సహా అన్ని అనారోగ్యకర అలవాట్లకు గుడ్‌బై చెప్పేసి ఫిట్నెస్ లవర్‌గా మారిపోయాను. రోజూ విశాఖ బీచ్‌లో కాళిమాత గుడి నుంచి పార్క్ హోటల్ వరకూ 2గంటల పాటు ఇసుకలో జాగింగ్ చేసేవాడ్ని.. ఆ తర్వాత లెమన్ వాటర్ మాత్రమే తాగేవాడ్ని. ఆర్నెళ్లలో బాగా వెయిట్ లాస్ అయ్యాను. ఆ తర్వాత జిమ్‌లో జాయిన్ అయ్యా.. కట్ చేస్తే.. పొట్ట, కొవ్వు అన్నీ మాయమై.. చక్కని ఫిజిక్ సాధ్యమైంది. అదే ఫిజిక్ నాకు సినిమాల్లో నటుడిగా అవకాశం వచ్చేలా చేసింది. అలా 20 ఏళ్లనుంచి నా శరీరం పూర్తిగా నా నియంత్రణలోనే ఉంటోంది. సినిమాల్లో అవకాశాలతో నగరానికి షిఫ్ట్ అయ్యాక కృష్ణానగర్‌లోని ఓ చిన్న జిమ్‌తో మొదలెట్టి, వెంకట్ ఫిట్నెస్ వగైరా జిమ్స్‌లో నా జర్నీ కంటిన్యూ చేశా..ఆరోగ్యకరమైన వంటలు.. తొలిదశలో రోజుకు డజను గుడ్లు.. 4గంటల వర్కవుట్ చేసేవాడ్ని. వయసుతో పాటు మార్పు చేర్పుల్లో భాగంగా ఇప్పుడు అరడజను గుడ్లు కనీసం, 3గంటల పాటు వ్యాయామం చేస్తున్నా. ఇప్పటికీ ఆపకుండా 100 దండీలు ఒకే స్ట్రెచ్‌లో తీయగలను. ట్రైన్ చేయమని టాలీవుడ్ ప్రముఖులు అడుగుతుంటారు. అయితే అది ఒక పూర్తిస్థాయి ప్రొఫెషన్ అనుకుంటేనే అటు వెళ్లాలి. అందుకే సలహాలు చెబుతా తప్ప ట్రైనర్‌గా మారను.డైట్ రొటీన్ ఇదీ... ఉదయం 7గంటలకల్లా నిద్ర లేస్తా. వేడినీళ్లలో నిమ్మకాయ వేసుకుని తీసుకుంటా.. పంచదార, బెల్లం, పెరుగు, వైట్‌రైస్ వినియోగించను. జిమ్ అయ్యాక 4 వైట్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటాను. లంచ్‌లో ఉప్పు లేకుండా బాయిల్డ్ వెజిటబుల్స్ అవి కూడా కాలీఫ్లవర్, బ్రొకొలీ, క్యారెట్, బీన్స్, క్యాబేజీ లాంటివి మాత్రమే తీసుకుంటాను. రాత్రి మిల్లెట్స్, కొర్రలు, లేదా క్వినోవా.. మితంగా తీసుకుంటాను.మోడల్‌గా జర్నీ.. నటుడిగా చేస్తుండగానే పలుచోట్ల ర్యాంప్ షోలపై మోడల్‌గానూ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్నాను. వేర్వేరు నగరాల్లో జరిగిన మోడలింగ్ ఈవెంట్స్‌లో పాల్గొన్నాను. ఇటీవలే అంతర్జాతీయంగా పనిచేస్తున్న బియర్డ్ క్లబ్ వాళ్లు వాషింగ్టన్లో నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోకు ఆహ్వానించారు. అయితే నేనింకా ఈ విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు. వర్కవుట్ రొటీన్ ఇదీ.. రోజూ ఉదయం 7గంటలకు నిద్రలేచి వేడి నిమ్మకాయ నీళ్లు తాగి జిమ్‌కు వెళతాను. అక్కడ 45 నిమిషాల వార్మప్.. ఇందులో ట్రెడ్మిల్ మీద వాకింగ్, బోనియం పాటకి ఎరోబిక్స్.. (ఈ ఒక్కపాట చేస్తే చాలు రోజుకు సరిపడా వర్కవుట్ చేసినట్లు అవుతుంది) వంటివి ఉంటాయి. ఆ తర్వాత వర్కవుట్ స్టార్ట్. రోజుకు 2 బాడీ పార్ట్స్ చేస్తాను. మొదటి రోజు ప్లెయిన్ రాడ్ మీద బెంచ్ ప్రైస్, ఫ్లైస్ ఒక రోజు స్క్వాట్, కాఫ్ మజిల్, మరో రోజు ఆ తర్వాత రోజు మొత్తం లాటిస్, ఆ తర్వాత ట్రైసప్, బైసప్ ఇలా.. రొటీన్‌గా సాగుతుంది.వెయిట్స్తో ఇలా.. చేస్తే భళా.. నేను జిమ్‌లో అడుగుపెట్టిన తొలిరోజే 50 చొప్పున డంబెల్స్‌తో రిపిటీషన్స్ చేయడంతో రెండోరోజు చేతులు పనిచేయలేదు. అయినా తగ్గించకుండా అలాగే చేస్తూ వచ్చా, అలవాటైపోయింది. తక్కువ వెయిట్స్తో ఎక్కువ రిపిటీషన్స్ చేయడం వల్ల ఆర్నెళ్లు వర్కవుట్ చేయకపోయినా షేప్ మారకుండా అలాగే ఉంటుంది. అదే వెయిట్స్ పెంచుకుంటూ పోతే ఇమ్మీడియట్‌గా మజిల్ పంప్ అయి మళ్లీ త్వరితంగానే బెలూన్‌లో గాలి తీసినట్లు అయిపోతాం. బాడీ బిల్డింగ్ చేయవచ్చు కదా అని కొందరు అడిగేవారు.. నాకు అలాంటి లక్ష్యాలేవీ లేవు.. జస్ట్ చూడడానికి లుక్ బాగుండాలి.. అంతేకాదు శరీరం ఎప్పుడూ రెడీ ఫర్ వార్ అన్నట్టు ఉండాలి. ఇక్కడ నుంచి దూకు అంటే దూకేయాలి అలా చురుగ్గా ఉండాలి. ఇప్పటికీ నేను గంటకు 16.5, 17కి.మీ స్ప్రింట్ చేయగలను. -
మిస్ కేరళ ఫిజిక్‌గా టైటిల్ తనకు సొంతం!
