20 ఏళ్లలో చెక్కిన శిల్పమైన టాలీవుడ్ హీమాన్
దేశంలో ఏడు పదుల వయసులోని తొలి మోడల్
లాస్ ఏంజెల్స్ ర్యాంప్‌పైనా మెరవనున్న కుమనన్
సాక్షి, సిటీబ్యూరో: రమణా లోడ్ ఎత్తాలిరా అనే డైలాగ్ వింటే ప్రేక్షకులకు ఆయన గుర్తొస్తాడు కానీ సిటీలోని ఫిట్‌నెస్ స్టూడియోల్లో మాత్రం సీనియర్ సిటిజన్స్ ఫిజిక్ గురించి మాట్లాడాలంటే ఆయన తప్ప మరెవరూ గుర్తురారు. జన్మతః తమిళనాడుకు చెందిన కుమనన్.. ప్రస్తుతం టాలీవుడ్ నటుడిగా రాణిస్తున్నారు. అంతేకాదు అద్భుతమైన శరీరాకృతితో ఆకట్టుకుంటూ ఏడు పదుల వయసులో ఏకైక మేల్ మోడల్‌గానూ ర్యాంప్‌పై మెరుస్తున్నారు. ఇటీవలే అంతర్జాతీయంగా పనిచేసే బియర్డ్స్ క్లబ్ నుంచి వాషింగ్టన్‌లో నిర్వహించే ఈవెంట్‌లో ర్యాంప్ వాక్‌కు ఆహ్వానం సైతం అందుకున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో ఆయన పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..
ఓ టీవీలు తయారు చేసే కంపెనీలో ఉద్యోగం చేసే సమయంలో చాలా లావుగా ఉండేవాడ్ని. డీలర్ల మీట్స్ కాక్‌టెయిల్ పార్టీస్‌తో వెయిట్ పెరిగాను. అదే సమయంలో నాకు వ్యక్తిగతంగా ఉన్న ఇష్టంతో ఫ్యాషన్ ఫొటోగ్రఫీ కూడా పార్ట్‌టైమ్‌గా చేసేవాడ్ని. అలా వైజాగ్‌తో పాటు పలు నగరాల్లో ఫ్యాషన్ ఈవెంట్స్‌కు హాజరయ్యేవాడిని. అలాంటి సమయంలో వారిని చూసినప్పుడు మోడల్స్‌లా మనమెందుకు లేం? ఈ పొట్ట, ఫ్యాట్ మనల్ని వదిలిపోవా? అని ఆలోచించేవాడ్ని.
మార్చిన మోడల్స్..
ఇలాంటి ఆలోచనలతో కొందరు మోడల్స్‌తో మాట్లాడుతూ అనేక విషయాలపైన అవగాహన పెంచుకున్నాను. ముందు వెయిట్‌లాస్ అవ్వాలి. రోజూ వాకింగ్ చేసి వెయిట్ లాస్ అయ్యాక వర్కవుట్ చేయాలనేది తెలుసుకున్నా. ఒక శుభముహూర్తాన కాక్‌టెయిల్ పార్టీలు సహా అన్ని అనారోగ్యకర అలవాట్లకు గుడ్‌బై చెప్పేసి ఫిట్‌నెస్ లవర్‌గా మారిపోయాను. రోజూ విశాఖ బీచ్‌లో కాళిమాత గుడి నుంచి పార్క్ హోటల్ వరకూ 2గంటల పాటు ఇసుకలో జాగింగ్ చేసేవాడ్ని.. ఆ తర్వాత లెమన్ వాటర్ మాత్రమే తాగేవాడ్ని. ఆర్నెళ్లలో బాగా వెయిట్ లాస్ అయ్యాను. ఆ తర్వాత జిమ్‌లో జాయిన్ అయ్యా.. కట్ చేస్తే.. పొట్ట, కొవ్వు అన్నీ మాయమై.. చక్కని ఫిజిక్ సాధ్యమైంది. అదే ఫిజిక్ నాకు సినిమాల్లో నటుడిగా అవకాశం వచ్చేలా చేసింది. అలా 20 ఏళ్లనుంచి నా శరీరం పూర్తిగా నా నియంత్రణలోనే ఉంటోంది. సినిమాల్లో అవకాశాలతో నగరానికి షిఫ్ట్ అయ్యాక కృష్ణానగర్‌లోని ఓ చిన్న జిమ్‌తో మొదలెట్టి, వెంకట్ ఫిట్‌నెస్ వగైరా జిమ్స్‌లో నా జర్నీ కంటిన్యూ చేశా..
ఆరోగ్యకరమైన వంటలు..
