ఫైనాన్షియల్ బేసిక్స్
ప్రతి ఒక్కరూ శారీరకంగా ఫిట్‌గా ఉండాలని భావిస్తారు. ఇందుకు జిమ్... వ్యాయామం, యోగా వంటి వాటిని ఆశ్రయిస్తారు. మరి ఆర్థికంగా ఫిట్‌గా ఉండాలంటే? మనం అసలు ఆర్థికంగా ఫిట్‌గా ఉన్నామో లేదో ముందు తెలుసుకోవాలి. నిజానికి శారీరక ఫిట్‌నెస్‌కు ప్రమాణాలున్నట్లుగా ఆర్థిక ఫిట్‌నెస్‌కు నిర్దిష్ట ప్రమాణాలుండవు. కానీ కొన్ని బేసిక్ నిబంధనలను పాటిస్తే ఆర్థిక ఫిట్‌నెస్ సాధించొచ్చు.
కెరీర్ ప్రారంభమే... సేవింగ్స్‌కు పునాది
సంపాదన మొదలైన తొలినాళ్లలోనే సేవింగ్స్ ప్రారంభించాలి. సాధ్యపడకపోతే కనీసం 30 ఏళ్లు వచ్చినపుడైనా సేవింగ్స్ ప్రారంభించాలి. సేవింగ్స్ ప్రక్రియను మీరు ఎంత ఆలస్యం చేస్తే అంత మీ రిటైర్మెంట్ గడువు వెనక్కు జరుగుతుంది. మీ ఆదాయంలో 40 శాతాన్ని సేవింగ్ చేయడం మంచిది. సాధ్యపడకపోతే వ్యక్తిగత, ఇంటి ఖర్చులను ఎక్కడైనా తగ్గించుకోవచ్చేమో పరిశీలించండి. ఉదాహరణకు మీ సొంత ఖర్చులను తగ్గించుకుంటే.. ఆ మొత్తం మీ పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది.
అత్యవసర నిధి ఏర్పాటు మరవొద్దు...
ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో ఎవరికీ తెలియదు. అకస్మాత్తుగా గుండెపోటు రావచ్చు. బైక్ మీద వెళ్తున్నపుడు ప్రమాదం జరగొచ్చు. అనుకోకుండా ఉద్యోగం పోవచ్చు. అప్పుడు మన పరిస్థితేంటి? అందుకే అనుకోని సంఘటనలను ఎదుర్కోడానికి ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా అత్యవసర నిధి మొత్తం... మన నెల జీతానికి ఆరు రెట్లుండాలి.
జీవిత బీమా తీసుకోండి...
మనిషి సంఘ జీవి. ఒకడిగా జీవించలేడు. కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడు మన తరవాత మనపై ఆధారపడ్డ వారి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖంగా ఉండాలంటే.. కచ్చితంగా జీవిత బీమాను తీసుకోవాలి. జీవిత బీమా కనీసం మన వార్షిక వేతనానికి 12 రెట్లు ఉండాలి. అలాగే కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమాను రూ.5 లక్షలకు తీసుకోవాలి. ఇటీవల ఆరోగ్య ఖర్చులు బాగా పెరిగిపోయాయి. భవిష్యత్తులో ఇంకా పెరగొచ్చు కూడా.
ఇన్వెస్ట్‌మెంట్ల సంగతేంటి..
ఇక ఇన్వెస్ట్‌మెంట్ల విషయానికి వస్తే.. ముందుగా మీరు ఏ స్థాయిలో రిస్క్‌ను భరించగలరో.. దాన్ని బేరీజు వేసుకోండి. అలాగే మీ ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటికి అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ప్రారంభించండి. ఎప్పుడూ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఒకే దానిలో చేయకండి. మీ పోర్ట్‌ఫోలియోను ఎల్లప్పుడూ డైవ ర్సిఫైడ్‌గా ఉంచుకోండి.
వంద శాతంలో మీ వయసును తీసేస్తే వచ్చే సంఖ్యకు సమాన మొత్తాన్ని రిస్క్ అధికంగా ఉండే ఈక్విటీ వంటి ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడిగా పెట్టండి. ద్రవ్యోల్బణం, పన్నులు వంటి అంశాలను తట్టుకొని అధిక రాబడిని పొందాలంటే రిస్క్‌ను భరించాల్సి ఉంటుందన్న విషయాన్ని మరవద్దు. ఆర్థిక వ్యవహారాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోండి. అవసరమైన సందర్భాల్లో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెన కాడవద్దు. ఆర్థిక పటిష్టత సాధించాలంటే క్రమశిక్షణ, ఓపిక అనే రెండు అంశాలను తప్పక అలవరచుకోవాలి.
ఆర్థికంగా ఫిట్.. ఎలా?
Published Mon, Nov 23 2015 3:35 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM
Advertisement