‘కొన్నిసార్లు మీరు భయపడకుండా వేసే ఒక్క అడుగు జీవన గమనాన్ని మెరుగ్గా మార్చేస్తుంది’ అంటుంది 24 ఏళ్ల అశ్వతి ప్రహ్లాదన్. బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్న అశ్వతి ఇప్పుడు మిస్ కేరళ ఫిజిక్‌గా టైటిల్ గెలుచుకుంది.. సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి ఫిట్నెస్ కోచ్‌గా మారింది. సోషల్ మీడియాలో లక్షమంది ఫాలోవర్లతో బిజీగా ఉంది. ఎగతాళి మాటల నుంచి పట్టిన పట్టుదల ఎందరిలోనో స్ఫూర్తిని కలిగిస్తుంది.‘‘ఒక దశలో నేను బాగా బరువు తగ్గిపోయాను. కారణం కొన్నిరోజులపాటు వేధించిన జ్వరం. ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయింది. సరైన ఆహారం తీసుకోలేక బాగా సన్నబడిపోయాను. కొన్నాళ్లపాటు ఆ సమస్యను జనాల నుంచి సూటిపోటి మాటల ద్వారా ఎదుర్కొన్నాను. ‘ఎందుకు ఇంత సన్నగా ఉన్నావు? ఇంట్లో వాళ్లు ఫుడ్ పెట్టడం లేదా? గాలికి ఎగిరిపోయేలా ఉన్నావ్?.. లాంటి మాటలను ఎదురుగానే అనేవాళ్లు. చుట్టుపక్కల, బంధువులు రకరకాల సలహాలు ఇచ్చేవారు. దాంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయినా ఉద్యోగానికి వెళ్లాలంటే భయంగా ఉండేది. అమ్మాయిలు లావుగా ఉన్నా, మరీ సన్నగా ఉన్నా ఈ సమాజంలో జనం ఏదో ఒకటి అంటూ బాధించాలనే చూస్తారు. ఇదో పెద్ద మానసిక ఒత్తిడిగా అనిపించేది. ఈ ట్రామా నుంచి ఎలాగైనా బయట పడాలనుకున్నాను. అప్పుడే ఫిట్‌నెస్‌లోకి రావాలనుకున్నాను.నన్ను నేను ప్రేమించుకుంటూ..జనాలు ఎగతాళిగా అనే బాడీ షేమింగ్ వ్యాఖ్యలను అసలు పట్టించుకోవడం మానేశాను. నన్ను నేను ప్రేమించుకోవడం ప్రారంభించాను. నాలా బాధపడేవారికి ఓ రోల్‌మోడల్‌గా ఉండాలని జిమ్‌లో చేరాను. నా జీవనశైలిలో మార్పులు చేసుకున్నాను. సమతుల ఆహారంపై అవగాహన పెంచుకుని, దానిని తీసుకోవడంపై శ్రద్ధ పెట్టాను. ఫలితంగా ఆరోగ్యంలో మార్పు వచ్చింది. మానసిక ఆరోగ్యమూ మెరుగుపడింది. దీంతో ఫిట్‌నెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. ఎంతగా సాధన చేస్తూ వచ్చానంటే బాడీ షేమింగ్ బాధితులకు కేరళ ఫిజిక్ టైటిల్‌ను అంకితం చేసేవరకు నన్ను నేను మలుచుకోవడంలో ఒక తపస్సే చేశాను.అశ్వతి ప్రహ్లాదన్విమర్శలను పట్టించుకోను..‘ఏమీ చేయని వ్యక్తులే జీవితంలో ఏదైనా సాధించాలని ప్రయత్నించేవారిని నిందిస్తుంటారు. మొదట్లో వారి మాటలకు నేను కూడా ఎదురు సమాధానం చెప్పేదాన్ని. ఇప్పటికి కూడా సోషల్‌మీడియాలో ఫేక్ అకౌంట్లతో నన్ను నిందించే ప్రయత్నం చేసేవాళ్లున్నారు. టైటిల్ సాధనతో ఇప్పుడు చెడు వ్యాఖ్యలు చేసేవారి సంఖ్య తగ్గి,పాజిటివ్ కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి.అపోహలు వద్దు..మగవారిలాగా తమ శరీరం కూడా కండలు తిరిగిపోతుందేమోనన్న భయంతో వర్కవుట్ చేయని మహిళలు ఉన్నారు. మరోవైపు వర్కవుట్ చేస్తూ బరువు తగ్గుతూ ఉంటే, ఏదైనా కారణాలతో మధ్యలో జిమ్ ఆపేస్తే మళ్లీ బరువు పెరుగుతామేమోనని అంటూ ఆందోళనపడేవారూ ఉన్నారు. ఇలాంటి అపోహలు మన సమాజంలో చాలా ఉన్నాయి. అలాంటి వారికి చెప్పేది ఏమిటంటే ‘జిమ్‌లోనూ, ఇంట్లోనూ మంచి జీవనశైలినిపాటించకుండా ఈ దురభి్రపాయాలకు రావద్దు. ముప్పై ఏళ్లు దాటిన తర్వాత మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గి, కండరాలు ద్రవ్యరాశిని కోల్పోయే అవకాశం ఉంది.కండర నిర్మాణానికి వ్యాయామం ఆరోగ్యకరం. కండరాలను నిర్మించడం అంటే శరీరం అంతా కండరాలుగా మారడం కాదు. ఫిట్నెస్నుప్రాక్టీస్ చేస్తే మానసిక, శారీరిక ఆరోగ్యంతో సహా అన్ని విషయాలు మెరుగుపడతాయి. అందుకని, అపోహలతో ఫిట్‌నెస్‌లోకి రావద్దు. మన వెనక జనాలు ఏదో మాట్లాడుతున్నారని వెనకడుగు వేయద్దు. నా విషయంలో అయితే ఈ రంగంలోకి రావడమే మంచి నిర్ణయం అయింది. అందరూ ఈ విషయాన్ని అంగీకరించారు కూడా. మన శరీరానికి సరైన రీతిలో శిక్షణ ఇస్తే మరిన్ని అద్భుతాలను మనమే చేయచ్చు.నా జీతం మొత్తం..ఏడాదిన్నర క్రితం ఇన్ఫోపార్క్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఫిట్నెస్ను కూడా నా జీవితంలో భాగం చేసుకున్నాను. కానీ, పనిలో చాలా ఒత్తిడి ఉండేది. ఒక్కోసారి తొమ్మిది నుంచి పదకొండు గంటలు పనిచేయాల్సి వచ్చేది. ఆ పనుల మధ్య జిమ్‌కి వెళ్లేందుకు సమయం దొరకడం కష్టమైంది. కుటుంబం నుంచి మద్దతు లభించింది. నా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంది మా అమ్మ.కానీ... వృత్తిని, అభిరుచిని కలపడం చాలా కష్టం అని గ్రహించాను. ఫిట్‌నెస్‌లో పోషకాహారం ఖరీదైనది. నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నా అభిరుచిని కొనసాగించగలిగాను. జీతం నా పోషణకు సరిపోయేది. కొన్ని సంప్లిమెంట్ల కోసం స్పాన్సర్లను వెతికాను. కానీ, లభించలేదు. దీంతో నా జీతం మొత్తం నా పౌష్టికాహారం కోసమే కేటాయించే దాన్ని. మరి ప్రయోజనాలు ఏంటి అని ఎవరైనా అడగచ్చు.ఈ రంగంలోకి వచ్చినతర్వాత నేనెవరో నాకు అర్ధమైంది.పాటలుపాడతాను, డ్యాన్స్ చేస్తాను. ఫిట్నెస్ నన్ను ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుతుంది. ఇది విజయంగా భావిస్తున్నాను. అంతేకాదు, నా ఫిట్నెస్ ఇప్పుడు నా ఆదాయ వనరు కూడా. అందుకే, ఉద్యోగాన్ని మానేసి బిజీ ట్రైనర్‌గా మారిపోయాను’ అంటూ తన ఫిట్నెస్ రహస్యాలను చెబుతుంది అశ్వతి.ఇవి చదవండి: Health: కడుపులోని బిడ్డ జాగ్రత్త! -
పాఠశాల విద్యార్ధుల్లో శారీరక ధృఢత్వ లేమి: సర్వే
నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అలాంటి పిల్లలు ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం.. చిన్న వయసు నుంచే పిల్లలకు పోషక విలువలు కలిగిన ఆహారం అందించడం తప్పనిసరి. అలాగే పిల్లలకు మానసిక ఉల్లాసంతోపాటు శారీరక ఉల్లాసం కూడా ముఖ్యమే. వారికి ఆటలు అలవాటు చేయడం, నేర్పించడం ద్వారా మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా ఇటు ఆరోగ్యంగానూ ఉండగలరు. తాజాగా భారత్‌లోని చాలా వరకు పాఠశాల విద్యార్థుల్లో ఫిట్నెస్ స్థాయిలు(శారీరక ధృఢత్వం) తక్కువగా ఉన్నట్లు పోర్ట్జ్ విలేజ్ ఫౌండేషన్ 12వ వార్షిక ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. ఆరోగ్యంపరంగా చాలా వెనకబడి ఉన్నట్లు తేలింది. దేశవ్యాప్యంగా 250 నగరాల్లో ఏడు నుంచి 17 సంవత్సరాల వయసున్న పిల్లలను సర్వే చేసి ఈ విషయాలు వెల్లడయ్యాయి. బాడీ మాస్ ఇండెక్స్ (BMI), ఏరోబిక్ కెపాసిటీ, వాయురహిత కెపాసిటీ, కోర్ స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటీ, అప్పర్ బాడీ స్ట్రెంత్, లోయర్ బాడీ స్ట్రెంత్ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఈ సర్వే చేపట్టారు. