మహిళలకూ కావాలి జీవితబీమా!
మన సమాజంలో స్త్రీలకు సముచిత స్థానముంది. ముఖ్యంగా మన దేశంలో కుటుంబ ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో గృహిణులదే కీలక పాత్ర. పొదుపులో మహిళలే ముందుంటారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాకపోతే కొద్ది మంది మాత్రమే వారికోసమో, కుటుంబ సభ్యుల కోసమో జీవిత బీమా చేస్తుంటారు. ప్రస్తుతం పలు సాధనాలు అందుబాటులోకి రావటంతో మహిళల్లోనూ చైతన్యం పెరిగింది. మేం ఇప్పటికే బీమా, ఎఫ్‌డీలు, ఇతర పెట్టుబడి సాధనాల విషయంలో మహిళల్లో గణనీయమైన మార్పుల్ని చూస్తున్నాం.
మహిళలకే ఎందుకు?
ఈ రోజుల్లో ఆర్థికంగా నిలదొక్కుకోవడమనేది ఎంతో అవసరం. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మహిళలకిది చాలా అవసరం. ఉద్యోగినులకు, గృహిణులకు, ఒంటరి ఆడవాళ్లకు జీవిత బీమాలో పొదుపు చేయడమనేది అనేక సందర్భాల్లో ఆర్థిక స్వేచ్ఛనిస్తుంది. నిజానికి భారత్‌లో చిన్నమొత్తాల పొదుపు అనేది మహిళల సామ్రాజ్యం. స్టాక్ మార్కెట్లలో పొదుపు చేసే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్(యూఎల్‌ఐపీ) వంటివి ఎంచుకోవటం ద్వారా పొదుపు చేయటంతో పాటు బీమా రక్షణ కూడా పొందొచ్చు.
మార్కెట్లలో పెట్టుబడులుంటాయి కనుక మెరుగైన రాబడులూ ఆశించవచ్చు. సాధారణంగా పిల్లల చదువు, పెళ్లిళ్లు, సొంతింటి కొనుగోలు, పదవీ విరమణ తరువాత జీవితం... ఇలాంటి జీవితావసరాల కోసం సంప్రదాయ ‘విత్ ప్రాఫిట్స్’ పథకాలను ఎంచుకోవచ్చు.
జీవితానికి రక్షణ...
జీవితంలో ప్రధాన సందర్భాల్లో పెట్టే ఖర్చులకు జీవిత బీమా సమర్థంగా పనికొస్తుంది. దీనికితోడు మహిళలకు తక్కువ ప్రీమియం ఉంటుంది కూడా. ప్రత్యేకించి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్సుల్లో మహిళలకు ప్రీమియంలో డిస్కౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. మహిళలు తమ అవసరానికి తగ్గట్టుగా వీటిని ఉపయోగించుకోవచ్చు. కావాలంటే పూర్తిస్థాయి టర్మ్ పాలసీనే ఎంచుకోవచ్చు. లేనిపక్షంలో ప్రాఫిట్స్‌తో కూడిన జీవిత బీమా పాలసీనైనా తీసుకోవచ్చు.
తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లోనూ....
ఆరోగ్య బీమాతో పాటు కొన్ని రకాలైన తీవ్ర అనారోగ్యాలకు వ ర్తించే క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌తో కూడిన బీమా అయితే అటు ప్రీ మియం విషయంలోనూ, ఇటు కవరేజీ విషయంలోనూ చక్కని ప్రయోజనం పొందొచ్చు. ఎందుకంటే కొన్ని తీవ్రమైన అస్వస్థతల విషయంలో అయ్యే ఖర్చును భరించటం మామూలు విషయం కాదు.
ఆర్థికపరమైన బాధ్యతల నుంచి తప్పుకోవటంతో పాటు ఇంట్లో పనుల్ని కూడా వేరొకరికి అప్పగించాల్సి వస్తుంది. అందుకని ఇలాంటివన్నీ తట్టుకునేలా మహిళలకోసం ప్రత్యేకమైన ఉత్పత్తులున్నాయి. అవి మరీ క్లిష్టమైనవేమీ కాదు. ఈజీగానే అర్థం చేసుకుని ఎంచుకోవచ్చు.
తరువాతి వారికి ఇవ్వాలన్నా...!
కొందరు మహిళలు తమ కుటుంబానికి తగినంత మొత్తం ఇవ్వాలనుకుంటారు. పిల్లలకే కాక భర్తకు కూడా బాసటగా నిలవాలనుకుంటారు. మరికొందరైతే ధార్మిక సంస్థలకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే దానధర్మాలు చేయాలనుకుంటారు. వారికి ఇవన్నీ చేయటానికి వీలు కల్పించే ఉత్పత్తుల్లో జీవిత బీమాదే ముందు వరస. మిగతావన్నీ తరువాతేనని చెప్పాలి.
చివరిగా నా సలహా ఏంటంటే మహిళలు పాలసీ తీసుకున్నాం కదా అని ఊరుకోకుండా జీవితంలో మార్పు సంభవించిన ప్రతి సందర్భంలోనూ వాటినొకసారి సరిచూసుకోవాలి. అంటే పెళ్లి, పిల్లలు పుట్టడం, ఇతరత్రా కీలక ఘటనలు సంభవించినపుడన్న మాట. అవసరమైతే కొన్ని మార్పులు చేసుకోవాలి. అంతేకాదు!! ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా తమ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలి.
- ప్రదీప్ పాండే
చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, ఫ్యూచర్ జెనరాలి లైఫ్ ఇన్సూరెన్స్