శామ్స్...కమిట్మెంట్కి తిరుగులేదు
ఆరోగ్యంగా ఉండాలనే నిర్ణయం తీసుకుని అమలు చేయాలనే విషయంలో ఖచ్చితత్వాన్ని పాటిస్తే చాలు ఫిజికల్ ఫిట్‌నెస్ మనల్ని అనుసరిస్తుంది. అలాంటి కమిట్‌మెంట్ విషయంలో సమంత రూత్ ప్రభు సూపర్ అంటున్నాడు రాజేష్ రామస్వామి. ఆయనెవరా అనుకుంటున్నారా? ఆయనే సమంత ఫేవరెట్ ఫిట్‌నెస్ ట్రైనర్. చెన్నైకు చెందిన ఈయన గత కొంతకాలంగా తమిళనాట పలువురు స్టార్స్‌కు మోస్ట్‌వాంటెడ్ ట్రైనర్‌గా ఉన్నారు. తన వ్యక్తిగత బరువుకు మించిన వెయిట్స్‌ను లిఫ్ట్ చేస్తూన్న సమంత వర్కవుట్ వీడియోలు ఇటీవల సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సమంత ఫిట్-డైట్-వర్కవుట్ గురించి ఆయనేం అంటున్నాడంటే ...
తానే నెంబర్ వన్ నెంబర్ 1 హీరోయిన్లలో అత్యంత ఫిట్ స్టార్ సమంత అనేది నిస్సందేహం. అందులో రెండో మాట లేదు. మరీ సన్నాగానో, మరీ లావుగానో అయిపోకుండా ఏళ్ల తరబడి ఒకే రకమైన ఫిజిక్‌ను మెయిన్‌టెయిన్ చేయడమే సమంతకు సంబంధించి మరింతగా చెప్పుకోవాల్సిన విషయం. మొదటి నుంచీ ‘స్ట్రెంగ్త్’ సాధించడమే శామ్స్ (సమంత) ప్రాధాన్యత. దాని కోసమే కష్టపడుతుంది. తనెప్పుడూ అనుకున్న వర్కవుట్ టైమ్‌కి 15 నిమిషాలు ముందుగానే జిమ్‌కి వచ్చేస్తుంది. ఒకవేళ ఉదయమే షూటింగ్‌గాని ఉంటే తెల్లవారుఝామున 5గంటలలోపే జిమ్ తలుపు తడుతుంది.
జాయ్...జాగింగ్ స్ట్రెంగ్త్, ఫ్యాట్ కంట్రోల్‌కు సంబంధించిన వర్కవుట్స్ బాగా చేస్తుంది. ఆమె వర్కవుట్స్‌ని హై ఇంటెన్సిటీ నుంచి తేలికపాటి వ్యాయామానికి ఇలా తరచుగా మార్పు చేర్పులకు గురి చేస్తుంటాను. వర్కవుట్‌కి టైమ్ లేకపోయినా, అందుబాటులో వ్యాయామ పరికరాలు లేకపోయినా దానికి ప్రత్యామ్నాయంగా శామ్స్ జాగింగ్‌ను ఎంచుకుంటుంది. జాగింగ్‌ని బాగా ఎంజాయ్ చేస్తుంది. దేహాన్ని శుభ్రపరిచి, తన శరీరంలో నుంచి హానికారక టాక్సిన్స్‌ను వెలుపలకి పంపేందుకు గాను చెమటపట్టేలా వ్యాయామం చేస్తుంది. స్వేదం తన చర్మరక్షణకు కూడా ఉపకరిస్తుందని తన అభిప్రాయం. వర్కవుట్‌తో పాటు రోజువారీ జీవనశైలిని కూడా క్రమశిక్షణతో తీర్చిదిద్దుకుంది. కాబట్టే అంత అందంగా ఆరోగ్యంగా ఉండలుగుతోంది.
డైట్ కాదు రైట్‌గా తినాలి డైట్ చేయడం ఉపవాసాలు ఉండడంపై ఆమెకి మరీ అంత నమ్మకం లేదు. తనకు కేలరీల విషయంలో భయం లేదంటుంది. నచ్చిన ప్రతీదీ తింటుంది. చాలా మందికి లాగే తనకీ సాంబార్ అన్నం అంటే మహా ఇష్టం. దోస, వడ, ఇడ్లీ, పొంగలి వంటివి తినకుండా నియంత్రించుకోవడం తన వల్ల కాదని చెప్పేస్తుంది. చికెన్, స్పైసీ పికిల్స్, స్వీట్ పొంగల్, ఫిల్టర్డ్ బ్లాక్ కాఫీ... వంటివి కూడా తనకు నచ్చే ఫేవరెట్ ఫుడ్ జాబితాలో ఉన్నాయి. అయితే పరిమాణంలో మాత్రం పరిధి దాటనివ్వదు. అంతేకాదు... ఆరోగ్యకరమైన, వ్యాయామ క్రమానికి తగినంత ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకునే క్రమంలో పప్పులు, బెర్రీస్, వెజ్ సలాడ్స్, పండ్లు, లీన్ మీట్,... వంటివి తీసుకుంటుంది. తనను తాను ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి బాగా మంచినీరు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాల మీద ఆధారపడుతుంది.