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ కీలక పాత్ర పోషిస్తుందని సర్వే ద్వారా వెల్లడైంది. స్కూళ్లో వారంలో రెండు కంటే ఎక్కువ సార్లు ఆటల్లో చురుగ్గా పాల్గొనే పిల్లల్లో శారీరక దృఢత్వం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. శరీరం కింద భాగం, పొట్ట భాగం, ఫ్లెక్సిబిలిటీ, ఏరోబిక్ కెపాసిటీ వంటి కీలకమైన అంశాలలో మెరుగుదల కనిపిస్తోంది. ఇవన్నీ క్రీడల ప్రాముఖ్యత, సానుకూల ప్రభావాన్ని నొక్కి చెబుతున్నాయి. ఈ పరిశోధనలన్నీ పిల్లల రోజువారీ దినచర్యలో శారీరక శ్రమను పెంచడం ద్వారా వారి సంపూర్ణ శ్రేయస్సుకు దోహదపడుతుందనే విషయాన్ని తెలియజేస్తుది. వార్షిక ఆరోగ్య సర్వేలో కనుగొన్న విషయాలపై స్పోర్ట్జ్ విలేజ్ సీఈఓ సౌమిల్ మజ్ముదర్ మాట్లాడుతూ.. స్పోర్ట్జ్ విలేజ్ ద్వారా, క్రీడలతో పిల్లల జీవితాలను మార్యాలనే తమ లక్ష్యానికి కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు క్రీడలను విద్యలో అంతర్భాగంగా చూడాలని కోరారు. పిల్లలు శారీరక శ్రమలలో పాల్గొనడానికి అవకాశాలను అందించాలని తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నారు. పిల్లలకు క్రీడలు అవసరం లేదనే ఉద్ధేశ్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు. దీంతో శారీరక శ్రమకు ఎక్కువ సమయం కేటాయించకపోవడం వల్ల పిల్లల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందన్నారు. శారీరక శ్రమ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసిక ఆరోగ్యం, విద్యా పనితీరుపై ప్రభావం చూపుతుందని వివిధ అధ్యయనాలు చూపిస్తున్నాయని తెలిపారు. వెల్లడైన కీలక విషయాలు, ►భారతదేశంలో మొత్తం 73,000 మంది పిల్లలను సర్వే చేశారు ►అయిదుగురిలో ఇద్దరు పిల్లలకు ఆరోగ్యకరమైన BMI లేదు ►అయిదుగురిలో ఇద్దరు పిల్లలు మంది పిల్లలు కోరుకున్న వాయురహిత సామర్థ్యాన్ని(Anaerobic Capacity) కలిగి లేరు ►నలుగురు పిల్లల్లో ముగ్గురికి కావలసిన ఏరోబిక్ కెపాసిటీ లేదు. ►ముగ్గురు పిల్లల్లో ఒకరికి కావలసిన ఉదర లేదా కోర్ బలం లేదు ►అయిదురు చిన్నారుల్లో ముగ్గురికి తగినంత ఎగువ శరీరం, దిగువ శరీర బలం లేదు సర్వే ప్రకారం అబ్బాయిలతో పోల్చినప్పుడు ఆరోగ్యకరమైన BMI స్థాయిలు (62%) బాలికల్లో ఎక్కువశాతం ఉన్నట్లు తేలింది. అమ్మాయిలు ఫ్లెక్సిబిలిటీ, అప్పర్ బాడీ స్ట్రెంత్‌లో కూడా మెరుగ్గా ఉన్నారు. అయితే వారు ఏరోబిక్ కెపాసిటీ, లోయర్ బాడీ స్ట్రెంత్‌లో బలహీనంగా ఉన్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల (31%) పిల్లలతో పోల్చితే, ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలు మెరుగైన శరీర బలాన్ని (43%) కలిగి ఉన్నారని సర్వే వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల పిల్లలు BMI, ఏరోబిక్ కెపాసిటీ, ఫ్లెక్సిబిలిటీలో మెరుగ్గా ఉన్నారు. -
మానసిక ఆరోగ్యంపై పెరిగిన దృష్టి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో రోజువారీ ప్రాధాన్యాలు, లక్ష్యాలు మారిపోతున్నాయి. శారీరకంగా ధృఢంగా, చురుకుగా ఉండడం (ఫిజికల్ ఫిట్నెస్) కంటే కూడా మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించడం పెరిగింది. సగటు మనిషి జీవనంలోని పలు అంశాలపై మానసిక ఆరోగ్యం చూపే ప్రభావంపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. గత రెండున్నరేళ్ల కరోనా మహమ్మారి ప్రభావిత కాలంలో చోటుచేసుకున్న అనేక మార్పులతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం వంటి వాటికి పెరిగిన ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. మానసిక ప్రశాంతత కొరవడిన వ్యక్తులపై వివిధ సమస్యలు ఏ విధంగా ప్రభావితం చూపుతున్నాయనేది క్రమంగా ప్రపంచానికి తెలిసొస్తోంది. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే అది నేర్చుకునే గుణం, పనిలో మెరుగైన ఉత్పాదకత, ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలు పెంపొందించుకోవడంపై ప్రభావం చూపుతున్నట్టు వివిధ పరిశోధనలు, అధ్యయనాల్లో గుర్తించారు. ఈ పరిశీలనల్లో భాగంగా కోవిడ్ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా జాబ్‌మార్కెట్ ఒడిదొడుకుల్లో ఉద్యోగులు మానసికస్థితి ఒత్తిళ్లకు గురవుతున్నట్లు గుర్తించారు. 2022 జూన్‌లో డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసిన నివేదికలో ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది ఏదో ఒక రూపంలో మానసికంగా ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లు వెల్లడైంది. సోమవారం ‘వరల్డ్ మెంటల్ హెల్త్‌డే’ సందర్భంగా ఆయా అంశాలు, విషయాలు చర్చనీయాంశమయ్యాయి. మానసిక ఆరోగ్య పరిరక్షణ అనేది ముఖ్యం.. ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య పరిరక్షణ చాలా ముఖ్యం. గత రెండున్నరేళ్ల కరోనా కాలంలో భవిష్యత్‌పై అనిశ్చితితో అధిక శాతం మంది జీవన ప్రమాణాలు దిగజారడం, తగిన ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడంతో చాలా కుటుంబాల్లో మానసిక ఒత్తిళ్లు పెరిగాయి. దాంతో మానసిక ప్రశాంత సాధనతోపాటు మానసిక ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఏర్పడింది. డబ్ల్యూహెచ్‌వో కూడా ‘మెంటల్ వెల్నెస్’పై దృష్టి పెట్టాలని చెబుతోంది. అయితే ప్రభుత్వాలు మన దగ్గర ఇప్పటిదాకా ‘మెంటల్ హెల్త్’పై ప్రత్యేక దృష్టి పెట్టలేదు. కోవిడ్ మహమ్మారి తీసుకొచ్చిన పరిస్థితుల ప్రభావంతో ఈ దృష్టిలో మార్పు వచ్చింది. ఇన్ని రోజులుగా పట్టించుకోని ముఖ్యమైన అంశంపై తప్పక దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. శారీరకంగా ఎదురయ్యే అనేక సమస్యలకు మానసిక అనారోగ్యం కారణమవుతోంది. వాస్తవాలను అంగీకరించే స్థితికి చేరుకుంటే మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. మానసిక ఆరోగ్యంతోనే ఉత్పాదకత పెరగడం, మెరుగైన కుటుంబ సంబంధాలతో శారీరక ఆరోగ్యం కూడా మెరుగౌతుంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
‘బరువు తగ్గితే ప్రతీ కిలోకి వెయ్యి కోట్లు ఇస్తానన్నారు’
