ఆనందమే అందం
ఐదు పదులు దాటినా తరగని అందం.. ఆత్మవిశ్వాసం నిండిన చూపు, కట్టిపడేసే చిరునవ్వు.. ఒకప్పటి మిస్ ఇండియా, మిస్ ఇంటర్నేషనల్ రన్నరప్.. క్రీడాకారిణి, నటి, రాజకీయ, సామాజికవేత్త... ఇలా విభిన్న రంగాలలో మేటి అయినా తల్లిగా, నానమ్మగా తాను ఎక్కువ సంతృప్తిని పొందుతున్నానని చెప్పే స్త్రీమూర్తి నఫీసా అలీతో కాసేపు...
- ఓ మధు
అథ్లెట్.. బ్యూటీక్వీన్, పొలిటీషియన్.. ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి?
అథ్లెట్ కావటం వల్ల ఫిజికల్ ఫిట్‌నెస్ గ్యారంటీగా ఉంటుంది. చదువు ఇంటెలిజెన్స్‌ని పెంచుకోవడానికి సహకరిస్తుంది. అలాగే సహజంగా మన పుట్టుక కొన్ని అవకాశాలు కల్పిస్తుంటుంది. పెరిగిన వాతావరణం కొంత హెల్ప్ చేస్తుంది. అలా అదృష్టవశాత్తు అవన్నీ నాకు అమరాయి. మనకున్న పాజిబిలిటీస్ నుంచి ముందుకు సాగటమే జీవితమంటే. అందుకే నా జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆనందంగా గడుపుతున్నా.
ఫిట్‌గా ఉండటానికి ఏం చేస్తుంటారు?
వాతావరణ కాలుష్యం, జీవన శైలి మార్పులు అనారోగ్యానికి ఆహ్వానం పలుకుతుంటాయి. వాటిని తట్టుకుని ఫిట్‌గా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో ప్రవేశం కలిగి వుండాలి. అథ్లెట్ కావడం వల్ల అనారోగ్యం పాలు కారని చెప్పలేం. కాని అనారోగ్యం పాలైనా తొందరగా కోలుకునేందుకు ఉపకరిస్తుంది. అందుకే, అందరూ జీవితంలో తప్పకుండా ఏదో ఒక క్రీడతో కనెక్ట్ కావాలి. వయసు పెరిగే కొద్దీ అనారోగ్యాలు పలకరిస్తుంటాయి. వీటిని తట్టుకోవడానికి, నియంత్రించడానికి మనం ఫిట్‌గా ఉండటం ద్వారా
ప్రయత్నించాలి.
క్రీడాకారిణులు రాణించాలంటే?
నేను స్వతహాగా క్రీడాకారిణిని. అవకాశం కల్పిస్తే ఎంతోమంది మంచి క్రీడాకారిణులు దేశానికి ఎన్నో పతకాలు తీసుకురాగలరు. ఇటీవల కామన్‌వెల్త్, ఒలింపిక్ క్రీడల్లో మన క్రీడాకారిణులు రాణిస్తున్నారు. అయితే అందరికీ సమానావకాశాలు రావటం లేదనేది వాస్తవమే. స్ఫూర్తి ఉన్న వారందరికీ అవకాశాలు కల్పించే అంశంలో కొంత బ్యాలెన్స్ రావలసి ఉంది. తగిన శిక్షణావకాశాల్ని మెరుగుపరిస్తే ఫలితం ఉంటుంది.
రాజకీయాలు, సినిమాలు, సేవ..
వీటిలో మీరు ఎక్కువ ఎంజాయ్ చేసింది ఏది?
నేను నా మదర్‌హుడ్‌ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాను. నేను అమ్మమ్మనయ్యా. అథ్లెట్ కావటం వల్ల నా గ్రాండ్ చిల్డ్రన్‌తో పరుగెడుతూ అలసట లేకుండా ఆడుకోగలుగుతున్నాను. అదినాకెంతో సంతోషాన్నిస్తుంది.
చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా ఎన్నో సేవలు అందించారు. వాటి గురించి కొన్ని వివరాలు...
చదువంటే పుస్తకాలే కాదు. వినోదం ద్వారా కూడా పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. చక్కటి సినిమాలు చూసే అవకాశం పిల్లలకు ఉండాలని నెహ్రూ ఆశించే వారు. పిల్లల సృజనకు కావలసిన వాతావరణం సృష్టించాలన్నదే ఆయన ఆంతర్యం. ఇందుకోసం మేం బాలల చిత్రోత్సవాలను నక్సల్ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో సైతం ప్రదర్శించాం. సందేశాత్మక, స్ఫూర్తిదాయక చిత్రాలను చూడటం ద్వారా పిల్లల్లో లక్ష్యాల కల్పన, వివిధ విషయాలపై అవగాహన కలుగుతాయి.
హైదరాబాద్ గురించి?
గతంలో హైదరాబాద్‌లో ఫిలిం ఫెస్టివల్స్ నిమిత్తం చాలాసార్లు వచ్చాను. ఇక్కడి వారితో నాకు ప్రత్యేక అనుబంధం వుంది. హైదరాబాద్ కల్చర్, హెరిటేజ్ ఇండియాలోనే యూనిక్ అనిపిస్తుంది. చార్మినార్ దగ్గరుండే చిన్న చిన్న బజారుల్లో కొత్తకొత్తగా తయారు చేసే వస్తువులను షాపింగ్ చేస్తుంటాను. హైదరాబాద్ వచ్చి బిర్యాని పట్ల నాకున్న ప్యాషన్‌కు న్యాయం చెయ్యకుండా వెళ్లింది లేదు. హుస్సేన్‌సాగర్, పురాతన కట్టడాలు, సాలార్జంగ్ మ్యూజియం నాకు నచ్చిన స్పాట్స్.
ఒక మాట...
కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్లోని ప్రతిభను కనబర్చనివ్వరు. దీనివల్ల పిల్లల్లో ఉన్న టాలెంట్ బయటకు రాకుండాపోతుంది. అదే విదేశాలలో పిల్లలను చూస్తే వీల్ చెయిర్‌లో ఉన్న పిల్లలు కూడా ఎంతో ప్రొడక్టివ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లల భవిష్యత్తు వారి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. దానిని గుర్తించటమే పెద్దవారిగా మన బాధ్యత.