తొలిదశలో రోజుకు డజను గుడ్లు.. 4గంటల వర్కవుట్ చేసేవాడ్ని. వయసుతో పాటు మార్పు చేర్పుల్లో భాగంగా ఇప్పుడు అరడజను గుడ్లు కనీసం, 3గంటల పాటు వ్యాయామం చేస్తున్నా. ఇప్పటికీ ఆపకుండా 100 దండీలు ఒకే స్ట్రెచ్‌లో తీయగలను. ట్రైన్ చేయమని టాలీవుడ్ ప్రముఖులు అడుగుతుంటారు. అయితే అది ఒక పూర్తిస్థాయి ప్రొఫెషన్ అనుకుంటేనే అటు వెళ్లాలి. అందుకే సలహాలు చెబుతా తప్ప ట్రైనర్‌గా మారను.
డైట్ రొటీన్ ఇదీ...
ఉదయం 7గంటలకల్లా నిద్ర లేస్తా. వేడినీళ్లలో నిమ్మకాయ వేసుకుని తీసుకుంటా.. పంచదార, బెల్లం, పెరుగు, వైట్‌రైస్ వినియోగించను. జిమ్ అయ్యాక 4 వైట్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటాను. లంచ్‌లో ఉప్పు లేకుండా బాయిల్డ్ వెజిటబుల్స్ అవి కూడా కాలీఫ్లవర్, బ్రొకొలీ, క్యారెట్, బీన్స్, క్యాబేజీ లాంటివి మాత్రమే తీసుకుంటాను. రాత్రి మిల్లెట్స్, కొర్రలు, లేదా క్వినోవా.. మితంగా తీసుకుంటాను.
మోడల్‌గా జర్నీ..
నటుడిగా చేస్తుండగానే పలుచోట్ల ర్యాంప్ షోలపై మోడల్‌గానూ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్నాను. వేర్వేరు నగరాల్లో జరిగిన మోడలింగ్ ఈవెంట్స్‌లో పాల్గొన్నాను. ఇటీవలే అంతర్జాతీయంగా పనిచేస్తున్న బియర్డ్ క్లబ్ వాళ్లు వాషింగ్టన్‌లో నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోకు ఆహ్వానించారు. అయితే నేనింకా ఈ విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు.
వర్కవుట్ రొటీన్ ఇదీ..
రోజూ ఉదయం 7గంటలకు నిద్రలేచి వేడి నిమ్మకాయ నీళ్లు తాగి జిమ్‌కు వెళతాను. అక్కడ 45 నిమిషాల వార్మప్.. ఇందులో ట్రెడ్‌మిల్ మీద వాకింగ్, బోనియం పాటకి ఎరోబిక్స్.. (ఈ ఒక్కపాట చేస్తే చాలు రోజుకు సరిపడా వర్కవుట్ చేసినట్లు అవుతుంది) వంటివి ఉంటాయి. ఆ తర్వాత వర్కవుట్ స్టార్ట్. రోజుకు 2 బాడీ పార్ట్స్ చేస్తాను. మొదటి రోజు ప్లెయిన్ రాడ్ మీద బెంచ్ ప్రైస్, ఫ్లైస్ ఒక రోజు స్క్వాట్, కాఫ్ మజిల్, మరో రోజు ఆ తర్వాత రోజు మొత్తం లాటిస్, ఆ తర్వాత ట్రైసప్, బైసప్ ఇలా.. రొటీన్‌గా సాగుతుంది.
వెయిట్స్‌తో ఇలా.. చేస్తే భళా..
నేను జిమ్‌లో అడుగుపెట్టిన తొలిరోజే 50 చొప్పున డంబెల్స్‌తో రిపిటీషన్స్ చేయడంతో రెండోరోజు చేతులు పనిచేయలేదు. అయినా తగ్గించకుండా అలాగే చేస్తూ వచ్చా, అలవాటైపోయింది. తక్కువ వెయిట్స్‌తో ఎక్కువ రిపిటీషన్స్ చేయడం వల్ల ఆర్నెళ్లు వర్కవుట్ చేయకపోయినా షేప్ మారకుండా అలాగే ఉంటుంది. అదే వెయిట్స్ పెంచుకుంటూ పోతే ఇమ్మీడియట్‌గా మజిల్ పంప్ అయి మళ్లీ త్వరితంగానే బెలూన్‌లో గాలి తీసినట్లు అయిపోతాం. బాడీ బిల్డింగ్ చేయవచ్చు కదా అని కొందరు అడిగేవారు.. నాకు అలాంటి లక్ష్యాలేవీ లేవు.. జస్ట్ చూడడానికి లుక్ బాగుండాలి.. అంతేకాదు శరీరం ఎప్పుడూ రెడీ ఫర్ వార్ అన్నట్టు ఉండాలి. ఇక్కడ నుంచి దూకు అంటే దూకేయాలి అలా చురుగ్గా ఉండాలి. ఇప్పటికీ నేను గంటకు 16.5, 17కి.మీ స్ప్రింట్ చేయగలను.
Comments
Please login to add a commentAdd a comment