భోపాల్: ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా తన నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరిన సంగతి తెలిసిందే. అందుకు కేంద్రమంత్రి గడ్కరీ.. ఉజ్జయిని ఎంపీ అనిల ఫిరోజియాకి ఒక షరతు విధించారు కూడా. తాను నిధులు మంజూరు చేయాలంటే ముందు తమరు చాలా బరువు తగ్గండి అప్పుడూ మంజూరు చేస్తానంటూ ఒక కండిషన్ కూడా పెట్టారు. అంతేకాదు గడ్కరీ ఫిరోజియా తాను ఏవిధంగా బరువు తగ్గానో కూడా వివరించి చెప్పారు.. ఈ మేరకు గడ్కరీ మాట్లాడుతూ...తాను గతంలో 135 కిలోలు బరువు ఉన్నానని, ప్రస్తుతం 93 కిలోలే ఉన్నాను. అప్పుడూ ప్రజలు నన్ను అసలు గుర్తు పట్టలేకపోయారు. అందువల్ల మీరు కూడా బరువు తగ్గేందుకు ప్రయత్నించండి. అంతేకాదు తగ్గిన ప్రతి కిలో బరువుకి వెయ్యి కోట్లు చొప్పున తమ నియోజక వర్గం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తాననంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిరోజియాకి ఒక గొప్ప చాలెంజ్ విసిరారు. దీంతో ఫిరోజియా అప్పటి నుంచి తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టడమే కాకుండా బరువు తగ్గేడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఆయన రకరకాల వ్యాయామాలు కూడా చేసేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర మంత్రి నియోజకవర్గ అభివృద్ధి పనుల నిధులతో చట్టసభ సభ్యుల శారీరక దృఢత్వాన్ని అనుసంధానించే అభివృద్ధి మంత్రం బాగా పనిచేస్తుందనే చెప్పాలి. ఫిరోజియా కూడా తన నియోజక వర్గం అభివృద్దికి నిధులు మంజూరయ్యేందుకైనా ఆయన బరువు తగ్గాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. అంతేకాదు వర్షాకాలం సమావేశం కల్లా తగ్గి... ఆయన్ను కలిసి మీరు ఇచ్చిన చాలెంజ్‌ని నెరవేర్చానని గుర్తుచేసి మరీ చెబుతానంటున్నారు కూడా. ఈ మేరకు ఫిరోజియా ఫిరోజియా డైట్ ప్లాన్‌ను పాటిస్తూ...సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా చేస్తున్న వీడియోల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. BJP MP from Ujjain @bjpanilfirojiya is on a mission to shed excess flab, not just to become fit, but also to fund the development of his Lok Sabha constituency as promised by Union Minister @nitin_gadkari @ndtv @ndtvindia pic.twitter.com/t7qv7K0FAB — Anurag Dwary (@Anurag_Dwary) June 11, 2022 (చదవండి: బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది.. ఎందుకో తెలుసా..?) -
పట్టు సాధిస్తేనే మెట్టెక్కేది... లక్ష్యం నెరవేరాలంటే పట్టు తప్పనిసరి
సాక్షి హైదరాబాద్: సర్కారు ఉద్యోగం నిరుద్యోగుల కల. ఆ స్వప్నం సాకారం కావాలంటే పట్టుదల తప్పనిసరి. చదవడం.. సమీక్షించుకోవడం.. పట్టు సాధించడం ఇవే ప్రభుత్వ ఉద్యోగానికి తొలిమెట్టు. ఈ మెట్టు ఎక్కడానికి ప్రణాళిక అవసరం. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భర్తీ చేస్తున్న గ్రూప్–1, 2, ఉపాధ్యాయ, పోలీసు, ఇతర శాఖల పోస్టుల సాధనలో పైచేయి సాధించడానికి అభ్యర్థులు సంసిద్ధులవుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై నిపుణులు సూచనలు అందిస్తున్నారు. సిలబస్ ముఖ్యం.. పరీక్ష ఏదైనా సిలబస్‌ను ఔపోసన పట్టాలని.. సిలబస్ ప్రామాణిక పత్రంగా పెట్టుకొని సన్నద్ధం కావాలని నిపుణులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు రాయబోయే పరీక్ష సిలబస్, పరీక్ష స్వరూపాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు గత పరీక్ష ప్రశ్న పత్రాలు పరిశీలించి, వాటిపై కసరత్తు చేస్తే ఉపయోగకరంగా ఉంటాయి. ‘తెలంగాణ’కు ప్రాధాన్యం రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోటీ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సిలబస్‌లో మార్పులు చేసింది. పోటీ పరీక్షల్లో తెలంగాణ ప్రాంత రాజకీయ–సామాజిక చరిత్రకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తూ సిలబస్ రూపొందించారు. తెలంగాణ చారి త్రక నేపథ్యం మొదలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వరకు చోటుచేసుకున్న అనేక అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమం, నక్సలిజం, రాష్ట్ర ఏర్పాటులో వివిధ రాజకీయ పార్టీల పాత్ర, టీఆర్ఎస్ ఏర్పా టు మొదలైన అంశాలపై కూడా పట్టు సాధించాలి. జనరల్ స్టడీస్‌పై పట్టు రాబోతున్న ఉద్యోగ పరీక్షల్లో ‘జనరల్ స్టడీస్’ ప్రతి పరీక్షలోనూ కనిపించే సబ్జెక్ట్. జీఎస్‌పై పట్టు సాధిస్తే గ్రూప్ –1 నుంచి మొదలు పంచాయతీ సెక్రటరీ పోస్టుల వరకు సగం సన్నద్ధత లభించినట్లే. అభ్యర్థులు తాము రాయబోయే పరీక్షల సిలబస్‌లో జీఎస్‌కు ఎలాంటి సిలబస్ ఇచ్చారో ఒకసారి క్షుణ్నంగా పరిశీలించి ప్రామాణిక పుస్తకాలు ఎంచుకొని సన్నద్ధమవ్వాలి. పాలిటీ, ఎకానమీ, చరిత్ర, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, జాగ్రఫీ మొదలైన జనరల్ స్టడీస్ సబ్జెక్టులకు సమకాలీన అంశాలను జోడిస్తూ చదువుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక పుస్తకాల ఎంపికలోనూ జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లో లభించే ప్రతి పుస్తకం కాకుండా తెలుగు అకాడమీ పుస్తకాలు, ఏదైనా ప్రముఖ రచయితల పుస్తకాలు సేకరించుకొని చదువుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు ఏదైనా ఒక్కటే పుస్తకాన్ని పలుమార్లు రివిజన్ చేయడం మేలు. ఇటీవల కాలంలో యూట్యూబ్‌లో కొన్ని చానల్స్ ఉచితంగా పోటీ పరీక్షల సిలబస్‌ను బోధిస్తున్నాయి. ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి పోటీ పరీక్ష ఏదైనా సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్, గత ప్రశ్నపత్రాలు చూడాలి. ముఖ్యంగా పోలీసు పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలి. కానిస్టేబుల్, ఎస్సైలకు ప్రిలిమ్స్ వరకు సిలబస్ కామన్‌గా ఉంటుంది కాబట్టి ఒకేసారి సన్నద్ధమవ్వచ్చు. ప్రధాన పరీక్ష సిలబస్ కూడా ఒకేలా కనిపిస్తున్నా మరింత లోతుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఏఆర్, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్ పోస్టులకు రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్స్ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈవెంట్స్‌లో మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను సులువుగా దక్కించుకోవచ్చు. – రాజశేఖర్, ఐరైజ్ ఫౌండర్ పీవీ స్మారక గ్రంథాలయంలో ప్రిపేర్ కండి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో బేగంపేట బ్రాహ్మణవాడీలోని స్వామి రామానందతీర్థ మెమోరియల్ కమిటీలో పీవీ నరసింహారావు స్మారక గ్రంథాలయంలో ఉద్యోగార్థులు చదువుకునేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించనున్నట్లు ఎమ్మెల్సీ, కమిటీ చైర్పర్సన్ వాణీదేవి తెలిపారు. కమిటీ ప్రాంగణంలోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఇక్కడి గ్రంథాలయంలో అవసరమైన సమాచారం, పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రంథాలయంలో చదువుకునేందుకు అనువైన వాతావరణం కల్పించినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పీవీ స్మారక గ్రంథాలయం తెరిచి ఉంటుందని ఆమె తెలిపారు. సమావేశంలో సురభి సోలార్ ఎనర్జీ కేంద్రం డైరెక్టర్ శేఖర్ మారంరాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వాణీదేవి -
ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట!
ఆరోగ్యంగా, చురుగ్గా... యవ్వనంగా కనిపించాలంటే బరువు సమానంగా ఉండాలి. అధిక బరువు వల్ల వయసు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తారు. అలా కాకుండా ఉండాలంటే బరువును అదుపులో పెట్టుకోవడం అవసరం. బరువు తగ్గాలంటే ఆహారంపై అదుపుతోబాటు కొంత శారీరక వ్యాయామం అవసరం. బరువు తగ్గాల్సిన ప్రక్రియలో లయబద్ధమైన శాస్వప్రక్రియతో పాటు గుండెవేగం, రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరగడం, కండరాలకు తగిన పని... ఈ అన్ని కార్యక్రమాలు సమన్వయంతో జరిగినప్పుడే కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. ఇలా కొవ్వును తగ్గించే వ్యాయామాల్నే ఏరోబిక్స్ అంటారు. వీటిలో సైక్లింగ్, జాగింగ్ సులువైనవి. ఇప్పుడు జాగింగ్ గురించి చెప్పుకుందాం. ప్రతి రోజూ ఉదయం జాగింగ్ చేయడం చాలా మందికి అలవాటు. శరీరం ఒత్తిడికి గురి కాకుండా, ఈ వ్యాయామం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అవేమిటో చూద్దాం... జాగింగ్ చేయడానికి జిమ్‌లో లాగా కష్టపడాల్సిన అవసరం లేదు. జాగింగ్ వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అదే విధంగా బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా మెరుగుపడుతాయి. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. కొన్ని పరిశోధనల ప్రకారం రెగ్యులర్‌గా జాగింగ్ చేసే వారిలో ఆయుష్షు పెరుగుతుందని కనుగొన్నారు. శారీరకంగా ఫిట్‌గా, క్యాలరీలను కరిగించుకుని బాడీ ఫ్రెష్‌గా కనబడేందుకు దోహదం చేసే వాటిలో జాగింగ్ మెరుగైనది. ఇది గుండె కండరాలను బలోపేతం చేసి గుండె మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. బ్లడ్‌గ్లూకోజ్‌ను, కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది. జాగింగ్ చేసే సమయంలో శరీరం నుంచి ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. ఈ గ్రూప్ హార్మోన్లు మానసిక ప్రశాంతకు సహాయపడుతాయి. ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ సహజంగానే మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. ఈ ఒక్క కారణం వల్ల శరీరం ఫ్రెష్‌గా ఉంటుంది. ముఖ్యంగా ముఖం తేటగా కనిపిస్తుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు.. ►జాగింగ్ వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరం ఉత్సాహంగా, కదలికలు కలిగి ఉండటం వల్ల కండరాలు కరిగి, బాడీ షేప్ మారి చూడటానికి అందంగా మారుతారు. ►బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జాగింగ్ వల్ల శ్వాసవ్యవస్థ బాగా పనిచేస్తుంది. ►ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ►శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే కనుక జాగింగ్ మంచి మార్గం. ►జాగింగ్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా వ్యాధులతో, ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తి అధికంగా ఉండి శారీరక శక్తిని పెంచుతుంది. ►తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దాంతో స్ట్రెస్, డిప్రెషన్, అలసట తగ్గుతాయి. ►కండరాల శక్తిని మెరుగు పరుస్తుంది. వెన్నెముక, తొడల భాగాన్ని దృఢంగా మార్చుతుంది. ఆలోచన శక్తిని మెరుగుపరుస్తుంది. మానసిక, శారీర ఆరోగ్యాలన్నింటికి చాలా మేలు చేస్తుంది. జాగింగ్ వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. పాజిటివ్ శక్తి వస్తుంది. ►చర్మానికి రక్తప్రసరణతో పాటు, ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. దాంతో నిత్యం యవ్వనంగా కనబడుతారు. అయితే కేవలం జాగింగ్ ఒక్కటే చేస్తే సరిపోదు. ఆహారంపై అదుపు కూడా ఉండాలి. అప్పుడే పైన చెప్పుకున్న అన్ని ప్రయోజనాలూ శరీరానికి సమకూరతాయి. చదవండి: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా.. -
అట్ల తద్ది ప్రత్యేకం: వయసులో ఉన్న ఆడపిల్లలూ ... ఆడుకుందామా...!
ఆటల నోము అట్లతద్ది.. ఆడపిల్లలు నోచే తద్ది అంటూ పవిత్రబంధం సినిమాలో కథానాయికగా వేసిన వాణిశ్రీ వేడుకగా పాడుతుంది. తెలుగు వారి జీవితాలలో అట్లతద్దికి అంత ప్రాధాన్యత ఉంది. ఆడపిల్లలు ఆడుతుంటే, మగ పిల్లలు ఆట పట్టిస్తారు. ఎవ్వరూ ఎవరితోనూ గొడవపడరు. ఆట పట్టించటాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తారు. తెల్లవారుజామునే పిల్లలంతా పొరపచ్చాలు, హెచ్చుతగ్గులు.. ఏ అభిప్రాయ భేదాలు లేకుండా ఆడుకుంటారు. ఐకమత్యానికి ఈ పండుగ ప్రతీకగా కనిపిస్తుంది. ఇంకా ఈ పండుగలో అనేక కోణాలున్నాయి... ఆడపిల్లలకు శారీరక వ్యాయామం తప్పనిసరి. పూర్వం అందరూ ఇంటి దగ్గరే ఉండేవారు. ఇంట్లో చేసే ప్రతి పనిలోనే వ్యాయామమే. చెరువుకు వెళ్లి బిందెడు నీళ్లు తేవటం, పెరట్లో బావిలో నీళ్లు తోడటం, పప్పులు రుబ్బడం, రవ్వ విసరటం, అప్పడాలు ఒత్తడం... ఏ పని చేసినా పనితో పాటు శరీర ఆరోగ్యానికి కావలసిన వ్యాయామం ఉండేది. దానితో పాటు మనసును కూడా కుదుటపరుస్తుంది. నిరంతరం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవారికి ఆటవిడుపు కూడా ఉండాలి. అట్లతద్ది ఆడపిల్లలకు ఆటవిడుపు. ముందు రోజే గోరింటారు పెట్టుకోవాలి. తెల్లవారు జామున సూర్యుని కంటె ముందే నిద్ర లేచి, ముందురోజు రాత్రి అమ్మ వండిన అన్నాన్ని చద్దన్నంగా తినటం ఎంతో సరదా. నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గోంగూర పచ్చడి, గడ్డ పెరుగు, తాంబూలం... అన్నీ కడుపు నిండా తిని, ఆహారం అరిగేవరకు ఉయ్యాల ఊగి, ఆటలు ఆడి, బారెడు పొద్దెక్కిన తరవాత ఇంటికి వచ్చి హాయిగా స్నానం చేయటం... ఇదీ ఈ పండుగ విధానం. చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! ఇక్కడితో ఆగదు... అమ్మ వేసే అట్లను కడుపు నిండా తినాలి. కొందరైతే వాయినాలు ఇవ్వాలి. ఇవన్నీ సంప్రదాయంలో భాగం. మరి తెల్లవారుజామున ఆడే ఆటల్లో ఒక కలివిడితనం ఉంటుంది. ఆడపిల్లలు ఆడుతుంటే, మగ పిల్లలు దురదగుంటాకుతో వచ్చి ఆడపిల్లల్ని సరదాగా ఆటపట్టించటం, ఈ ఆడపిల్లలు వారిని బెదిరించటం... ఇదీ ఆడమగ తేడా లేకుండా అందరం ఒకటే అనే భావనతో సరదాసరదాగా నడిచే పండుగ. ఎక్కడా శృతిమించని సరదాల వేడుక ఈ పండుగ. ఉయ్యాలో ఉయ్యాల... ఊరు చివర చెరువు గట్టున ఉన్న పెద్దపెద్ద చెట్లకు ఉయ్యాలలు వేసి, ఒకరిని ఒకరు ఊపుకుంటూ, పాటలు పాడుకుంటూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ చేసుకునే ప్రకృతి పండుగ. ఏ చెట్టు కొమ్మ ఎంత గట్టిగా ఉందో చూసుకోవటం ప్రధానం. జీవితం అనే ఉయ్యాల దృఢంగా ఉండాలంటే ఆధారం గట్టిగా ఉండాలనే అంతరార్థం చెబుతుంది ఈ పండుగ. నిత్యజీవితంలో ఆటుపోట్లు వస్తాయి. మనసు డోలాయమానంగా అయిపోతుంటుంది. ఎత్తుపల్లాలు చవిచూడాల్సి వస్తుంది. ఒకసారి అంత ఎత్తుకు వెళ్లిపోతాం, ఒకసారి నేల మీదకు పడిపోతాం. అదే ఉయ్యాల అంతరార్థం. పండుగల పరమార్థం వెనకపడిపోవటంతో, అందులోని సామాజిక కోణం మరుగున పడిపోయి, అనవసరమైన చాదస్తాలు మాత్రం మిగిలిపోతున్నాయి. చదవండి: ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నారో పార్లర్‌కి వెళ్లాల్సిన పనేలేదు! వయసులో ఉన్న ఆడపిల్లలు ఆటలు ఆడాలి... నలుగురితో కలిసిమెలిసి ఆడుతుంటే, ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించటం నేర్చుకోవాలి. యుక్త వయసు నుంచి ఆలోచనలలో మార్పు వస్తుంది. మంచి మార్గం వైపు కాని, చెడు తోవలోకి కాని వెళ్లే వయసు ఇదే. స్నేహితులతో ఆడుకుంటూ ఉండటం వల్ల, ఒకరిని చూసి ఒకరు మంచి నేర్చుకునే అవకాశం కలిగించే పండుగ. అంతేనా యుక్తవయసులో వచ్చే శారీరక మార్పులకు అనుగుణంగా అనారోగ్యాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి అనువుగా ఏర్పడిన పండుగలు ఇవి. శరీరం బాగా అలసిపోయే వరకు ఆడుకుంటూ, తోటివారితో ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ రకరకాల మనస్తత్వాలను అర్థం చేసుకుంటూ వ్యక్తిత్వాన్ని అందంగా రూపుదిద్దుకోవటానికి అవసరమైన విధంగా పండుగలు మార్గం చూపుతాయి. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్ద పప్పోయ్ మూడట్లోయ్ పీట కింద పిడికెడు బియ్యం పిల్లల్లారా జెల్లల్లార లేచి రండోయ్... ఎంతో అందమైన పాట ఆశ్వీయుజం వెనుకబడి, కార్తికం వస్తోందంటే చలి ముదురుతుంది. ఆ చలికి ముడుచుకుని పడుకుంటే కుదరదు. చలికి సవాలుగా నిద్ర లేచి చలిని పరుగులు పెట్టించాలి. అందుకే పిల్లలంతా తెల్లవారు జామునే లేచి ఆడుకోవాలని చెప్పే పండుగ ఇది. కడుపు నిండుగా అట్లు తినాలి. మినుములు, బియ్యంతో కలిపి చేసిన అట్లు తింటే ఒళ్లు ఇనుములా తయారవుతుంది. ప్రకృతి సిద్ధంగా ఆడపిల్లల శరీరంలో కలిగే మార్పులకి ఇది చాలా అవసరం. ముద్ద పప్పు తినాలి. పిడికెడు బియ్యాన్ని మాత్రమే అన్నంగా వండుకుని తినాలి. మనం ఈ పాటను ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు. అందుకే అట్లతద్దిని అందరూ జరుపుకునేందుకు వీలుగా నోము కింద ఏర్పాటుచేశారు. నోముగా చేసుకునేవారు ఉదయాన్నే కార్యక్రమం పూర్తయ్యాక, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, చందమామను చూశాకే భోజనం చేస్తారు. నోము అంటే మొక్కుబడిగా కాకుండా, త్రికరణశుద్ధిగా ఆచరించాలి. చాదస్తాలకు దూరంగా, ఆరోగ్యానికి దగ్గరగా ఉండేలా ఈ పండుగను జరుపుకోవాలని చెబుతుంది మన సంప్రదాయం. ఇదే అట్లతద్దిలోని అంతరార్థం. - వైజయంతి పురాణపండ చదవండి: Pollution In China: ఏటా 7 లక్షల 50 వేల మంది మృతి అందుకేనట! ప్రమాదం అంచున.. చైనా..! -
కరోనాలో రిస్క్ తగ్గాలంటే... ఒళ్లు కదల్చండి..!
ఒళ్లు కదల్చని బద్దకం... వేళపాళ లేని తిండి.. కంటికి కరవైన కునుకు... ఆధునిక జీవనశైలి తాలూకూ మూడు ప్రధాన లక్షణాలివి. ఈ అలవాట్లతో మధుమేహం, గుండెజబ్బులు మాత్రమే కాదు.. రోగ నిరోధక శక్తి బలహీనపడి.... కరోనా మహమ్మారి బారిన పడే అవకాశాలూ బాగా పెరిగిపోయాయి. కానీ.. కేవలం వ్యాయామం ద్వారా మాత్రమే ఈ సమస్యను ఇట్టే అధిగమించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు! శరీరాన్ని చురుకుగా ఉంచడం ఆరోగ్యానికి మేలన్నది కొత్త విషయం ఏమీ కాదు. మనసుకు ఉల్లాసం కల్పించడం... బోలెడన్ని జబ్బులు రాకుం డా నివారించడం వ్యాయామం వల్ల కలిగే కొన్ని లాభాలని కూడా మనం చదువుకునే ఉంటాం. కారణాలేవైనా.. ఈ అంశాన్ని విస్మరించిన ఫలితంగానే చాలామంది కోవిడ్ బారిన పడ్డారన్నది కూడా నిష్టూర సత్యం. అందుకే.. క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం ద్వారా కోవిడ్ బారిన పడ్డా.. సమస్య జటిలం కాకుండా జాగ్రత్త పడవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్’ మెడిసిన్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. వారంలో ఎన్ని రోజుల పాటు మీరు ఓ మోస్తరు నుంచి కఠినమైన వ్యాయామం చేస్తారు? నడక, సైక్లింగ్, పరుగు వంటి రకరకాల వ్యాయామాలకు వారంలో ఎంత సమయం కేటాయిస్తారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే.. ఒక వ్యక్తి శారీరకంగా ఎంత చురుకుగా ఉన్నాడన్నది అర్థం చేసుకోవచ్చు. కోవిడ్‌కు, వ్యాయామానికి మధ్య ఉన్న సంబంధం తెలుసుకునేందుకూ ఈ ప్రశ్నలే ఆధారమయ్యాయి. పద్దెనిమిదేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు, కోవిడ్ కోరల్లో చిక్కుక్కున్న సుమారు 48 వేల మందికి ఈ ప్రశ్నలే వేసి వారిచ్చిన సమాధానాల ఆధారంగా వ్యాయామానికి, కోవిడ్‌కు ఉన్న లింక్‌ను అంచనా వేశారు శాస్త్రవేత్తలు. అమెరికాలో జరిగిన ఈ అధ్యయనంలో అన్ని ప్రాంతాల వారూ పాల్గొన్నారు. మూడుసార్లు వివరాల నమోదు దాదాపు పది నెలల అధ్యయన కాలంలో సర్వేలో పాల్గొన్న వారి నుంచి మూడుసార్లు వివరాలు సేకరించారు. వారానికి కనీసం 150 నిమిషాలపాటు ఏదో ఒకరమైన వ్యాయామం తప్పకుండా చేసిన వారు ఒక వర్గంగా పరిగణిస్తే... ఒళ్లు కదల్చకుండా వారానికి పది నిమిషాల కంటే తక్కువ సమయం కష్టపడ్డ వారు ఇంకో వర్గంగా లెక్కించారు. అప్పుడప్పుడు మాత్రమే వ్యాయా మం చేస్తూ వారంలో 11 నుంచి 149 నిమిషాలు దానికి వెచ్చించిన వారు మూడో వర్గమైంది. అధ్యయనంలో పాల్గొన్న వారి వయసు, స్త్రీనా? పురుషుడా?, ఏ ప్రాంతం వారు? ధూమపానం లేదా ఆ అలవాటు కారణంగా వచ్చే దగ్గు ఉందా? ఊబకాయులా? మధుమేహం, రక్త పోటు, గుండె, మూత్రపిండాల సమస్యలు ఉన్నాయా?.. ఇలా అన్ని రకాల ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఈ మొత్తం సమాచారాన్ని విశ్లేషించినప్పుడు కోవిడ్ వ్యాధి తీవ్రతకు.. వ్యాయామం చేసే సమ యానికి గట్టి సంబంధాలే ఉన్నట్లు స్పష్టమైంది! రోజుకు కనీసం అరగంట... వారంలో అతితక్కువ సమయం వ్యాయామం చేసే వాళ్లు కోవిడ్ కారణంగా ఆసుపత్రిపాలయ్యేందుకు, ఐసీయూలో చేరే స్థాయికి ఆరోగ్యం పతనమయ్యేందుకు, ఆఖరుకు మరణానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. వారానికి దాదాపు 150 నిమిషాలు అంటే.. వారంలో ఐదు రోజులపాటు అరగంట సేపు వ్యాయామం చేసిన వాళ్లతో పోలిస్తే.. వ్యాయామం చేయని వారి పరిస్థితి ఇదన్నమాట. అప్పుడప్పుడూ వ్యాయామం చేసే వారు కూడా వ్యాధి నుంచి ఒక మోస్తరు రక్షణ పొందారని, కడుపులో చల్ల కదలకుండా ఉన్న వారికే సమస్యలు ఎక్కువగా వచ్చినట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ రోజు నుంచే ఎక్కడ, ఎలా వీలైతే అలా శరీరానికి పని చెప్పండి. ఇల్లు శుభ్రం చేయడం మొదలుకొని జిమ్‌లో చేరి బరువులెత్తడం వరకూ ఏదో ఒకదాన్ని ఎంచుకుని క్రమం తప్పకుండా పాటించండి. ఎలాంటి వ్యాయామం చేయాలో తెలియదనుకుంటే.. రోజూ రెండు మూడు కిలోమీటర్లు వేగంగా నడిచినా (బ్రిస్క్ వాకింగ్) చాలు. ఆపాదమస్తిష్కమూ ప్రయోజనమే. ఒక్కమాటలో చెప్పాలంటే.. వ్యాయామం జిందాబాద్ అనేయండి!! – సాక్షి, హైదరాబాద్. -
ఫిట్నెస్ ఉంటేనే విధుల్లో రాణిస్తారు
ఆదిలాబాద్: పోలీసులు పూర్తిస్థాయి ఫిట్నెస్ ఉంటేనే విధుల్లో మానసికంగా, శారీరకంగా రాణిస్తారని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసులకు సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన యశోద ఆస్పత్రి వైద్యులు ఆదిలాబాద్ డివిజన్ పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేశారు. ఎస్పీ సైతం రక్త పరీక్షలు, బీపీ చెక్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనుకోని సంఘటనలతో ప్రమాదాలు జరిగినా.. వాటిని తట్టుకొని నిలబడే శక్తి సామార్థ్యాలు ఉండాలంటే శారీరకంగా, మానసికంగా పోలీసులు బలంగా ఉండాలన్నారు. త్వరలో 40ఏళ్లు పూర్తి చేసుకున్న పోలీసులకు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో అత్యాధునిక పరికరాలతో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్యాకెజ్ తరహాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉట్నూర్ డివిజన్ పోలీసులకు మంగళవారం ఉట్నూర్ పోలీసుస్టేషన్లో వైద్య శిబిరం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు ఎస్కె తాజోద్ధిన్, ప్రతినిధులు పోలీసు డాక్టర్ గంగారాం, యశోద ఆస్పత్రి వైద్యులు నాగూర్, సోని, జ్యోతి, శ్రీకాంత్, రాజు, ఆర్ఐలు సుధాకర్‌రావు, వామనమూర్తి, జి.రమేశ్, ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి, రూరల్ సీఐ ప్రదీప్‌కుమార్, సీసీ దుర్గం శ్రీనివాస్ ఉన్నారు. -
శామ్స్...కమిట్మెంట్కి తిరుగులేదు
ఆరోగ్యంగా ఉండాలనే నిర్ణయం తీసుకుని అమలు చేయాలనే విషయంలో ఖచ్చితత్వాన్ని పాటిస్తే చాలు ఫిజికల్ ఫిట్నెస్ మనల్ని అనుసరిస్తుంది. అలాంటి కమిట్మెంట్ విషయంలో సమంత రూత్ ప్రభు సూపర్ అంటున్నాడు రాజేష్ రామస్వామి. ఆయనెవరా అనుకుంటున్నారా? ఆయనే సమంత ఫేవరెట్ ఫిట్నెస్ ట్రైనర్. చెన్నైకు చెందిన ఈయన గత కొంతకాలంగా తమిళనాట పలువురు స్టార్స్‌కు మోస్ట్‌వాంటెడ్ ట్రైనర్‌గా ఉన్నారు. తన వ్యక్తిగత బరువుకు మించిన వెయిట్స్‌ను లిఫ్ట్ చేస్తూన్న సమంత వర్కవుట్ వీడియోలు ఇటీవల సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సమంత ఫిట్-డైట్-వర్కవుట్ గురించి ఆయనేం అంటున్నాడంటే ... తానే నెంబర్ వన్ నెంబర్ 1 హీరోయిన్లలో అత్యంత ఫిట్ స్టార్ సమంత అనేది నిస్సందేహం. అందులో రెండో మాట లేదు. మరీ సన్నాగానో, మరీ లావుగానో అయిపోకుండా ఏళ్ల తరబడి ఒకే రకమైన ఫిజిక్‌ను మెయిన్‌టెయిన్ చేయడమే సమంతకు సంబంధించి మరింతగా చెప్పుకోవాల్సిన విషయం. మొదటి నుంచీ ‘స్ట్రెంగ్త్’ సాధించడమే శామ్స్ (సమంత) ప్రాధాన్యత. దాని కోసమే కష్టపడుతుంది. తనెప్పుడూ అనుకున్న వర్కవుట్ టైమ్‌కి 15 నిమిషాలు ముందుగానే జిమ్‌కి వచ్చేస్తుంది. ఒకవేళ ఉదయమే షూటింగ్గాని ఉంటే తెల్లవారుఝామున 5గంటలలోపే జిమ్ తలుపు తడుతుంది. జాయ్...జాగింగ్ స్ట్రెంగ్త్, ఫ్యాట్ కంట్రోల్‌కు సంబంధించిన వర్కవుట్స్ బాగా చేస్తుంది. ఆమె వర్కవుట్స్‌ని హై ఇంటెన్సిటీ నుంచి తేలికపాటి వ్యాయామానికి ఇలా తరచుగా మార్పు చేర్పులకు గురి చేస్తుంటాను. వర్కవుట్‌కి టైమ్ లేకపోయినా, అందుబాటులో వ్యాయామ పరికరాలు లేకపోయినా దానికి ప్రత్యామ్నాయంగా శామ్స్ జాగింగ్‌ను ఎంచుకుంటుంది. జాగింగ్‌ని బాగా ఎంజాయ్ చేస్తుంది. దేహాన్ని శుభ్రపరిచి, తన శరీరంలో నుంచి హానికారక టాక్సిన్స్‌ను వెలుపలకి పంపేందుకు గాను చెమటపట్టేలా వ్యాయామం చేస్తుంది. స్వేదం తన చర్మరక్షణకు కూడా ఉపకరిస్తుందని తన అభిప్రాయం. వర్కవుట్‌తో పాటు రోజువారీ జీవనశైలిని కూడా క్రమశిక్షణతో తీర్చిదిద్దుకుంది. కాబట్టే అంత అందంగా ఆరోగ్యంగా ఉండలుగుతోంది. డైట్ కాదు రైట్‌గా తినాలి డైట్ చేయడం ఉపవాసాలు ఉండడంపై ఆమెకి మరీ అంత నమ్మకం లేదు. తనకు కేలరీల విషయంలో భయం లేదంటుంది. నచ్చిన ప్రతీదీ తింటుంది. చాలా మందికి లాగే తనకీ సాంబార్ అన్నం అంటే మహా ఇష్టం. దోస, వడ, ఇడ్లీ, పొంగలి వంటివి తినకుండా నియంత్రించుకోవడం తన వల్ల కాదని చెప్పేస్తుంది. చికెన్, స్పైసీ పికిల్స్, స్వీట్ పొంగల్, ఫిల్టర్డ్ బ్లాక్ కాఫీ... వంటివి కూడా తనకు నచ్చే ఫేవరెట్ ఫుడ్ జాబితాలో ఉన్నాయి. అయితే పరిమాణంలో మాత్రం పరిధి దాటనివ్వదు. అంతేకాదు... ఆరోగ్యకరమైన, వ్యాయామ క్రమానికి తగినంత ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకునే క్రమంలో పప్పులు, బెర్రీస్, వెజ్ సలాడ్స్, పండ్లు, లీన్ మీట్,... వంటివి తీసుకుంటుంది. తనను తాను ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి బాగా మంచినీరు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాల మీద ఆధారపడుతుంది. -
ఆర్థికంగా ఫిట్.. ఎలా?
ఫైనాన్షియల్ బేసిక్స్ ప్రతి ఒక్కరూ శారీరకంగా ఫిట్‌గా ఉండాలని భావిస్తారు. ఇందుకు జిమ్... వ్యాయామం, యోగా వంటి వాటిని ఆశ్రయిస్తారు. మరి ఆర్థికంగా ఫిట్‌గా ఉండాలంటే? మనం అసలు ఆర్థికంగా ఫిట్‌గా ఉన్నామో లేదో ముందు తెలుసుకోవాలి. నిజానికి శారీరక ఫిట్‌నెస్‌కు ప్రమాణాలున్నట్లుగా ఆర్థిక ఫిట్‌నెస్‌కు నిర్దిష్ట ప్రమాణాలుండవు. కానీ కొన్ని బేసిక్ నిబంధనలను పాటిస్తే ఆర్థిక ఫిట్నెస్ సాధించొచ్చు. కెరీర్ ప్రారంభమే... సేవింగ్స్‌కు పునాది సంపాదన మొదలైన తొలినాళ్లలోనే సేవింగ్స్ ప్రారంభించాలి. సాధ్యపడకపోతే కనీసం 30 ఏళ్లు వచ్చినపుడైనా సేవింగ్స్ ప్రారంభించాలి. సేవింగ్స్ ప్రక్రియను మీరు ఎంత ఆలస్యం చేస్తే అంత మీ రిటైర్మెంట్ గడువు వెనక్కు జరుగుతుంది. మీ ఆదాయంలో 40 శాతాన్ని సేవింగ్ చేయడం మంచిది. సాధ్యపడకపోతే వ్యక్తిగత, ఇంటి ఖర్చులను ఎక్కడైనా తగ్గించుకోవచ్చేమో పరిశీలించండి. ఉదాహరణకు మీ సొంత ఖర్చులను తగ్గించుకుంటే.. ఆ మొత్తం మీ పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది. అత్యవసర నిధి ఏర్పాటు మరవొద్దు... ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో ఎవరికీ తెలియదు. అకస్మాత్తుగా గుండెపోటు రావచ్చు. బైక్ మీద వెళ్తున్నపుడు ప్రమాదం జరగొచ్చు. అనుకోకుండా ఉద్యోగం పోవచ్చు. అప్పుడు మన పరిస్థితేంటి? అందుకే అనుకోని సంఘటనలను ఎదుర్కోడానికి ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా అత్యవసర నిధి మొత్తం... మన నెల జీతానికి ఆరు రెట్లుండాలి. జీవిత బీమా తీసుకోండి... మనిషి సంఘ జీవి. ఒకడిగా జీవించలేడు. కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడు మన తరవాత మనపై ఆధారపడ్డ వారి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖంగా ఉండాలంటే.. కచ్చితంగా జీవిత బీమాను తీసుకోవాలి. జీవిత బీమా కనీసం మన వార్షిక వేతనానికి 12 రెట్లు ఉండాలి. అలాగే కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమాను రూ.5 లక్షలకు తీసుకోవాలి. ఇటీవల ఆరోగ్య ఖర్చులు బాగా పెరిగిపోయాయి. భవిష్యత్తులో ఇంకా పెరగొచ్చు కూడా. ఇన్వెస్ట్మెంట్ల సంగతేంటి.. ఇక ఇన్వెస్ట్మెంట్ల విషయానికి వస్తే.. ముందుగా మీరు ఏ స్థాయిలో రిస్క్‌ను భరించగలరో.. దాన్ని బేరీజు వేసుకోండి. అలాగే మీ ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రారంభించండి. ఎప్పుడూ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఒకే దానిలో చేయకండి. మీ పోర్ట్‌ఫోలియోను ఎల్లప్పుడూ డైవ ర్సిఫైడ్గా ఉంచుకోండి. వంద శాతంలో మీ వయసును తీసేస్తే వచ్చే సంఖ్యకు సమాన మొత్తాన్ని రిస్క్ అధికంగా ఉండే ఈక్విటీ వంటి ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడిగా పెట్టండి. ద్రవ్యోల్బణం, పన్నులు వంటి అంశాలను తట్టుకొని అధిక రాబడిని పొందాలంటే రిస్క్‌ను భరించాల్సి ఉంటుందన్న విషయాన్ని మరవద్దు. ఆర్థిక వ్యవహారాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోండి. అవసరమైన సందర్భాల్లో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెన కాడవద్దు. ఆర్థిక పటిష్టత సాధించాలంటే క్రమశిక్షణ, ఓపిక అనే రెండు అంశాలను తప్పక అలవరచుకోవాలి. -
ఆనందమే అందం
ఐదు పదులు దాటినా తరగని అందం.. ఆత్మవిశ్వాసం నిండిన చూపు, కట్టిపడేసే చిరునవ్వు.. ఒకప్పటి మిస్ ఇండియా, మిస్ ఇంటర్నేషనల్ రన్నరప్.. క్రీడాకారిణి, నటి, రాజకీయ, సామాజికవేత్త... ఇలా విభిన్న రంగాలలో మేటి అయినా తల్లిగా, నానమ్మగా తాను ఎక్కువ సంతృప్తిని పొందుతున్నానని చెప్పే స్త్రీమూర్తి నఫీసా అలీతో కాసేపు... - ఓ మధు అథ్లెట్.. బ్యూటీక్వీన్, పొలిటీషియన్.. ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి? అథ్లెట్ కావటం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ గ్యారంటీగా ఉంటుంది. చదువు ఇంటెలిజెన్స్‌ని పెంచుకోవడానికి సహకరిస్తుంది. అలాగే సహజంగా మన పుట్టుక కొన్ని అవకాశాలు కల్పిస్తుంటుంది. పెరిగిన వాతావరణం కొంత హెల్ప్ చేస్తుంది. అలా అదృష్టవశాత్తు అవన్నీ నాకు అమరాయి. మనకున్న పాజిబిలిటీస్ నుంచి ముందుకు సాగటమే జీవితమంటే. అందుకే నా జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆనందంగా గడుపుతున్నా. ఫిట్‌గా ఉండటానికి ఏం చేస్తుంటారు? వాతావరణ కాలుష్యం, జీవన శైలి మార్పులు అనారోగ్యానికి ఆహ్వానం పలుకుతుంటాయి. వాటిని తట్టుకుని ఫిట్‌గా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో ప్రవేశం కలిగి వుండాలి. అథ్లెట్ కావడం వల్ల అనారోగ్యం పాలు కారని చెప్పలేం. కాని అనారోగ్యం పాలైనా తొందరగా కోలుకునేందుకు ఉపకరిస్తుంది. అందుకే, అందరూ జీవితంలో తప్పకుండా ఏదో ఒక క్రీడతో కనెక్ట్ కావాలి. వయసు పెరిగే కొద్దీ అనారోగ్యాలు పలకరిస్తుంటాయి. వీటిని తట్టుకోవడానికి, నియంత్రించడానికి మనం ఫిట్‌గా ఉండటం ద్వారా ప్రయత్నించాలి. క్రీడాకారిణులు రాణించాలంటే? నేను స్వతహాగా క్రీడాకారిణిని. అవకాశం కల్పిస్తే ఎంతోమంది మంచి క్రీడాకారిణులు దేశానికి ఎన్నో పతకాలు తీసుకురాగలరు. ఇటీవల కామన్వెల్త్, ఒలింపిక్ క్రీడల్లో మన క్రీడాకారిణులు రాణిస్తున్నారు. అయితే అందరికీ సమానావకాశాలు రావటం లేదనేది వాస్తవమే. స్ఫూర్తి ఉన్న వారందరికీ అవకాశాలు కల్పించే అంశంలో కొంత బ్యాలెన్స్ రావలసి ఉంది. తగిన శిక్షణావకాశాల్ని మెరుగుపరిస్తే ఫలితం ఉంటుంది. రాజకీయాలు, సినిమాలు, సేవ.. వీటిలో మీరు ఎక్కువ ఎంజాయ్ చేసింది ఏది? నేను నా మదర్‌హుడ్‌ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాను. నేను అమ్మమ్మనయ్యా. అథ్లెట్ కావటం వల్ల నా గ్రాండ్ చిల్డ్రన్‌తో పరుగెడుతూ అలసట లేకుండా ఆడుకోగలుగుతున్నాను. అదినాకెంతో సంతోషాన్నిస్తుంది. చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా ఎన్నో సేవలు అందించారు. వాటి గురించి కొన్ని వివరాలు... చదువంటే పుస్తకాలే కాదు. వినోదం ద్వారా కూడా పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. చక్కటి సినిమాలు చూసే అవకాశం పిల్లలకు ఉండాలని నెహ్రూ ఆశించే వారు. పిల్లల సృజనకు కావలసిన వాతావరణం సృష్టించాలన్నదే ఆయన ఆంతర్యం. ఇందుకోసం మేం బాలల చిత్రోత్సవాలను నక్సల్ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో సైతం ప్రదర్శించాం. సందేశాత్మక, స్ఫూర్తిదాయక చిత్రాలను చూడటం ద్వారా పిల్లల్లో లక్ష్యాల కల్పన, వివిధ విషయాలపై అవగాహన కలుగుతాయి. హైదరాబాద్ గురించి? గతంలో హైదరాబాద్‌లో ఫిలిం ఫెస్టివల్స్ నిమిత్తం చాలాసార్లు వచ్చాను. ఇక్కడి వారితో నాకు ప్రత్యేక అనుబంధం వుంది. హైదరాబాద్ కల్చర్, హెరిటేజ్ ఇండియాలోనే యూనిక్ అనిపిస్తుంది. చార్మినార్ దగ్గరుండే చిన్న చిన్న బజారుల్లో కొత్తకొత్తగా తయారు చేసే వస్తువులను షాపింగ్ చేస్తుంటాను. హైదరాబాద్ వచ్చి బిర్యాని పట్ల నాకున్న ప్యాషన్‌కు న్యాయం చెయ్యకుండా వెళ్లింది లేదు. హుస్సేన్‌సాగర్, పురాతన కట్టడాలు, సాలార్జంగ్ మ్యూజియం నాకు నచ్చిన స్పాట్స్. ఒక మాట... కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్లోని ప్రతిభను కనబర్చనివ్వరు. దీనివల్ల పిల్లల్లో ఉన్న టాలెంట్ బయటకు రాకుండాపోతుంది. అదే విదేశాలలో పిల్లలను చూస్తే వీల్ చెయిర్లో ఉన్న పిల్లలు కూడా ఎంతో ప్రొడక్టివ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లల భవిష్యత్తు వారి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. దానిని గుర్తించటమే పెద్దవారిగా మన బాధ్యత.